తప్పటడుగులతో… వచ్చీ రాని మాటలతో… ఇల్లంతా సందడిచేస్తోంది సోనూ. పట్టుకోబోతే చటుక్కున తప్పుకుని కిలకిలా నవ్వేస్తోంది. ఇందంతా గమనిస్తూ, అత్తగారి కాళ్లదగ్గర కూర్చుని సేవలందిస్తున్నాను. అలా ఉడికిస్తూ… నవ్వుతూ దగ్గరగా వచ్చినట్టే వచ్చి మరింత వేగంగా పరుగు పెట్టపోయింది. పట్టుతప్పింది. అమాంతం కిందపడింది. వెంటనే ఏడవలేదు. గట్టిగా అరుస్తూ నేలను బలంగా తన చేతులతో కొడుతోంది. కిందపడడానికి కారణమైన ఇటాలియన్ మార్బుల్స్ ని కసిదీరా కొరకటానికి ప్రయత్నిస్తోంది. లేపడానికి ప్రయత్నించిన వాళ్లమ్మను కూడా దగ్గరకు రానివ్వలేదు. కొద్దిసేపటికి తనే మెల్లగా లేచి నిలబడింది.
‘నువ్వేంటొదినా అలా రాయిలా కూర్చుండిపోయావ్. కిందపడిన పాపను ఎత్తుకోవచ్చుగా…’ అంది చిరాగ్గా.
‘ఇంత కోపం పనికిరాదు తల్లీ. ఆడపిల్లవి. నెమ్మదిగా నడవాలి. చెప్పినా వినవు కదా’ పాపను బలవంతంగా లోనికి తీస్కెళ్తూ మరోసారి కొరకొరా చూసింది.
ఆడపిల్లలకు కోపం పనికిరాదట. ఆ మాటల్నే పదే పదే నా మనసు రిపీట్ చేస్తోంది. అత్తగారి కాళ్లదగ్గర కూర్చుని నెమ్మదిగా కాళ్లుపడుతున్న నాకు గతం కళ్లముందు తిరిగింది. గతంతో పాటూ అమ్మకూడా గుర్తొచ్చింది. అమ్మ ఎదురుగా లేకపోయినా… ఉన్నట్టు ఊహించడం అలవాటైపోయిన నా మనసు నాతో ప్రమేయం లేకుండా ఆలోచనలని కంటిన్యూ చేస్తోంది.
కోపం… !!! నాక్కూడా చిన్నప్పుడు చాలా ఉండేదట. ఇప్పుడు ఎటుపోయింది. ఏమైపోయింది. నచ్చని వాటికి నిర్మొహమాటంగా ‘నో’ చెప్పే నాలోని టైగ్రెస్ ఏ మూలకెళ్లింది. లెన్స్ వేసినా ఆనవాళ్లు దొరకవే. ఆ కోపం, మొండితనం నేను పెరుగుతున్న కొద్దీ పట్టుదలగా మారాయంటుంది అమ్మ. పీజీలో సాధించిన గోల్డ్ మెడల్ కి అదే రీజన్ అంటావు. ఇప్పుడు ఆ పట్టుదలకూడా మిగల్లేదు. అదే ఉంటే వీళ్లను మార్చాలిగా. మారేంతవరకూ ధైర్యంగా నిలబడాలిగా. ఎందుకో అలా చేయలేక పోతున్నాను. వీళ్లను మార్చే శక్తిలేక ప్రతిరోజూ ఓడిపోతున్నాను. వీళ్లతో పోరాడి గెలిచే సత్తాలేక, ఓటమిని గెలిపిస్తున్నాను. వీళ్లలో ఒకరిగా ఛీ… కాదు కాదు… వీళ్లకి బానిసలా బతకలేక అనుక్షణం చస్తూ బతుకీడుస్తున్నాను.
చిన్నప్పుడు నన్నూ తమ్ముడినీ ఒకేలా చూసేదానివి గుర్తుందా. జెండర్ బయాస్ లేకుండా. పుట్టింట్లో నాకు నో కండిషన్స్. పుట్టిల్లు… ఛీ… ‘పుట్టిల్లు’ అన్న పదమంటేనే నాకు చిరాకు. నేను పుట్టి పెరిగిన ఇల్లు నా ఇల్లవుతుంది గానీ, పుట్టిల్లెలా అవుతుంది. పేగుబంధాన్ని పరాయిగా మార్చేస్తోందా ‘పదం’. అందికే నాకదంటే అసహ్యం. నన్నో పురుగులా చూసే వీళ్లంతా నా వాళ్లంటావే. ఎలా అనుకోను. మెడలో ఓ తాడు పడింది. వెంటనే మీరు పరాయివాళ్లైపోతారా. వీళ్లు నా వాళ్లైపోతారా. ఈ విషయంపై నిన్ను చాలా సార్లు నిలదీశాను నేను. నాతో పోట్లాడే ఓపికలేక ఆ పదాన్నే వాడడం మానేశావు నువ్వు. నన్నుఅనుక్షణం ఈసడించుకునే వాళ్లను ‘నా వాళ్లు’ అని ఎలా అనుకోమంటావ్. అయినా నాకు తెలీక అడుగుతాను, ఒక్క పసుపు తాడుతో తెగిపోయే ఈ బంధాలేంటి, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ బంధనాలేంటి?.
బంధం… !!! అంటే బాధలు పంచుకోవడం… సంతోషాన్ని షేర్ చేసుకోవడం. ఇక్కడ నా బాధలెవరికీ పట్టవే. వాటినెవరూ పంచుకోరే. వాళ్ల ఆనందాన్ని నాకు పంచి ఇవ్వరే. ఇక ఇదెక్కడి బంధం. ఎలాంటి అనుబంధం. అసలిది నా ఇల్లని ఎలా అనుకోను. నా కూతుర్ని వివక్షనుంచి కాపాడలేను. ఆడమగా తేడాల్లేకుండా పెంచడమే నాకిష్టం అని ధైర్యంగా చెప్పలేను. నా కొడుకు చేస్తున్నది తప్పని తెలిసినా ఈ ‘నా కొడుకుల’ముందు గట్టిగా నిలదీయలేను. చివరికి నాకు ఆకలేసినప్పుడుకూడా పట్టెడన్నం తినలేను.
ఇలాంటి బతుకుని బానిస బతుకు అంటారని ఏదో ‘పుస్తకం’లో చదివాను. నువ్వే మనింట్లో అటకమీద పడున్న ఆ పుస్తకాన్ని నాకిచ్చి చదవమన్నావు గుర్తుందా. కానీ నన్నెందుకు చూస్తూ చూస్తూ ఈ కొంపకి బానిసను చేశావ్. చేశావ్ సరే… ఏం జరిగినా నాకు నువ్వున్నావనీ, నా ఇల్లు ఒకటి ఎప్పటికీ నాకోసం ఎదురు చూస్తూ ఉంటుందనీ ఎందుకు భరోసా ఇవ్వలేదు. బాధ్యత దింపుకోగానే నేనూ నీకు బరువైపోయానా?
అరెకరం స్థలంతో విశాలంగా ఉన్న కోటలాంటి మేడ. చేతికింద నలుగురు పనివాళ్లు. మహారాణిలా ఈ ఇంట్లో అడుగుపెట్టిన నేను ఆ మరుక్షణం నుంచే మరో పనిమనిషిని అవుతానని నీకు తెలీదా. తెలిసికూడా ఇగ్నోర్ చేశావా. ముందే తెలిస్తే నేను ఎక్కడ ‘నో’ అంటానో అని నా నోరు నొక్కేశావా.
నా ఇల్లు…!!! నా మూలం కదా. నన్నికడికి పంపి నా ఇంటిని ‘పుట్టిల్లు’ చేశావ్. నా ములాన్ని నాశనం చేశావ్. బేస్మెంట్ లేకుండా బిల్డింగ్ కడతారా ఎవరైనా. పునాది లేని భవంతి పేకమేడలా కూలిపోదూ. నా పరిస్థితీ అంతే. నా ఇల్లు ఎప్పటికీ ‘నాదే’ అన్నబరోసా ఇచ్చి ఉంటే… ఆ ధైర్యం నాకు మరింత ఆత్మస్థైర్యాన్నిచ్చేది. ఈ సోకాల్డ్ ‘నా’వాళ్లు నన్నిలా బానిసలా చూడడానికి భయపడేవాళ్లు.
ఓర్పుతో మార్పుకోసం ఎదురుచూడమన్నావ్ కదూ. అలా చూసీ చూసీ విసిగిపోయాను. ఏళ్ల తరబడి వీళ్ల అజమాయిషీని భరించీ భరించీ బిక్కచచ్చిపోయాను. అప్పట్లో ఎవరైనా ఒక్కమాటంటే కళ్లు జలపాతాలయ్యేవి. ఆ కన్నీళ్లేవి. ఇంకెప్పుడూ నన్ను పలకరించవా. ఎన్ని మాటలు పడ్డా… వీపుపై వాతలు పడ్డా ఈ గాజుకళ్లలో ఒక్క నీటి బొట్టుకూడా రాదే. పంటిబిగువున బాధను భరిస్తూ చిరునవ్వు నవ్వడం. గొడ్డు చాకిరీ చేస్తూ లేని ఓపికను తెచ్చుకోవడం. ఇందంతా టీవీ సీరియళ్లకే పరిమితం అనుకునేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు నా జీవితమే ఒక ఎండ్లెస్ సీరియల్. ఇందులో నటిస్తున్నది, కాదు కాదు జీవిస్తున్నది నేను కాదు… ఏ ఫీలింగ్సు లేని నా బాడీ మాత్రమే.
పెద్దవాళ్లకు విలువివ్వాలన్నావ్. వీళ్లు పెద్దవారెలా అవుతారు. మనసులో, మెదడులో అవిటితనం తప్ప ‘పెద్దరికం’ జాడేలేదే. వీళ్లను నేను ఎందుకు గౌరవించాలి. అసలు ఎలా? కానీ నాకు తెలీకుండా నా చేతులు వీళ్ల మురికి పాదాలను ముడుతున్నాయేంటి. ఛీ… పాడు బతుకు. నిండు చూలాలైనా వంగి వేళ్లతో వారి పాదాలను తాకాలంట. పురిటి బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని కటికనేల మీదే కూర్చోవాలట.
తాడు…!!! అంతా దీని వల్లేకదా. ఛీత్కారాలు. ఛీదరింపులు. ఇదే మెడలో పడకముందు ఎలా ఉండేదాన్ని. సీతాకోకచిలుకల్ని నా జడలో బంధించాలనే పిచ్చితనం. ప్రక్రుతిలోని అందాలన్నీ దోసిలితో వడిసి పట్టాలనే అమాయకత్వం. నువ్వెప్పుడూ కాదనలేదే. కలలకు రెక్కలిచ్చావ్. ఊహలకు ఊపిరిపోశావ్. ముఖ్యంగా నన్ను నన్నుగా చూశావ్. గౌరవించావ్. కానీ తాడే నా భవిష్యత్తు అని ఎందుకు అన్నావ్. అతనే నా సర్వస్వం,తోడు,నీడ అంటూ ఎందుకు నూరిపోశావ్. నిజంకాని రంగుల కలను లెన్స్ వేసి మరీ చాలా దగ్గరగా చూపించావ్. అదే నిజమనుకున్నాను. భ్రమించాను. బోలెడు కలలు కన్నాను. కానీ రియాలిటీ ఎందుకింత భయంకరంగా ఉంది? మేకప్ తుడిచేసిన సినిమా వాళ్ల మొహంలా.
అయినా నాకు ఫీలింగ్సేంటి. నేనో వస్తువుని కదా ఇక్కడ. ఇంటెడు చాకిరీ చేయడం. వండివార్చడం. అందరూ తిన్న తర్వాత ఏదో ఒక మూలకూర్చొని మిగిలిన మెతుకులు తినడం. కూరలు చాలా బాగున్నప్పుడు మంచినీళ్లతో సరిపెట్టుకోవడం. మరి బాగోనప్పుడు. చీవాట్లు తినడం. వాటితోపాటూ మిగిలిపోయిన గిన్నెడన్నం ప్రిడ్జ్ లో పెట్టుకుని అది అయిపోయేంతవరకూ పరమాన్నంలా తినడం. ప్రతి చిన్నపనికీ నన్నో దోషిలా నిలదీస్తారెందుకు. అలా నిలబడి, తలొంచుకుని, వాళ్ల మాటల్ని సహించడం నాకే తెలీకుండా నాకెలా అబ్బింది. నేనెందుకు వీళ్లని ఎదిరించట్లేదు. ఇది ‘నేను’ కాదు. ఒకప్పుడు నేను చాలా వేరు. ఇప్పుడు నేను ఓ బానిసని. కట్టు బానిసని. బానిసలు యజమానులపై తిరగబడలేరు కదా. ఇది కూడా నువ్విచ్చిన పుస్తకంలోదే.
నా నోరు నొక్కిపట్టొచ్చు. నా శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్నర్ వాయిస్ ని చంపలేరు. అది నన్ను హెచ్చరిస్తూనే ఉంది. నేనున్న ప్లేస్ సరైంది కాదని చెబుతూనే ఉంది. ఇన్నాళ్లూ దాన్ని నేను సరిగా పట్టించుకోలేదు. కానీ ఈమధ్య ఆ వాయిస్ బలంగా వినిపిస్తోంది. ఎంతో బలంగా. మెదడును సమ్మెటతో పోటేసినట్టు. ఇప్పుడు కాకపోతే ‘రేపు’ లేదంటోంది. ఇప్పుడు కదలకపోతే రేపు మిగలదంటోంది. కానీ ఎలా బయటికి రావడం. ఇక్కడినుంచి బయటపడితే… నాకోసం బాధపడేదెవరు. చస్తేమాత్రం ఏడ్చేది ఎవ్వరు. నువ్వు తప్ప.అయినా నేనెందుక చావాలి. నేను పోతే నా బిడ్డలకి ఎవరు నేర్పుతారు మంచీచెడు. వాళ్లకోసమైనా బతకాలి. ఏదోలా కాదు. మనిషిలా బతతాలి. అసలు ఎవరికోసమో ఎందుకు. నాకోసం… నాకోసమే నేను బతకాలి. ఈ బతుకుని గెలవడంకోసం బతకాలి. ఈ ఊబినుంచి బయటపడాలి. పూర్తిగా బురదలో కూరుకుపోకముందే. ఈ చావునుంచి తప్పించుకోవాలి. ఈ తాడు ఉరితాడులా మారి నేన్నుకట్టెలా మార్చకముందే. నువ్వు నన్ను ఇంటికి రమ్మన్నా అనకపోయినా… నా చదువు మాత్రం నన్ను మోసం చేయదుకదా. ఎక్కుడున్నాయి నా సర్టిఫికేట్లు. పాతసామాను గదిలో పడేశారు కదూ. తీస్తాను. వాటిసాయంతో ఈ బంధనాలను తెంపుకుంటూ బయటికి వస్తాను. నా కాళ్లపై నేను నిలబడతాను. నా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తాను.
మనసు తేలికపడింది. చల్లటి గాలి శరీరాన్ని తాకింది. భూమిమీద పడ్డ చిరుజల్లు పిల్లతెమ్మెరలా మారి ముక్కుపుటాలను సోకింది. తూర్పున ఓ మెరుపు చటుక్కున మెరిసింది.
నా చేతులు అప్రయత్నంగా అత్తగారి కళ్లను వదిలేశాయి. తనువు తన ప్రమేయంలేకుండానే లేచి నిలబడింది. నాకాళ్లు గుమ్మంవైపు నడుస్తున్నాయి. మనసులో స్థిరత్వం అడుగుల్లో సవ్వడిలా మారుతోంది.
ఏం… తిన్నది అరగట్లేదా… కాళ్లుపట్టమని ఎన్నిసార్లు చెప్పాలి…
వెనక్కితిరిగాను.
ఇంకా ఏదో అనబోతూ చటుక్కున నోరు మూసుకుందావిడ.
మూతపడ్డ అత్తగారి నోటిని చూస్తే అర్థమైంది నాకు నా చూపుల్లో నిప్పులు కురిపించే శక్తి లేకపోయినా… నన్ను నేను కాపాడుకోగల సామర్థ్యం ఉందని.
-శివలీల.కె
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~