నా కళ్లతో అమెరికా-72 (కాన్ కూన్ -మెక్సికో యాత్ర- భాగం-3)-డా.కె.గీత

కాన్ కూన్ ఎయిర్పోర్టు అద్దాల తలుపులు సరిగ్గా రెండడుగుల్లో దాటుతామనంగా చక్కగా సూటు వేసుకుని, ఎయిర్పోర్టు హెల్పింగ్ బూత్ లో పనిచేస్తున్నట్లున్న ఒకమ్మాయి మమ్మల్ని “సహాయం ఏమైనా కావాలా?” అని నవ్వుతూ పలకరించింది.

అప్పటికే మేం బయటికెళ్లే ముందు పక్కకి ఆగి మా పాకేజీలో భాగమైన పికప్ టాక్సీ కి ఫోను చెయ్యడానికి నంబరు కోసం రిసీట్ లో చూడాలని అనుకుంటూ నడుస్తున్నాం.

ఇంతలో ఈమె కనబడి పలకరించడంతో “మేం ఫోను చెయ్యకుండా ఈమెనే టాక్సీ స్టాండ్ వివరాలు అడిగితే సరిపోతుంది కదా!” అనుకుని “పోనీలే ఈమెవరో బానే అడిగిందని” దగ్గిరికెళ్లాం.
ముందుగా నేనామెని అడిగేను “కాస్ట్కో పాకేజీ లో హోటల్ టాక్సీ పికప్ కి ఎక్కడికి వెళ్లాలి?” అని.
ఆమె చెపుతాను ఇలా నా డెస్కు దగ్గిరికి రండి అంటూ తీసుకెళ్లి, “ఇదేనా మొదటిసారి రావడం?” అని స్పానిషు యాసలోని ఇంగ్లీషులో అడిగింది.

అవునని మేం తలూపగానే “వెల్ కమ్ టు కాన్కూ న్” అని కొన్ని సరదా కబుర్లు చెప్పి, “రేపు ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారు?” అంది.

“మేం ఇంకా ఏమీ అనుకోలేదు” అన్నాం.
అయితే మీకు చాలా చవకగా మూడు టూర్లు కలిపి తక్కువ ప్రైస్ లో ఇస్తాను వివరాలు చూడండి అంటూ చార్టు మా ముందు పెట్టి, స్కెచ్ పెన్నుతో గీతలు చుడుతూ ఏవో చూపించసాగింది.

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

అప్పటికప్పుడు తీసుకుంటేనే ఆఫర్ ఉంటుంది అంది పైగా. ఆన్ లైనులో మేం చూసిన కంటే బాగా తక్కువకి ఆమె ఆఫర్ చేస్తూ ఉంది, పైగా అప్పుడే కొనుక్కుంటే ఇక ఉదయం టూరుకి వెళ్లొచ్చనే ఉద్దేశ్యంతో కానీ ఎందుకైనా మంచిదని ఒక టూరు చాలని చెప్పేం.

ఇక టూరు టిక్కెట్ల పేమెంటు కార్డు కాకుండా కాష్ గానీ, చెక్ గానీ ఇమ్మంది. నాకు కొంచెం అనుమానం వచ్చి, “మా దగ్గిర కాష్ ఎక్కువ లేదు” అని యాభై డాలర్లు ఇచ్చి, “మిగతాది రేపు టూరు దగ్గిర పే చేస్తాం అని చెప్పేను గొప్ప తెలివిగా. ఆమె వెంటనే ఒప్పుకుంది.

“కానీ ఒక మాట, మీరు బాలెన్సు కట్టేకనే టూరు టిక్కెట్లు ఇస్తారు మీకు, ఇక పొద్దున్నే మిమ్మల్ని మా డ్రైవరు పికప్ చేసుకుని మా రిసార్టు కి తీసుకెళ్తాడు, అక్కడ మీరు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ చెయ్యొచ్చు. అక్కడే బ్యాలన్సు కట్టి టిక్కెట్లు తీసుకోవచ్చు” అంది.

“మీ రిసార్టు ఎక్కడుంది?” అనడిగేం.
మాప్ తీసి, “ఇదిగో ఇది మీ హోటలు, ఇక్కడ మా రిసార్టు ” అని చిన్న గీత గీసింది.
చాలా చిన్న మేప్ కావడంతో అందులో చూస్తే పక్క వీధిలా కనిపించింది.

రిసీటు ఇస్తూ “అయితే చివరగా ఒక మాట, మీరు ఎక్కడికి వెళ్లేదీ ఎవరితో చెప్పకండి” అంది.
దాంతో సత్యకి అనుమానం వచ్చి ఇదేమైనా “టైం షేరింగ్ విషయమా” అన్నాడు.

ఆమె “అబ్బే, అలాంటిదేమీ లేదు” అని తేలిగ్గా నవ్వి “మీకు టూరు వద్దనుకుంటే మీ డబ్బులు వాపసు రేపైనా కూడా తీసుకోవచ్చు” అని,

“మీరిద్దరూ హనీమూన్ జంటలా ఉన్నారు కానీ, పిల్లలు ఉన్నట్లే లేరు” అంటూ మాటమార్చి మమ్మల్ని అయిసు చేసేసింది.

ఇక కాస్ట్కో పికప్ బయటికి వెళ్లేక దగ్గర్లోనే ఉంటుందని చెప్పింది.

నేను “సరేలే ఆమె చెప్పేదేవిటో కూడా చూద్దాం. మరో రిసార్టు చూసినట్టూ ఉంటుంది. పైగా ఒక్కటే టూరు కొన్నాం, ఎక్కువ అడ్వాన్సు కూడా ఏవీ కట్టలేదు కదా!” అని తేలిగ్గా తీసుకోమని సత్యకి సర్ది చెప్పేను.
ఇంతకీ బయటికి రాగానే అర్థమైన విషయం ఏవిటంటే అది చాలా చిన్న ఎయిర్ పోర్టని. మేం ఇంటర్నేషల్ ఎయిర్పోర్టుల లెవెల్లో ఊహించుకుని, బయట వెతుక్కోవడం కష్టమని అప్పటివరకు ఆయాసపడ్డాం.

తీరా చూస్తే చిన్న బస్టాండు బయటికి వచ్చినట్లు ఒక పొడవైన ప్లాట్ ఫారమ్మీద నడిచి ఎదురుగా “కాస్ట్కో” అని రాసి ఉన్న యూనీఫారం మనుషులిద్దర్ని చూడగానే “అనవసరంగా ఆమె దగ్గిర ఆగి సమయం వృథా చేసుకున్నాం” అని అనుకున్నాం. వాళ్లిద్దరూ తప్ప అక్కడ పిట్టమనిషి లేడు.

ఎయిర్పోర్టు బయటకి అడుగుపెట్టగానే వాతావరణం అచ్చం హైదరాబాదులో దిగినట్లు ఉంది వెచ్చగా.
కాలిఫోర్నియాలో చలి దుస్తులు తీసేసి, హాయిగా తిరగగలిగే వెచ్చదనాన్ని చూడగానే పిల్లలు కేరింతలు కొట్టేరు.

అచ్చు ఇండియాలో దిగినట్లు ఉందని మురిసిపోయాం. కాకపోతే జనమే లేరు, అంతే.

అక్కణ్ణించి హోటలుకి దాదాపు గంటన్నర పాటు ప్రయాణం చేసేం. బీచ్ రోడ్డులో ఉన్న హోటలు జోన్ లో మా “బీచ్ పాలెస్” హోటల్లో రాత్రి పన్నెండుగంటల వేళ చెకిన్ అయ్యేం.

అప్పటికి అన్నీ మూసేసి ఉండడం వల్ల మాకు తినడానికి ఏమీ దొరకలేదు.

నిజానికి కాలిఫోర్నియా టైములో అది రాత్రి తొమ్మిది గంటల వేళ కావడంతో అందరికీ బాగా ఆకలేస్తూ ఉంది.

దార్లో డాలస్ ఎయిర్పోర్టులో కొన్న తినుబండారాలు, ఇంటి నుంచి తెచ్చిన బిస్కెట్లు అప్పుడు పనికొచ్చేయి.

ఇక మా గది సూట్ కావడం వల్ల మంచాల పక్కనే గదిలో మూడు వంతుల భాగంలో స్పా టబ్ ఉంది. అద్దాల పార్టీషను, ఓపెన్ సింక్స్, బాల్కనీ తెరవగానే ఎనిమిదో అంతస్థులోంచి కింద ఎదురుగా వెన్నెల పరుచుకున్న అందమైన కెరటాలతో అనంత జలధి.

ఓహ్, అత్యద్భుతంగా ఉందక్కడ! అయితే ఉదయం ఎనిమిది కల్లా బయటికెళ్లాల్సి ఉండడంతో ఆస్వాదనని మర్నాటికి వాయిదా వేసి నిద్రకుపక్రమించాం.

–డా.కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నా కళ్ళతో అమెరికా, యాత్రా సాహిత్యంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో