నాట్యగురువు,నటి, రచయిత్రి, “నాట్య భారతి” ఉమాభారతిగారి తో మాలాకుమార్ ముఖాముఖి

ఉమాభారతి కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్యానికి పేరు తెచ్చిపెట్టిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించింది. పద్నాల్గవ ఏట అఖిలభాత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందిన అప్పటి యువనర్తకి, ఉమాభారతి.

తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో ఆమె రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోనూ, పలు అంతర్జాల పత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ రచన పురాస్కారాన్ని మూడు మార్లు అందుకుంది.
ఉమ రచించి నిర్వహించిన నృత్యనాటిక ‘భరతముని భూలోక పర్యటన’ కి 1997 లో ‘తానా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు అందుకుంది..

‘అమెరికాలో అనసూయ’, ‘సంభవామి యుగే-యుగే’, ‘మానసపుత్రి’, ‘కన్య’, పెళ్లి ముచ్చట’ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఇతర రచనలు.
2013 నుండి 2018 వరకు – విదేశీ కోడలు (కథా సంపుటి), సరికొత్త వేకువ (కథా సంపుటి), వేదిక (నవల), ఎగిరే పావురమా (సాంఘిక నవల), నాట్యభారతీయం (వ్యాసా సంపుటి)..వంగూరి ఫౌండేషన్ ప్రచురణలుగా వెలువడ్డాయి..
వేదిక (నవల), నాట్యభారతీయం (వ్యాసా సంపుటి)..దారావాహికలగా ‘గో-తెలుగు’ అంతర్జాల సాహిత్య వారపత్రికలోను, ఎగిరే పావురమా (సాంఘిక నవల) ‘సారంగా’ అంతర్జాల సాహిత్య పత్రికలోనూ ధారావాహికలుగా వెలువడి..పాఠకుల ఆదరణ పొందాయి..
నటరాజు మహదేవు ని సతి ఉమ ,(శివుని అర్ధనారీశ్వరిగా నాట్యంచేసేది) బ్రహ్మదేవుని భార్య భారతి (చదువుల తల్లి ) ఇద్దరూ కలిసి అవతరించిన, నర్తకి, రచయిత్రి ఉమాభారతి గారి తో,వారి రచన “సరి కొత్త వేకువ” సమీక్షతో కూడిన ముఖాముఖి.

1..ఉమాభారతి గారు మీ “సరికొత్త వేకువ” కథల సంపుటి చదివానండి.కథలన్నీ చాలా సరళంగా, సున్నితం గా ఉన్నాయి.మొదలు పెట్టాక ఏకబిగిన చదివేసాను.మీకు సాహిత్యాభిరుచి ఎలా కలిగిందండి ?
జవాబు : ముందుగా పుస్తకం చదివినందుకు కృతజ్ఞతలు..కథలు నచ్చినందుకు చాలా సంతోషం.
…నృత్యం, సంగీతం… వంటి కళలని అభ్యసించే వారికి…భాషాసాహిత్యాల పట్ల ఆసక్తి పెంపొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ‘సాహిత్యం’ పట్ల నాకున్నది అలా సహజమైన ఆసక్తి…ఆపైన అలవరచుకున్న అభిలాష. నా నృత్యశిక్షణే నాలో సాహిత్యాభిలాషని పెంచి పోషించిందని నమ్ముతాను. నా ఏడెనిమిదేళ్ళ వయసు వరకు కూడా కూచిపూడి నృత్య ‘’తకిట తజ్జణులు’’ మాత్రమే తెలుసు.

ఇక్కడ నేను మీకు ఓ చిన్న పాటలోని సాహిత్యం వినిపిస్తాను. గుర్తు పట్టగాలరేమో అని కూడా ఆలోచించండి.
||అతని హతమార్చినానని ఇతడు మురిసే
ఇతని వదియిన్చినానని అతడు కులికే
అన్నదమ్ములమను మాట అసలు మరిచి
కోయుచున్నారు తమ తల్లి గుండియలను||...

ఇటువంటి సాహిత్యానికి స్పందించి ఆ పాటలోని తల్లిగా, హావభావాలు చూపించే ప్రయత్నం పదేళ్ళప్పుడు చేయడమంటే, సాహిత్య విలువని రవంత అర్ధం చేసుకోడమే అనుకుంటాను… నా విషయంలో అదే జరిగింది.
ఈ పాట నంది అవార్డు అందుకున్న అక్కినేని గారి చిత్రం ‘సుడిగుండాలు’ లోనిది. దేశ విభజన సందర్భంగా భారతమాత అలా విలిపిస్తుంది.. అందులో భారతమాతగా ఆ చిన్న పాటకి నటించే అవకాశం నాది. అప్పటినుండే… సాహిత్యం వైపు దృష్టి సాగింది.
ఐదేళ్ళ వయస్సు నుండి నృత్యానికి సంబంధించిన సాహిత్య సంగీతాలకి ఆడాను పాడాను. నర్తకిగా అభినయం పై దృష్టి కేంద్రీకరించాలి కనుక పాటలోని సాహిత్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. దాంతో భాష లోని సౌందర్యం, కవిత్వం లోని మాధుర్యాన్ని తెలుసుకున్నాను. ఆసక్తి పెరిగింది. ఎప్పటికప్పుడు నృత్యానికి సంబంధించి ఇతివృత్తాలు రాసుకునేదాన్ని కూడా. ముందుకు సాగి కొన్ని పాటలు కూడా రాసాను.. నృత్యనాటికలు రచించి ప్రదర్శనలు చేసేదేన్ని..
దేవి స్తోత్ర మాలిక, గురువేనమః, సంభవామి యుగే యుగే, అమెరికాలో అనసూయ, పెళ్లి ముచ్చట, కన్య, మానసపుత్రి నృత్యనాటికలు మాకు అమెరికాలో ప్రేక్షకుల అభిమానాన్ని తెచ్చి పెట్టాయి. ‘తానా’ మహా సభల్లో మేము ప్రదర్శించిన ‘భరతముని భూలోక పర్యటన’ నృత్య నాటికకి అంతర్జాతీయ గుర్తింపుతో పాటు ‘OUTSTANDING PERFORMANCE AWARD’ అందుకున్నాము.

ఐదేళ్లగా నృత్యేతర రచనలు చేస్తున్నాను. నా కథలు, వ్యాసాలూ పలు పత్రికల్లో ప్రచురణకి నోచుకున్నాయి. కొన్ని ‘ఉగాది ఉత్తమ రచన’ గుర్తింపు అందుకున్నాయి.. అంతా దేవుని దయ.. సాహిత్య రంగంలో ఉత్సాహం, ప్రోత్సాహం లభించడం కూడా నా అదృష్టం. 2013 నుండి ఇప్పటికి ఐదు పుస్తకాలు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ద్వారా ప్రచురణ అయ్యాయి.. ఇక ముందు కూడా రచనాసాహిత్యంలో కృషి చేద్దామనే..

2..మీ కథలు ఎక్కువగా స్త్రీల కోణంలోనే ఉన్నాయి. అమ్మగా , ప్రేయసిగా,భార్యగా, ఇబ్బందులు ఎదురైనప్పుడు కృంగిపోక ధీరవనితగా ఇలా వివిధ కోణములల్లో చక్కగా మలిచారు.నాకు ఎక్కువగా “నిరంతరం నీ ధ్యానం లో”కథలోని పార్వతమ్మ పాత్ర నచ్చింది.ఆవిడ తనకు ఎదురైన సమస్యలను చాలా తెలివిగా పరిష్కరించుకుంది.మీ నాయికలలా నిజజీవితం లో ఉండటం సాద్యమేనంటారా?

జవాబు: కుటుంబ బాధ్యతని సమర్ధవంతంగా నిర్వహించేది పురుషులే అని అనుకుంటాము గానీ, గృహిణులు కూడా అంతే సమర్ధతతో అన్ని బాధ్యతలు వహిస్తారు అని నా ఉద్దేశం. పిల్లల ప్రాపకం నుండి ఆస్తిపాస్తుల వ్యవహారాల వరకు కూడా… కాదంటారా? మా అమ్మ, అమ్మమల తీరు తెన్నులు చూసాను. భర్త చాటు ఇల్లాలు గానే ఉన్నా.. రాజుకి మంత్రిలా వారే అన్నీ సజావుగా జరిగేలా అహర్నిశలూ పాటు పడే వారు.. అందుకే స్త్రీ ని అబలగా, బేలగా చిత్రీకరించడం అంతగా రుచించదు నాకు.
“నిరంతరం నీ ధ్యానం లో”కథలోని పార్వతమ్మ పాత్ర మీకూ నచ్చినందుకు చాలా సంతోషం.. సంసారంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది, కుటుంబంలోని ఒడుదొడుకులని సముదాయించుకునే ప్రయత్నం తప్ప ఇతర ఆలోచన లేని ఆ పార్వతమ్మలా ఉండగలగాలి.. ఉండవచ్చు అని నా విశ్వాసం.. అలా ఉన్నవాళ్ళని చూసాను కూడా…కానైతే, చెప్పిన మాట వినే సంతానం, కుటుంబం కూడా ఉండాలి..

3…భారతీయ కథలను అమెరికా నేపధ్యం లో చదవటం నాకు చాలా గమ్మత్తుగా ,ఆసక్తిగా అనిపించింది.మన దేశంలోనే నిర్లక్షం ఎక్కువ అమెరికాలో చాలా జాగ్రత్తగా ఉంటారు, అక్కడ అంతా క్షేమమే అనుకునేవాళ్ళకు “కంచే చేను మేస్తే ” అన్న కథ ద్వారా అక్కడా పొరపాట్లు జరుగుతాయి అని తెలియచెప్పారు.ఈ నేపధ్యం లో మీరు కథలల్లో కొంచం ఎక్కువగా ఆంగ్లపదాలు వాడినట్లుగా నాకనిపించింది.కొన్ని చోట్ల వ్యాదుల గురించి చెప్పినప్పుడు కొంచం వివరంగా వ్రాస్తే బాగుండేది అనిపించింది.మరి మీరే మంటారు ?

జవాబు : మీకలా అనిపించింది అంటే నిజమే కావచ్చు.. కానయితే 1. ఆ వ్యాధులకి తెలుగు పర్యాయపదాలు గాని అంతకన్నా వివరణ గాని వెతికినా లభించలేదు. అప్పటికే ఇచ్చిన వివరణ (వీలయినంతమటుకు తెలుగులోనే) చాలునేమో అని భావించడం మరో కారణం. “ఏం మాయ చేశావో”, “అనగనగా ఓ జాబిలమ్మ” కథల్లోని వ్యాధి, వ్యాధి లక్షణాలు-వివిధ కోణాలు, పర్యవసానాలు … అన్నీ వైద్య పరంగా ఒకటే. తెలుగు, ఇంగ్లీషు అని విడివిడిగా లేవనే అనుకుంటాను..

ఇకపోతే, “కంచే చేను మేస్తే ” కథలో లా ఇక్కడ అమెరికాలో కూడా నిర్లక్ష్యం, పొరపాట్లు మస్తుగా జరుగుతాయి. ఇక్కడ జరిగిన సంఘటనలని కథలుగా రచిస్తే కొన్ని మార్లు ఆంగ్లపదాలు వాడుక అధికంగానే ఉంటుంది. కథ లోని పాత్రల తీరుని బట్టి కూడా ఆంగ్ల పదాలు వాడవలసి వచ్చింది. లేదంటే అతకదేమో అనుకున్నాను. అప్పటికీ వీలయినంత ప్రయత్నం మాత్రం చేసాను.. ఏమైనా ఇకనుండి మరింతగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి.

4.”అనగనగా ఒక జాబిలమ్మ ” , “కథ కాని కథ ” లో “డెత్ విత్ డిగ్నిటీ” గురించి ప్రస్తావించారు .డెత్ విత్ డిగ్నిటీ అవసరమంటారా? ఆత్మీయులని చూస్తూ చూస్తూ ఎవరైనా చంపేసుకోగలరా?

జవాబు: ఇది మాత్రం చాలా సున్నితమైన విషయమే.. ఆత్మీయులని చూస్తూ చూస్తూ ఎవరైనా చంపేసుకోగలరా? అని అడిగారు మీరు. నిజమే వాస్తవానికి అలా ఎవరూ చేయలేరు. కానీ ఇక్కడ రోగి యొక్క ఆత్మీయుల భావనలు కాదు ముఖ్యం. వ్యాధిగ్రస్తుల జీవనం, వారి మనస్థితి, వారి సుఖసంతోషాల గురించిన విషయంగా ఆలోచించాలి.
తిరుగులేని వ్యాధి సోకి, నడవలేక, చూడలేక, కదలలేక, మాట్లాడలేక… కేవలం మందులు, మెషీన్ల పైనే ఆధారపడి జీవిస్తున్నప్పుడు..లేదా పోనుపోను అటువంటి నిస్సారమైన చలనంలేని స్థితి ఏర్పడుతుందని వ్యాధిగ్రస్తులు నిర్ధారణగా తెలుసుకున్నప్పుడు – అటువంటి జీవనాన్ని కొనసాగించాలా? వద్దా? అన్న నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఉండాలన్నదే “డెత్ విత్ డిగ్నిటీ” అన్న వెసలుబాటు. అది న్యాయపరమైన వెసలుబాటుగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో పరిగణింపబడుతుంది.

అంత తీవ్రమైన వ్యాధి బారిన పడిన రోగులు… అందరికీ దూరంగా మరో వసతిలో బస చేస్తూ జీవచ్చవాల్లా ఉంటారు. ఆ పరిస్థితికి రాక ముందే వారు తెలివిగా తమ జీవితం గురించి చేసుకునే నిర్ణయమే “డెత్ విత్ డిగ్నిటీ”…వెసలుబాటు.
అసలు ఏ వ్యాధి లేకున్నా, మరే కారణం చేతనో అటువంటి స్పృహలో లేని పరిస్థితి అంటూ ఏర్పడితే తను జీవితం కొనసాగించను అని ఇష్టపూర్వకంగా ‘మెడికల్ డిక్లరేషన్’ రాసి నమోదు చేసేవారు కూడా లేకపోలేదు ఈ దేశంలో..
ఇక ఈ విషయంగా నా ఆలోచన ఏమిటి అని మీరడిగితే… జవాబుగా ఓ విషయం చెబుతాను.

నాకు కుక్కపిల్లలంటే చాలా ఇష్టం.. 14 ఏళ్ళ పాటు సొంత బిడ్డలా సాకిన హస్కీ జాతికి చెందిన కుక్కపిల్ల ‘భీష్మ’.. వాడిని మా కుటుంబంలో సభ్యుడి లాగానే భావించాము. ఇటీవల ఏడాది పాటు వెన్ను, వెనుక కాళ్ళ వాతనొప్పులతో బాధపడేవాడు.. సరిగా నడవలేకపోయేవాడు. ఎక్కువగా కదలలేని పెద్దవాళ్ళకి చేసినట్టు సేవ చేసాను. జాగ్రత్తగా పసిబిడ్డలా చూసుకున్నాను. కీళ్ళు బలహీనమై లేవలేక కూర్చోలేక పోయేవాడు.. మందులు కష్టంగా మింగేవాడు. రానురాను నేను సాయం చేయబోయినా, ముట్టుకున్నా నొప్పితో బాధపడేవాడు. బయట కూర్చున్నప్పుడు తన మీద వాలే దోమ ఈగని కూడా తోలలేక పోయేవాడు. పైగా మూగజీవి. చెప్పుకోలేడు. వాడి పట్ల నాకున్నది అపారమైన ప్రేమే.. అందుకని వాడిని అలా నిస్సహాయిడిగా నిస్సారమైన జీవితాన్ని గడపనివ్వాలా?

నా దృష్టిలో ఏ జీవిదైనా జీవం, నొప్పి, బాధ, రోగం ఒకటే…
పిల్లలకి తల్లితండ్రుల పై ఉన్న అపారమైన ప్రేమలు తెలుసును కాబట్టి, ‘డెత్ విత్ డిగ్నిటీ’ వెసలబాటు కల్పించడానికి పిల్లలు ఇష్టపడరు కాబట్టి …నా సొంత నిర్ణయంగా నా మటుకు నేను ఆ “మెడికల్ డిక్లరేషన్” నమోదు చేసేసాను…
కాకపోతే, అది నా వ్యక్తిగత నిర్ణయం.. అందరికీ ఇదే సరయినదని కాని ఇదే మంచి మార్గమని కానీ నేను ఆమోదించను, సిఫారసు చేయబోను.

*..మీరు చెప్పింది నిజమే.ఈ మధ్య ఇక్కడ కూడా ఓ అమ్మ తన కొడుకు నయం కాని వ్యాధి తో చాలా బాధ పడుతున్నాడని, అతనికి మెర్సీ కిల్లింగ్ కు అనుమతించమని ఓ ప్రకటన పేపర్ లో చదివాను.పాపం ఆవిడ ఎంత బాధపడి ఆ నిర్ణయం తీసుకుందో కదా అని చాలా బాధ అనిపించింది.తరువాత ఏమైంది అన్నది నేను ఫాలో అవలేదు.ఎంతైనా మనది ఖర్మ సిద్దాంతం నమ్మే దేశం కదా తొందరగా ఒప్పుకోలేము .మీరన్నట్లు అది వ్యక్తిగతం గా తీసుకోవలసిన నిర్ణయమే.

5..మీరు నాట్యం అమెరికాలో ఎవరికైనా నేర్పిస్తున్నారా?
జవాబు: నృత్యం, సంగీతం, సాహిత్యం నా జీవితంలో పెద్ద భాగమే….నృత్యం నా ఆసక్తి, ఆరాధనా కూడా…అర్చనా డాన్స్ అకాడెమీ 1982 లో హ్యూస్టన్ లో స్థాపించి కూచిపూడి నృత్య శిక్షణ, సినిమా నిర్మాణం-దర్శకత్వం, నృత్య నాటికలు, నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధుల సేకరణలు వగైరాలు గత 30 ఏళ్ళగా చేస్తున్నాను. నా నృత్య సాధన గురించి క్లుప్తంగా చెప్పాలంటే…

నేను, నా నృత్యం..
………………………..
నా ఊహ నృత్యం
నా ధ్యాస నృత్యం
నా మదిలో నృత్యం
నా క్రియలో నృత్యం
నా ఆశయం నృత్యం
నా ఆశ్రయం నృత్యం
నా భావనం నృత్యం
నా సాధనం నృత్యం
నాకు స్వాంతన నృత్యం
నా ప్రశాంతత నృత్యం
నా అలజడి నృత్యం
నా ఆలంబన నృత్యం
నా జీవనం నృత్యం
నా ఆరాధనం నృత్యం
నా కల నృత్యం
నా కళ నృత్యం
నాకు రమ్యం నృత్యం
నా గమ్యం నృత్యం
మనసా వాచా కర్మేనా నృత్యం
నృత్యం లేక నేను, నేను లేక నా నృత్యం ..ఈ ఉనికే లేదు..
  కవిత: ఉమాభారతి.
www.archanafineartsacademy.com

6..సాహిత్యము, నాట్యం కాకుండా ఇంకా ఏమైనా కళల పట్ల మీకు ఆసక్తి ఉందా ?

జవాబు: అప్పుడప్పుడు బొమ్మలు వేయడం మాత్రమే… కాకుండా ,
1976 లో,కాకతీయ పిక్చర్స్ వారి సాహిత్యేకాడమీ అవార్డ్ పొందిన “చిల్లరదేవుళ్ళు ” లో కథానాయకిగా,
1977 లో సింగపూర్,జోహన్నస్బర్జ్ ,టి.వి లకి ‘భారతీయనృత్యాలు ‘, ‘నర్తకి ‘ డాక్యుమెంటరీల కళాకారిణి గా,
1978 లో ‘ యమగోల ‘లో యన్.టి.ఆర్.సరసన ఊర్వశిగా,
1988 లో ‘క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఇండియా ‘నృత్యశిక్షణ వీడియో చిత్రాల కళాకారిణిగా,
1994 లో ఓం ఇంటర్నేషనల్ వారి ‘ ఆలయనాదాలు ‘ టెలీపిల్మ్ కథానాయికగా కొన్ని చిత్రాలల్లో నటించాను.
1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం విధ్యార్ధి దశలోనే ‘ కూచిపూడి నృత్యం ‘ ,డాక్యుమెంటరీ,
1994 లో ‘ ఆలయనాదాలు ‘ టెలీ పిలిం అమెరికా చిత్రీకరణ,
2003 లో ‘ ఈ జగమే నాట్యమయం ‘ , ‘ రాగం-తానం-పల్లవి ‘ నృత్యశిక్షణ వీడియోలు నిర్మించి దర్శకత్వం కూడా వహించాను .

7..మీ కథలల్లో ఎక్కువగా అనాథాశ్రమాలు, హాస్పిట్ల్స్, బ్లడ్ డొనేషన్, సంక్షేమ హౌస్ ల గురించి ప్రస్తావించారు. మీకు సమాజ సేవ అంటే మక్కువనా ?

జవాబు: అవునండీ. చేతనయినంత, వీలయినంత చేయాలనే…

8..ఈ మధ్య సినిమాలల్లో, కథలల్లో అమెరికా వెళ్ళిన పిల్లలు తల్లితండ్రులను నిర్లక్షం చేస్తున్నారని, భారతదేశం ముక్ష్యంగా ఆంధ్ర వృద్ధాశ్రమంగా మారిపోతోందని అంటున్నారు .ఒక ప్రావాస భారతీయురాలిగా, ఒక రచయిత్రిగా మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు: పెద్దల పట్ల పిన్నలు గౌరవాభిమానాలతో మసులుకోవాలన్నది ప్రపంచంలోని అన్ని సంస్కృతల లోనూ ఉన్నదే.. అలాగే, పిల్లలు తమకంటే మెరుగ్గా, దూరంగా విదేశాల్లో అయినా సరే వృద్దిలోకి రావాలని తల్లితండ్రు కోరుకోడం, అందుకు పాటుపడ్డం కూడా అన్ని సంస్కృతులలో ఉన్నదే.. ఔనా?

నా వ్యక్తిగత విషయానికి వస్తే, జీవితంలో అన్నింటికీ సిద్దంగా ఉండాలని ప్రయత్నిస్తాను. వృద్దిలోకి వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. అందరి మనస్తత్వాలు ఒక్కలా ఉండవు. పెదావాళ్ళయ్యాక వారి జీవితాలు, బాధ్యతలు వారివి. తల్లితండ్రులుగా ఎనలేని ప్రేమానురాగాలు పిల్లలకి పంచినా, తిరిగి వారివ్వగలిగినంతతో సరిపుచ్చుకుంటేనే మంచిదని నా ఉద్దేశం.
ఆశించినంతగా పిల్లలు నన్ను చూడలేదనో, ఫోన్ చేయలేదనో అతిగా బాధపడను. పడినా సరిపెట్టుకోవడమే. వారి వీలునిబట్టి చేస్తారు చూస్తారు అనుకోడమే.. వారి సంతోషాలకి నేను అస్సలు అడ్డు కాకూడదు అన్నది నా సిద్దాంతం. అదే నాకు సంతోషం.
పైగా వృద్దాప్యం, వ్యాధి మనిషి జీవితంలో తప్పని ఆధ్యాయాలే కదా!… వీలయినంత ప్రశాంతంగా ఉండేలా చేసుకోడంలో నిమగ్నమవ్వాలి అన్నది నా అభిప్రాయం. పిల్లల్ని ఆరడి పెట్టుపెట్టుకోడం, వారు మన దగ్గరుండి చూసుకోడంలేదు అని బాధపడ్డంలో అశాంతి అసంతృప్తి మాత్రమే ఉంటాయి.. తల్లితండ్రులకి అలాటి మనస్థితి ఉండడం వారి సంతతికే మంచిది కాదు అన్నది నా భావన. కాబట్టి మీ ప్రశ్నకి బదులుగా నేను ఎటూ అనలేను, అనుకోలేను. ఎవరి దృక్పదాలు వారివి.

9.ఇది చదివిన తరువాత మీ ఇతర పుస్తకాలు కూడా చదవాలనిపిస్తొంది.మీ పుస్తకాలన్నీ ఎక్కడ లభ్యమవుతాయో తెలుపగలరా?
జవాబు : చాలా సంతోషంగా ఉందండీ. తప్పక చదివి మీ అభిప్రాయాలని నాతో పంచుకుంటారని ఆశిస్తాను మాలా గారు…
పై విషయాల పై నా అభిప్రాయాలని అందరితో ఇలా పంచుకునే అవకాశానికి, పుస్తక విశ్లేషణకి.. మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.. ప్రచురించిన ‘విహంగ’ పత్రిక వారికి ధన్యవాదాలు.

*ఉమాభారతి గారు మీకిష్టమైన నాట్యం లో మీరు ఇంకా ఇంకా ఎన్నో పురస్కారాలు పొందాలని మనసారా కోరుకుంటూ, మీ విలువైన సమయాన్ని నాకోసం వెచ్చించినందుకు ధన్యవాదాలండి.

-మాలా కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

 

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో