“శ్రీమతి ఇందిరారావు గారి” తో మాలా కుమార్ ముఖాముఖి

మా చిన్నప్పుడు స్కూల్‌ వ్యాస రచన పోటీల్లో, డిబేట్‌ పోటీల్లో ‘‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’’ అన్న టాపిక్‌ ఉండేది. కలం కూడా కత్తి లాగే ఉద్యమాలల్లో పాల్గొనేంత గొప్పది, ప్రజలను చైతన్యవంతులుగా చేయగలిగిన శక్తి కలది. అందుకే పత్రికలు ప్రజా ఉద్యమాల్లో భాగాలు అయ్యాయి. అలా నిజాం రాష్ట్రంలోని ఆంధ్రులను చైతన్యవంతం చేయటం కోసమే, ఆగస్ట్‌ 24`1922 నాడు నల్లగొండలో, శ్రీ షబ్నవీసు రామనరసింహారావుగారు “నీలగిరి” వారపత్రికను ప్రారంభించారు. ఆనాటి నిజాం పాలనాకాలంలోని నిర్భందాన్ని అధిగమించి ఉస్మానియా ముద్రణాలయం స్థాపించి, దాని ద్వారా సంస్కారిణి గ్రంధము ద్వారా ప్రతి నెల ఒక మంచి పుస్తకాన్ని పాఠకులకు అందించి, ఆనాడు సాహితీసేవ చేసిన శ్రీ షబ్నవీసు రామనరసింహారావు గారి గురించి, వారి కోడలు షబ్నవీస్‌ ఇందిరా రావు గారు రచించిన పుస్తకము ‘‘తెలంగాణా వైతాళికుడు షబ్నవీస్‌ జీవితం.. సాహిత్యం’’. షబ్నవీస్‌ ఇందిరాగారితో ముఖాముఖిలో వారి గురించి మరిన్ని విషయాలు .

1. మీ తెలంగాణా వైతాళికుడు, షబ్నవీస్‌ జీవితం`సాహిత్యం’ పుస్తకము చదివాను. చాలా బాగా రాశారు. అసలు మీ మామగారు, షబ్నవీస్‌ వెంకటరామనరసింహారావు గారి గురించి వ్రాయాలని మీరు ఎందుకు అనుకున్నారు?
జ ;తెలంగాణ సాధించాక అనేకమంది తేజోమూర్తుల జీవితాలు నెమ్మదిగా వెలుగులోకి రావడం మొదలైంది. నిజాం పరిపాలనలో ఉర్దూ భాషా ప్రయోగం తప్ప, అన్య భాషకు ప్రాధాన్యత లేని రోజులో పత్రికా సంపాదకీయం, ప్రచురణ ఆనాటి కష్టతర పరిస్థితులలో పూనుకోవడం చాలా గొప్ప విషయం. అచ్చు వేయడం అచ్చిరాదని అనేకమంది హెచ్చరించినా వినకుండా పట్టుదలతోను, శ్రమతోను, అనేక కష్ట నష్టాలకు ఓర్చి మా మామగారైన శ్రీ షబ్నవీస్‌ లక్ష్మీనరసింహారావుగారు నీలగిరి పత్రికను స్థాపించారు. పత్రిక ప్రారంభమైన రోజే వారి మొదటి భార్య శ్రీమతి జానకీబాయి మరణించారు. అంతటి దు:ఖాన్ని, బాధని దిగమింగి ప్రజలకు, నల్గొండ వాసులకు ఒక మంచి పత్రికని, సమాచారాన్ని అందివ్వడానికి ఒక రకంగా తన జీవితాన్ని పణంగా పెట్టారు. ఏ స్వతంత్ర సమరయోధునికి తీసిపోని వారు. మరుగుపడిన వారి చరిత్ర మళ్ళీ తెలంగాణా వారికి, మా కుటుంబంలో కూడా ఈ తరం వారికి, ముందుతరాల వారు, మర్చిపోకుండా వుండలానే ఉద్ధేశ్యంతో వీలయినంత వారి గురించిన విషయసేకరణ చేసి పుస్తకరూపంలో అచ్చువేయడం జరిగింది. మరుగుపడిన మాణిక్యం షబ్నవీస్‌ లక్ష్మీనరసింహారావు గారు. వారి జీవిత చరిత్రలో, సాటి పత్రికారంగపు ప్రతినిధి అయిన వద్దిరాజు సోదరులకు (వీరి పత్రికకు పోటి అయిన పత్రిక) ‘‘తెనుగు పత్రిక’’ ని నడపడానికి షబ్నవీస్‌ వారు సాయపడటం గురించిన విషయ వివరాలు వున్నాయి. దీన్నిబట్టి వారు ఎంత ఉన్నత మనస్కులో అర్థమవుతుంది. సాధారణంగా తమ పోటీదారులకి సహాయపడటం అరుదుగా జరిగే విషయం. ఇలాంటి విషయాలు చదివినప్పుడు అంత గొప్పవంశానికి వారసులవడం మా అదృష్టంగా భావించాము. షబ్నవీస్‌ వారి గురించిన విషయసేకరణ ఇంకా ఇంకా జరుగుతూనే ఉంది. అనేక విషయాలు ఈ పుస్తకంలో పొందుపరచనివి మళ్ళీ లభించాయి. దేవుడి దయ, పెద్దల ఆశీస్సులతో రెండవ భాగం ప్రచురణ కూడా తొందరలోనే చేయాలని సంకల్పించాము.

2. ఈ పుస్తకం వ్రాసేందుకు మీరు విషయసేకరణ ఎలా చేస్తారు ? మీ మామగారి గురించి, ఆయన స్థాపించిన నీలగిరి పత్రిక గురించి తెలుసుకునేటప్పుడు మీకు కలిగిన అనుభవాలు ఏమిటి?
జ ; నాకు మావారు (మా అత్తగారి కుటుంబం) చాలా దగ్గర బంధువు. మా ఇంట్లో ఉండే వీరి అమ్మమ్మగారు నల్గొండ వివరాలు చెప్తుండేవారు. కాని మా మామగారైన శ్రీ వెంకటరామ నరసింహారావు గారి పత్రిక గురించిన వివరాల ప్రసక్తి ఎప్పుడూ రాలేదు. సుమారుగా 2012లో ‘‘మిసిమి’’ అనే మాసపత్రికలో శ్రీ కుర్రా జితేందర్‌ బాబు గారు షబ్నవీస్‌ వారి గురించిన వ్యాసం చదవటం జరిగి మొదటిసారిగా వారి గురించిన అనేక విషయాలు తెలిసినాయి. కాని తర్వాత కుటుంబ బాధ్యతలో దాని గురించిన విస్తృతమైన పరిశోధన చేసే అవకాశం కలగలేదు. తరువాత 2015లో తెలుగు యూనివర్సిటీలో Post-Graduation in Communication and Journalism చేసేటప్పుడు దాదాపు అన్ని సబ్జెక్ట్సులోనూ పత్రికా రంగం / మీడియా విషయ సమాచారాలో వీరి గురించిన సమాచారం ఉంది. క్లాసులో వారి కోడలిని నేను అని లేచి నిలబడి చెప్పుకోవడం నాకొక గొప్ప అనుభూతి. 2017లో రేడియోలో మాట్లాడే అవకాశం అయినంపూడి శ్రీలక్ష్మి గారి ద్వారా వచ్చినప్పుడు, షబ్నవీస్‌ గారి గురించి నేను మాట్లాడాను. ఒక రకంగా ఆల్‌ ఇండియా రేడియో వారు, శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మిగారు ఈ పుస్తకానికి నాంది పలికారు. తర్వాత అది ప్రచారం కావడం, అలాగే తెలంగాణా తేజోమూర్తులు పుస్తకంలో ప్రచురణ కావడం జరిగింది. ఆ రేడియో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నల్గొండ వాస్తవ్యులతో (వారు అదే కార్యక్రమంలో ప్రసంగించడానికి వచ్చారు పరిచయం, వారి ద్వారా అనేకమంది నల్గొండ పెద్దలతోనూ, కురువృద్ధులైన శ్రీ కూరెళ్ళ విఠలాచార్య లాంటి వారితో పరిచయం కలగటం సంభవించింది. అది ఒక క్రొత్త ప్రపంచానికి తెర తీసింది. జ్ఞానవృద్ధులు, సరస్వతీ మూర్తులనేకులతో పరిచయాలు, గ్రంథాలయ సంపద ఇవన్నీ లభించాయి. అలా కూరెళ్ళగారి సరస్వతీ కుటీరంలో అనేక తెలంగాణ ప్రముఖుల జీవిత చరిత్రలు, సంఘటనతో కూడిన పుస్తకాలు లభించినప్పుడు ఇవన్నీ సంకలనం చేసి మరుగుపడిన లక్ష్మీనరసింహారావుగారి జీవిత చరిత్రను మళ్ళీ వెలుగులోకి తీసుకొని రావాలనే కోరికతో అనేక గ్రంథాలయాలకు, బుక్‌ షాపు తిరిగి, పాతతరం ప్రముఖుని కలుసుకొని, వీయినంత సమాచార సేకరణ, ఒక పుస్తకరూపం దాల్చడానికి వీలయినంత పరిశోధన చేయడం జరిగింది.

జ్యోతివలభోజుగారితో పరిచయం, ఒకసారి ఆవిడను కలవడం జరిగింది. ప్రింటింగ్‌ విషయమై ఆవిడకిస్తే బాగుంటుందనిపించి జ్యోతితో మాట్లాడిన వెంటనే తను ఒప్పుకోవడం, 15 రోజులలో పుస్తకం చక్కటి రూపుదిద్దుకుంది. జ్యోతి గారు అన్ని విధాల పుస్తకం ప్రింట్‌ అవడానికి తన సహాయ సహకారాన్ని, అవసరమయిన సహాయాన్ని అందించారు. త్యాగరాయ గానసభలో ఆగస్ట్‌ 10, 2017 లో శ్రీ నందిని సిద్దారెడ్డి, సాగి కమలాకర శర్మగారు, టి. గౌరీశంకర్‌ లాంటి ప్రముఖుతో నా షబ్నవీస్‌ జీవితం`సాహిత్యం ఆవిష్కరణ జరిగింది. షబ్నవీస్‌ లక్ష్మీనరసింహా రావు గారి నీలగిరి పత్రిక మొదటిసారిగా 1922, ఆగస్ట్‌ లోనే మొదలవడం, వారి గురించిన నా పుస్తకం షబ్నవీస్‌ జీవితం`సాహిత్యం అదే ఆగస్టు నెలలో ఆవిష్కరణ జరగడం యాదృశ్చికం.
శ్రీ సంగిసెట్టి శ్రీనివాస్‌ గారి షబ్బనీస్‌ పుస్తకం నుంచి, శ్రీ కుర్రా జితేందర్‌ బాబు గారి నిజాం రాష్ట్రాంధ్ర ఉద్యమం లాంటి అనేక పుస్తకాల సంకలనాల నుండి, ఇతర తెలంగాణ రచయిత పుస్తకాల నుంచి విషయసేకరణ జరిగింది.

3) ఆంద్రోద్యమం ఆరంభానికి తెలంగాణాలో ప్రచురించబడిన మూడు వార్తా పత్రికలకు సాధనాలైనవి. అందులో ‘‘నీలగిరి’’ మొదటిది. అని మీరు వ్రాసారు. అసలు ఆంద్రోద్యమం ఏంటి, ఎందుకు చేసారో క్లుప్తంగా ఐనా రాసి ఉంటే బాగుండేది అని నాకనిపించింది. మరి మీ అభిప్రాయం ఏమిటి?
జ ; 1921 వరకు రాష్ట్రంలో ఏ ఉద్యమాలు లేవు. 1921 లో జరిగిన ఒక కారణంగా ఆంధ్ర జనసంఘం/ఆంద్రోద్యమం ఏర్పడింది. ఆంద్ర జనసంఘం మొదటి సమావేశం 1923 జూలై 27న హైదరాబాద్‌లో మాడపాటి హనుమంతరావు నివాసగృహంలో జరిగింది. తెంగాణలో ఎనిమిది జిల్లా నుండి ఎన్నికైన సభ్యులతో ఏడుగురు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అది 1921 నవంబర్‌ 12 సాయం సమయం. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని థియేటరులో హిందూ సంస్కార సభ జరుగుతున్నది. పూణే మహిళా విశ్వవిద్యాయ సంస్థాపకుడు ధోండే కేశవ్‌ కార్వే మహాశయుడు సభకు అధ్యక్షత వహించాడు. ఈ సభలో అనేకమంది వక్తలు ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీలో ప్రసంగించారు. ఆంధ్ర ప్రతినిధులు మాడపాటి హనుమంతరావు, ఆలంపల్లి వెంకటరామారావు ఇద్దరూ ప్రసిద్ధులే. ఇద్దరూ హైకోర్టు న్యాయవాదులే. హనుమంతరావు తెలుగులో మాట్లాడినాడు. మహారాష్ట్ర బహుళ్యమైన సభవారు విసుక్కున్నారు. కాని విన్నారు. ఆలంపల్లి వెంకటరామారావు లేచి సభలో మాట్లాడటం ప్రారంభించాడు. సభవారు నిరసన చప్పట్లు కొట్టినారు. ఆయన లక్ష్యం చేయక మాట్లాడుతూనే ఉన్నారు. సభవారు అల్లరి చేసారు, వినలేదు. వక్త మాట్లాడుతూనే ఉన్నాడు. సభవారు తమ వీపు సభావేదిక వైపుకి తిప్పి వినమన్నారు. ఈ దుశ్చర్య, ఈ అవమానం ఆంధ్రులు భరించలేకపోయారు. సభ విడిచి వెళ్ళిపోయారు. ఆ రాత్రికి రాత్రే  రంగారావు గారింట్లో సమావేశమై కర్తవ్యం ఆలోచించారు. ఆంద్రుల అభిమాన సంరక్షణ కోసం, ఆంధ్రుల వ్యక్తిత్వ నిరూపణకోసం, ఒక సంఘం స్థాపించాలని నిశ్చయించుకున్నారు. ఆ సంఘం పేరు నిజాం రాష్ట్ర ఆంధ్రజన కేంద్ర సంఘం. అధ్యక్షుడు రావుబహదూర్‌ శ్యామలారెడ్డి, కార్యదర్శి హనుమంతరావు.

ఈ కేంద్ర సంఘం స్థాపకులు టేకుమళ్ల రంగారావు, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, మందుముల నరసింహారావు, మందుముల రామచంద్రారావు, ఆదిరాజు వీరభద్రారావు, పందిట రామస్వామి నాయుడు, ఆర్‌.రాజగోపాల రెడ్డి, మిట్టా లక్ష్మీనరసయ్య, కొమ్మవరపు సుబ్బారావు, ఆంధ్రోద్యమం రాజ్యమంతా వ్యాపించింది. ప్రజలకు వెలుగు చూపింది. తరువాత మహారాష్ట్ర, కన్నడ పరిషత్తుకు దారి చూపింది. అంతవరకు ఏ రాష్ట్ర ఉధ్యమమైనా నగరంలోనే ఉండేది. ఆంధ్రులు గ్రామసీమకు తరలారు. ఆంధ్రులో ఐకమత్యం, చైతన్యం, విద్య, స్త్రీ వికాసం మొదలైన వాటికి కారకులై తాము మేల్కొని ఇతరులను మేల్కొలిపారు.

ఇదివరకుదాకా ప్రభువులు, వారి ఆశ్రితులు ప్రచారం చేస్తూ వచ్చిన దక్కను భావం, దక్కను చరిత్ర, దక్కను రాజ్యం, దక్కను సంస్కృతీ అనే ముక్కాలి పీఠం విరిగిపోయింది. ఆంధ్ర సంస్కృతీ వాహిని వెల్లివిరిసి మూసీనదిలో మూర్తీభవించింది. యువకుల ఆవేశ అభిమానాలతో, ఈ ఆంధ్ర సంఘం పెద్ద ఆశయాలతో బయలుదేరింది. ఒక పక్కన గ్రామీణుల విజ్ఞానం వృద్ధి చేసి, వాళ్ళకళ్ళు తెరవడానికి గ్రంథాలయాలు, రైతుల ఇక్కట్లు పోగొట్టడానికి రైతు సంఘాలు, వ్యాపార పరిస్థితులు బాగుపరచడానికి వర్తక సంఘాలు ఇటువంటి సంఘాలు ఉన్నవాటికి చేయూతనిచ్చి, లేనిచోట్ల కొత్త వాటిని స్థాపించి ‘జై’ అని కార్యక్రమం ప్రారంభించారు. ఆ కాలంలో గ్రామస్థుల మీద పటేల్‌-పట్వారీలు, పోలీసు జులుం నిరంకుశంగా సాగేది. రైతుల్ని అన్యాయంగా వసూళ్ళతో యమ బాధలు పెట్టేవారు. వెట్టిచాకిరీ చేయించుకువారు. వర్తకుల దగ్గర అధీకారులు సరుకు తీసుకుని డబ్బిచ్చేవారు కాదు. తిట్టేవారు, కొట్టేవారు, దిక్కూ దివాణం ఉండేది కాదు. అటువంటి నిర్భాగ్య ప్రజా శ్రేయస్సుకోసం పనిచేసింది ఆంధ్ర జనసంఘం. నాయకులు జిల్లాలు తిరిగి ప్రబోధం చేశారు.

ఆంధ్ర జనసంఘం రెండవ సమావేశం ‘నీలగిరి’ పత్రిక సంపాదకులు షబ్నవీసు వెంకట రామనరసింహారావు కార్యాలయ ఆవరణలో నల్లగొండలో 1924 సం॥ మార్చి 21వ తేదీన జరిగింది. ఈ సమావేశానికి రావుబహదూర్‌ వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణా జిల్లా నుండి ప్రతినిధులు, వివిధ జిల్లాల నుండి యాభై మంది ప్రజలు వచ్చారు.

ఆంధ్ర జనసంఘం మూడవ సమావేశం 1925 ఫిబ్రవరి 21వ తేదీన వరంగల్లు జిల్లా మధిరలో పింగళ వెంకటరామిరెడ్డి కర్మాగారపు ఆవరణలో విశామైన మంటపంలో జరిగింది.

ఆంధ్ర జనసంఘం నాల్గవ సమావేశం సూర్యాపేటలో 1928 సం॥ మే నెల 28, 30వ తేదీలలో జరిగింది.
ఆంధ్ర జనసంఘం స్థాపించిన మొదలు దాని పెంపు కొరకై మాడపాటి హనుమంతరావు పంతులుగారు నిర్విరామంగా కృషిచేసారు. మూడు, నాలుగేళ్ళలోనే, ఆంధ్ర జనసంఘం శాఖకు 50 వరకు వివిధ ప్రదేశాలో స్థాపించబడ్డాయి. సుమారు 90 గ్రంథాయాలు కూడా తెలంగాణలో ఏర్పడి భాషాసేవ, విజ్జాన వ్యాప్తి కలిగించాయి. దీనితో ప్రజలలో సంచలనం కలిగింది. తెలంగాణలో క్రమంగా చీకట్లు తొలగిపోయి ఉషోరేఖ కాంతులు వెదజల్లసాగాయి.

ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ సంస్థను స్థాపించినవారు తెలంగాణ వారు. ఆంధ్రోద్యమం, ఆంధ్ర జనసంఘం అనే పేర్లను పెట్టుకున్నారు. తెలంగాణా జనసంఘం అని పెట్టలేదు. వారు చరిత్రను పరిశీలించారు. చరిత్రలో తెలుగు భాష మాట్లాడే ప్రజలను ఆంధ్రులన్నారు. ఉర్దూ భాష మాట్లాడే నిజాం అధీకాయి ‘తెలంగీ’ అనేవారు. ‘తెలంగీ బేధంగీ’ (తెలుగు భాషకు ఒక క్రమ పద్ధతి లేదు) అని అపహసించేవారు. భాషను అర్తం చేసుకోలేక, నేర్చుకోవాలన్న ఉద్ధేశమే లేక, మాట్లాడటం చేతకాక, భాషను అలా ద్వేష భావంతో సంస్తాణ పేర్లలో ఆంధ్ర శబ్ధమే కనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయ ఆంద్రభాష నిలయం రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయం, వేమన ఆంధ్ర భాషానిలయం మొదలైనవి కనుక చరిత్రను బట్టి ఆంధ్ర జనసంఘం, ఆంద్రోద్యమం అని వ్యవహరించారు.

మధిర, సూర్యాపేట సమావేశాల్లో ప్రథమ, ద్వితీయ గ్రంథాయాల సభలు కూడా జరిపించారు. ప్రజలలో పెల్లుబుకుతున్న ఉత్సాహాన్ని అదుపులో ఉంచి దాని నిర్మాణ మార్గంలోకి మరల్చడానికి పంతులుగారు పూనుకున్నారు. ఆంధ్ర జనసంఘం వల్ల జరిగిన మేలు ఏమిటంటే ఒకప్పుడు ఉర్ధూ భాషలో మాట్లాడటమే నాగరికతగా భావించిన పట్టణ విద్యాధికులు క్రమంగా తెలుగు ఉపన్యాసాలివ్వడం మొదలుపెట్టారు. పామరులు కూడా తెలుగు ఉపన్యాసాలు వినసాగారు, తరచు సభలు, సమావేశాలు అన్నిచోట్లా జరిగాయి. తెలుగు పత్రికలు పట్టణాలలోనే గాక గ్రామసీమలలో కూడా కనిపించాయి. పోస్టువాళ్ళు బండగుర్తు పెట్టుకొని వాటిని అందించేవారు. రచయితలు, కవులు పుట్టుకు వచ్చి పత్రికలో తెలుగు కవితలు, కథలు, వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు.

హైదరాబాద్‌ నుండి కాక తెలంగాణ జిల్లాల నుండి వెలువడిన తెలుగు పత్రికలు రెండు. అవి 1922 సంవత్సరము ఆగస్టు నెలలో నాలుగు రోజుల వ్యత్యాసంతో ప్రారంభమైనవి. 1922 ఆగస్టు 24న షబ్నవీసు వెంకటరామనరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండ నుండి ‘‘నీలగిరి’’ అనే వారపత్రిక ప్రారంభమైనది. ఇదే మొట్టమొదటి పూర్తి స్థాయి రాజకీయ పత్రిక. 1922 ఆగస్టు 27న వరంగల్‌ జిల్లా మానుకోట తాలుకా ఇనుగుర్తి నుండి ‘తెలుగు పత్రిక’ ప్రచురించబడింది. ఈ పత్రిక సంపాదకులు వొద్దిరాజు సీతారంచంద్రరావు, వొద్దిరాజు రాఘవరంగారావు సోదరులు.

1925 వరకు నీలగిరి పత్రికను అత్యంత సమర్థతతో షబ్నవీసు రామనరసింహారావు నడిపారు. ఆనాటి ప్రముఖ నాయకులైన మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, పులిజాల రంగారావు తదితరులు వివిధ విషయాలపై ఈ పత్రికలో ఎన్నో కవితలు, వ్యాసాలు రాసేవారు. ఆ రోజులో గుడిపాటి వెంకటాచలం రాసిన ఒక సంచలనాత్మకమైన కథను పత్రికలు ప్రచురించడానికి నిరాకరించాయి. అప్పుడు షబ్నవీసువారు నీలగిరి పత్రికలో ఆ కథను ప్రచురించి సంచలనం సృష్టించారు. ఆంధ్రోద్యమ నిర్మాతలైన రామనరసింహారావు 1992లో మరణించారు.
(పై సమాచారం తెలంగాణ చరిత్ర`రచయిత జి. వెంకటరామారావుగారి పుస్తకం నుండి సేకరించడం జరిగింది).

4) మాకు తెలియని ఆంద్రోద్యమం గురించి వివరంగా బాగా చెప్పారండి. థాంక్‌ యు. ఇక మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పగలరా?
జ: సాహితీ ప్రస్థానం వంటి పదప్రయోగం చేయడానికి ఇంకా నాకు అర్హత లేదని నేను అనుకుంటున్నాను. మీరన్న సాహితీ ప్రస్థానంలో ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకలు మొదలు పెట్టాను. మొదటి రచన ఇంటర్‌మీడియట్‌లో వనితా కాలేజిలో చదువుతున్నప్పుడు మొదటి సంవత్సరంలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి కవితా సంపుటి గురించి నాలుగు పేజీల సమీక్ష కాలేజి మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. రెండవ సంవత్సరంలో ఒక చిన్న సరదా కథ ‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ ప్రచురించబడింది. తరువాత పెళ్ళి, పిల్లలు, చదువు, మస్కట్‌ ఓమాన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు, అక్కడ చిన్న చిన్న నాటికలు రాసి మన తెలుగు వారితో వేయించేవాళ్ళం. 2000 సం॥లో ఇండియా వచ్చాక కొన్ని కథలు, వ్యాసాలు, పరిచయాలు ఆంధ్రభూమి, జ్యోతి, భూమిడైలిపేపర్‌ లాంటి పత్రికలోను ప్రచురించబడ్డాయి.

నా మొదటి కథకి 150 రూపాయలు పారితోషికం అందుకున్నప్పుడు నా సంతోషం వర్ణనాతీతం. ఆ తరువాత ఒక పది సం॥లు అనేక కారణాతో రచన మూపడింది. మళ్ళీ రేడియో ప్రసంగాలు, ఈ పుస్తకం ప్రచురణతో పున:ప్రారంభమైంది.

సుమారుగా 2003 సం॥ లో కీ॥ శే॥ పోతుకూచి సాంబశివరావు గారు ‘‘ఒక పేజీ’’ కథ పోటీలు నిర్వహించారు. అందులో నా కథ ‘‘భరతమాత ముద్దుబిడ్డ’’ ప్రథమ బహుమతిని గెలుచుకుంది. అంతా తెలంగాణ మాండలీకంలో రాశాను. జడ్జీగా వచ్చిన శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు నేను కథ రాస్తే ఎలా ఉంటుందో అలా రాశావమ్మ అని మెచ్చుకున్నారు. అంత పెద్ద రచయిత నుండి అలాంటి కాంప్లిమెంట్లు రావడం చాలా సంతోషంగా అనిపించింది.

ఒక పరాయి దేశంలో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం, కాక్‌పీట్‌లో ప్రయాణాలు, తెలుగు కళాసమితి తరుపున మన ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం, ఇలా అనేక సంతోషాన్ని కలిగించే మరచిపోలేని సంఘటనలు. జీవితం పూబాట కాదు, కాని ముళ్ళ పొదలు వచ్చిన వెంటనే తొలగించే ప్రయత్నాలు చేసి, నమ్మకాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా మనకి మంచి రోజులు వస్తాయి అని వేచి చూస్తే తప్పకుండా అది జరుగుతుంది అని నా నమ్మకం. ఎన్నిటికి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఇది నాచేత కాదు అనుకోకుండా ఎందుకు కాదు అని చేసి చూపిద్దాం అనుకుంటే అనుకోకుండా ఎందుకు కాదు అని చేసి చూపిద్దాం అనుకుంటే అంతా విజయమే.

5) మీరు మస్కట్‌లో కూడా ఉండి వచ్చారు కదా, అక్కడ తెలుగు గ్రంథాయాలు ఉండేవా. అమెరికాలోలా అక్కడ కూడా తెలుగు సాహిత్యానికి ఆదరణ ఉండేదా?
జ: మస్కట్‌లో తెలుగు గ్రంథాయాలు అంటూ ఏంలేవు. కాని తెలుగు కళాసమితి అనే సంస్థ ఉండేది. ఇప్పటికి ఇంకా అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు మావారు తెలుగు కళాసమితి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ముందు నుండి మా కుటుంబం అంతా, మావారు, మా అబ్బాయి, అమ్మాయి, అమ్మాయి కూడా చాలా చురుకుగా అనేక అనేక సాంస్కృతిక, నాటక, నృత్య సంబంధిత కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు. మా వారు చాలా తెలుగు నాటకాలు వేసారు. తెలుగు వారితో నాటికలు వేయించారు. ఆదివిష్ణు, గొల్లపూడి వంటి వారి ప్రసిద్ధ నాటకాలు వేశారు. అలాగే మన తెలుగు వారందరు ఏకమయి చాలా పద్ధతిగా పండగలు జరుపుకునేవారం. ఉగాది అంటే పంచాంగ శ్రవణం, శ్రావణమాసపు వరలక్ష్మిపూజ పేరంటాలు, సంక్రాంతి ముగ్గు పోటీలు ఇలా అనేక రకాల తెలుగు సంప్రదాయాలని, సంస్కృతిని మర్చిపోకుండా పిల్లలకు కూడా తెలియాలి, భారతదేశానికి తెలుగు గడ్డకి దూరమైనా మన అలవాట్లు, పద్ధతులు తెలపాలి అనే ఉద్ధేశ్యంతో అన్ని పండగలు పద్దతిగా జరుపుకునేవాళ్ళం. మన భాషని, మర్చిపోకుండా పద్యాల పోటీలు లాంటివి కూడా నిర్వహించేవాళ్ళం. ఒక రకంగా మస్కట్‌లో ఉన్నన్ని రోజులు ఒక స్వర్ణ యుగంగా గడిపాము.

6) మీకు రచను కాకుండా ఇంకా ఏమైనా హాబీలు ఉన్నాయా?
జ: రచనలు కాకుండా ఇంటీరియల్‌ డెకరేషన్‌, గార్డెనింగ్‌ నాకు చాలా ఇష్టమైన హాబీలు, ఉన్నదాంట్లోనే వీలయినన్ని మొక్కలు మల్లి, గులాబీ, సంపెంగ లాంటి మొక్కలు వేశాము. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో సింహాచలం  సంపెంగ మా ఇంట్లో విరగబూస్తూ నాకు అనేక మంది స్నేహితులను సంపాదించి పెట్టింది. అలాగే సమయం ఉన్నప్పుడు వృద్ధాశ్రమాలకి వెళ్ళి వాళ్ళని పలకరించి వీలయినంత సేపు వారితో గడపడం, పండుగలు, పబ్బాలకు మా పరాశరి సేవా సమితి ద్వారా వెళ్ళి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్‌లు, వారికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించి కాలక్షేపం చెయ్యడం సుమారు 15 సంవత్సరాల నుండి చేస్తున్నాము.

7. మీ సింహాచలం సంపెంగ నన్నూ మీ ఇంటికి తీసుకొచ్చింది  మీరు ఎక్కువగా పుస్తకాలు చదువుతారా? మీకు నచ్చిన ఒక పుస్తకం గురించి చెప్పగలరా?
జ: పుస్తకాలు చాలా చదువుతాను. ఎక్కడైనా ప్రింటెడ్‌ మెటీరియల్‌ ఉంటే చదవకుండా వుండలేను. నా దగ్గర బోలెడన్ని పుస్తకాల కలెక్షన్‌ ఉంది. నెలకి రెండు పుస్తకాలు తప్పక కొనేదాన్ని. మేము మస్కట్‌ నుండి శాశ్వతంగా వచ్చేటప్పుడు సగం పెట్టెలో నా పుస్తకాలే. విశ్వనాధ వారి నుంచి Sidney Sheldon వరకు తెలుగు, ఇంగ్లీష్‌ కలిపి 500 పైగా ఉంటాయి.
ఇంగ్లీష్‌లో చాలా ఇష్టమైంది Pearl S Buck “Good Earth”. ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. అలాగే Ayn Rand “Fountain Head” . తెలుగులో అనేకం ఉన్నాయి. ఒకటని చెప్పడానికి లేదు. డా॥ శ్రీదేవి గారి ‘కాలాతీత వ్యక్తులు’’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’’, సోమరాజు సుశీల గారి ‘‘ఇల్లేరమ్మ కథలు’’, ఇంకా ఇంద్రగంటి జానకీ బాల గారు, కన్నెగంటి అనసూయ, పొత్తూరి విజయక్ష్మి, డి.కామేశ్వరి ఇలా వీళ్ళందరి రచనలు చాలా బాగుంటాయి. ఇలా అవలీలగా అన్నేసి కథలు ఎలా రాస్తుంటారో అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కథ, కథనం, శైలి అన్ని ఒకదానిని మించి ఒకటి ఉంటాయి.

8. మీ గురించి అంటే మీ బాల్యం, విద్య, కుటుంబం గురించి చెప్పగరా? మీకు అభ్యంతరం లేకపోతేనే..?
జ : బాల్యం కొంత వరకు శ్రీకాకుళంలో తరువాత హైస్కూల్‌ నుండి హైదరాబాద్‌ లోను గడిచింది. బి.కాం రెండవ సం॥లో పెళ్ళయింది. నాన్నగారు ఎడ్యుకేషన్‌ పార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసేవారు. చిన్నప్పటి నుంచి సాహిత్యం, గార్డెనింగ్‌ పై ఆసక్తి కలగడానికి కారణం మా నాన్నగారు. మా నాన్నగారిని కలవడానికి అనేక మంది ప్రముఖులు వస్తుండేవారు. జంద్యాల పాపయ్యశాస్త్రి గారి పుస్తకాన్ని వారి సోదరుని ద్వారా, అలాగే నటరాజు రామకృష్ణగారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారు, పరిమళా సోమేశ్వర్‌ ఇలా అనేకులతో నాన్నగారికి పరిచయాలుండేవి. వారి పుస్తకాలు మాకిచ్చేవారు. నాన్నగారితో పాటు నేను చదివేదాన్ని. నాన్నగారికి పౌరాణిక నాటకాలంటే చాలా ఇష్టం. పీసపాటి, ఈలపాట రఘురామయ్య లాంటి ప్రముఖు నాటకాలకి నన్ను తీసుకెళ్ళేవారు. చాలా వరకు ఆ పద్యాలు నాకు కంఠస్థం వచ్చేవి. తెలుగు సాహిత్యం మీద అభిమానానికి కారణం ఆయనే.

వివాహమైన తరువాత నేను, మా వారు కూడా మస్కట్‌ Oman Airlines లో ఉద్యోగం చేశాను. మస్కట్‌లో చాలా మంది తెలుగువారు ఉండేవారు. అందులో మేము తెలుగు కార్యక్రమాలలో, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వల్ల అందరితోటి మంచి సత్సంబంధాలు ఉండేవి.

మా ఉమ్మడి కుటుంబం, పుట్టినింటా మెట్టినింటా కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆనందాలని, సుఖసంతోషాలని అందరం కలిసి పంచుకుంటున్నాము.

సుమారు నా 57వ ఏట తెలుగు విశ్వవిద్యాయం నుండి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసాను.వీలయితే ఎం.ఫిల్‌ కూడా చేయాలని ఉంది.

మీరన్నట్లు ఏ స్వాతంత్రసమరయోధునికీ తీసిపోని యోధులు శ్రీ షబ్నవీసు రామనరసింహారావుగారు.వారి చరిత్రను వెలికి తీసుకు వచ్చి ముందు తరాలవారి తెలియచెప్పిన మీ ప్రయత్నం ప్రశంసనీయము.మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇంత ఓపికగా జవాబులు చెప్పినందుకు ధన్యవాదములు.

ఈ ముఖాముఖి పూర్తి ఐన తరువాత వసుధ ఎన్విరో వారి సౌజన్యం తో RGB infotain ఉగాది 2018 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో ఇందిరగారి కథ “అమ్మకి తోడూ ” కు ప్రత్యేక బహుమతి లభించినట్లుగా తెలిసింది.చాలా సంతోషం ఇందిరగారు. మీరు ఇంకా ఎన్నో ఎన్నో బహుమతులు గెలుచుకోవాలని ఆశిస్తూ అభినందనలను అందజేస్తున్నాను.

మీ పిల్లలకు బహుమతిగా ఇవ్వదగిన చక్కటి పుస్తకం ” తెలంగాణా వైతాళికుడు – షబ్నవీస్ జీవితం- సాహిత్యం “. ఈ పుస్తకం నవోదయా , కాచిగూడా లోనూ, రచయిత్రి దగ్గరా లభ్యం అవుతుంది.

రచయిత్రి అడ్రెస్;
“వసుధ “, H.NO 34-39/3/4 వివేకానందపురం,
సైనిక్ పురి,
సికింద్రాబాద్ -500094
టెలిఫోన్ నంబర్; 99899 88226
Email ; indurao [at] yahoo [dot] com
పుస్తకం ధర 100 rs

-మాలా కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో