మేఘసందేశం- 21 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. తెలుగు తెలియని వాళ్ళు కొత్తగా తెలుసుకుని ఈ భాషేదో ఇటాలియన్ భాషలా వుంది కదా అని అనుకోవడం వరకూ సరే! కానీ మనవాళ్ళు కూడా ఆ విషయం విని సర్దుకు పోయారే అనే విషయం తెలిసి కొంచెం బాధగా ఇబ్బందిగా వుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… తెలుగు భాష లాంటిదే కాళిదాసు పరిస్థితి కూడా! కాళిదాసు షేక్స్పేయర్ ఆఫ్ ది ఈస్ట్ అని కొంతమంది అంటారు. రచనా కాలాన్ని బట్టీ వస్తు విశేషాన్ని బట్టీ చూస్తే నక్కకూ నాగలోకానికి ఉన్న పోలిక ఉంది. కాళిదాసు ఎక్కడ? షేక్స్పియర్ ఎక్కడ? షేక్స్పియర్ నాటకాలు అన్నీ ఒకే మూసలో రాసినవి. అవన్నీ విక్టోరియాకాలం నాటి వాతావరణం లోనే నడుస్తాయి కింగ్ లియర్ అయినా హ్యాంలెట్ అయినా రోమియో జూలియట్ అయినా ఏదైనా సరే! కాళిదాసు రచనలు గమనిస్తే.. తన కధల్లోని వర్ణనలు అతనే ప్రాంత వాసో తేల్చలేనంత వాస్తవికంగా వున్నాయి. కుమార సంభవంలో హిమాలయాల్ని వర్ణించిన తీరు చూసి అక్కడి వాడేమో నని కొందరు,మేఘదూత కావ్యంలో చేసిన ఉజ్జయిని వర్ణనల్ని చూసి ఇతను ఖచ్చితంగా వుజ్జయిని వాడే నని మరికొందరు, రఘువంశంలో కళింగ ప్రభువైన హేమాంగదుది రాజ్య వైభవాన్ని కీర్తించిన తీరు చూసి కళింగ ప్రాంతాని చెందిన వాడనీ దిగ్దంతులైన విమర్సక శిఖామణులే గందరగోళంలో పడిపోయారంటే ఆ వైవిధ్యం యెంతటి గొప్పదో గదా! ఇతని సాహిత్యమే తప్ప ఇతని గురించి జన్మసంబంధ విశేషాలు ఎవరికీ తెలియవు.

లక్ష్మీధర అనే పండితుదు మాత్రం ఎన్నో వ్యయప్రాయాసలకోర్చి ఆధారాలతో అతను కాశ్మీరుకు చెందిన వాడనీ బహుశా రాజాశ్రయం కోసం అటు ఇటూ తిరిగీ చివరకు ఉజ్జయిని నగరం దగ్గిర ఆగి వుండొచ్చునని అభిప్రాయ పడ్డాడు. అప్పటి వాళ్ళకి ఒక రకమైన నిర్లక్ష్యం వుండేది తమ గురించి చెప్పుకోవడం పట్ల. నా కావ్యంలో సత్తా వుంటే అది కలకాలం నిలబడుతుంది, చదువర్లకి నేను ఏమి చెప్పాలనుకున్నానో అది చెప్పగలిగితే చాలు గదా! నేనెవరినో ఎందుకు చెప్పుకోవాలి అనే వుద్దేశం ఉండేది కాబోలు. ఈరోజు చిన్న బొమ్మ గీసినా అందులో యేదో ఒక మూల “ఆర్టిస్ట్-ఫలానా” అని యిరికించుకునే సరదా వున్నవాళ్ళకి దాని వెనక వున్న ధీమా అర్ధం కాదు! అలా పేరు వేసుకోవడం తప్పని నేనడంలేదు కూడా! ఆ కాలం వారి చింతన గురించి మాత్రమే చెప్పాలనిపించింది. మళ్ళీ మనం మేఘసందేశంలోకి ప్రవేశిద్దాం.
గత మాసం “ఆలోకే తే నిపతతి పురా సా బలివ్యాకులా” అన్న శ్లోకంతో ముగిస్తూ అలకాపురి పట్టణ వర్ణనను మనోహరంగా ముగించి, యక్షుడు తన గృహం గురించిన విశేషాలను తెలియజేస్తున్నాడు.

శ్లో.25. ఉత్సంగే వా మలిన వసనే సౌమ్య నిక్షిప్య వీణాం
మద్గోత్రాంకం విరచిత పదం గేయముద్గాతు కామా
తంత్రీమార్ద్రాం నయనసలిలై: సారయిత్వా కధంచి
ద్భూయో భూయ: స్వయమపి కృత్వాం మూర్ఛనాం విస్మరంతీ

భావం:

మేఘుడు తన గృహంలోని విశేషాలను వివరిచడం కొన్సాగిస్తున్నాడు. ఓ మేఘుడా! నీవు నా గృహంలోకి వెళ్ళేసమయానికి నా భార్య నా వియోగ విషాదంతో మాసిన దుస్తులు ధరించి తన ఒడిలో వీణను పెట్టుకుని విషాదంగా ఉండి దర్శనమీయవచ్చు. ఆ వీణపై నా పేరుమీద నా గురించి రచించిన పాటలను పాడాలనుకుంటూ అతి కష్టం మీద దు:ఖంతో వీణ తీగలను సవరిస్తూ..ఇది వరకు ఎంతో సుమధురంగా తానే రాగాలను కూర్చి వీణావాదనం చేసిన పాటలను నా వియోగ దు:ఖంలో అన్యమనస్కంగా నన్ను తలుచుకుంటూ వీణపై ఆ పాటలను ప్రయత్నిస్తూ నీకు కనబడవచ్చు.

శ్లో.26. శేషాన్మాసాన్విరహదివస స్థాపిత స్యావధేర్వా
విన్యస్యంతీ భువి గణనయా దేహళీ దత్తపుష్పై:
సంభోగం వా హృదయనిహితారంభ మాస్వాదయన్తీ
ప్రాయేణైతే రమణవిరహే ష్వంగనానాం వినోదా:

భావం:

ఓ మేఘబాంధవుడా! నీవు మా యింటికివెళ్ళే సమయానికి ఇంకా నా భార్య పరిస్తితి ఎలా వుంటుందో చెప్తాను విను. నాశాపం పరిసమాప్తి కావడానికి ఇంకా ఎంతకాలంపడుతుందో.. ఎన్ని మాసాలు లేక ఎన్ని దినాలు పడుతుందో తెలిసే విధంగా ప్రతిత్రోజూ ఇంటి గడపలో పెట్టిన పూలను లెక్కించి నేలమీద వరుసగా పెడుతూ ఉండి ఉండవచ్చు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ ఒకప్పటి మా శృంగార క్రీడలను తలుచుకుని మనసులో ఆనంద పారవశ్యం పొందుతూ కూడా ఉండవచ్చు. సాధారణంగా తమ పతులనెడబాసిన సతుల అవస్థలు ఇలాగే ఉంటాయి కదా!

శ్లో.27. సవ్యాపారామహని న తథా పీడయేన్మద్వియోగః
శఙ్కే రాత్రౌ గురుతరశుచం నిర్వినోదాం సఖీం తే ।
మత్సందేశైః సుఖయితుమలం పశ్య సాధ్వీం నిశీథే
తామున్నిద్రామవనిశయనాం సౌధవాతాయనస్థః

భావం:

ఓ మేఘుడా! నా భార్య పగటిపూట గృహకృత్యాలలోను, చిత్రలేఖనంలోను నిమగ్నమై ఉండి ఉండడం వలన ఆమెకు విరహబాధ అంతగా తెలియకపోవచ్చు. కాని, రాత్రి సమయాలలో అలాంటి కాలక్షేపాలు ఏమీ ఉండవుకదా! నిద్ర పట్టక భూశయనంలో మిక్కిలి దు:ఖిస్తూ ఉంటుంది. అందువల్ల నీకు నా విన్నపం ఏమిటంటే అలాంటి రాత్రి సమయంలో నీవు మా గృహంలో ప్రవేశించి నా కుశల వార్తలు చెప్పి ఆమెకు కొంచెం ఉపశమనం గలిగించే ప్రయత్నం గావించు.

శ్లో.28. ఆధిక్షామాం విరహశయనే సంనిషణ్ణైకపార్శ్వాం
ప్రాచీమూలే తనుమివ కలామాత్రశేషాం హిమాంశోః ।
నీతా రాత్రిః క్షణ ఇవ మయా సార్ధమిచ్ఛారతైర్యా
తామేవోష్ణైర్విరహమహతీ మశ్రుభిర్యాపయన్తీమ్

భావం:

ఓ మేఘ మిత్రమా! విను నీవు వెళ్ళేసరికి నా భార్య ఏ రూపంలో ఉంటుందో ఊహించి చెప్తాను. నా వియోగం వలన కలిగిన బాధతో బాగా బక్కచిక్కి ఉండవచ్చు. ఒంటరిగా దు:ఖిస్తూ శయ్యపైన ఒకవైపు ఒరిగి పడుకుని ఉండవచ్చు. తూర్పు దిక్కుగా గమనిస్తే ఒక్క కళతో తేజోవిహీనంగా ఉన్న శశి బింబం వలె ఉంటుంది. పూర్వం నేనక్కడ ఉన్నప్పుడు నాతో శృంగార విలాసాలు గడిపినప్పుడు రార్తి మొత్తాన్ని క్షణ కాలంలా గడిపిన ఆమె ఇప్పుడు వియోగ దు:ఖం వలన ప్రతి క్షణం భారంగా దుర్భరంగా గడుపుతూ ఉండి ఉండవచ్చు.

శ్లో.29. పాదానిన్దోరమృతశిశిరాన్ జాలమార్గప్రవిష్టాన్
పూర్వప్రీత్యా గతమభిముఖం సంనివృత్తం తథైవ ।
చక్షుః ఖేదాత్ సలిలగురుభిః పక్ష్మభిశ్ఛాదయన్తీం
సాభ్రేఽహ్నీవ స్థలకమలినీం న ప్రబుద్ధాం న సుప్తామ్

భావం:

ఓ మేఘమా! మా ఇంటిలో కిటికీల రంధ్రముల ద్వారా ప్రసరించే వెన్నెలను గతంలో నా భార్య ఎంతో సాదరంగా ఆహ్వానించి ఆస్వాదించేది. ఇప్పుడు కూడా పూర్వస్నేహ కారణంగా వెన్నెల లోపలికి వెళ్ళినప్పటికి ఒంటరితనం అనుభవిస్తున్న ఆమెను చూసి వెనక్కు మళ్ళుతుంది. గత సంతోష దినాలు గుర్తుకు రాగా దు:ఖంతో కన్నులు మూతలు పడగా, మబ్బులు కమ్మి ఇటు పగటిపూట వికసించకుండా, అటు మొగ్గగా కాకుండా ఉన్న కలమెట్ట తామర పుష్పాల లాగా నా భార్య దీనావస్థలో ఉండి నీకు కనబడవచ్చు అంటూ తన భార్య వియోగవేధను మేఘునికి పరి పరి విధాలుగా వర్ణిస్తూ, వివరిస్తూ, విన్నవిస్తూ సాగుతూ… కొనసాగిస్తున్నాడు యక్షుడు.

(సశేషం)

– -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో