”ఓహో ఊర్వశి ! అపురూప సౌందర్య రాశి
ఏదీ నీ నయన మనోహర నవరస లాస్యం
ఏదీ నీ త్రిభువన మోహన రూప విలాసం …”
మొదటి సారి చూడగానే ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది… ఎక్కడో గుర్తుకు రాదు.
మొదటి పరిచయం ఒక రచయిత్రిగానే. తరచి తరచి చూస్తే … కాదు …ఆమె గురించి
చదివితే అప్పుడు అర్ధమైంది.
ఆమె రూప లావణ్యాల వెనక వున్న ఆమె హొయలు, నాట్య కౌశలం, సాధించిన
విజయాలు…
డాక్యుమెంటరీ , టెలీ ఫిలిం లకు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా పని చేస్తూ …
నృత్య కళాకారిణిగా ఒకవైపు ప్రదర్శనలిస్తూ ,అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమికి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ
నిత్యం పనిలో నిమగ్నమవుతూనే …
శాస్త్రీయ నృత్య సంబంధిత వ్యాసాలూ, నృత్య రూపకాలు,వచన కవితలు, కథలు రాస్తూ ‘రచన’ ని
కొనసాగించటం ఆసక్తికరమైన విషయమే.
ఇంకా చెప్పాలంటే మూడు దశాబ్దాల క్రితం యమగోల సినిమాలో
”ఆడవే అందాల సురభామిని
పాడవే కళలన్నీ ఒకటేనని –
ఓహో ఊర్వశి అపురూప సౌందర్య రాశి
ఏదీ నీ నయన మనోహర నవరస లాస్యం
ఏదీ నీ త్రిభువన మోహన రూప విలాసం …”
(ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి)
అంటూ NTR పాడిన పాటకి నర్తించిన ‘ ఊర్వశి ‘ … ఈ ఉమాభారతి… ఒకరేననీ ఈ పాటికే మీకు అర్ధమయ్యే
వుంటుంది.
తెలుగు నాట పుట్టి తెలుగు వెలుగుల్ని దేశ విదేశాల్లో వెదజల్లుతున్న ‘నాట్యభారతి’ శ్రీమతి ఉమాభారతి. అనేక సన్మానాలు, సత్కారాలు పొందిన తర్వాత ప్రఖ్యాత వాగ్గేయకారులు పద్మశ్రీ. మంగళంపల్లి. బాలమురళీకృష్ణ ద్వారా ‘నాట్యభారతి’ బిరుదుతో పాటు రత్నఖచిత సువర్ణకంకణం స్వీకరించింది.
ప్రపంచ తెలుగు మహా సభల సహాయార్ధం ఆహ్వానింప బడి దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చినప్పుడు, అప్పటి దేశాధ్యక్షులు శ్రీ. వి. వి. గిరి, రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ. టి. అంజయ్య గార్ల మన్ననలు పొందింది.
ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి, అక్కడి దేవాలయాల నిర్మాణాలకి నిధుల సేకరణార్ధం తానే కర్త..కర్మ..క్రియ అయిందంటే అతిశయోక్తి కాదు. నాట్యమే ఒక సాధనగా, సాంప్రదాయ కూచిపూడి నాట్య శైలిని తన జీవన జ్యోతిగా మలుచుకొన్న నర్తకీమణి, ‘నాట్యభారతి’ ఉమాభారతి. జాతీయంగానే కాక అంతర్జాతీయంగా కుడా ఖ్యాతిని ఆర్జించిన నాట్యశిరోమణి.ఆమె ఎక్కని వేదిక లేదు అధిరోహించని రంగస్థల వాటిక లేదు.సినీ రంగ ప్రవేశం కూడా చేసి నర్తకిగా, కథానాయకిగా నటించి, సాంప్రదాయ నృత్య రంగంలో గత 40 (నలభై) సంవత్సరాలుగా నిరంతర కృషి చేస్తూనే ఉంది ఆమె. కూచిపూడి నృత్య కళ కి (ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి) అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు రావడానికి ఎంతో దోహదం చేసిన మేటి కళాకారిణి ‘నాట్యభారతి’ ఉమాభారతి.
UMA BHARATHI EXCLUSIVE STILLS FOR VIHANGA READERS
[showtime]
single clik on slide show
మరి కొన్ని చిత్రాలు చూడండి
‘విహంగ’ పాఠకుల కోసం ప్రత్యేకం శ్రీమతి కోసూరి ఉమాభారతితో ముఖాముఖి
– పుట్ల హేమలత
*ఉమా భారతి గారూ! మీరు ఎప్పుడు ,ఎక్కడ పుట్టారు?
పుట్టింది గుంటూరు లో. నా పేరెంట్స్ కి నేను మొదటి సంతానం. డిసెంబర్ 12 1958. నాన్నగారు ఆర్మీలో
లెఫ్ట్నెంట్.కెప్టెన్ గా (Lt. Capt) సెలెక్ట్ అయిన తొలి రోజులు. అమ్మ బి.ఎ. చదివారు. నాన్న శ్రీశైల వాసి.
అమ్మ గుంటూరు నుండి.
ఆడపిల్ల కావాలని పెదకాకాని అమ్మవారికి మొక్కారట నాన్న. అందుకే ఉమామహేశ్వరి అని పేరు పెట్టారు నాకు.
*మీ తల్లి దండ్రులు ఏం చేసేవారు?
తండ్రి – మేజర్. ఎ. సత్యనారాయణ, బి.ఎ., ఎల్.ఎల్.బి, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ గ్రాడుయేట్. ఆర్మీ ఆఫీసర్
గా,కమర్షియల్ టాక్స్ డెప్యుటి కమీషనర్ గానూ చేసి రిటైర్ అయ్యారు.
తల్లి – స్వర్గీయ శ్రీమతి. శారద, గుంటూరు తాసీల్దారి గారి అమ్మాయి, ఎ.సి. కాలేజీ లో బి.ఎ. పూర్తి చేసారు.
నాకు ఒక తమ్ముడు. A.V.N. ప్రసాద్, ‘భోజరాజు కథలు’, ‘ఇదెక్క డైనా ఉందా?’ సీరియెల్స్, ‘అసలే పెళ్ళైన వాడిని’
సినిమా ప్రొడ్యూసర్.
ఇద్దరు చెల్లెళ్ళు, జయంతి, అనూరాధ. ఒకరు అమెరికా లో, ఒకరు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.
*చిన్నప్పుడు చదువుతో బాటు మీకు యే విషయాలపై బాగా ఆసక్తి
వుండేది?
బాగా చదివేదాన్ని. అయినా నాకు నృత్యం అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. నాలుగేళ్లప్పటి
నుంచీ ఏ పాటకైనా అభినయం చేసే దాన్నట. నాకు ఊహ తెలిసాక పాడాలని ఇంట్రెస్ట్ ఉండేది, పాటలు రాసి ట్యూన్స్
కట్టేదాన్ని కూ డా. కథలు రాసేదాన్ని.
* చదువు లో ఎలా రాణించారు?ఎంతవరకు చదువుకున్నారు?
చదువులో బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నా చదువు ప్రైమరీ నుండి కాలేజీ వరకు కాన్వెంట్ స్కూల్స్ లోనే. అప్పెర్ కే.జి, సెకండ్ గ్రేడ్, డబుల్ ప్రొమోషన్ వల్ల స్కిప్ చేసాను. ముందు గుంటూరు లోని St. Joseph Convent, తరువాత మద్రాస్ లోని
హోలీ ఏంజెల్స్ (Holy Angels Convent), మిడిల్ స్కూల్ వరంగల్ ప్లాటినం జూబిలీ కాన్వెంట్ లో (Platinum
Jubilee) చదివాను. స్కూల్ స్పోర్ట్స్ లో కూడా బాగా ఆడేదాన్ని. నా కోసం వేరు వేరు టీమ్స్ గొడవ పడేవాళ్లు.
తరువాత హైదరాబాద్ లోని St. ఫ్రాన్సిస్ (St. Francis college) లో జూనియర్ కాలేజీ, బి.ఏ పూర్తి చేసి, ఆ తరువాత
ఉస్మానియా నుండి ఎం.ఎ పూర్తి చేసాను. పొలిటికల్ సైన్సు, ఎకనామిక్స్ తో. మా నాన్న అమ్మ ఇద్దరికీ నా పై ఎక్కువ నమ్మకం ఉండేది,
ఏదైనా బాగా చేయగలను అని అంటూ ఉండేవారు, బయట వాళ్ళతోనూ అనేవారు. వారిని నిరుత్సాహ పరచకూడదనీ, వారి నమ్మకం వమ్ము కాకుడదనీ నేను శాయశక్తులా ప్రయత్నించేదాన్ని.
ఎప్పుడూ నా పేరెంట్స్ ని సంతోష పెట్టాలని, నా మీద వారికున్న ఆశలు నెరవేర్చాలని మాత్రం, అప్పుడూ ఎంతగానో ఉండేది. ఇప్పటికీ పోలేదు.
*జయంతి, అనూరాధ ఒకరు అమెరికాలో ఒకరు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు కదా? వారు
కూడా మీలాగానే కళారంగంలో కృషి చేసారా?
హైదరాబాద్ వచ్చాక, కళాప్రపూర్ణ శ్రీ వేదాంతం జగన్నాధశర్మ గారు ప్రత్యేకంగా నాకు ఇంటి వద్దనే కూచిపూడి శిక్షణ
ఇచ్చేవారు. చెల్లెళ్ళని కుడా నేర్చుకోమని అమ్మ వాళ్ళు చాల ప్రోత్సహించారు. అంతగా శ్రద్ధ లేకపోయినా జయంతి
కళాభిమాని. కాక తను చిత్రలేఖనం చేసేది, బొమ్మలు గీయడం చాల ఇష్టం. అనూరాధ గృహిణిగా సెటిల్ అయింది.(మీ కోసం మరి కొన్ని చిత్రాలు)
* ఉమ గారూ!బాల్యంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు? బంధువులా?
స్నేహితులా? లేదంటే ఉపాధ్యాయులా ?
కుటుంబం అంటే ముఖ్యంగా మా అమ్మ నాన్నలే నాకు రోల్ మాడల్స్.
(role models), నన్ను ప్రోత్సహించి ఉత్తేజ పరచేవారు….తరువాత మా అమ్మమ్మ. ఆవిడ ఎన్నో పురాణాల కథలు,
పద్యాలు వినిపించేవారు, అంతే కాదు, తరంగాలు తాను పాడి పాడించేది అమ్మమ్మ. డాన్సు నేర్చుకోమని అమ్మమ్మ
కూడా అనేది. అమ్మావాళ్ళకి కూడా చెప్పేది. ఆవిడ కూర్చుని నా ప్రాక్టిస్ లు కూడా చూసేది.
* అయితే మీ అమ్మ , నాన్నలకు కూడా కళల్లో ప్రవేశం ఉందా? లేక పోతే కళల మీద
ఆసక్తితో ప్రోత్సహించేవారా?
అమ్మ చిన్నపుడు వాళ్ళక్క కూతురు తో కలిసి కృష్ణుడి వేషం వేసి నాట్యం చేసేది. అమ్మ బాగా పొడగరి, అందంగా
ఉండేది, ఉంగరాల జుట్టు తో కృష్ణుడుగా చాల బాగుండేదట. అలా మా అమ్మకి ఉన్న ఆసక్తి కుడా నాకు
ఎంతో ఉపయోగ పడింది. నా దుస్తులు డిజైన్ చేయడం, మేకప్, కేశాలంకరణ అన్నిటా అమ్మ ట్రైనింగ్ తీసుకొని మరీ
చేసేది.
మా నాన్న శోభనాచల స్టూడియో లో కొంతకాలం అసోసియేట్ డైరెక్టర్ గా కొన్ని చిత్రాలకి పని చేసారు. ‘సావాసం’
చిత్రంలో విలన్ గా నటించారు.. అలా ఆయనకి కళల పట్ల ఆశక్తి. అయనకి శాస్త్రీయ నృత్యం అంటే చదువుకొనే
రోజులనుండి చాల ఇష్టమట. కాలేజి లో సాంస్కృతిక సమితి కార్యదర్శిగా పనిచేసి, ఎందరో పేరున్న కళాకారుల నృత్య
ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారట. ఆయన ఆ కళాకారుల గురించీ, వారి ప్రత్యేకత
గురించీ చెప్పేవారు. ఆ విషయాలు వినడం వల్ల కూడా నాకు కొంత కళల పట్ల ఉత్సుకత కలిగింది .
* అంటే ఏ రకమైన కళలు ?సంగీతం ,చిత్రలేఖనం లాంటివి కూడానా?
పాటలు పాడేదాన్ని, బొమ్మలు బాగానే గీసేదాన్ని. చిన్న కథలు రాసేదాన్ని,
కానీ అన్నిటికంటే ‘నృత్యకళలో నువ్వు బాగా రాణిస్తావు’ అని నాన్న చెప్పడంతో, చదువు
వెనకబడ కూ డ దన్న ఆలోచనతో నేను ఎక్కువ వాటిపై దృష్టి పెట్టలేదు.
* మీకు నృత్యంచేయాలని ఏ వయసులో ఆసక్తి కలిగింది?
చిన్నపటి నుండి అంటే, నాలుగేళ్లప్పుడే స్వతహాగా నాకే చాలా ఇంటరెస్ట్ ఉండేదిట. కళల పట్ల మా నాన్న గారికి
అమ్మకి కూడా అభిమానం. నా ఆశక్తి వల్లే ఐదేళ్ళప్పుడు క్లాసు కి పంపడానికి ఒప్పుకున్నారు. ఏ సంగీతానికైనా డాన్సు
చేసేదాన్నట.1963 లో అనుకుంటా, నాన్న మద్రాస్ కి ఆర్మీ మేజర్ గా బదిలీ అయ్యాక, మేమున్న ఆవరణ లోనే చిన్న సత్యం గారు టి. నగర్
లో డాన్సు స్కూల్ మొదలు పెట్టారు. అప్పుడు నా వయసు ఐదు
సంవత్సరాలు. ఒక వారం రోజులు క్లాసు కి వెళ్లి చూసాను. నేను
నేర్చుకుంటానని గొడవ చేసి మరీ చేరాను క్లాసులో. నాకు
గుర్తే. సన్నగా ఉండేదాన్నేమో వారం వెళితే, రెండు
రోజులు జ్వరం తో వెళ్ళలేక పోయేదాన్ని. అమ్మ ఇంట్లో ఉంచేసేది.
మద్రాస్ హోలీ ఏంజెల్స్ లో చదివేరోజుల్లో,ఆరేళ్ళ ప్పటి నుండి మాత్రం ప్రతీ
రోజు ఓ అరగంట మాఇంట్లో వాళ్ళందరిని కూర్చో బెట్టి, -స్కూల్లో
విషయాలు, డాన్సులు, పాటలు ఓ కార్యక్రమంలా చేయడం నాకు గుర్తే.
అలా ఆరేడు ఏళ్ళు వచ్చాక నేను బాగా చేస్తున్నానని మాస్టారు గుర్తించి
బాగా ప్రోత్సహించారు. నాన్నకి అమ్మకి అప్పుడు నమ్మకం కుదిరి నాకు
డాన్సు శిక్షణ కొనసాగించాలని అనుకొన్నారు. మద్రాస్ లో చిన్న సత్యం
గారి వద్ద నాలుగేళ్ళు నేర్చుకొన్నాను. అడుగులు, జతులు వరకు
వచ్చాయి. ఇంతలో నాన్నకి మళ్లీ బదిలీ.
* వెంపటి చిన్న సత్యం గారి దగ్గర మీకు మంచి పునాది ఏర్పడి ఉంటుంది కదా? అప్పుడు మీ
అనుభవం ఎలా ఉండేది?
ఐదేళ్ళప్పుడు వెంపటి చిన్న సత్యం గారి డాన్సు స్కూల్లో చేరినప్పుడు, అక్కడ యడవల్లి రమ, నటి
చంద్రకళ, కొత్తపల్లి పద్మ వాళ్ళు సీనియర్స్. డాన్సు ప్రాక్టిస్ చేసేవాళ్ళు. వాళ్ళలా అవ్వాలని అలా డాన్సు
చెయ్యాలని చాలా ఆశక్తిగా ఉండేది. నా క్లాస్మేట్ రాధ (సిని నటి రేఖ చెల్లెలు), రేఖ, మాల (సింగపూర్) కూ
డా నా గ్రూప్ లోనే నేర్చుకోనేవాళ్ళు.
నేను రెండు రోజులు క్లాసు కి రాకపోతే, మాస్టర్ గారు, ఇంటికొచ్చి కనుక్కొనే వారు, ఒక్కోసారి క్లాసు అయ్యాక
నన్నుఇంటివరకు దిగబెట్టేవారు, మేము బదిలీ అయి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు, నన్ను నర్తకిగా తీర్చి దిద్దుతానని,
కాన్వెంట్లో చదువుకుంటూ డాన్సు నేర్చుకోవచ్చుననీ, మద్రాస్ లోనే తన వద్ద వదిలేసి వెళ్ళమని చాల
అడిగారు. అయన అలా అనడం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది, అంతటి గొప్ప గురువుగారు నా అంత చిన్న పిల్లపై
ఉంచిన నమ్మకం నాలో చాలా ఉత్సాహాని నింపింది. మా అమ్మ వాళ్ళలోనూ నాపై నమ్మకం పెంచిందేమో.
* మీ నాన్నగారి బదిలీల వల్ల మీ నృత్య శిక్షణ సజావుగా సాగిందా ? లేదా ఏవైనా ఆటంకాలు
ఏర్పడ్డాయా?
బదిలీల వల్ల, కొద్ది రోజులు హైదరాబాద్, గుంటూరు, తరువాత వరంగల్, నా శిక్షణ వెనక బడిందనే అనుకోవచ్చు.
హైదరాబాద్ లో ఉన్నన్నాళ్ళు వేదాంతం జగన్నాధ శర్మ గారు నుండి కొన్ని జానపద నృత్యాలు నేర్చుకొన్నాను.
వరంగల్ వెళ్ళాక ఎన్నో స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాను. గురువు మాత్రం లేరు. పేరున్న గురువులు, సాంప్రదాయ
నృత్యాలు నేర్పే గురువు దొరక్క అమ్మ నన్ను ఎక్కడికీ పంపలేదు.
అప్పుడు ఇంక అమ్మే నా గురువు. అమ్మ ఎన్నో డాన్సులు నేర్పింది. సినిమా ల్లోని సాంప్రదాయ నృత్యాలు,
జానపదాలు, అమ్మ నేను కలిసి కొరియోగ్రాఫ్ చేసాము. స్కూల్లో వేడుకలన్నిటికి నా పార్టిసిపేషన్ ముఖ్యమైపోయింది.
మా ప్రిన్సిపాల్, టీచర్ నాకు స్పెషల్ గా ఓ గది ఏర్పాటు చేసి మిగతా అందరి పిల్లలకి శిక్షణ నిప్పించేవారు. అలా నాలో
చాల కాన్ఫిడెన్స్ వచ్చింది.
* అయితే మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళలో మీ ప్రిన్సిపాల్ గారు,టీచర్ కూడా ఉన్నారన్న
మాట.
అవును. నన్ను మా ప్రిన్సిపాల్ గారు స్కూల్ (Platinum Jubilee)
తరఫున సీనియర్ డివిజన్ లో స్టేట్ లెవెల్ ఇంటర్ కాలేజీ డాన్సు పోటీలకి పంపారు. అందరిలోకి నేనే
చిన్నదాన్ని. అయినా రెండు కార్యక్రమాల్లో గెలిచి మా స్కూల్ కి, మా
అమ్మ నాన్నలకి ఎంతో సంతోషాన్ని కలిగించగలిగాను.(ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి)
నన్ను ఇలా ఓ సారి స్టేజి మీద చూసి డైరెక్టర్ మాధవరవుగారు చూసి, హైదరాబాద్ రవీంద్రభారతిలో ఓ ప్రోగ్రాం లో కొంత
సమయం కేటాయించి డాన్సు చేయమన్నారు. నేను ఓ ఇరవై నిమిషాలు చేసాను. అందరి
మెప్పు, మన్ననలూ పొందాను. పెద్దవాళ్ళంతా నాకు శాస్త్రీయ నృత్యం నేర్పితే మంచి నర్తకి నవుతానని సలహా
ఇచ్చారు. అప్పట్లోనే ఎన్నో కార్యక్రమాల్లో నా డాన్సు తప్పక ఉండేది. అప్పటికి నా వయసు పది.
* మీరు చాలా చిన్న వయసులోనే సినిమాలో నటించారు కదా? తొలి సారిగా సినిమా
అవకాశం ఎలా వచ్చింది?
‘సుడిగుండాలు’ సినిమా లోకి పిల్లల డాన్సు డ్రామా లో ‘భారత మాతగా’ వేయాలని అడిగారు, అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వారు. వెళ్ళాము. చేసాను.1967 సం.లో విడుదలైన చక్రవర్తి వారి ఆ సినిమా నంది అవార్డు చిత్రమైంది. ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్ గార్లు డైరెక్ట్ చేశారు.
అక్కినేని నాగేశ్వర రావు గారు జడ్జి పాత్ర వేశారు.సాంఘిక సమస్యలపై తీసిన గొప్ప చిత్రం ఇది.
* అవును. ఆ రోజుల్లో ఆ సినిమాలో చర్చించిన సమస్యలు ఈ
రోజుకీ అలాగే వున్నాయి. ఇంకా పెరిగాయి కూడా. కాక పోతే అలాంటి సబ్జెక్టుని తీసుకుని
సినిమా తీసే సాహసం ఈ రోజుల్లో ఏ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ చెయ్యరు.
మీరు ఉమా ‘భారతి’ కావడం , ‘భారత’ మాతగా నటించడం యాదృచ్చికంగా జరిగిందేమో
అనుకున్నాను.
*లేదండి.నా అసలు పేరు ఉమా మహేశ్వరి ‘సుడిగుండాల్లో’ ఆక్ట్ చేయడం, అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్
గారు ఫస్ట్ ఫిలిం ‘భారతమాత’ గా చేస్తున్నాను కాబట్టి పేరు ‘ఉమాభారతి’ గా మార్చాలని అనడం, నాన్న
ఒప్పుకోడం. ‘ఉమాభారతి’ అప్పటి నుండి నా స్టేజి నేమ్ అవ్వడం.
* ఓ అలాగా? అయితే ఆ సినిమా తర్వాత మీరు ఇంకా బిజీ అయి వుంటారే?
అవునండి . పెర్ఫార్మెన్స్ (performance) అంటే నాకు చాలా ఉత్సాహం. స్టేజ్ ఫియర్ ఉండేది కాదు. మా తమ్ముడు ,
చెల్లెళ్ళ స్కూల్ కి అమ్మని కూడా తీసుకొని వెళ్లి, వాళ్ళ పేరెంట్స్ డే కి సాయం చేస్తానని రిక్వెస్ట్ (request) చేసేదాన్ని.
జానపద, ట్విస్ట్ డాన్సులు కొత్త తరహాగా కొరియోగ్రాఫ్ చేసి ప్రాక్టిస్ చేయించి, బదులుగా నాకూ డాన్సు చేయను
ఆవకాశం ఉండేది. అంత ఇష్టంగా ఉండేది నాకు పెర్ఫార్మెన్స్ (performance) అంటే. అంతే కాదు, ఎంతో మెప్పు
మన్ననలూ పొందేదాన్ని , నా టాలెంట్ కే కాక, కొరియోగ్రఫీ స్కిల్ (choreography skill) కి.
(ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి)
* మీ ప్రతిభకి బాగా మెప్పులూ , బహుమతులు కూడా పొందేవారన్నమాట!
అన్నట్టు ఇంకో విషయం .1968 సం.లో స్టేట్ లెవెల్ (Inter collegiate) డాన్సు పోటీలకి అమ్మ వరంగల్ నుండి వెళ్లి
హైదరాబాద్ లో వారం మకాం వేసి డ్రెస్ కుట్టించి మేకప్ వేయడం నేర్చుకొని
నన్ను గొప్పగా అందంగా చేయను చాల కష్టపడింది. . ఆ డాన్సు పోటీల్లో నెగ్గి కాకతీయ రచయితుల
మహాసభలో, వూటుకూరి లక్ష్మి కాంతమ్మ గారి నుండి అవార్డు అందుకోవడం చాలా గర్వంగా అనిపించింది.
* అంత పెద్ద రచయిత్రి నుండి అవార్డు అందుకోవటం మీకు మర్చిపోలేని అనుభవంకదా?
ఈసందర్భంగావూటుకూరి లక్ష్మి కాంతమ్మగారిని స్మరించుకోవటం నాకూ,విహంగ పాఠకులకి కూడా సంతోషం కలిగించే విషయం.
*ఉమా గారూ! నేననుకోవటం మీ కంటే మీ కోసం మీ అమ్మా నాన్నలే బాగా కష్టపడి వుంటారేమో అని.
నిజమే. అప్పట్లో అంత చిన్నతనం లోనే నాకొస్తున్న గుర్తింపుకి మా అమ్మా నాన్నలు చాల కృషి చేయడం. నా
తరువాత ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ,చదువులు కూడా పట్టించుకుంటూ,
నాకంత చేసారంటే సామాన్య విషయం కాదు.
* అప్పటికి మీరు కూడా చిన్న వయసులోనే వున్నారు కదా? ఎలా చేయగలిగారు?
ఊహ తెలిసినప్పటి నుండీ డాన్సు, చదువు కూడా, చాలా వేగంగా అవు తూ వచ్చాయి.
‘సుడిగుండాలు’, ఎన్నో పర్ఫార్మెన్స్ లు,సీనియర్స్ లెవెల్ ల్లో డాన్సు పోటీలోగెలవడం,
అన్నీనా పదకొండవ సంవత్సరానికి ముందే జరగడం విశేషం. అస్సలు టైం ఉండేది కాదు. ఓ రకంగా మంచిదే,
ఓ రకంగా కాదేమో అనిపిస్తుంది.
(ఇంకా ఉంది)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to ‘కళల హారతి’ ఉమా భారతి తో ముఖాముఖి-1