మేఘసందేశం-15- వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు గురించి ఒక సంఘటన చెప్పుకుని మేఘసందేశంలోకి వెళ్దాం. ఒక సారి భోజరాజుకు వింత కోరిక ఒకటి కలిగింది. “నేను మరణించిన తర్వాత కాళిదాసు తన గురించి ఏమి చెప్తాడు”? అని తలచి,      కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు. కాళిదాసు “మీ కోరిక పిచ్చిగానూ,  అమంగళకరము గానూ వుంది నేను తీర్చలేను క్షమించండి” అన్నాడు. రాజాజ్ఞను ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష అన్నాడు రాజు.  కాళిదాసు భయపడి అయినా చెప్తాడేమో అనుకుని. కానీ కాళిదాసు “విద్వాన్ సర్వత్ర పూజ్యతే”   అని ఒకే ఒక్క మాట చెప్పి ధారానగరం విడిచి వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతుందని వూహించని రాజు దిగులు పడిపోయాడు కాళిదాసు లేకుంటే ఆయనకు ఒక్క రోజు కూడా గడవదు. కొన్నాళ్ళు గడిచాక, కాళిదాసు ఏకశిలా నగరం లో ఉన్నాడని వేగులు చెప్పారు. వెంటనే భోజరాజు గడ్డాలూ మీసాలూ పెట్టుకొని యోగివేషంలో కాళిదాసును వెతకడానికి ఏకశిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ కాళిదాసు ఆయనకు యెదురుపడ్డాడు. భోజరాజు ఆయనను చూసి మహాకవీ! అభివాదాలు అన్నాడు. నేను ధారా నగరం నుండి వస్తున్నాను అన్నాడు. అలాగా అయితే భోజరాజు గారు యెలా వున్నారు? అని ఆత్రంగా అడిగాడు కాళిదాసు. అప్పుడు యోగి వేషం లో వున్న భోజరాజు విచారంగా యింకెక్కడి భోజరాజు? కాళిదాసు ధారా నగరం విడిచి  వెళ్లిపోగానే ఆయన ఆ దిగులుతో మరణించారు అన్నాడు. కాళిదాసు అదిరి పడ్డాడు. ఆయనకు భోజరాజుతో గడిపినరోజులు గుర్తుకొచ్చాయి అప్రయత్నంగా ఆయన నోటివెంట శ్లోకం వచ్చింది.

“అద్యధారా నిరాధారా నిరాలంబా సరస్వతీ ”

పండితా ఖండితా సర్వే భోజరాజే దివంగతే!”

దీని భావం ఏమిటంటే… ఈ రోజు ధారా నగరం నిరాధారమై పోయింది. వాగ్దేవికి ఆలంబన పోయింది. భోజరాజు దివంగతుడు కావటంతో పండితులందరికీ చావు దెబ్బ తగిలింది. కానీ ఆయన వాక్శుద్ధి ప్రభావం తో ఆ యోగి అకస్మాత్తుగా కూలి చని పోయాడు. నిదానంగా చూసి, ఆ యోగిని రాజుగా గుర్తించి న అనంతరం నివ్వెరపడి, “ఎంత పని చేశారు మహారాజా!” అని రోదించాడు కాళిదాసు. వెంటనే కర్తవ్యం స్ఫురించి భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తన శ్లోకాన్ని మార్చి చదివాడు.

“అద్యధారా సదా ధారా, సదాలంబా సరస్వతీ

పండితా మండితా సర్వే, భోజరాజే భువంగతే”

దీని భావం ఏమిటంటే… “ఈ రోజు ధారా నగరానికీ, సరస్వతీ దేవికీ చక్కని ఆలంబన దొరికింది. భోజరాజు భూలోకంలో అవతరించగానే పండితులందరూ చక్కగా సత్కరించబడ్డారు. శ్లోకం వినగానే భోజరాజు సజీవుడై లేచి కూర్చున్నాడు. రాజూ, కవిరాజూ గాఢంగా కౌగలించుకున్నారు. ధారా నగరానికి తిరిగి వెళ్లి పోయారు. కాళిదాసు వాక్శుద్ధి అలాంటిది.  మళ్ళీ మనం మేఘ సందేశంలోకి ప్రవేశిద్దాం.

శ్లో.63. తత్రావశ్యం వలయకులిశోద్ఘట్టనోద్గీర్ణతోయం

నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వం ,

తాభ్యో మోక్షస్తవ యది సఖే ఘర్మలబ్ధస్య స్యాత్

క్రీడాలోలాః శ్రవణపరుషైర్గర్జితైర్భాయయేస్తాః

భావం:  మిత్రుడా! కైలాసమందు, సురయువతులు నిన్ను తమ కంకణాల అంచులతో ఒత్తి, నిశ్చయంగా నీలోని నీటిని పిండుతారు. ఎండాకాలంలో వారికి నీవు దొరికినందువల్ల నిన్ను వారు తప్పక నీ నీటి ఆటల్ని మరిగి, వారు నిన్ను విడిచిపెట్టరు. అప్పుడు క్రీడాలోలురైన వేల్పు చేడియలను వినడానికి కఠినాలైన నీ ఉఱుములతో భయపెట్టి, తప్పించుకొని పారిపో! అంటున్నాడు యక్షుడు. మనం ఇంకా కొంచెం లోతుకు వెళ్తే.. యిది మనోహరమైన భావం. మేఘానికి సంబంధించి ఎన్ని ఆలోచనలు చేయాలో అన్నీ చేశాడు కాళిదాసు అని మనకు అర్ధమవుతుంది. వారు యువతులు కాబట్టి కొంటెపనులు చేయడం, ఎండా కాలంలో నీటి ఆటలు అందరికీ ఇష్టమేగదా! కృత్రిమంగా నీటిధారల్ని సృష్టించి ఆనందించడం కాలంలో ఉందని మనకు శ్లోకం ద్వారా తెలుస్తుంది.

శ్లో.64. హేమాంభోజ ప్రసవి సలిలం మానసస్యాదదానః

కుర్వ న్కామం క్షణముఖపట ప్రీతిమైరావతస్య ,

ధున్వన్కల్పద్రుమకిసలయాన్యంశుకాని స్వవాతై

ర్నానాచేష్టైర్జలద లలితైర్నిర్విశేస్తం నగేంద్రమ్ .

భావం:  ప్రియ మిత్రుడా! మేఘుడా! బంగారు తామరపూలు కల మానససరోవరంలో నీరు త్రాగు. ఐరావతం యొక్క ముఖానికి అలంకారమైన వస్త్రంలా అయ్యి, క్షణకాలం ప్రీతి కలిగించు. కల్పవృక్షాల చిగుళ్లనే సన్నని వస్త్రాలను నీ వాయువుచేత విదలిస్తూ సరదా చూడు. ఇలా నీ కిష్టమైన ఆటలాడి, పర్వతాన భోగించు అని అంటున్నాడు యక్షుడుఇంకా కొంచెం వివరాల్లోకి వెళ్తే…  కైలాస పర్వత ప్రశంస శ్లోకంతో ముగుస్తోంది. ఇక మీద అలకాపురి వర్ణన ప్రారంభమవుతుంది. అందువల్లనే కాళిదాసు ఇచ్ఛవచ్చినట్లు పర్వతంపై ఆడుకోమంటున్నాడు మేఘుడిని. మానససరోవరంలో బంగారు తామరపూలు ఉన్నాయి. బంగారంతో సంస్పర్శమైన నీరు త్రాగడం ఆరోగ్యానికి చాల శ్రేష్ఠం. ఐరావతం ఇంద్రుని వాహనం. ఏనుగు కైలాసపర్వతం దగ్గర ఎందుకున్నదీ అంటే, శివని సేవించేందుకు ఇంద్రుడు వచ్చాడని మనం భావించవచ్చు. అలాగే కల్పవృక్షాలు స్వర్గంలోనే ఉన్నాయనుకోనక్కరలేదుకోరిన ఫలాల్ని కల్పించే వృక్షమే కల్పవృక్షం అని అంటారు. సాక్షాత్తు పరమశివుడు కొలువైన కైలాసపర్వతాన ఉన్న వృక్షాలన్నీ కల్పవృక్షాలే కదా! నానావిధ చేష్టలతో పర్వతంపై క్రీడించు అనడంలో ఔచిత్యం ఎంతో ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే  పర్వతం మేఘుని మిత్రగృహం. పర్వతానికి మేఘానికి సహజమైత్రి. సహజమైత్రి అంటే దర్శనంతోనే స్నేహం ఏర్పడటం. వాటికే కాదు శిఖిమేఘాలకు (శిఖి = నెమలి), అబ్జసూర్యులకు (అబ్జం = పద్మం), సముద్ర చంద్రులకు, దృష్టి రమ్యాలకు (చూపుకు అందానికి మైత్రి. అందం కనబడగానే చూపు ఆనందిస్తుంది) తనను చూసి ఆనందించే చూపును చూసి, అందమూ ఆనందిస్తుంది. పై జంటలు ఒకదాని దర్శనంతో మరొకటి ఆనందిస్తాయి. అందువల్ల వాటికి సహజమైత్రి. అందువల్లనే నీ మిత్రుని గృహంలో నీవు నీ ఇష్టం వచ్చినట్లు క్రీడించు అంటున్నాడు. అయితే ఇష్టం వచ్చినట్లు అని వ్రాయబోతున్నందున కాళిదాసు విభిన్నాంశాలను అంటే పొంతనలేని అంశాలను శ్లోకంలో కూర్చాడేమో అనిపిస్తుందిమొదటిపాదంలో జలపానం, రెండవపాదంలో ఐరావతంతో క్రీడ, మూడవపాదంలో కల్పవృక్షాలతో క్రీడ…. ఇలా చెప్పుకుంటూ వెళ్ళి కాళిదాసు మనకు అలకాపురిని మేఘునికి పరిచయం  చేయబోతున్నాడు.

శ్లో.65. తస్యోత్సంగే ప్రణయిన ఇవ స్రస్తగంగాదుకూలాం

త్వం దృష్ట్వా పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్,

యా వః కాలే వహతి సలిలోద్గార ముచ్చైర్విమానా

ముక్తాజాలగ్రథిత మలకం కామినీవాభ్రబృందం.

భావం:    కైలాసపర్వతం మీద అలకాపురిని కాళిదాసు ప్రియుని తొడపై ఉన్న కామినిలా ఉన్నది అంటునాడు. దరినున్న గంగ, కామిని మొలనుండి కొంచెంగా జారిన శ్వేతవస్త్రంలా ఉన్నది. ప్రియునిచే లాలింపబడుతూ, అలక తీరినట్లున్నది. వర్షాకాలంలో చినుకులు రాల్చుతూండగా, ముంగురులందు ముత్యాలు కూర్చి, అలంకరించినట్లున్నది. సంగతులన్నీ కామచారివైన నీకు తెలియకుండా ఉండవులే అని మేఘుడిని చమత్కరిస్తునాడు యక్షుడు. ఇంకొంచెం ఆలోచిస్తే.. కైలాసపర్వతం అనుకూలుడు అనే నాయకుడైతే, లాలింపబడే అలకాపురి స్వాధీనపతిక అనే నాయిక అని మనకు ధ్వనిస్తున్నది. పురిలో ఎత్తైన భవనాలున్నాయి. కొద్ది ఎత్తులో  దాపున వర్షాకాలంలో మేఘాలు తిరుగాడుతూంటాయి. అవి వర్షపు చినుకులను కురిపిస్తూంటే, చూడటానికి ఎలా ఉందంటే, ప్రియురాలి ముంగురులందు ముత్యాలు కూర్చి, అలంకరించినట్లున్నది.

ఈ శ్లోకంతో పూర్వమేఘం సమాప్తం. వచ్చే మాసం ఉత్తరమేఘంతో కలుసుకుందాం. సెలవు

వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

One Response to మేఘసందేశం-15- వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో