కవిని ఆలూరి అనగానే “ముగింపు మాటలా…”కథలు గుర్తొస్తాయి. రచయిత్రి తండ్రినుండి సాహితీ రచనను వారసత్వంగా పునికిపుచ్చుకొని రాస్తున్న రచయిత్రి.అంతేకాక ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ద్వారా మహిళా చైతన్య కార్యక్రమాల ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.2018 జనవరిలో వచ్చిన”అభాగ్య జీవనాల భాగ్య నగరం”ఈమె నూతన పుస్తకం అనే కంటే పరిశోధనాత్మక పుస్తకం అనటం సమంజసం.
సాధారణంగా భాగ్య నగరం అనగానే మెట్రోరైలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్,విలాసవంతమైన జీవితాలు అనుకుంటాం. వీటితో పాటు అభాగ్యులు కూడా ఉన్నారన్న సంగతి ఊహల్లోకి కూడా రాదు.రచయిత్రి దాదాపు 14 నెలలు(2016 సెప్టెంబర్ నుండి2017అక్టోబర్ )మురికి వాడల్లో సంచరించి ప్రత్యక్షoగా చూసిన జీవితాల్ని మనముందుకు తెచ్చారు. అభాగ్యుల జీవితాలపట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతారు.హైదరాబాద్ లోని పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులు దోపిడీకి గురయ్యే వైనాన్ని తెలతెల్లం చేశారు.
ఎందరో ఇతర జిల్లాలనుండి ఇతర ప్రాంతాలనుండి భాగ్యనగరానికి వలసవచ్చి జీవన పోరాటాన్ని సాగిస్తున్న విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.చెప్పదలుచుకున్న విషయాలను చారిత్రక ఆధారాలతో సహా నిరూపించటo విశేషం.ఈ పుస్తకంలోని రెండవ భాగం ‘జంగమ్మ గోస’ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఇక మూడవ భాగమైన ‘లక్ష్మయ్య ముచ్చట్లు’లో దశాబ్దాల చారిత్రక నేపధ్యాన్ని ఆవిష్కరించారు.
మురికి వాడల్లో నివసించే వాళ్ళలో అధిక శాతం ఎస్. సి, ఎస్, టి,ముస్లిం మైనారిటీ ప్రజలే ఎక్కువ.వీరికి కనీస వసతులు లేక, కుటుంబాలను పోషించుకోలేక అప్పుల కుంపటికి దహనమయ్యే జీవితాల్ని ఇందులో చూపించారు.నాగరికత మాటున దాగిన పచ్చి నిజాల్ని కుండబద్దలు కొట్టినట్టు చూపించారు. ప్రభుత్వo చేయవలసిన సర్వే బాధ్యతను కవిని ఆలూరి గారు చేసారనిపిస్తుంది.ప్రభుత్వానికి ఈ పుస్తకం ద్వారా తమ బాధ్యతను గుర్తు చేశారు. నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో ఈ పుస్తకం చదివితే అవగతమవుతుంది.
పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులు కాంట్రాక్టర్ ల ద్వారా దోపిడీకి గురైన వైనాన్ని ఇందులో చిత్రించారు.’పేద మధ్య తరగతి ,బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నగర అభివృద్ధి జరిగినప్పుడే మురికి వాడలు లేని స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యం’అవుతుందని ఆకాంక్షించారు.
-పెరుమాళ్ళ రవికుమార్
పుస్తకం పేరు:అభాగ్య జీవనాల భాగ్యనగరం
రచయిత్రి:కవిని ఆలూరి
పుటలు:90
వెల:80/-
ప్రతులకు:అన్ని ప్రముఖ పుస్తక షాపుల్లో
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~