నాడియా-టి.వి.యస్.రామానుజ రావు

నాడియా – ఈ పేరు ఇప్పటి వాళ్ళకు అసలు తెలియక పోవచ్చు కానీ, ఎనభై ఏళ్ల క్రితం, 1935 లొ విడుదలైన “హంటర్ వాలి” అనే సినిమాలో ఆమె చేసిన స్టంట్లు, పోషించిన ఆ పాత్రకు ముగ్ధులైన మన దేశ ప్రజలు ఆమెను హంటర్ వాలిగానే పిలుచుకున్నారు, గుర్తుంచు కున్నారు. ఆ రోజుల్లో ఇప్పట్లో లాగా స్టంట్లు చేసే స్టంట్ మాస్టర్లు, డూపులు లేరు. కెమేరా ట్రిక్కులు గానీ, ఇంకా మనం ఇప్పుడు చూస్తున్న గ్రాఫిక్స్ గానీ లేవు. మగవాళ్ళు కూడా చెయ్యలేని స్టంట్లు సైతం చెయ్యడానికి సిద్ధమైయిన అత్యంత సాహస వనిత ఆమె. భారతీయ సినిమా చరిత్రలో మొదటి స్టంటు ఉమన్ గా ఆమె పేరు నిలిచిపోయింది.
నాడియ 1908 వ సంవత్సరం జనవరి 8 వ తారికున ఆస్ట్రేలియాలో బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న స్కాటిష్ సైనికుడికి, గ్రీకు వనితకు జన్మించింది. ఆమె అసలు పేరు మేరి ఇవాన్స్.

ఆమెకు అయిదు సంవత్సరాల వయసున్నప్పుడు, తండ్రి సైన్యం విధులలో భాగంగా బొంబాయికి కుటుంబం అంతా వలస వచ్చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో(1915 లో) ఆమె తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం పెషావర్ వచ్చేసింది. పెషావర్ లో ఉండగానే, ఆమె గుర్రపుస్వారీ, వేట, ఫిషింగ్ మొదలైనవన్నీ నేర్చుకుంది. 1928 లో ఆమె తల్లితో, కొడుకు రాబర్ట్ జోన్స్ తో కలిసి, బొంబాయి వచ్చింది. కొన్నాళ్ళు జార్కో సర్కస్ లో పనిచేసింది. మరి కొన్నాళ్ళు ఆమె బొంబాయిలో ఆర్మీ మరియూ నేవీ స్టోర్సు లో పనిచేసింది. మరింత మంచి ఉద్యోగం కోసం ప్రయత్నంలో భాగంగా ఆమె టైప్, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలని కూడా అనుకుందట. అయితే, లావు తగ్గాలని, ఆస్త్రోవ అనే ఆవిడ దగ్గర బాలే డాన్సు నేర్చుకుంది. అస్త్రోవ ట్రూపు, భారతీయ సంస్థానాధీశులు తమ రక్షణ కోసం ఏర్పరుచుకున్న సైన్యం ఎదుట, చిన్నచిన్న ఊళ్ళలోనూ డాన్సులు చేస్తుండేవారు. అలా ఆ ట్రూపులో మేరి ఇవాన్సు చేరింది. ఒక ఆర్మేనియన్ జ్యోతిష్కుడి సలహాననుసరించి ఆమె తన పేరు నాడియా అని మార్చుకుంది. అక్కడ నేర్చుకున్న “కార్ట్ వీల్స్ అండ్ స్ప్లిట్స్” అనే జిమ్నాస్టిక్సు పద్ధతులు ఆమెకు తర్వాతి కాలంలో సినిమాలలో స్టంట్స్ చేసేందుకు ఉపయోగ పడ్డాయి.

ముంబై వచ్చాక ఆమె డాన్సు ట్రూపులో తిరుగుతున్నప్పుడు, జే.బి.హెచ్. వాడియా తన సినిమా “దేశ్ దీపక్”లో ఒక బానిస పాత్రకు ఆమెను తీసుకున్నాడు. ఆయన అప్పట్లో “మువిటోన్” అనే నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమాలు తీస్తుండే వాడు. అయితే, నాడియాకు హిరోయిన్ గా వెయ్యాలన్న కోరిక ఎక్కువగా ఉండటంతో హిరోయిన్ పాత్ర కోసం ప్రయత్నించింది. వాడియా ఆమె ఉత్సాహాన్ని గమనించి, “నూర్ –యి- యమన్” అనే సినిమాలో ప్రిన్సెస్ పరిజాద పాత్రలో నటింపచేశాడు. ఆ సినిమాతో ఆమె గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. భారతీయ స్త్రీల అణిగిమణిగి వుండే స్వభావం నచ్చని జే.బీ.వాడియా, ఆమెలో ఒక సాహస వంతురాలైన ఫెమినిస్టుని చూశాడు. ఆమెలో వున్న నటనా కౌశలానికి తోడు, జిమ్నాస్టిక్స్ అదనపు అర్హతగా గుర్తించి, ఆమె హిరోయినుగా “హంటర్ వాలీ” అనే సినిమా తీశాడు. ఈసినిమాలో ఆమెది ఒక ప్రత్యేకమైన పాత్ర. కళ్ళకు గంతలు కట్టుకుని, అన్యాయాన్ని ఎదిరించే స్త్రీగా, పేద ప్రజలకు అండగా వుండే నాయకురాలి పాత్ర ఆమెది. శతృవుల పాలిట సింహ స్వప్నంగా, చేతిలో కొరడాతో గుర్రపు స్వారి చేస్తూ, ఆమె చేసిన స్టంట్లు ఆ తర్వాతి కాలంలో “యాంగ్రీ యంగ్ మాన్” గా పేరుపొందిన నటుడు అమితాబ్ బచన్ పాత్రల రూప కల్పనకు ఒక ప్రేరణ అంటాడు ప్రఖ్యాత చిత్ర దర్శకుడు శ్యాం బెనెగల్.

అలా నాయకురాలిగా, దీనజనోద్దారకురాలిగా “హంటర్ వాలీ” సినిమాతో ప్రసిద్ధికెక్కిన నాడియాతో జే.బి.హెచ్ కంపెనీ, యాక్షన్, స్టంట్స్ ప్రధానంగా మిస్ ఫ్రాంటియర్ మెయిల్, షిర్ దిల్, డైమండ్ క్వీన్, స్టంట్ క్వీన్, తుఫాన్ క్వీన్, పహాడీ కన్య, జంగిల్ ప్రిన్స్ ,బాగ్దాద్ కా జాదు,హరికేన్ హంస, లాటరు లాల్న మొదలైన సినిమాలు నిర్మించారు. ఈ సమయంలో నాడియా, జే.బి. సోదరుడూ, ఫిలిం కంపెనీ మరొక పార్టనర్ అయిన హోమీ వాడియాతో ప్రేమలో పడింది. 1940లో మొదలైన వారి ప్రేమ ఇరవై ఏళ్ల పాటు సాగింది. వాడియా సోదరుల తల్లి ఆ పెళ్ళికి ఒప్పుకోక పోవటం వల్ల, ఆమె మరణించాక, 1961లో వారిరువురూ వివాహం చేసుకున్నారు.

ఆమె 33 ఏళ్ల సినీ ప్రయాణంలో ఏక్షన్ ప్రధానమైన 50 సినిమాలపైగా ఆమె నటించింది. ఆమె ప్రమాదకరమైన స్టంట్లు అన్నీఎటువంటి జాగ్రతలూ లేకుండా, చివరికి ఆరోగ్య భీమా కూడా లేకుండానే సొంతంగా చేసేది. ఎత్తైన గోడ మీద నుంచుని స్టంటు చేస్తూ ఆమె కింద పడిపోయిన్దొక సారి. మరొకసారి మహారాష్ట్రలోని భండార్దారా జలపాతంలో దాదాపు కొట్టుకుపోయే పరిస్థితి నుంచి ఆమె బయటపడింది. “మిస్ ఫ్రాంటియెర్ మెయిల్” సినిమాలో ఆమె నడుస్తున్న ట్రైనుపై దుర్మార్గులతో డూపు లేకుండా స్టంటు చెయ్యడం ఒక మరువరాని దృశ్యంగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆమె గుర్రానికి “పంజాబ్ కా బేటా” అనీ, ఆమె కారుకి “రోల్సు రాయస్ కి బేటి”అని ముద్దు పేర్లుండేవి. ఆమె సినిమాలన్నింటిలో పితృస్వామ్య నేపధ్యం తొంగిచూస్తున్నప్పటికి, స్త్రీ పురుషుల సమానత్వాన్ని హీరో పాత్ర ద్వారా నిరూపించడం జరిగింది. చిత్రంగా ఆమె సినిమాలలో హీరో పాత్రలన్నీ ఆమెకు అండగా నిలబడేవే తప్ప, సొంతంగా నాయకత్వం వహించిన దాఖలాలు లేవు. ఆమె సినిమాలలో విలన్ పాత్రలకు ప్రాముఖ్యత వున్నా,అవి నాడియా పాత్రలో దేశభక్తిని, స్త్రీల గొప్పదనాన్ని వెల్లడి చేసే విధంగా ఉండేవి. ఆమె చేసిన సినిమాలలో ఎక్కువగా కోవాస్ అనే మల్లయుద్ధ వీరుడు మరో ముఖ్య పాత్ర పోషించాడు. నాడియా 1968లో చివరగా కిలాడి అనే సినిమా చేసింది. ఆ సినిమా సామ్యవాద సిద్ధాంతాలకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు మధ్య సంఘర్షణను చిత్రీకరిస్తుంది. అప్పటికే 50 ఏళ్ల వయసు దాటిన నాడియా, ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకుని, ప్రశాంతంగా రిటైర్డు జీవితం గడిపింది. 1996వ సంవత్సరంలో ఆమె తన 87వ ఏట మరణించింది.

జే.బి. మనవడు రియాద్ వింసి వాడియా 1993 లో నాడియాపై డాక్యుమెంటరీ సినిమా తీసి, అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్సులో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించాడు. అప్పటి దాకా ఆమెను మరిచిపోయిన ప్రపంచానికి ఆమె గొప్పతనాన్ని తెలియజెప్పాడు. ఓజేడ్ ఏషియా ఫిలిం ఫెస్టివల్లో ఆస్ట్రేలియా వారు, ఆమె తమ దేశస్థురాలని గుర్తించి, ఆమె పై డాక్యుమెంటరీ తమ దేశంలో అనేక సార్లు ప్రదర్శించారు. ఆస్ట్రేలియా దేశ హైకమిషను నాడియా సినిమాలలో లభ్యం కాని “డైమండ్ క్వీన్” మన దేశానికి కానుకగా పంపించింది. 1993లో ఆమె పై తీసిన డాక్యుమెంటరీ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో చూసి, దొరతి వన్నెర్ అనే ఫ్రీ లాన్స్ రచయిత్రి, సినిమా నిర్మాత, జర్మన్ భాషలో నాడియా జీవిత చరిత్ర రాసింది. ఆమె నాడియాను “రాడికల్ ఫెమినిస్ట్ యాక్ట్రెస్” అని వర్ణించింది. దొరతి రాసిన ఆ పుస్తకం 2005వ సంవత్సరంలో ఇంగ్లీష్ లోకి అనువదింప బడింది. విషాల్ భరద్వాజ్ సినిమా “జాన్బాజ్ మిస్ జూలియ” లో కంగనా రనౌత్ పాత్ర నాడియాని గుర్తు చేస్తుంది.

స్క్రీన్ మాగజైన్ మునుపటి ఎడిటర్ బి.కే.కరంజియా ఒక సారి ఆమె చేస్తున్న సినిమా (బహుశా డైమండ్ క్వీన్ కావచ్చు) సెట్స్ పై చూడటం సంభవించిందట. “ఆమె స్టంట్లు చాల సునాయాసంగా, ఏమాత్రం భయం లేకుండా చెయ్యడం నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. ఆమె తనను గురించిగానీ, తను చేసే స్టంట్ల గురించి గానీ, సీరియస్ గా తీసుకోలేదు. అంతేకాదు, ఆమె ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ, జోక్సు వేస్తూ వుండడం చూశాను” అని చెప్పారట. ఆనాటి భారతదేశంలో స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితమైన పరిస్థితులలో, విభిన్నమైన భాషా, సంస్కృతీ, స్త్రీలపై వున్న ఆధిపత్య ధోరణులూ ఉన్నప్పటికీ, స్త్రీలు కూడా సబలలే అని నిరూపించే పాత్రలు మొదటిసారిగా చేసి మెప్పించింది ఈ నటిమణి.

ఆ తర్వాత అనేక సందర్భాలలో ఈ గొప్ప నటిని తలవను కూడా తలవకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆమె మనవడు రాయ్ వాపోయాడు. అయితేనేం, ఆమె మన దేశంలో కన్నా ఇతర దేశాల్లోనే ఎక్కువ గుర్తింపు పొందింది. బ్రిటన్ లో యుకె’స్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లాటి కొన్ని విద్యా సంస్థలలో ఆమె జీవితంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఆమెకు బంధువు, కొరియోగ్రాఫర్ కూడా అయిన శయామాక్ దేవర్ గర్వంగా ఇలా చెప్పారు “ప్రపంచ సినిమా రంగంలో గొప్ప నటిగా పేరొందిన ఎంజేలిన జోలి, నాడియా గురించి విని, ఆమె చరిత్ర సెల్యులాయిడ్ తెరపైన తీసే ఉద్దేశం ఉంటె, తను ఆమె పాత్ర వెయ్యటానికి ఆనందిస్తానని షారుఖ్ ఖానుతో అన్నది.”

– టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో