జ్ఞాపకాలు -5(ఆత్మ కథ )- కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

అది 1977 వ సంవత్సరం , ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిభ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి . ‘నేను ఆడ పిల్లలకి కట్నం ఇవ్వను , మగ పిల్లలకి తీసుకొను ‘ అన్న మా నాన్నమాట మా చిన్న చెల్లి విషయంలో చెల్లలేదు . 5 వేలు ఇవ్వాల్సి వచ్చింది . ఆ డబ్బుల కోసం , పెళ్లి ఖర్చులకీ అప్పు చేసేరు . నేను స్కూలు ప్రారంభించి నాలుగేళ్లు ముగిసినా ఆర్ధికంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది నా పరిస్థితి . అందువల్ల నేనూ ఏమీ సాయం చెయ్యలేకపోయేను . మా చెల్లి నా స్కూల్లో l.k.g టీచరుగా చేసేది . ఆ జీతం మాత్రం ఏ నెలకానెల ఇచ్చేసేదాన్ని .
మా అమ్మ తమ్ముడి కూతుర్ని మా తమ్ముడికి చేసేరు . మా అమ్మ ఎంత అమాయకురాలంటే ‘మాకేమీ కట్న కానుకలు వద్దు కాని మా ఆడపిల్లలు ముగ్గురికీ మూడు స్టీలు బిందెలివ్వండి అని అడిగిందట . పెళ్ళిలో మా నాన్న అల్లుళ్లు ముగ్గురికీ బట్టలు కొనుక్కోమని రెండేసి వందలిచ్చేరు . నేను మా చెల్లికొక ఉంగరం , తమ్ముడికొక ఉంగరం చేయించి ఇచ్చేను . మా మరుదులిద్దరూ రెండేసి వందలూ మాట్లాడకుండా తీసుకున్నారు . మోహన్ కి ఏం అయ్యిందో తెలీదు “ రెండు వందలకేమోస్తాయ్ “ అని వెనక్కిచ్చేసేడు. పెళ్లి ముగిసి అందరం ఇంటి కొచ్చేసెం .”మీ నాన్నకి కోపం వచ్చింది , ఆ రెండు వందలూ అడిగి తీసుకో “ అంటూ మా అమ్మ నాకు పదేపదే చెప్పడం మొదలు పెట్టింది . నిజమే అనుకుని మానాన్నని అడిగేను . అంతే విపరీతమైన కోపంతో వణికిపోతూ “ ముందు మీ కుటుంబం నా గుమ్మం దిగండి , పొండి బైటికి “ అంటూ ఒక్క అరుపు అరిచి గేటు వైపు చెయ్యి చూపించేరు . ఇంకా పెళ్ళికొచ్చిన చుట్టాలు వెళ్లలేదు . ఊహ తెలిసినప్పట్నుంచీ మా నాన్నగారాబం తప్ప మరోటి తెలీని నేను ముందు తెల్లబోయాను . ఆ అవమానాన్ని తట్టుకోలేక దుఖంతో నా కళ్ళు జలపాతాలయ్యాయి . పురాణాల్లో చెప్పిన సతీదేవి అవమానం నాకు అనుభూతిలోకొచ్చింది . పుట్టింటి అవమానాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో తెలిసొచ్చింది . నిద్రపోతున్న గీతని , లలితని మోహన్ , నేను ఎత్తుకుని , బాబుని రెక్కపట్టుకుని నడిపించుకుంటూ ఆ రాత్రి వేళ ఇంటికి చేరుకున్నాం . పగలంతా స్కూలు బాధ్యతల్లో తలమునకలైనా , రాత్రయ్యేసరికి దుఃఖం నన్నావరించేది . రెండు నెలలైనా అదొక మనో వ్యధలాగా నన్ను వదలకుండా అయ్యింది . ఎన్ని కష్టాలు వచ్చినా నా వెనక మా నాన్న ఉన్నారు అనే నమ్మకం వమ్మైపోయింది . ఎంత పనిలో ఉన్నా నెలకి ఒక ట్రెండు సార్లు చూడ్డానికి వచ్చేవారు . ఒకోసారి నా కిష్టమైన చేపలు కొనుక్కోచేవారు . నా స్కూలు బిజీ వల్ల ఏనాడు మా నాన్నకి భోజనం పెట్టలేదు . గబగబా బొగ్గుల కుంపటి అంటించి చిక్కటి పాలతో టీ పెట్టి ఇచ్చే దాన్ని . అప్పటికి నేను ఇంటర్మీడియట్ పాసై డిగ్రీ చదువుతున్నాను . అది మానాన్నకి గొప్ప గర్వ కారణం . చదువంటే అంత యిష్టం .” అమ్మా లక్ష్మీ ‘ అని పిలిచే నాన్న అంత మాట ఎందుకన్నారో ! తిండి నోటికి పోయేది కాదు . కంటికి నిద్ర వచ్చేది కాదు .

ఒకరోజు సాయంకాలం స్కూలు పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చిన రిక్షా నాగరాజు “ అమ్మా , నాన్నగారికి సోడా పేలి దెబ్బ తగిలిందండి “ అన్నాడు . అప్పటికి ఇల్లు గడవడానికి సెంటర్లో కూల్ డ్రింక్ షాపులాంటిది పెట్టేరు . మా పెద్ద తమ్ముణ్ణి కాకినాడలో చదివిస్తూ చిన్న తమ్ముణ్ణి పదో తరగతిలో చదువు మానిపించి సాయంగా ఉంచుకున్నారు . అప్పటికి నా నోట్సు తీసుకుని చిన్న తమ్ముడు ఇంటర్మీడియట్ ప్రైవేటుగా చదువుతున్నాడు . సోడాలు పట్టడం మాత్రం మా నాన్నే చేసుకునేవారు . నా గుండె గుభేలుమంది . పిల్లల్తో బాటు అదే రిక్షాలో ఇరుక్కుని షాపు దగ్గరకి చేరుకున్నాను . ఎదురుగా ఉన్న లలితా క్లినిక్ లోంచి అప్పుడే బైటికి వస్తున్నారు . భుజం మీది టర్కీ టవలు రక్తంతో తడిసిపోయి ఉంది . గబుక్కున వెళ్లి నాన్న చేతిని పట్టుకున్నాను . కుడి చేతి మడమ మీది పెద్ద రక్త నాళం కట్ అయిపోయిందట . ఎంత ఆపుకొన్నా బాధ తట్టుకోలేకపోతున్నారని అర్ధమైంది . భోరుమని ఏడ్చేసేను . నాన్న నా తల మీద చెయ్యి వేసి “ ఏడవకు నాన్నా “ అన్నారు . డాక్టరు ప్రధమ చికిత్స చేసి కాటన్ తో తేలికపాటి కట్టు కట్టి , కాకినాడ జనరల్ హాస్పటల్ కి వెళ్ళమన్నారు . “ నాన్నా , నేను రానా ?” అని అడిగేను . “వద్దమ్మా , ఇంటి కెళ్ళు , పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చేవు అన్నారు . బస్సు వచ్చే లోపల నాన్న పడిన బాధ అంతా ఇంతా కాదు .” అమ్మా, కొంచెం బ్రాందీ తాగితే ఈనొప్పి తట్టుకోగలనేమో “ అన్నారు . నాన్న నోటి వెంట మొదటి సారి బ్రాందీ అన్న మాట వినడం . తాగడం గానీ , తాగే వాళ్ళంటే గానీ ఇష్టపడని మనిషి .” వద్దు నాన్నా “ అన్నాను నేను . “సరే అమ్మా “ అన్నారు . అంతలో బస్సు వస్తే ఎక్కేరు . డాక్టరు పెయిన్ కిల్లర్ ఇచ్చినట్టులేరు . అప్పటికి పెయిన్ కిల్లర్స్ లేవోమరి !

ఒక వారం తర్వాత మా చిన్నమ్మాయికి జ్వరంగా ఉందని లలితా క్లినిక్ కి తీసుకు వెళ్తుంటే ఎదురు పడ్డారు . నేనే దగ్గరకెళ్ళి “ ఎలా ఉంది నాన్నా “ అని అడిగేను . మా చిన్నమ్మాయి వీపు నిమురుతూ “ ఫర్వాలేదమ్మా . వచ్చే వారం కట్టు మార్పించుకోవడాని కెళ్ళాలి . అన్నట్టు మూడో నెల వచ్చింది కదా , చెల్లిని అత్తవారింటికి పంపడానికి , కోడల్ని మన ఇంటికి తీసుకురావడానికి ముహూర్తం పెట్టించేము . నువ్వు రావాలి “ అన్నారు . నేను చిన్నగా నవ్వి వచ్చేసాను . ఆరోజు నాన్న అలా అన్నాక నేను ఆ ఇంటికి వెళ్ళలేదు .

ఇంకోవారం తర్వాత సాయంకాలం స్కూలు పిల్లల్ని తీసుకెళ్లిన నాగరాజు మరో అరగంటలో మళ్ళీ వచ్చేడు . “ అమ్మాయిగారూ , నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకుని రమ్మన్నారు “ అన్నాడు . “కాకినాడ వెళ్లి కట్టు మార్పించుకుని వచ్చేసేరా “ అన్నాను .”ఆ ….వచ్చే సేరండి “ అన్నాడు . పిల్లలకి స్నానాలు చేయించి పెద్ద వాళ్ళిద్దర్నీ ముందు పంపేసి , నేను మంచి చీర కట్టుకుని తయారై బయలు దేరేనే కాని , రావద్దన్న ఇంటికి వెళ్ళనా వద్దా అని ఆలోచిస్తూ …మధనపడుతూ …నడుస్తున్నాను . “ఏముంది , మా చెల్లిని అత్త వారింటికి పంపించే విషయం గురించై ఉంటుంది ‘. చిన్నమ్మాయి వచ్చీ రాణి కబుర్లేవో చెప్తూంటే నవ్వుతూ నడుస్తున్నాను . బొండా రాజులు గారి ఇంటి దగ్గర నుంచీ అందరూ నన్ను పట్టి పట్టి చూస్తున్నారన్పించింది . దారా వారి సందు దాటగానే అందరికీ మంచి నీళ్లు పోసే వాకా వాళ్ల మామ్మ “అయ్యో తల్లోయ్ , ఎంత పని జరిగి పోయిందమ్మో , ఈ పిల్లకి తెలిసినట్టు లేదు “ అని ఎవరితోనో అంటూంటే ఎవరి గురించో అనుకున్నాను . తోట వారి వీధిలోంచి మా గేటు వైపు అంతా నడవడానికి దారి లేనంత జనం . నన్ను చూసి అందరూ పక్కకి తప్పుకొని దారి ఇచ్చేరు . ఏం జరిగిందో అర్ధం కాకుండా లోపలికెళ్లే సరికి గచ్చు మీద వాకిట్లో ప్రశాంతంగా శాశ్వత నిద్ర పోతున్న నాన్న . ప్రశాంతంగా నవ్వుతున్నట్టున్న మొహం . ఊరి అంచుమీదున్న నగరం దగ్గర సపోటా పండు తింటూ , రాబోయే ఎన్నికల గురించి ఎవరో ఏదో జోక్ చెప్తే ఫక్కుమని నవ్వేరట . ఆ నవ్వులోనే పక్కనున్న విలేజ్ గైడ్ గారి భుజం మీదికి తల వాల్చేసేరట . స్పృహ తప్పిందనుకున్నారట. 5 నిమిషాల్లో బస్సు వచ్చి షాపు దగ్గర ఆగితే మా తమ్ముళ్లు రిక్షాలో ఇంటికి తీసుకొచ్చి పెద్ద గదిలో పందిరి అమ్చం మీద పడుకోబెట్టేరట . డాక్టరు వచ్చి చూసి అప్పటికే ప్రాణం పోయిందన్నారట . రిక్షా నాగరాజు నేను కంగారు పడతానని అబద్ధం చెప్పేడట నాన్న రమ్మన్నారని . ఆ షాక్ తట్టుకోవడం చాలా కష్టమైపోయింది .

పల్లెటూళ్లలో జనాలు అర్ధం లేకుండా కట్టు కథలు అల్లేస్తూ ఉంటారు .నేను ఏడుస్తూనే నాన్న జేబులో ఉన్న డాక్టరిచ్చిన ప్రిస్కిప్షన్ తీసి చూసేను . నా పక్కనే కూర్చున్న మా పెద్ద నాన్న భార్యకి పోట్టకొస్తే అక్షరం ముక్క రాదు . ఆ చీటీలోకి తొంగి చూసి బైటి కెళ్ళేక మా నాన్న సూసైడ్ చేసుకుంటున్నట్టు చీటీ రాసి పెట్టి చచ్చిపోయేరని అందరికీ చెప్పడం మొదలు పెట్టింది . మేమున్న కొత్త వారింట్లో మా భోజనాల గదిలోకి కాకినాడ బస్సు హారన్ విన్పించేది . ఆ సౌండ్ విన్నప్పుడల్లా నా కళ్ళు జలపాతాలయ్యేవి . మోహన్ చాలా విసుక్కునే వాడు “ నీ కొక్కదానికే తండ్రి పోయినట్టు ఓవర్ చెయ్యకు “అంటూ కేకలేసేవాడు . ఆ షాక్ నుంచి తేరుకోడానికి చాలా కాలం పట్టింది .

మా తమ్ముల్లిద్దరికీ ఇంకా ఏమీ తెలీని వయసు . షాపు చూసుంటూనే క్రమంగా నిలదొక్కుకుని నిలబడ్డారు . పెద్ద వాళ్లు మన కళ్ళ ఎదుటే ఉన్నారు కదా , ఇంకా ఉంటార్లే అని మన రొటీన్ లో మునిగిపోయి ఉంటాం .వాళ్ళు ఆకస్మికంగా మనల్ని వదిలిపోయాక “ అయ్యో , వాళ్ల కోసం ఏమీ చెయ్యలేదే “అని దుఖంలో కూరుకుపోతాం . ఊళ్లోనే ఉండడం వాళ్ళ ఒక్క పూట భోజనమైనా పెట్టలేదే అని నాన్న గురించి పదేపదే అన్పించేది . మా నాన్న కాలం చెయ్యడానికి ఏడాది ముందు కడుతూ ఉన్న ఇల్లోకటి అమ్మకానికి వచ్చింది . రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ ఒకాయన రోజూ వాళ్ల మనవడిని స్కూలుకి తీసుకోచ్చేవాడు . యిక్కడ సెటిలవుదామనే ఉద్దేశంతో వెంకటరత్నం థియేటరు వీధిలో ఇల్లు కట్టడం ప్రారంభించేరు . బోరు వేయించి , కాంపౌండు వాల్ కట్టి ,ఇంటికి శ్లాబ్ వేసేక అభిప్రాయం మారిపోయినట్టుంది . ఆయన నాతో “ అమ్మా , నాలుగు వందల గజాల స్థలం . పెద్ద గదులు . తూర్పు ముఖం ఇల్లు . మీరుండడానికీ , స్కూలుకీ సరిపోతుంది . ఒక్క పదివేలిచ్చి తీసుకోండి “ అన్నాడు . మోహన్ తో చెప్తే “ మనకి ఇక్కడ ఇల్లెందుకు / మనం రాజమండ్రిలో సెటిలవ్వాల్సిన వాళ్లం “ అన్నాడు . మా నాన్నతో చెప్పి “ ఎక్కడైనా అప్పు ఇప్పించగలరా “ అని అడిగితే “ పూర్తిగా కట్టని ఇల్లు పదివేలెందుకమ్మా , అయినా ఊరికి అంత దూరంలో ఎందుకు “ అన్నారు . అది ఇప్పుడు ఊరి మధ్యకైంది . నాక్కూడా అన్పించింది . ‘ఒక్క రూపాయైనా వెనకేసింది లేకుండా అప్పు చేసి ఇల్లు కొనడం రిస్కేమో ‘అని. తర్వాత ఆ ఇల్లు పోలీసు శంకర్రావు కొని అద్దెలకిచ్చే వాళ్లు . చాలా కాలం దాంట్లో పోస్టాఫీసు నడిచింది . ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ గా మారింది .

ఆ రోజుల్లో కోమట్ల వీధిల్లో ఒక అలవాటుండేది . సాయం కాలం వంటలు పెందలాడే పూర్తి చేసుకుని ఫ్రెష్ గా తయారై ఆడ వాళ్లంతా వీధి అరుగుల మీదో , మెట్ల మీదో కూర్చుని ఒకళ్లనొకళ్ళు పలకరించుకుని కబుర్లు చెప్పుకొనే వాళ్లు . వాళ్లని చూసి నేను కూడా మా పెరటి గుమ్మం మెట్ల మీద కూర్చుని మా పిల్లల చేత హోమ్ వర్క్ చేయిస్తూండే దాన్ని . అప్పటికి ఊళ్లో ఎవరికీ కార్లు , స్కూటర్లు లేవు . పెంకుల ఫేక్టరీ యజమాని ఒకాయన సైకిలు మీద వెళ్తూ మా ఎదురింటి అరుగును గుద్దుకుని పడ్డాడు . అనుకోకుండా “అయ్యో “ అన్నాను . అతను లేచి కూర్చుంటే ఒంటి కంటిన మట్టి దులుపుకొంటూ “ మీరిలా వీధిలో కూర్చుంటే యాక్సిడెంట్లు అవ్వకపోతే ఇంకేమౌతాయండి “ అన్నాడు నా వైపు చూసి నవ్వుతూ నేను గతుక్కుమన్నాను . ఇదొకటా నా ప్రాణానికి ? ఆ రోజు నుంచీ అలా బైట కూర్చోవడం మానేసేను .

– కె.వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో...Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో