మంచిమాట-మంచిబాట(పుస్తక సమీక్ష )-మాలాకుమార్

మంచిమాట-మంచిబాట
రచన: సి. ఉమాదేవి

ఉమాదేవి గారు జూనియర్ కాలేజిలో పబ్లిక్ అడ్మినిస్రేషన్ లెక్చరర్ గా, అనుబంధ పాఠశాలకు కో ఆర్డినేటర్ గా, వైస్ ప్రిన్సిపల్ గా విద్యారంగానికి తగిన సేవలందించి, ఆపై ఫౌండర్ ప్రిన్సిపల్ గా శ్రీనగర్ విద్యానికేతన్ స్తాపించి తన పర్యవేక్షణలో విద్యార్ధినీ, విధ్యార్ధులకు విద్య నందించారు. ఎన్ని పనులున్నా మనసు మాత్రం రచనాభిలాష నుంచి మరలిపోలేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేసారు. స్కూల్ పిల్లలకై చిన్నచిన్న నాటికలు, లలితగీతాలు, కవితలు రాసి బాలానందంలో పిల్లల ద్వారా ప్రసారం చెయ్యడం, ఆకాశవాణిలో చదివిన కథలు, మహిళాసమాజంలో పాలుపంచుకున్న చర్చా కార్యక్రమాలు, విస్సా టి. విలో ఇంటర్వ్యూ, ఈటివిలో కొన్ని మహిళా కార్యక్రమాలు, వనితాజ్యోతి నిర్వహించిన వ్యాసపోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం మొదలైనవి ఆవిడ ఖాతాలో వున్నాయి. కవితలలో ‘అమ్మతనం’ కవితకు పోతుకూచి సాంబశివరావుగారి అవార్డు, ‘మనషి నిర్వచనం’ కవితకు ఆరాధన-ఆంధ్రప్రభ అవార్డు,

‘మానవతకు చిరునామా’ కవితకు ఎక్స్ రే అవార్డు లభించాయి. తన రచనలు, మనవడు, మనవరాలు చదవాలనే కోరిక తో అన్నీ ఒకే చోట పొందుపరచాలని, అన్నింటిని పుస్తకాలుగా మలిచారు. ఇదివరకే ‘శిలా పుష్పాలు’ నవల, ‘ చిన్నిగుండె చప్పుళ్లు’ కథా సంపుటం ప్రచురించారు. ఇటీవల జులై ఇరవైన తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు, ఆరు పుస్తకాలను ఆవిష్కరించారు. అవి ‘సాగరకెరటం’, ‘కేర్ టేకర్’ నవలలు, ‘అమ్మంటే’ కవితల సంపుటి, ‘మాటేమంత్రం’ కథల సంపుటి, ‘మంచి మాట-మంచి బాట’ వ్యాస సంపుటి, ‘ ఏకథలో ఏముందో’ అనే శీర్షికతో కథ, కవిత, నవల, వ్యాసాల సమీక్షాసంకలనం.

సి. ఉమాదేవి గారు వ్రాసిన మంచి మాట-మంచి బాట గురించి పరిచయము చేసుకునే ముందుగా రచయిత్రి తో చిన్న ముఖాముఖి:

1) మీకు రచనలు చేయాలనే కోరిక ఎప్పుడు కలిగింది?

జ) మీ మొదటి ప్రశ్నకు నా జవాబు ఓ చిన్న వ్యాసమయింది. విశాఖ సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువు సాగిస్తున్న తరుణంలోనే నాలో అంతర్గతంగా పరిశీలనాశక్తి మొగ్గ తొడిగింది. బాల్యంలో కేవలం జిరాక్స్ కాపీలా బుర్రలో ముద్రితమయే విషయాలు వయసు, ఊహ, పరిశీలనాశక్తి పెరిగేకొలది విశ్లేషణ, విమర్శ, వివరణలై నా సంభాషణలో చోటు చేసుకోనారంభించాయి. ఈ మార్పు కేవలం నా కుటుంబసభ్యులు, స్నేహితులకే పరిమితంకాక నేను చదివే రచనలపట్ల కూడా కలుగసాగింది. అయితే నాభావాలను ప్రోది చేసుకుని మనసులోనే నిలువరించుకుంటున్న నాకు వాటిని వెలువరించే అవకాశం తొలిసారిగా ఆంధ్రప్రభలో కలిగింది. స్పందనే రచనకు శ్రీకారం. స్పందన సంభాషణలలో నలుగురికి చేరితే రచన ద్వారా పదుగురికి చేరుతుంది. భావజాల ప్రకటనకు రచనను మించిన మాధ్యమం లేదనిపించింది. అయితే ఆలోచనకు అంకురార్పణ జరిగినంత శీఘ్రంగా ఆచరణ వేగం పుంజుకోదు. కథారచనకన్నా జీవిత రచనకు అంటే విధాత రచించిన నా జీవితానికి అధిక ప్రాముఖ్యతనివ్వసాగాను. బాధ్యతలకు అగ్రతాంబూలమిచ్చినా రచనానురక్తి ఇంకిపోలేదు. నా భావపరంపర నన్ను నిలువనిచ్చేది కాదు. బయటపడే అవకాశంకొరకు కలకాలం ఊహలతో ఊసులాడితే చాలదు. అందుకే ఆలోచనలను సమీకరించి క్రమబద్ధం చేయసాగాను. ఏదో చెప్పాలనే నా ఆకాంక్షను పత్రికారంగం అక్కున చేర్చుకుంది. స్పందనకు రూపురేఖలలది అక్షరరూపేణా ఆవిష్కరించసాగాను. ప్రకృతి ఒడిలో పరవశించిన నా మనసులో కథాబీజం నాటిన ఘనత మాత్రం అరకులోయదే!జలపాతాల పరవళ్లు పరవశాన్నికలిగిస్తే, అఘాతమైన లోయలు బ్రతుకు లోతులను తెలుసుకొమ్మని హెచ్చరించాయి. తూర్పు కనుమలు ఎత్తయిన కొండలు. అవి నేర్పిన పాఠం, మనిషెప్పుడూ ఉన్నతంగా ఉండాలని. అనంతగిరి ఘాట్ సెక్షన్ జీవితంలోని మలుపులను జాగ్రత్తగా స్టీరింగ్ చేయమంది. దట్టమైన దండకారణ్యం, జనారణ్యంలో సైతం హృదయం అరణ్యమంత విశాలంగా ఉండాలంది. ఆ స్ఫూర్థితోనే కథలలో మమతకు, మానవత్వానికి నీరాజనాలర్పించాను. మనసును రివైండ్ చేసుకుంటే తొలినాటి అక్షరవిన్యాసం కళ్లముందు ప్రత్యక్షమయింది. నిజానికి రచన ప్రారంభదశలో రచించడంకన్నా చించడమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన మనసుకే

తృప్తినివ్వని విషయాన్ని హడావిడిగా అక్షరబద్ధం చేస్తే అక్షరం చిరంజీవెలా అవుతుంది అనుకునే నాకు అందరికీ నచ్చేలా రచనలుండాలనే ఆశే నేను రచనలు చేసే విధంగా పురికొల్పి వుండవచ్చు. నన్ను నేను సమీక్షించుకుంటూ నాదైన శైలిలో రచించసాగాను. ఆత్మీయుల ఆశీస్సులు, పాఠకుల ప్రశంసలు అందించిన ప్రాణవాయువుతో పాటు పత్రికా సంపాదకులు చోటిచ్చి అందించిన ప్రోత్సాహం అమూల్యం. ఇదీ నా అక్షరకేళి. నేను అస్తమించినా నా అక్షరం అస్తమించకూడదన్న నా గాఢానుభూతే నా రచనలకు ఆయువుపట్టు. నావెంట రాలేని నా అక్షరాలను పాఠకుల గుండెల్లోనైనా భద్రపరచి వెళ్లాలనే. . . . నా కళ్లు చెమ్మగిలుతున్నాయి. నేనొక కవితలో అన్నట్లు అక్షరం నా ఊపిరి. నన్ను ఊపిరాడనియ్యదు.

2) మీ మనోగతం చాలా బాగా చెప్పారండి. మరి మీరు చాలా కథలు వ్రాసారు కదా, అందులో మీకు నచ్చిన కథ గురించి చెప్పండి?
జ) మీ పిల్లలలో మీకెవరిష్టమంటే ఎలా చెప్పగలం? మనసునిండా పరచుకున్న అక్షరబాలలు చెంగుమని గెంతుతూ తమకిష్టమున్నచోట కథగా స్థిరపడి నన్ను నివ్వెరపరుస్తాయి. మా పాప, మా బాబు అని ఆప్యాయంగా చెప్పుకున్నట్లు ఇది నా కథ, నేను రచించిన కథ, అదిగో ఆ వార పత్రికలో, ఇదిగో ఈ మాస పత్రికలో అని నా కథకు చిరునామా అడిగినవారికి, అడగనివారికీ అందించి వారందించే స్పందనకు ఎదురు చూస్తాను. అయితే వందమంది దాకా చేసిన ఫోనులు, పంపిన మెసేజ్ లు మాత్రం మాటే మంత్రం కథకే మరి. మన పిల్లలలో కళాకారులుంటే అందరు గుర్తిస్తారు కదా!అందుకేనేమో మాటేమంత్రం కథంటే కాస్త సంబరపడతాను. చరవాణి, దూరవాణి అని మనల్ని కట్టిపడేసిన టెక్నాలజీ యుగంలో అయినవారితో మాటల కలబోత కేవలం కలగానే మిగిలిపోతుందనే ఆవేదనకు బీజం ఈ కథకు రూపమిచ్చింది. వృద్ధాశ్రమాలనుండి, పదవీ విరమణ చేసినవారు, చేయబోతున్నవారు అందరు నాతో పంచుకున్న వారి ఆవేదన నేను మరువలేనిది. టి. వి కొని తెచ్చిన కొడుకు నీకు ఎవరు లేరనే బాధ వద్దు టి. వి. చూస్తూ ఆనందించమన్నప్పుడు అతడి తండ్రి, ఎంతో బాధపడుతూ నేను మాట్లాడితే వింటుందా, నా అనుభూతులు నేను టి. వి తో పంచుకోగలనా అని అడిగినప్పుడు అతడి వేదనకు అక్షరరూపమిచ్చిన ఆ కథాసంఘటన నిరంతరం నా మనసును మెలిపెట్తూనే ఉంటుంది.

3) మీరు మంచి సమీక్షలు కూడా కదా, ఎందరి రచనలనో సమీక్షించారు. మరి మీ కథను కూడా సమీక్షించండి?
జ) ఎదురు చూడని ప్రశ్న. సిలబస్ లో లేని ప్రశ్న. మరి ఉత్తీర్ణత సాధించాలంటే జవాబివ్వాల్సిందే కదా!.
సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మాటల్లో చెప్పాలంటే అందమైన ఊహకు పొందికైన రూపం అలది కథానిర్మాణాన్ని పటిష్టపరచాలనుకునే రచయిత్రిగా రచనలు సాగించి కథను చిరంజీవి చేయాలనుకునే తపన మెండుగా కల వ్యక్తిని. రచన మాసపత్రికలో కథాపీఠం పురస్కారం పొందిన కథ అచ్చరమ్ముక్క. బాల్యం ఛిద్రం కాకుండా పిల్లలు జీవించాలంటే వారికి కావలసినది విద్యాభ్యాసం. అలాకాక పసిపిల్లలను పనిపిల్లలుగా మార్చిన భర్తలో మార్పు తీసుకుని రావాలని తన చివరి క్షణం వరకు ఆరాటపడిన తల్లి. ఈ నేపథ్యంలో అల్లబడిన కథే అచ్చరమ్ముక్క. సీతమ్మ, మల్లయ్యల దాంపత్యంలో సంభాషణలన్నీ పిల్లలకు చదువుండాలనే సీతమ్మకు, ఎందుకు చదివినోళ్లందరు కలెక్టర్ లు, డాక్టర్లు అవుతారా, మనకెందుకీ చదువులు అనే మల్లన్న మధ్య తగవులాట. కథ చదివే పాఠకులలో అంతర్మథనం మొదలవుతుంది. కారణం నేటికీ సమాజంలో వేళ్లూనుకున్న బాలకార్మిక వ్యవస్థ. కూలి పనులకు, ఇంటిపనులకు పసిచేతులను బలి ఇచ్చే పద్ధతి మారనంతవరకు విద్య పేదపిల్లలకు అందని అవకాశమే.

బిడ్డలు-అచ్చరమ్ముక్కలు అంటూ తను నిద్రపోకుండా, తనకు నిద్ర లేకుండా చేసిన సీతమ్మ దీర్ఘనిద్రలోకి జారిపోవడంతో మల్లయ్య కళ్లలో నిత్యం ఊరుతున్న నీటిచెలమలే. భార్య డెత్ సర్టిఫికేట్ తీసుకున్న గుర్తుగా సంతకంపెట్టలేని మల్లయ్యను వేలిముద్రవెయ్యమంటాడు మునిసిపల్ అధికారి. స్టాంప్ ప్యాడ్ పై అద్దిన బొటనవేలిపై సీతమ్మ ముఖం కనబడి అచ్చరమ్ముక్క రావాలయ్యా. . . అదొస్తేనే అన్నీ తెలిసేది అన్నట్లు మల్లయ్యకు భవిష్యత్తును పారదర్శకం చేస్తుంది సీతమ్మ. అతడి పిల్లలిరువురు చేతిలో పుస్తకాలతో బడిదిశగా అడుగులు వేయడం కథకు పరిపూర్ణతనందిస్తుంది.

4) మీకు పాతతరంవాళ్లు వ్రాసిన కథలు ఇష్టమా? ఇప్పటివాళ్లు వ్రాసినవి ఇష్టమా? రెండింటిలో తేడా ఏమిటంటారు?
జ) దీనికి సమాధానంగా మరో వ్యాసం అవుతుందేమో. కాని క్లుప్తంగా వివరించ ప్రయత్నిస్తాను. మన తరం పాతతరంవాళ్లు వ్రాసినవి చదివే రచనాసంవిధానాన్ని ఆకళింపుచేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్లం. మన పాఠ్యాంశాలే మనకు ఎందరో మహారచయితలను పరిచయం చేసాయి. వేమన శతకమైనా, సుమతీ శతకమైనా నీతి పాఠాలకు చక్కటి వేదికలే. వ్యాసభారతం, పోతన భాగవతం, వాల్మీకి రామాయణం మొదలుకుని గురజాడ అప్పారావు, మల్లాది రామక్రిష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, పి. వి. నరసింహారావు, పురిపండా అప్పలస్వామి, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటక్రిష్ణమూర్తి, చాగంటి సోమయాజులు, తురగా జానకి రాణి, వాసిరెడ్డి సీతాదేవి, యద్దనపూడి సులోచనారాణి, అబ్బూరి ఛాయాదేవి, వాసా ప్రభావతి, డి. కామేశ్వరి. వీరేకాదు మరెందరో చేయి తిరిగిన రచయితలు, రచయిత్రులు పుస్తకభాండాగారాలలో తమ రచనలను మనకందించారు. మరి మనకు పడ్డ పునాది పాతతరం రచయితలు(త్రు)లది. ఇక కొత్త తరం రచనలు కొత్తపుంతలు తొక్కుతూ మనం భయపడుతున్నట్లు తెలుగు మాయమవుతుందన్న దిగులు లేకుండా పిల్లలు సైతం రచనానురక్తులవుతున్నారు. ఇదొక శుభపరిణామం. అప్పటి రచనలు చదవాలంటే తెలుగు ప్రథమభాషగా తీసుకున్నవారే చదవాలి అనే అపోహ వద్దు. సమాజపరిస్థితులు, పెరుగుతున్న టెక్నాలజీ కథలలోని భాషను ప్రభావితం చేయవచ్చునేమోకాని, మారని మనుషులు, మారిన మనసులు ఎప్పటికైనా మారని కథాంశాలే నాటికైనా, నేటికైనా!ఏమంటారు?

5) మీరు అనుభవము తో చెప్పాక కాదనగలనా ? మీకు రచనలు కాకుండా ఇంకా ఏమైనా కళల్లో ప్రవేశం ఉందా?
జ) అరవైనాలుగు కళల్లో కొన్నయినా వంటబట్టించుకుందామంటే ముందుగా పట్టుబడింది వంటచెయ్యడం. అయితే వండినది తిని కడుపు చల్లబడ్డాక ఏం చేద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఎంబ్రయిడరీ, ఆపై పత్రికలకు డిజైనులు, కార్టూనులు వేసి పంపడం, ఆ తరువాత రంగుల పెన్సిళ్లు, క్రేయాన్స్, వాటర్ కలర్స్ తో మొదలైన చిత్రకళ పోస్ట్ ద్వారా శంతను చిత్రవిద్యాలయంలో చిత్రకళాభ్యాసం, పాఠశాలలో, కాలేజీలో నాటికలు, నృత్యాలు అందరిలాగే కాని దేనిలోను పరిపూర్ణత సాధించలేకపోయానని కాస్త ఏమూలనో తొలుస్తుంటుంది.

చాలా ఓపికగా అడిగినవాటన్నిటికీ విపులముగా జవాబిచ్చారు. ధన్యవాదాలు ఉమాదేవి గారు.
ఇక మంచి మాట-మంచి బాట లోకి పదండి.
రెండు విభిన్న కుటుంబాలకు చెందిన యువతీ, యువకులు వివాహబంధంతో ఒకటవుతారు. అప్పటి వరకూ విడి విడిగా ఉద్యోగాలు చేసుకుంటూ తమ తమ జీతాలను ఖర్చు పెట్టుకున్నవారు ఒకేసారిగా ఉమ్మడిగా ఖర్చు చేసుకునేందుకు సిద్దంగా వుండరు. నీకు, నీ స్నేహితులకు ఖర్చు చేస్తున్నావని భార్య, నీ చీరలు, సినిమాలే తలక్రిందులుగా చేస్తున్నాయని భర్త, కీచులాటలు మొదలవుతాయి. జీతాలూ, జీవితాలూ పంచుకోవాలి అని వారికి తెలిపేది ఎవరు?
గృహిణిగానే కాక ఉద్యోగినిగా కూడా జోడుగుర్రాల మీద స్వారీ చేస్తున్న మహిళకు తన గురించి తాను పట్టించుకునే తీరిక వుండదు. అకస్మాత్తుగా తన శరీరం పెరిగిపోయిందని, బరువు పెరిగి పోయిందని చింత
మొదలవుతుంది. మరి అలాంటప్పుడు డైట్ ప్లాన్ తో సన్నబడవచ్చా ?

వివాహమై అత్తవారింట అడుగుపెట్టిన అమ్మాయి తనకు నచ్చినా, నచ్చకపోయినా అన్నిటికీ మనసు చంపుకొని తనే సద్దుకుపోవాలా ?

తలనొప్పి గుండెదడ ఏదో టెన్షన్ గా వుంటోంది. అలజడిగా వుంటుంది. మరి ఏమి చేయాలి?
నేను ఈ పని చేయగలనా ? ఇందులో విజయం సాధించగలనా ? అని నెగిటివ్ థాట్స్ తో పనులు మొదలుపెట్టవద్దు అని భోదిస్తారు రచయిత్రి.

మనిషికి మాత్రమే లభించిన అపురూపవరం వాక్కు. మరి దాని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలి?
కొద్దికాలం క్రితం వరకూ ఉమ్మడి కుటుంబాలు వుండేవి. బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలుపిల్లలకు నీతి కథలు చెబుతూ లోక రీతిని భోధించేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి అనుభవంతో పరిష్కారం చూపించేవారు. మరి ఈ రోజులలో ఉమ్మడి కుటుంబాలు లేవు. పిల్లలు చదువుల భారం లో మునిగిపోయివున్నారు. చిన్నతనము లోనే చదువుల కోసం హాస్టల్స్ లలో వుండటమూ, విదేశాలకు వెళ్ళటము తో పెద్దవాళ్ళ దగ్గర గడిపే సమయము వుండటము లేదు. చదువుల ప్రపంచం నుంచి బయట పడ్డాక లోకమంతా కొత్తగా వుంటుంది. ఎంతసేపూ చదువులూ, రాంకుల పరుగులతో వున్నవారికి లోకజ్ఞానం తక్కువ. ఏ కొద్దిపాటి సమస్య వచ్చినా ఉక్కిరిబిక్కిరి ఐపోతారు. ఏమి చేయాలో, ఎవరిని అడగాలో తెలీదు అలాంటి వారు, వారనేముంది సమస్య వచ్చిన ప్రతి వారికీ ఇలాంటి నిత్యజీవితము లో ఎదుర్కొనే అనేక సమస్యలకు, ఓ అమ్మలా, అమ్మమ్మలా పరిష్కారాలు చూపించారు రచయిత్రి.

–మాలాకుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో