సాంఘిక సేవా కార్యకర్త,రైతుకూలీల సంక్షేమం కోసం కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన్ సంఘాన్ని స్థాపించిన నాయకురాలు శ్రీమతి అరుణ్ రాయ్ 26-5-1946 చెన్నైలో జన్మించింది .తండ్రి ప్రభుత్వోద్యోగి అయినందున ఆమె ఢిల్లీ లొ పెరిగింది .ఢిల్లీ యూని వర్సిటి కాలేజిలో ఇంగ్లిష్ లిటరేచర్ చదివి డిగ్రీ పొందింది .ఇండియన్ అడ్మిని స్ట్రేటివ్ సర్వీస్ లో సివిల్ సర్వెంట్ గా 1968లో చేరి 1974వరకు ఆరేళ్ళు పనిచేసి౦ది .
పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసి ,పేద ,బడుగు వర్గాల వారి సమస్యలపై దృష్టి పెట్టింది.రాజస్థాన్ టినోలియా లోని ‘’సోషల్ వర్క్ అండ్ రిసెర్చ్ సెంటర్ ‘’లో చేరి౦ది .అరుంధతీ రాయ్ 1987లో నిఖిల్ డే,శంకర్ సింగ్ మొదలైన ఉత్సాహవంతులతో కలిసి’’ మజ్దూర్ కిస్సాన్ శక్తి సంఘటన్’’సంస్థ ఏర్పాటు చేసింది .ఈ సంఘటన ద్వారా కూలీలసమాన హక్కులు న్యాయమైన జీతాలకోసం పోరాటం చేసింది .దీనివలననే ‘’సమాచార హక్కు చట్టం ‘’ఏర్పడింది .సమాచార హక్కు కోసం దేశవ్యాప్తం గా అనేక చోట్ల ఉద్యమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి , ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది .ఈ నిరంతర ఉద్యమ ఫలితంగానే 2005 లో కేంద్ర ప్రభుత్వం ‘’సమాచార హక్కు చట్టం’’ తెచ్చింది .దీనివలన పౌరులందరికీ ప్రభుత్వ ఆఫీసులలో జరిగే విషయాలను తెలుసుకొనే హక్కు లభించింది .ఎన్నో లొసుగులు బయటపడి ప్రభుత్వాల తీరు తెన్నులేమిటో పారదర్శకంగా ప్రజలకు తెలుస్తోంది .దీనికి ఆమెకు మనమందరం ఎంతో రుణపడి ఉన్నాం .
పేద, అట్టడుగు వర్గాల ప్రజల హక్కులకోసం అరుణ్ రాయ్ నాయకత్వం వహించి, దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించింది .ఇందులోపనిచేసే హక్కు ,ఆహార హక్కు , సమాచార హక్కు లూ కలిసే ఉన్నాయి .ఇటీవలి కాలం లో ‘’పెన్షన్ పరిషత్ మెంబర్ ‘’గా ‘’వ్యవస్థీ కృతం కాని’’వ్యవస్థ(అన్ ఆర్గనైజేడ్ సెక్టార్ )లలోని ఉద్యోగుల ‘’నాన్ కాన్ట్రి బ్యూషన్ పెన్షన్ ‘’కోసం తీవ్రంగా ఉద్యమాలు చేసింది .దీనితోపాటు ‘’విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ లా’’ ( ప్రభుత్వోద్యోగుల అవినీతి ,అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై దర్యాప్తు జరిపటం ,వారిని బాధ్యతాయుతంగా పనిచేయించటం , ఆరోపణ చేసినవారికి భద్రతకలిగించాటం తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకొనే యంత్రాంగం ) మరియు ‘’గ్రీవెన్స్ రెడ్రేస్ యాక్ట్ ‘’( ప్రభుత్వ ,ప్రైవేట్ సంస్థలపై పౌరులు ఇచ్చే ఫిర్యాదులకు రసీదు ఇవ్వటం, దర్యాప్తుజరపటం నిందితులపై తీసుకున్న చర్యలువివరించటం ) అమలు కోసం పోరాడి సాధించింది .ఈ రెండూ 2011 లో చట్టరూపం దాల్చాయి .ఇదంతా ఆమె అకుంఠిత పోరాట దీక్షా ఫలితమే ..
అరుణ్ రాయ్ ‘’నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ‘’కు మెంబర్ గా20 06 లో రిటైర్ అయ్యేదాకా పని చేసింది .మజ్దూర్ కిస్సాన్ శక్తి సంఘటన్ ద్వారా గ్రామీణ పనివారల హక్కులు సాంఘిక న్యాయం ,సృజనాత్మక అభివృద్ధి కోసం ,చేసిన సేవలకు 1991 లో ‘’టైమ్స్ ఫెలోషిప్ ‘’అవార్డ్ అందుకొన్నది .సమాజ నాయకత్వానికి గాను 2,000లో ‘’రామన్ మేగసేసే’’పురస్కారం పొందింది .పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ,అకాడేమియా అండ్ మేనేజ్ మెంట్ లలో అత్యున్నత సేవకు 20 10 లొ లాల్ బహదూర్ శాస్త్రి ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది .టైమ్స్ మేగజైన్ 2011 లోవందమంది ప్రపంచ ప్రసిద్ధ ప్రభావితుల లో ఒకరుగా అరుణ్ రాయ్ ని ప్రకటించింది .20 17 సెప్టెంబర్ లొ ఇండియా టైమ్స్ పత్రిక ‘’మానవ హక్కులు కార్యక్రమలో ఇతరులు గౌరవంగా జీవించటానికి కృషి చేసిన 11 మంది ప్రసిద్ధులలో అరుణ్ రాయ్ ఒకరుగా గుర్తించింది .
బడుగు బలహీనవర్గాల ,కూలీ, రైతుల హక్కుల కోసం ,గౌరవప్రదమైన సమాన వేతనాలకోసం ఉద్యమించి ,సమాచార హక్కు చట్టాన్ని సాధించిన మహిళా మాణిక్యం అరుణ్ రాయ్ .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~