మనుచరిత్ర : వరూథినీ ప్రవరాఖ్యులు పాత్ర చిత్రణ(సాహిత్య వ్యాసం ) – గరికిపాటి గురజాడ

ISSN 2278-478

పరిచయం:
మార్కండేయ పురాణంలో ఉన్న ఒక కథ ఆధారంగా పెద్దన మనుచరిత్రను రచించాడు. మార్కండేయ పురాణంలో ఉన్న పాత్రల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, పెద్దన తనదైన శైలిలో మనుచరిత్రని రసరమ్యమైన కావ్యంగా తీర్చిదిద్దే క్రమంలో, ప్రతీ పాత్రని మరింత శ్రద్ధగా మలిచాడు. తన వర్ణనకౌశలంతో పెద్దన పాత్రల ఔన్నత్యాన్ని మరింత పెంచాడు. తన కావ్యం సమాజానికి ఒక చక్కటి సందేశాన్నిస్తూనే, పాఠకులకు దిశానిర్దేశం చేయాలని పెద్దన తపించాడు. ప్రవరుడి పాత్రతో మొదలుకొని ప్రతీ పాత్ర, వ్యక్తిత్వం వికసించే దిశగా తోడ్పడేవి.

ఒక దేశం గొప్పతనం ఆ దేశంలో ఉండే పౌరులపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా, మనుచరిత్ర కావ్యంలో వ్యక్తిత్వ వికాసం అంతర్లీనమైన భాగమే అయినా, కావ్యంలో ఉండే పాత్రల వల్లే కావ్యానికి ఆ సార్థకత చేకూరింది. పెద్దన ఆ పాత్రలను మలిచిన తీరు మనుచరిత్రని వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే కావ్యంగా నిలిపింది.

నిజానికి ప్రతీ వ్యక్తి తనని తాను మనుచరిత్రలో పాత్రలతో పోల్చుకోవచ్చు. రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తించడం మనుచరిత్రలో కనిపిస్తుంది. అచ్చంగా చెప్పాలంటే, మనుచరిత్ర మన నిత్యజీవితానికి ప్రతిబింబం. మనుచరిత్రలో పెద్దన చేసిన పాత్ర చిత్రణ ఒక సజీవ సృష్టి. మనుచరిత్రలో పాత్రలు అంత సజీవంగా ఉంటాయి కాబట్టే ‘మనుచరిత్ర మన చరిత్రే’ అన్నారు ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు.

మనుచరిత్రలో చాలా పాత్రలు ఉన్నాయి. అయితే, మొత్తం కావ్యంలో కీలకమైన పాత్రలు రెండు. ప్రవరుడు, వరూథిని. వరూథినీప్రవరాఖ్యుల సంవాద ఘట్టమే మొత్తం కావ్యానికి గుండె వంటిది. అయితే, వరూథిని ఎంతగా మభ్యపెట్టినా ప్రవరుడు లొంగకపోవడానికి ముఖ్యమైన కారణం సోమిదమ్మ, ప్రవరుడి భార్య. సోమిదమ్మ వంటి అనుకూలవతియైన భార్య ఉండబట్టే ప్రవరుడి ఇంద్రియనిగ్రహాన్ని ఎన్నడూ కోల్పోలేదు.

సోమిదమ్మ:
ప్రవరుడి భార్య సోమిదమ్మ. అంటే సోమయాజి భార్య అని అర్థం. కేవలం ఒకే ఒక్క తేటగీతి పద్యంలో సోమిదమ్మను వర్ణిస్తాడు పెద్దన. కానీ, ఆ చిన్న పద్యం ఎంతో గొప్ప సందేశాన్నిస్తుంది. ఒకే ఒక్క పద్యంలో ఒక గొప్ప పాత్ర ఔన్నత్యాన్ని చెప్పడం పెద్దనకే చెల్లింది. నిజానికి ఈ పాత్ర లేకపోతే ప్రవరుడు యజ్ఞాలు, యాగాలు చేయలేడు. దానధర్మాలు చేయలేడు. సంసార సాగరాన్ని ఈదలేడు.
ప్రవరుడు చేసే ప్రతీ మంచి పని వెనుక సోమిదమ్మ పాత్ర ఉంది. ప్రవరుడు ధర్మమార్గాన్ని వీడకపోవడానికి ఆమే కారణం. ప్రవరుడి వ్యక్తిత్వం ప్రకాశించడానికి సోమిదమ్మే హేతువు.
సోమిదమ్మ ప్రవరుడి పట్ల ఎంత అంకితభావంతో మెలగకపోతే ప్రవరుడు అపురూపసౌందర్యవతి అయిన వరూథినిని తిరస్కరిస్తాడు? సోమిదమ్మ పాత్రని పెద్దన పెద్దగా వర్ణించకపోయినా అంతర్లీనంగా ప్రవరుడి వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ఆమెది కీలకమైన పాత్ర అని చెప్పకనే చెప్పాడు.

తే. వండ నలయదు వేవురు వచ్చిరేని
నన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి
నతిథు లేతేర నడికి రేయైనఁ బెట్టు
వలయు భోజ్యంబు లింట నవ్వారి గాఁగ. (మను. 1 – 56)

ప్రవరుని భార్య సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వంటిది. ఇక్కడ అన్నపూర్ణ అనడం సార్థకం. కాశిలో అన్నపూర్ణ వ్యాసుడికి, అతడి శిష్యులకి భోజనం పెట్టిన సన్నివేశాన్ని శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో చాలా గొప్పగా వర్ణించాడు. అందుకే అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టిన స్త్రీలను అన్నపూర్ణతో పోలుస్తారు.
సోమిదమ్మ వెయ్యి మంది అతిథులు ఇంటికి వచ్చినా అలిసిపోకుండా వంట చేసి పెడుతుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలో అతిథి వచ్చినా అన్నం పెట్టేది. అంటే ప్రవరుని ఇంట్లో నిత్యం అన్నదాన సంతర్పణ జరుగుతూ ఉంటుంది.

ఇది చాలా గొప్ప ఆచారం. నిజానికి ఆచారాలు అంటే గుడ్డి నమ్మకాలు కాదు. ఒక జాతి సంస్కృతికి పట్టుగొమ్మలు. సోమిదమ్మ ఆనాటి గృహిణులకు ప్రతినిధి. ప్రతీ ఇంట్లోనూ ఇలా అతిథులను ఆదరిస్తే పేదరికం ఎక్కడ ఉంటుంది? అందుకే ‘అక్కడ పుట్టిన చిగురు కొమ్మైన చేవ’ అని పెద్దన మరో పద్యంలో అన్నారు. మనిషి స్వార్థాన్ని విడనాడి సమాజాన్ని ప్రేమించే స్థాయికి చేరుకోవడమే వ్యక్తిత్వ వికాసం. ఇవాళ ఎవ్వరికీ పక్కవారి జీవితంతో సంబంధం ఉండడం లేదు. తాను హాయిగా జీవిస్తే చాలు అని ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు. పై పద్యంలో ‘అతిథులు’ అన్నారే కాని ఏ కులమో, మతమో చెప్పలేదు. అంటరానితనం నేటికీ మరో రూపంలో ఉన్న ఈ సమాజంలో మనిషి తనకి తోటివారికి మధ్య ఎన్నో గోడలు నిర్మించుకుని అందరికీ దూరమైపోతున్నాడు. ఆ దిశ నుంచి అందరినీ నిస్వార్థంగా ప్రేమించే దిశకి చేరుకోవడమే అసలైన వ్యక్తిత్వం. సోమిదమ్మ పాత్రని పెద్దన చిత్రించిన తీరు ఈకాలం మనుషులకి ఆదర్శంగా నిలుస్తుంది.

ప్రవరుడు:
సంస్కృతంలో ద్విజాతిప్రవరుడు అని ఉన్న ఈ పాత్రను, పెద్దన మాత్రం మారన మార్కండేయపురాణాన్ని అనుసరించి ప్రవరుడు అని కొనసాగించాడు. ద్విజాతిప్రవరుడు అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని అర్థం. ప్రవరుడి గురించి పెద్దన చెప్పిన ఈ పద్యం మనుచరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన పద్యాల్లో ఒకటి.

ఉ. ఆపురిఁ బాయకుండు మకరాంకశశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ
క్షా పరతంత్రుఁ డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపన తత్పరుండు ప్రవారాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై. (మను. 1 :51)

ఇది ప్రవరుని పాత్రను మనుచరిత్రలో పెద్దన పాఠకులకు పరిచయం చేసిన తీరు. ఈ పద్యం నిజానికి ప్రవరుని వృత్తి గురించి, గొప్పతనాన్ని గురించి చెప్పేదే అయినా, కాస్త నిశితంగా పరిశీలిస్తే గొప్ప సందేశం ధ్వనిస్తుంది.

ప్రవరుడిని భాషాపరశేషభోగిగా, వివిధాధ్వరనిర్మలధర్మకర్మ దీక్షాపరతంత్రుడిగా, అనారతాధ్యాపన తత్పరుడిగా పెద్దన చిత్రించాడు. ‘శేషభోగి’ అంటే ఆదిశేషువు. ప్రవరుడు భాష విషయంలో మరో ఆదిశేషువని పెద్దన ఉద్దేశ్యం. పాముకి రెండు నాలుకలుంటే, ఆదిశేషువుకి రెండువేల నాలుకలుంటాయి. అంటే ప్రవరుడు గొప్ప వాక్చాతుర్యం, మాటతీరు కలవాడని అర్థం.

‘వివిధాధ్వరనిర్మలధర్మకర్మ దీక్షాపరతంత్రుడు’ అంటే పలు రకాలైన యజ్ఞాలు, పుణ్యకార్యాలు దీక్షగా చేసేవాడు అని అర్థం. ప్రవరుడు క్రమశిక్షణ, పట్టుదల కలవాడు. ఒక మంచి పనిని తలపెడితే దాన్ని దీక్షగా భావించి పూర్తి చేస్తాడని, ధర్మానికి కట్టుబడి జీవిస్తాడని పెద్దన ఉద్దేశ్యం.

‘అనారతాధ్యాపన తత్పరుడు’ అంటే ఎల్లప్పుడూ వేదాధ్యయనం చేయడంలో ఆసక్తి కలవాడని అర్థం. అంటే జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తి కలవాడని స్పష్టమవుతోంది.

యావద్భారతీయ సంస్కృతికీ, జీవన విధానానికి ఈ పద్యం ప్రతిబింబంగా నిలుస్తుంది. ఒక వ్యక్తి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలంటే చక్కటి మాటతీరు కలిగి ఉండాలి, ధర్మానికి కట్టుబడి ఉంటూ మంచి పనులు చేయాలి, నిత్యం జ్ఞానసముపార్జన, విద్యాధ్యయనం పట్ల ఆసక్తి, జిజ్ఞాస కలిగి ఉండాలి అని పెద్దన చెప్పకనే చెప్పారు.

చివరిదైనా చిన్నది కాని మాట. ‘ఆపురిఁ బాయకుండు’ అంటే ఆ ఊరిని విడిచి ఉండడని అర్థం. ఎన్ని మంచి పనులు చేసి ఎంత కీర్తిని సంపాదించినా, ఎంత జ్ఞానాన్ని పొందినా తిరిగి నీ దేశానికి, నీ గ్రామానికి ఆ జ్ఞానాన్ని అందించాలి. నువ్వు ఎదిగిన ప్రాంతాన్ని మర్చిపోకూడదు అనే భావం ఆ పదంలో ధ్వనిస్తోంది. పైచదువుల పేరు మీద విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్న యువతకి ఈ పద్యం ఒక గుణపాఠం.

మొదటి పద్యంలోనే ప్రవరుడి పాత్రను ఇంత ఆదర్శవంతంగా చిత్రించాడు పెద్దన. ఈ పద్యం ప్రవరుడిని పరిచయం చేసేది మాత్రమే. కావ్యంలో కథ నడిచేకొద్దీ పెద్దన ఆ పాత్రను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాడు. నిజానికి వ్యక్తిత్వం వికసించడానికి ప్రవరుడి పాత్ర ఒక్కటి చాలు. అందుకు ప్రవరుడి పాత్రను పెద్దన తీర్చిదిద్దిన విధానమే నిదర్శనం.

వరూథిని:
ప్రవరుడి వ్యక్తిత్వం గొప్పదే అయినా ఆయన మనోనిగ్రహానికి పరీక్ష పెట్టింది వరూథిని పాత్రే. అనుభవానికి వస్తే కాని కొన్ని సందర్భాల్లో మనిషి ఎలా ప్రవర్తిస్తాడో చెప్పలేం.

వరూథిని పరిచయం అయ్యేనాటికే ప్రవరుడు గొప్పవాడైనప్పటికీ అతడి మనోనిగ్రహానికి పరీక్ష పెట్టి ప్రవరుడి పాత్రకి మరింత ఔన్నత్యాన్ని సంతరింపజేసింది వరూథిని పాత్రే. వరూథిని పాత్ర ఈరోజు ప్రతీ మనిషి ఎదుర్కొనే వ్యామోహాలకి ప్రతీక. ధర్మమార్గంలో నడిచేవారికి జీవితంలో ఇలాంటి పాత్రలే ఎదురయ్యి పరీక్ష పెడుతుంటాయి. వరూథిని చక్కటి మాటకారి. తన మాటలతో ప్రవరుడిని బుట్టలో వేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. గొప్ప మనోనిగ్రహం కల ప్రవరుడి వంటి వారు తప్ప మరెవరైనా సరే వరూథిని మాటలకు మాయలో పడపోకుండా ఉండలేరు. సగటు మనిషి నిత్య జీవితంలో ఎదురయ్యే ఆకర్షణలు మనిషిని ఎంతగా మభ్య పెడతాయో వరూథిని పాత్ర ద్వారా అర్థం చేసుకోవచ్చు.

మూలంలో ఉన్న దానికంటే వైవిధ్యంగా వరూథిని పాత్రను పెద్దన తీర్చిదిద్దాడనడంలో ఏ సందేహం లేదు. ప్రవరుడి ధర్మనిష్ఠకి వరూథిని పాత్ర అగ్నిపరీక్ష వంటిది. పరీక్ష పెడితేనే కదా ఎవరి గొప్పతనం ఎంతో తెలిసేది. మాటల్లో అందరూ మంచివాళ్ళే, మనోనిగ్రహం కలవారే. కానీ ఆచరణకి వచ్చేసరికి చాలా మంది పట్టు తప్పుతారు. తన మాటకారితనంతో, అందంతో, ప్రేమతో వరూథిని ప్రవరుడిని చాలా మభ్య పెడుతుంది. కానీ స్వతఃసిద్ధంగా ధర్మనిష్ఠ కలవాడు కాబట్టీ, వైరాగ్యం కలవాడు కాబట్టే అగ్నిపరీక్షకి తట్టుకొని ప్రవరుడు నిలబడ్డాడు.

మనుచరిత్ర మొత్తానికి అత్యంత ఆకర్షణీయమైనది, కీలకమైనది వరూథిని పాత్ర.

ఉ. ఇంతలు కన్నులుండఁ దెరు వెవ్వరి వేఁడెదు భూసురేంద్ర యే
కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతయు కాక నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవ చెప్పు నీ
కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమి మాట లేటికిన్. (మను. 2 – 41)

ప్రవరుడు వరూథినిని ఇంటికి వెళ్ళే మార్గం అడిగినప్పుడు వరూథిని ప్రవరునితో ఇలా పలుకుతుంది. ‘ఓ విప్రుడా! ఒంటరిగా ఉండే అమ్మాయిలను పలకరించాలనే ఉద్దేశ్యం లేకపోతే చారడేసి కన్నులు పెట్టుకొని ఇతరులను దారి అడుగుతావెందుకు? నిజంగా నీకు దారి తెలియదా? నీకు నేనంత చులకనగా కనిపిస్తున్ననా?’ అని పలుకుతుంది.

ఇలా మాట్లాడడంలో ఆమె ప్రవరుడిని మభ్య పెట్టాలని చూస్తోందన్నది స్పష్టం. ఆ కోరికని సూటిగా చెప్పకుండా పరోక్షంగా ధ్వనింపజేసింది. నిత్యజీవితంలో మనిషికి ఎదురయ్యే ఆకర్షణలు అలాగే ఉంటాయి. అనితరసాధ్యమైన తన శైలితో పెద్దన ఈ ఘట్టాన్ని చాలా నాటకీయంగా మలిచాడు. ఇక్కడ ప్రవరుడు ధర్మానికి కట్టుబడాలా? ఆకర్షణకు లొంగిపోవాలా? అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ధర్మానికే కట్టుబడతాడు.

మొత్తం మనుచరిత్రలో అత్యంత రసవత్తరమైన ఘట్టమిది. వరూథినీప్రవరుల సంవాదం ప్రవరుడి ధర్మనిష్ఠకి పరీక్ష. ఆ ఒక్క ఘట్టాన్ని అర్థం చేసుకుంటే చాలు మనిషిని ఆకర్షణలు ఎలా మభ్య పెడతాయో అర్థమవుతుంది.

ప్రవరుడి పాత్ర ఔన్నత్యాన్ని పెంచడానికి పెద్దన వరూథిని పాత్రకి మరిన్ని సొబగులద్ది పాఠకులను సైతం సందిగ్ధావస్థలో పడేస్తాడు. నిజానికి వరూథిని పాత్ర మనిషి జీవితంలో ఎదురయ్యే అందమైన ఆకర్షణలకు ప్రతిరూపం. వరూథిని లేకపోతే మనుచరిత్ర లేదు.

– గరికిపాటి గురజాడ.
పిహెచ్. డి. పరిశోధక విద్యార్థి(తెలుగు శాఖ)
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం

ఆధార గ్రంథాలు
1. గురజాడ, గరికిపాటి, 2015. మనుచరిత్ర: వ్యక్తిత్వ వికాసం. హైదరాబాదు: హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఎం. ఫిల్. పరిశోధన వ్యాసం.
2. దామోదరనాయుడు, గార్లపాటి. 2012. మనుచరిత్ర – మనచరిత్ర. హైదరాబాదు: తెలుగు అకాడమి.
3. దుర్గయ్య, పల్లా. 1980. పెద్దన కవితావైభవం. హైదరాబాదు: యువభారతి ప్రచురణలు
4. పెద్దన, అల్లసాని. 2001. మనుచరిత్రము. చెన్నై: వావిళ్ళ రామస్వామిశాస్త్రులు & సన్స్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో