తెల్లగులాబి(పుస్తక సమీక్ష ) – మాలా కూమార్

వంట రుచికరముగా చేస్తేనే చాలదు, అది అందంగా అలంకరించి వడ్డిస్తే , చూడగానే తినాలనిపిస్తుంది.ఆ సూత్రం అత్తలూరి విజయలక్ష్మిగారికి బాగా తెలుసనుకుంటాను,”తెల్లగులాబి” నవలను చాలా ముచ్చటగా ముద్దగా అలంకరించారు . లేతగులాబీ రంగులో, తెల్లని గులాబీల మధ్య ముద్దుగా ఉన్న ఓ చిన్నిపాపాయి ని చూడగానే చాలా ఆహ్లాదం గా అనిపించింది.వెంటనే కవర్పేజ్ డిజైన్ ఎవరు చేసారండి అని విజయలక్ష్మిగారిని అడుగుతే “నేనే” అని, ” చదివారా ఎలాఉంది?”అని అడిగారు.”లేదండి, ఇప్పుడే చదువుతాను” అని చెప్పి చదివాను.ఇది “కౌముది”అంతర్జాల పత్రిక లో సీరియల్ గా వచ్చింది.ఇక కథలోకి వస్తే , శిరీష,భాను ఇద్దరు అనుకోని పరిస్తిథులల్లో భర్తను వదిలేసి, పిల్లలతో వంటరిగా పక్కపక్క ఫ్లాట్స్ లల్లో ఉంటూ ఉంటారు. శిరీష కొడుకు ఆదిత్య, భాను కూతురు ప్రత్య ఇద్దరు స్నేహితులవుతారు.వారి తో పాటు శిరీష, భాను కూడా స్నేహితులవుతారు.

అప్పుడప్పుడే కౌమార్య దశలోకి అడుగుపెడుతున్న ఆదిత్య,ప్రత్య వయసు చాపల్యం తో దగ్గరవుతారు.ఫలితం ప్రత్య గర్భవతి అవుతుంది.దానితో భాను ఆగ్రహం చెంది శిరీష, ఆదిత్యలతో గొడవపడి, ప్రత్యకు అబార్షన్ చేయించుదామనిప్రయత్నిస్తుంది.ఆ సంగతి తెలుసుకున్న ఆదిత్య డాక్టర్ ను రహస్యంగా కలిసి బతిమిలాడి అబార్షన్ ను ఆపుతాడు.ప్రత్యకు పాప పుట్టగానే రహస్యంగా ఎత్తుకుపోయి , అంతకు ముందు తెలీని అమ్మమ్మను ఫొటో ద్వారా తెలుసుకొని, వెతుక్కుంటూవెళ్ళి ,పాపను పెంచమని ఇస్తాడు.ఆ తరువాత తన చదువు పూర్తిచేసుకొని ఉద్యోగము లో చేరి,అమ్మమ్మను,పాపను, తల్లిని తన దగ్గరకు తీసుకొచ్చుకుంటాడు.ప్రత్య తల్లి కోరిక ప్రకారము చదువుపూర్తి చేసుకొని,అమెరికా వెళ్ళిపోతుంది.అక్కడ ఆదిత్య స్నేహితుడు ద్వారా ఆదిత్య పాపను పెంచుకుంటున్నట్లుగా తెలుసుకుంటుంది. అక్కడితో నవల ఐపోతుంది. నవల పూర్తిచేయగానే,ఇప్పటివరకు నేను చదివిన నవలలకన్నా భిన్నంగా ఉన్న ఈ కథ నాకు కొరుకుడు పడలేదు.రచయిత్రి వి ఇదివరకు ఎప్పుడో కొన్న “ప్రతిమాదేవి”, పోయిన సంవత్సరము పుస్తకప్రదర్శనలో కొన్న “అర్చన” నవల బయటకు తీసి చదివాను.ప్రతిమాదేవి ఎప్పుడో నాలుగైదేళ్ళ క్రితం చదివాను కాని గుర్తులేదు.అర్చన ఇప్పటి వరకు చదివేందుకు వీలుకాక చదవలేదు.ఇప్పుడు మూడు ఒకేసారి చదివాక నాలో చాలా ప్రశ్నలు ఉదయించాయి.ముందు కొంచం సంశయించినా ఉత్సుకతను ఆపుకోలేక రచయిత్రిని అడిగేసాను.

. తెల్ల గులాబీ చదివాక కొన్ని అనుమానాలు వచ్చాయి .అవి

1. మీరూ ఇందులో ఏ సమస్య గురించి చెప్పాలనుకున్నారు?

1. ప్రేమించి పెళ్లి చేసుకోవటము వలన వచ్చే ఇబ్బందులు,

2. చిన్న కుటుంబము వలన కలిగే నష్టాలు,

3. ఒంటరిగా పెరిగే పిల్లల మనస్తత్వము గురించి ,

4. కౌమార్య దశలో పిల్లలో కలిగే మార్పులు ,

5. స్త్రీ స్వాతంత్ర్యము గురించి , దేనిమీద ఎక్కువగా చర్చిన్చాలనుకున్నారు?

2. భర్త అధికారాన్ని సహించలేక విడిగా వచ్చేసిన శిరిష కొడుకును అదుపులో ఉంచాలి అనుకోవటము కొంత అసహజముగా లేదా ?

౩. మీవి తెల్ల గులాబీ కాకుండా “ప్రతిమాదేవి”,”అర్చన” నవలలు కుడా చదివాను. మూడు నవలల్లోనూ నాయికలు ఏకారణము వలనైతే నేమీ భర్తలను వదిలేసి వెళ్ళిపోతారు. ప్రతిమాదేవి,అర్చనలలో నైతే పిల్లలను కూడా వదిలి వెళ్ళిపోతారు.ఈ విధముగా నాయికల పాత్రలను సృష్ఠించటములో కారణము తెలుసుకోవచ్చా ?

4.మీ ఆదిత్య అడిగిన ప్రశ్ననే నేనూ అడుగుతున్నాను, స్వేచ్చ,స్వాతంత్రం అంటే ఏమిటి ?

నా ఈ ప్రశ్నలన్నిటికీ కలిపి రచయిత్రి ఇలా సమాధానం ఇచ్చారు.

కమల గారూ!

మీరు ఎంతో ఓపికగా నా నవలలు చదివి, మీకు కలిగిన అనేక సందేహాలను వెలిబుచ్చారు చాలా సంతోషం .. నేను మీకు తప్పకుండా సమాధానాలు చెప్తాను.

ఇక్కడ మీరు 3 నవలల లోని స్త్రీ పాత్రలను ప్రస్తావించారు. ఇవి మూడు కూడా చాలా ప్రాముఖ్యత కలిగినవి. నాకు సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినవి. అటు పాథకులను ఇటు సాహితీ ప్రముఖులను కదిలించినవి.

ఒక్కొక్క దానికి నేను సమాధానం చెప్తాను. ముందుగా మనం ప్రతిమాదేవి గురించి మాట్లాడుకుందాము ..

ఇందులో ప్రతిమాదేవి అందం, డబ్బు, చదువుతో పాటు అహంకారం కూడా కావాల్సినంత ఉన్న అమ్మాయి ..అలాగే మొండితనం తనమాటే నెగ్గాలన్న పంతం ఆమెలో కావాల్సినంతగా ఉంది .. ఈ పాత్ర ఆధునిక స్త్రీ భావజాలాన్ని పూర్తిగా నింపుకున్న పాత్ర .. ఆమెకి జీవితం అంటే ఒక పూల పడవలా సాగాలన్న కోరిక .. వివాహానికి పూర్వం ఆమె జీవితం అలాగీ ఉంది .. కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, జీవితంలో లోతుపాతులు తెలియవు .. ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అతను తన భావాలకు అనుగుణంగా ఉండాలని, తన చెప్పు చేతల్లో ఉండాలని ఆమె కోరిక .. దాదాపు అతను అలాగే ఉంటాడు కొంతవరకు … అలాగే ఆమె కి పిల్లలను కనడం ఇష్టం లేదు. కాని ప్రక్రుతి సహజమైన మాతృత్వం ఆమెకి ఎదురైంది.. పిల్లలను కంటే తన నెత్తిమీద పడే బాధ్యతలు మోయడానికి ఆమె సిద్ధంగా లేదు.. ఆ విషయంలో తల్లి, తండ్రి, భర్త, అత్తగారు అందరు వ్యతిరేకించినా ఆమె గర్భం తీయించు కోడానికి సిద్ధపడుతుంది.. ఈ విషయంలో ఆమెలోని మొండితనం , పంతం అనే సహజ స్వభావాలు సహకరించాయి. కాని తల్లి గట్టి ప్రయత్నం మీద కనడానికి మాత్రం అయిష్టంగానే అంగీకరించింది .. కాని పెంచడానికి బాధ్యత మోయడానికి ఆమె అంగీకరించలేదు. ఆమెలోని స్వేచ్చా ప్రియత్వం, ఒకవిధమైన అజ్ఞానంతో కూడిన విచ్చలవిడితనం తో భర్తని, పాపని వదిలి వెళ్ళిపోయింది. అయితే వెళ్ళాక కానీ ఆమెకి తను చేసిన తప్పు ఏమిటో తెలియలేదు.. స్వేఛ్చ అంటే ఏమిటి అనే ప్రశ్న ఆమెకే వచ్చింది.. ఆ ప్రశ్నకి బలరాం గారు సమాధానం ఇస్తారు చివరి రోజుల్లో ఆమె బలరాం దగ్గరకు వచ్చినపుడు. ఒకరి స్వేఛ్చ మరొకరి స్వేచ్చని ఆనందాన్ని , సుఖాన్ని హరించేది కానంతవరకు ఎంత స్వేచ్చగా అయినా ఉండచ్చు అంటారు రఘురాం గారు.

ఆధునికత రెక్కలు విప్పుకుని కుటుంబ వ్యవస్థ అనేది తనని అన్ని విధాలుగా బంధించి ఉంచే ఒక బంగారు పంజరం అని, పిల్లలని కనడం స్త్రీ స్వేచ్చని, అస్తిత్వాన్ని హరించేది అని భావనతో అస్తిత్వ పోరాటం మొదలుపెట్టిన ఒక రకమైన భావజాలంలో పడి కొట్టుకుపోయిన అనేకమంది ఆధునిక మహిళలకు ప్రతిరూపం ప్రతిమాదేవి. గమనించగలరు ఈ పాత్రని నేను నవల మొత్తంలో ఎక్కడా సమర్ధించలేదు.

అలాగే, ఈ పాత్రకి పూర్తీ వ్యతిరేకంగా నేను మరో పాత్ర సృష్టించాను ఆమె రోహిణి .. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమై తండ్రి ఆదరణలో పెరుగుతూ విద్యవంతురాలై, ఒక మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదిగి జీవితంలో ఎంతో ఉన్నతంగా నిలబడిన పాత్ర .. చిన్నప్పుడు తల్లి చేసిన గాయం ఆమె జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అది ఆమెలో తల్లి పట్ల ఒక ద్వేషంగా మారి ఆమెతో పాటు పెరుగుతూ వచ్చింది. చివరికి తను తల్లిగా మారుతున్న సమయంలో ఆమె మనసు తల్లి ప్రేమకోసం తపిస్తుంది, తల్లిని చేరుకోడానికి ఆరాటపడుతుంది. ఇది ప్రతి అమ్మాయికి సహజం ..ప్రతిమాదేవి ఎంత కఠినంగా ఉన్నా స్త్రీనే కదా … అలాగే ప్రతిమాదేవి కూడా జీవిత చరమాంకంలో కూతురికోసం ఎంతో తపించిపోతుంది.. అనుభవాలు ఆమెకి అనేక పాఠాలు నేర్పుతాయి.

ఈ నవలలోని విభిన్న మనస్తత్వాలు ఉన్న ఈ తల్లి, కూతుళ్ళ పాత్రల ద్వారా అసలు women empower అంటే ఏంటి …స్త్రీ పురోభివృద్ధి అంటే ఏంటి? స్త్రీ స్వేఛ్చ అంటే ఏంటి ? అనే సమస్యలకి సమాధానం ఇచ్చాననే అనుకున్నాను.

ఇక అర్చన ….

అర్చన కధా నాయిక కాబట్టి సహజంగానే అందంగా ఉంతుంది. అర్చన అందమైన ఒక మధ్య తరగతి కుటుంబంలోని అమ్మాయి. ఆమెకి తను ఉన్నత చదువులు చదవాలి అనే ఆశయం ఉంది … అందుకే చదువు లక్ష్యం గా ఉన్న ఆమె తనని ప్రేమించిన ఎందరినో తిరస్కరించింది. కొందరు ఆమె తిరస్కారం మౌనంగా భారించినా కొందరు ఆమె తిరస్కారం అవమానంగా భావించారు.. వేణు ఆమె తిరస్కరించినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఏనాటికైనా ఆమె ప్రేమ పొందాలని ఎదురుచూశాడు.

వీరిలో నాగరాజు ఒకడు .. దుర్మార్గుడు … ఆమెని పధకం ప్రకారం అవమానించి ఆమె ఆశయానికి ఆదిలోనే అవరోధాలు సృష్టించాడు. ఒక మధ్య తరగతి కుటుంబంలో తల్లి, తండ్రులు ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే అర్చన తల్లి, తండ్రులు కూడా కూతురి జీవితం నాశనం అయిందని ఇంక ఆమెని ఎవరూ పెళ్లి చేసుకోరని ఇంక ఆమె తమ గుండెల మిద కుంపటే అని భావిస్తారు. కాని అర్చన సాధారణ యువతి కాదు .. ధైర్యం, సాహసం, ఒక లక్ష్యం, పట్టుదల ఉన్న అమ్మాయి. ఒక దుర్మార్గుడు ఆడిన నాటకంలో తను అపనిందల పాలు అవడంతో జీవితం అయిపోయిందని అనుకోడం ఆమెకి నచ్చలేదు. నాలుగు గోడల మధ్య బందీగా మారిన తనని కాపాడే స్నేహ హస్తం కోసం ఎదురుచూసింది.. ఆ హస్తం వేణు రూపంలో వచ్చింది.. కాని వేణు ఒక పక్క సాయం చేస్తూనే ఆమె నిస్సహాయాతని తనకి అనుకూలంగా మార్చుకుని ఆమెని ఒకవిధంగా బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు.

(ఇక్కడ అర్చన కూడా ఒక కన్య … కన్నె పిల్లలందరికీ ఉన్నట్టే ఆమెకి తనకి కాబోయే భర్త పట్ల కొన్ని ఆశలు, ఊహలు ఉన్నట్టు.. ఆ ఊహలకి అనుగుణంగా ఒక వ్యక్తీ తరచూ కలలో కనిపించడం అలాంటి వ్యక్తే జీవితంలో తారసపడి, అందకుండా పోడం అనేది కన్నె కలలకి సింబాలిక్ గా చూపించాను ఒక అజ్ఞాత వ్యక్తిని . )

కాకపోతే వేణు దుర్మార్గుడు కాదు.. కాని స్వార్ధపరుడు.. అర్చన కావాలి.. ఆమెని దక్కించుకున్నాడు. ఇక భర్తగా ఆమె మీద ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇది కూడా సహజమే … కాని అర్చన లాంటి అసాధారణ వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అంత సులభంగా జీవితంతో రాజి పడదు .. అందుకే అర్చన కూడా రాజి పడలేదు.. ఆమెకి తన వైవాహిక జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అనే ఆలోచన కన్నా తన లక్ష్యం నేరవేర్చుకోడమే ముఖ్యం. వేణు దౌర్జన్యం చేయడం ద్వారా తను గర్భం దాల్చింది. ఆ గర్భం ద్వారా తనకి ఏ మాత్రం ఇష్టం లేని వేణుకి భార్యగా , అతని పిల్లలకి తల్లిగా జీవితంలో ఒక అతి మామూలు స్త్రీలాగా స్థిరపదిపోవడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే గుండె రాయి చేసుకుని తన ప్రమేయం లేకుండా కన్న కొడుకుని వదిలి వెళ్ళిపోయింది. అయితే ఒక తల్లిగా తన కొడుకు ఎక్కడ క్షేమంగా ఉంటాడో అక్కడే వదిలి వెళ్తుంది.. కష్టపడింది.. అవమానాలు, అవహేళనలు భరించింది. చదువుకుంది. తన లక్ష్యం సాదించింది. ఎంత మంది ఎన్ని చెప్పినా చివరి వరకూ వేణుని కలవడం ఆమెకి ఇష్టం లేదు. కాని ఎప్పుడైతే నళిని ఆమె వ్యక్తిత్వాన్ని సవాల్ చేసి ఉన్నత విద్యవంతురాలివి, ఉన్నత స్థానంలో ఉన్న నీవు కూడా ఒక సాధారణ స్త్రీలా నీ వలన ఒక కుటుంబం నాశనం అవుతుంటే చూస్తూ ఉంటావా అనగానే ఆమెలోని స్త్రీత్వం నిద్ర లేచింది. అక్కడ వేణు కన్నా తన కొడుకు, తన అత్తగారు వాళ్ళని గుర్తు తెచ్చుకుని మానవతా ధర్మంతో తిరిగి వెళ్ళింది. ఇక్కడ కూడా ఆమెలో ఒక ఔన్నత్యాన్నే చూపించే ప్రయత్నం చేసాను. అర్చన ఒక మామూలు స్త్రీలా పోనేలే నా జీవితం నవ్వులపాలు అయింది.. ఇతనెవరో నా మీద దయ తలచి పెళ్లి చేసుకుంటున్నాడు .. అని రాజి పడి వేణుతో కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ బతికితే ఒక అర్చన రూపు దిద్దుకోదు.

ఎలాంటి పరిస్థితి ఎదురైనా జీవితంలో ధైర్యంగా నిలబడి తను అనుకున్నది సాధించాలి ఆడపిల్లలు అనే సందేశం అర్చన పాత్ర ద్వారా అందించడం నా ధ్యేయం …

ఇక తెల్లగులాబి …

ఈ నవల రేపిన కలకలం నేను మర్చిపోను. అలాగే ఈ నవల ఎందఱో సుప్రసిద్ధ సాహితీ వేత్తలను నాకు సన్నిహితం చేయడం కూడా నేను మర్చిపోను. ఈ నవల నేను ౨౦౧౨ లో ప్రారంభించి ౨౦౧౩ లో పూర్తీ చేసాను. అంతకు ముందు రెండేళ్ళ క్రితం ఇండియా టు డే లో టినేజర్స్ ని కొందరిని ప్రీ మారిటల్ సెక్స్ విషయం లో ఇంటర్వ్యూ చేసినది చదివాను. వాళ్ళ సమాధానాలు చదివి నివ్వెరపోయాను. నాలో ఏదో ఆందోళన .. ఏమై పోతోంది ఈ సమాజం .. ఏం జరుగుతోంది.. ఒకప్పుడు నాకు ఒకబ్బాయి లవ్ లెటర్ రాసి ఇంటికి తెచ్చి ఇచ్చాడని నేను అవమానంతో మూడు రోజులపాటు ఇంటి చుట్టు పక్కల వాళ్లకి మొహం చూపించాలేకపోయాను. నేనం తప్పు చేయకపోయినా చేసిన భావన .. కాని కాలం ఎలా మారిపోయింది .. ఆ తరవాత పేపర్ లో కొన్ని వార్తలు … ఇవన్ని నాలో ఏదో ఆలోచన రేకెత్తించాయి.

అప్పుడప్పుడే సహజీవనం రెక్కలు విప్పుకుంటోంది.. భారత దేశం వివాహవ్యవస్థకి , కుటుంబ వ్యవస్థకి ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది.. మనలను విదేశీయులు ఆదర్శంగా , స్ఫూర్తిగా తీసుకుని ఒక బలమైన కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి పరిస్థితి లో మన సమాజంలో ఏర్పడుతున్న కల్లోలం ఎంతవరకు సమంజసం .. ఎంత వరకు ఆహ్వానించదగ్గ పరిణామం ! ఎందుకు వివాహాలు విచ్చిన్నం అవుతున్నాయి.. స్త్రీల అస్తిత్వ పోరాటంలో పిల్లలు బలి పశువులు అవుతున్నారు.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పిల్లలకి ఉన్న రక్షణ ఇప్పుడు ఏది? సామాజికంగా, నైతికంగా ఎలా చూసినా విచ్చిన్నం అవుతున్న కుటుంబ వ్యవస్థ యొక్క ప్రభావం పిల్లల మీదే పడుతోంది.. నాకు శరత్ నవలలు గుర్తొచ్చాయి . ముఖ్యంగా శ్రీకాంత్ అనుకుంటా … ఒక పెద్ద కుటుంబం .. ఇంటి పెద్ద పిల్లలని అందరిని కూర్చోబెట్టి చదివిస్తుంటాడు.. ఆ పిల్లలు అందరి మీదా అతని ఆజమాయిషీ ఉంటుంది.. నా మనసులో ఆ సన్నివేశం బలంగా ముద్రించుకుపోయింది. అల్లాంటి ఒక పర్యవేక్షణలో పిల్లలు పెరిగితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా కాని, వంటరి తనం వల్ల వాళ్ళ మనస్సులో కలిగే వికారాలు కాని, మానసిక ఆందోళన కాని వీటికి అవకాశం ఉంటుందా? మానసిక శాస్త్రవేత్తలు కూడా నేటి యువత మానసిక స్థితి పట్ల ఇలాంటి ఆందోళనే వెలిబుచ్చుతున్నారు.

ఈ ఆలోచనే తెల్లగులాబి నవలకి పునాది. శిరీష కొడుకుని అదుపులో పెట్టగలదు కాని అతని మనసులో కలుగుతున్న ఆలోచనలు అదుపులో పెట్టగలదా? లేదు … భాను కూడా పెట్టలేదు.. వాళ్ళ వేగవంతమైన జీవనవిధానంలో వాళ్లకి పిల్లల్లో కలుగుతున్న వికారాలు పట్టించుకునే తీరిక ఏది? ఎంతసేపూ మా జీవితాలు ప్రతి దశలో ఎవరో ఒకరికోసం త్యాగం చేయడం తోటే సాగాలా అనుకునే మాటిరియలిస్తిక్( materialistic) మనస్తత్వాలు .. వాళ్ళు తమ పిల్లల కోసం తమ ఆనందం వదులుకోడానికి సిద్ధంగా లేరు. కాకపోతే కన్నా పిల్లలు కాబట్టి వాళ్లకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం బాధ్యత అని మాత్రమె వాళ్ళు భావిస్తున్నారు . ఈ పరంపరలో నేటి కౌమార దశలోని పిల్లల మనస్త్తవాలకి ప్రతీకలే ఆదిత్య, ప్రఖ్య .. ప్రఖ్య ఆడపిల్ల .. తల్లి జీవన విధానం తనకి నచ్చినా నచ్చకపోయినా ప్రశ్నించదు. కాని ఆదిత్య మగపిల్లాడు.. సహజంగానే కోపం, పౌరుషం , పోగారుమోత్తనం , ఏ మాట అయినా అనగల అహంకారం ఉన్నవాడు .. అందుకే తల్లిని , ఆమె స్నేహితుడిని కూడా నోటికి వచ్చినట్టు అనగలిగాడు. ఈ నవల ఒక ఆవేశంలో, ఆవేదనతో రాసాను .. ఆధునిక సాహిత్యం అవపోసన పట్టిన మేధావులు ఈ నవల లోని నా ఆర్తిని అర్ధం చేసుకున్నారు.. అది చాలు నాకు.. ఇది హిందీలో అనువాదం చేసిన వసంత గారు నాకన్నా ఎక్కువగా ఈ నవల పట్ల అభిమానం పెంచుకున్నారు.. ఒకవిధంగా ఆవిడ mouth publicity ఈ నవలని హిందీ వారికి చేరువ చేసింది. తమాషా ఏంటంటే ఎందఱో మహిళా పాఠకులు నాకు ఈ నవల చదివి ఫోన్లు చేసి ఎంత అద్భుతంగా ఉందండి మీ నవల అని చెప్పడం విశేషం .

ఒక విభిన్నమైన ధోరణిలో నా రచనలు సాగాయి అన్నారు మీరు.. రచనలు అంటే సమాజానికి ప్రతిబింబాలు. నేటి సమాజం ఎలా ఉంది అని తరవాతి తరానికి తెలియాలంటే ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న మార్పులు మన రచనల్లో చోటు చేసుకోవాలి. గురజాడ లేకపోతె మనకి కన్యాశుల్కం తెలిసేదా … కాళ్ళకూరి లేకపోతె ఆనాటి వ్యవస్థలో వరవిక్రయం గురించి తెలిసేదా .. విశ్వనాధ గారి వేయిపడగల్లో అప్పటి సామాజిక నేపధ్యం ఎంతో అద్భుతంగా చూపించలేదా.

కాకపోతే ఇప్పటి సమాజం వికృతంగా ఉండడం వలన ఈ నిజాలని ఒప్పుకునే మానసిక స్థాయి లేక మనం కొన్ని రచనలను చూసి భయపడతాం, చిరాకుపడతాం … అంత మాత్రాన అలాంటి రచనలు చేయకూడదు అంటే ఎలా? నేను ఇది రాస్తే ఎవరు ఏమనుకుంటారో అని భయపడుతూ రాసేవాళ్ళు రచయితలు కారు అని అన్నారు ప్రముఖ రచయిత శ్రీ సి. ఎస్. రావుగారు.

6. విజయలక్ష్మిగారు చాలా వివరం గా చెప్పారండి.అవును మీరన్నది కూడా నిజమే, రచనలు కాలమానపరిస్థితులను ముందు తరం వారికి తెలియజెప్పాలి. కాకపోతే ఆహ్లాదక రమైన కథలు మాత్రమే చదివే నాలాంటి పాఠకులకు జీర్ణించుకోవటం కొంచం కష్టమే అనుకోండి. ఇక మీ రచనాప్రస్థానం గురించి చెప్పగలరా?

జ; మా నాన్నగారి పేరు కి. శే. ఏ ఎల్. నరసింహ రావు గారు , అమ్మ అత్తలూరి అనసూయ .. మా నాన్నగారు చాలా పెద్ద రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తీ … స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.. రాయ్ ఉద్యమం లో అబ్బూరి రామకృష్ణ రావు గారితో కలిసి పని చేసారు.. అనేక పత్రికలలో ఉప సంపాదకులుగా పని చేసారు.. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ట్రేడ్ యూనియన్ కి వి, వి గిరి గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా మా నాన్నగారు వ్యవస్థాపక కార్యదర్శిగా కార్మికుల హక్కుల కోసం పోరాడారు.

చాలా అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తీ …ఆయన గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంధం అవుతుంది. అమ్మ అక్షరాలా ఆయనకీ సహా ధర్మ చారిణి .నాకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరూ అక్క చెల్లెళ్ళు.

నా చిన్నప్పటినుంచి మా ఇంట్లో అమ్మ, నాన్న, అక్కయ్య, అన్నయ్య పుస్తకాలూ చదువుతుండేవారు ముఖ్యంగా అమ్మ … ఆవిడ విపరీతంగా చదివేది. ఇంటినిండా ఎక్కడ చూసిన పుస్తకాలు.. నాకు అప్పుడే అవన్నీ చదవాలనిపించేది. పెద్దవాళ్ళు చూడకుండా చదివే దాన్ని … ఆ ప్రభావమే నాకూ రాయాలని కోరికకు బీజం వేసింది. నాన్నగారు రాజకీయాలు, ఎం ఎన్ రాయ్ , ఉద్యమ విశేషాలు, ఇంకా చాలా రాసేవారు. పెద్ద, పెద్ద పుస్తకాలు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసేవారు.. వేసవి సెలవుల్లో నాకు డిక్టేట్ చేస్తుంటే నేను రాసేదాన్ని .. అల్లా రాత పట్ల ఒక ఆకర్షణ, ఇష్టం ఏర్పడ్డాయి. నాన్నగారి ప్రోత్సాహం కూడా కలిసింది.. నేను 1974 లో ఆకాశవాణి , హైదరాబాద్ కేంద్రానికి , యువ వాణిలో కొన్ని స్కెచ్ లు వినిపించడం ద్వారా ప్రారంభించాను. అప్పటికి నాకు పదిహేడు సంవత్సరాలు. అప్పుడు ప్రముఖ రచయిత రావూరి భరద్వాజగారు రేడియో అన్నయ్యగా ఉండేవారు.. వారు నాన్నగారికి ప్రాణమిత్రులు. నేను రాసిన కొన్ని చిన్న పిల్లల కధలు తీసుకుని వారి దగ్గరకు వెళ్లాను. అలా నాకు రేడియో తో ఒక అనుబంధం ఏర్పడింది.

తరవాత ఒక ఏడాది గడిచాక నాకు వివాహం అయింది. నా రాతలు ఆగిపోయాయి. తిరిగి 1980 నుంచి ఒకటి , అరా కధలు రాసి దాచుకున్నాను. మరో రెండేళ్ళు గడిచాక తిరిగి యువ వాణికి నా కధలు పట్టుకుని వెళ్ళాను. మళ్ళి రెండేళ్ళు బ్రేక్ … అలా కుంటుకుంటూ రేడియో నుంచి పత్రికల వైపు వచ్చాను .. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అనుభవాలు అపారం అయినా అనుభూతిరాహిత్యం … మనసు స్పందన కోల్పోయింది. తిరిగి రాయడం ప్రారంభించాక రేడియో కి కధలు, రేడియో నాటకాలు … కేవలం ఆర్ధిక అవసరాల కోసం రేడియో కి ఉధృతంగా రాసేదాన్ని. ప్రతి కధకి పారితోషికం ఉంటుంది కదా … అందుకు. రేడియోలో గంట నాటకాలు రాయడం మొదలు పెట్టాను. గంట నాటకం ఆదివారాలు మధ్యాన్నం మూడు నుంచి నాలుగు దాకా ప్రసారం అవడం అంటే మాటలు కాదు.. అతిరధ మహారధులు ఏలిన సామ్రాజ్యం అది .. ఆ సామ్రాజ్యంలోకి నేను చోచ్చుకుపోయాను.

ఒక పక్క ఉద్యోగం , మరో పక్క ఈ రాతలు. ఒక పక్క అమ్మాయి బాధ్యత .. తరవాత తురగా జానకి రాణి గారి సలహాతో ఈనాడు, ఆంధ్రభూమి, మయూరి, మొదలైన పత్రికలకు కధలు రాస్తూ ఉండగా … 2000 సంవత్సరంలో మా అమ్మాయి వివాహం చేసాక అతి పెద్ద బాధ్యత నుంచి కొంత రిలీఫ్ .. అప్పుడు రాసాను నవల దత్తపుత్రుడు … డా. వాసిరెడ్డి సీతాదేవి గారు చదివి అవసరమైన సూచనలు చేయగా ఒక మంచి నవలగా రూపు దిద్దుకుంది. (సీతాదేవిగారు నా రేడియో నాటకాలకి పెద్ద అభిమాని.. ఆవిడ వైతరణి నేను రేడియో నాటకంగా రాసాను.) ఆ నవల ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించారు శ్రీ ఎం.వి. ఆర్ శాస్త్రిగారు. ఆ తరవాత మహావృక్షం, అమావాస్యతార, నేనెవరిని, ప్రతిమాదేవి, గూడు చెదిరిన గువ్వలు.. ఈ లోగా 2000 సంవత్సరంలోనే నా జీవితంలో ఒక పెద్ద బ్రేక్ నేను రాసిన మాచ్ ఫిక్సింగ్ హాస్య నాటకం నాటక లోకాన్ని దుమ్ము రేపి నాకు సుప్రసిద్ధ నాటక రచయితల పక్కన చోటు కల్పించింది. అక్కడినుంచి అత్తలూరి విజయలక్ష్మి అనగానే నాటక రచయిత్రి అని స్టాంప్ పడిపోయింది. అనేక బహుమతులు, చాట్ల శ్రీరాములుగారు, సి. ఎస్. రావుగారు, దుగ్గిరాల సోమేశ్వర రావుగారు, జే. వి. రమణమూర్తి గారు వంటి దిగ్గజాలకు సన్నిహితురాలిని అయాను. వారి అభిమానం, ఆదరణ …. కప్పగంతుల మల్లికార్జునరావు గారు … రమణారెడ్డి గారు … ఎందఱో మహానుభావులు అందరికి వందనాలు

7.ఒకప్పుడు నాటకాలు చాలా ప్రజాదరణపొందేవి.ఇప్పుడు చాలావరకు కనుమరుగయ్యాయి.ఇప్పటికీ నాకు తెలిసిన , మా కుటుంబంలోని పిల్లలే “బావా ఎప్పుడు వచ్చితీవు” అని అప్పుడప్పుడు రాగం అందుకుంటూ ఉంటారు.ఆ పద్యాలను చాలా ఎంజాయ్ చేస్తారు ఐనా నాటకాలు ఆదరణకు నోచుకోవటం లేదు ఎందువలన అంటారు ? మహారాష్ట్రాలో, పూనాలో, బాంబేలో అప్పటికప్పుడు అప్పటి సమస్య మీద చిన్న నాటికలా తయారు చేసి వీధిలో వేస్తారు.అవి నేను చాలానే చూసాను.కాని మన దగ్గర చూడలేదు.

జ; నాకు నాటకాలంటే చాలా ఇష్టం ఏర్పడడానికి కారణం నా చిన్నప్పటినుంచి మా నాన్నగారితో, నా చిన్ననాటి మిత్రుడు కళా కృష్ణ గారితో కలిసి నాటకాలు చూసేదాన్ని.. అవి నన్ను నాటక రచనకు ప్రేరణని ఇచ్చాయి. అయితే నాటక రచనలో ముఖ్యంగా రేడియో నాటకంలో నేను ఒక ప్రావిణ్యత సంపాదించడానికి కారణం రేడియో నాటకంలో ఒక పరిశోధన్ చేసిన నా మిత్రులు కళాకృష్ణ గారి శిక్షణ .

ఇకపోతే మన తెలుగు దేశంలో ఎందుకు నాటకం ఆదరణకు నోచుకోదు అంటే మన నాటకాలు మూస ధోరణిలో ఉండడం … పరిషత్తు లో ప్రేక్షకులని ఏడిపించడం లక్ష్యంగా ఎప్పుడూ అమ్మ సెంటిమెంట్ కి మాత్రం ప్రాధాన్యత ఇస్తూ రచనలు రావడం .. లేదంటే భార్యలను హింసించే భర్తలు… ఇలా కొన్ని వస్తువులు మాత్రమె నాటక రచనల్లో చోటు చేసుకుంటాయి.. ఇప్పుడిప్పుడు కొంచెం మార్పు వస్తోంది.

రెండు _ మహారాష్ట్రలో , ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా విద్యావంతులు అయిన మహిళలు నాటకంలో నటించడానికి ముందుకు రావడం లేదు.. నాటకం అంటే ఒక తేలిక భావం మనలో పాతుకుపోయింది. బతుకు తెరువుకోసం మాత్రమె నాటకాల్లో నటిస్తారు స్త్రీలు అనే భావన .. అందుకే పదహారేళ్ళ అమ్మాయిగా, అరవై ఏళ్ల వ్రుద్దురాలిగా ఒకరే కనిపించడంతో చూసేవాళ్ళకి ఆసక్తి ఉండడంలేదు. ఇప్పుడు కొందరు వస్తున్నా వాళ్ళలో నాటకం పట్ల ప్రేమ , నిబద్ధత తక్కువ.. రిహార్సల్స్ చేయరు.. టి వి అందరిని మేస్మరైస్ చేస్తున్నది.

ఇక నాటక ప్రదర్శన అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం .. ఎందఱో నాటకం మీద ప్రేమతో ఆస్తులు అమ్ముకున్న కధలు విన్నాం .. టి వి లో ప్రసారం అయే చెత్త సీరియల్స్ కి లక్షలు లక్షలు స్పాన్సర్ చేసే వ్యాపారవేత్తలు కనీసం నెలకి ఒక నాటక ప్రదర్శనకి ఒక యాభై వేలు ఇస్తే మంచి నాటకం వస్తుంది.

మన తెలుగు నాటకాల్లో స్త్రీలు కూడా నాటకాలు వేయాలి అనే కోరికతో సరసిజ అనే సంస్థ స్థాపించాను. పైన చెప్పినట్టుగా నాకు ఆర్ధిక బలం లేదు, కనీసం ఎవరినన్నా స్పాన్సర్ చేసేవాళ్ళని కలిసి విరాళాలు సేకరించే చొరవ కూడా లేదు. అందుకే నాకు చేతనైనంతలో కొన్ని నాటకాలు వేయించాను.

నా కూతురు రాజేశ్వరి ఉదయగిరి అమెరికాలోని డల్లాస్ లో నా సంస్థకి అనుబంధంగా అదే పేరుతొ ఒక సంస్థ పెట్టి నాటక ప్రదర్శనలు ఇస్తూ అక్కడి తెలుగు వారిలో నాటకం పట్ల ఆసక్తిని కలిగిస్తున్నది. అందులో భాగంగా నేను రాసిన మమకారాల కాపురం అనే హాస్యనాటకం ప్రదర్శనతో ప్రారంభించి, నా చేత అలనాటి మిస్సమ్మ సినిమా ని రంగస్థల నాటకంగా రాయించి పెద్ద ఎత్తున ప్రదర్శించి ఒక సంచలనం సృష్టించింది. ఈ ఏడాది విక్రమార్క భేతాళ కధలాంటి అనగనగా ఒక రాజకుమారి అనే నాటకం రాయించింది నాతోటే .. అది కూడా ఆరు వందల మంది టికెట్ కొనుక్కుని చూసి విజయవంతం చేసారు. అమెరికాలో నాటకం పట్ల అంత ఆసక్తి కలిగించడానికి మా అమ్మాయి తయారు చేసిన టీం ఎంతో కృషి చేసింది.. చక్కటి ఆధునిక సాంకేతిక సౌకర్యాలు ఉపయోగించి ఒక సినిమాలాగా చేసారు. అలా చేస్తే మన దగ్గర కూడా నాటకాలు ఆదరణ పొందుతాయి.

మీలాంటి వారు ముందుకు వస్తే నా సరసిజ ద్వారా స్త్రీలను నాటక రంగంలో విస్తృతంగా పరిచయం చేయాలని ఉంది నాకు.

9.రచనలు, నాటికలు కాకుండా మీకు ఇంకేమైనా కళలల్లో అభిరుచి ఉందా ?

జ; నాకు మంచి పుస్తకాలు చదువుకోడం, మంచి పాటలు వినడం , నాటకాలు చూడడం, శాస్త్రీయ నృత్యం ఇవన్ని ఇష్టం . నేను హైదరాబాద్ వాటర్ వర్క్స్ లో ఉద్యోగం చేయడం వలన ఇతర కళల పట్ల ఆసక్తి చూపే సమయం లేదు. ఉద్యోగం, రచన వ్యాసంగం , ఇల్లు, మా అమ్మాయి . మధ్య, మధ్యలో అమెరికా వెళ్లి నా మనవరాలు, మనవడితో ఆడుకోవడం నాకు ఎంతో ఇష్టమైన విషయం .

ఆఖరిగా, నా రచనా ప్రస్థానంలో ఎన్నో అవరోధాలు వచ్చినా నేను కొనసాగిస్తూనే ఉన్నాను. కధలు, రేడియో నాటకాలు, రంగస్థల నాటకాలు, టెలి ప్లే లు, టెలి ఫిలిం , టి వి సీరియల్స్ , కాలమ్స్ , నవలలు కొన్ని కవితలు ఇలా అనేక ప్రక్రియలు సాహిత్యంలో చేసాను. మంచివి, ప్రతిష్టాత్మకమైనవి అయిన పురస్కారాలు పొందాను. బహుమతులు పొందాను. నా మ్యాచ్ ఫిక్సింగ్ , ఇ వి వి సత్యనారాయణ గారు హక్కులు తీసుకుని కితకితలు సినిమాగా తీసారు. నా కదలు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ గా వచ్చాయి. కాకపోతే మొదటినుంచి నాకు స్టేజి ఫియర్ ఎక్కువ … కెమెరా అంటే భయం … అందులోనూ ఒక రాష్ట్ర ప్రభుత్వశాఖలో హోదా గల ఉద్యోగం చేయడంతో రిజర్వ్డ్ నెస్ ఇవన్ని కలిసి నేను ఎక్కువగా expose అవలేదు.. అందుకే బహుశా నాకు నా తోటి రచయితలతో పరిచయాలు చాలా తక్కువ .. కొందరు నాకు గర్వం అనుకుంటారు.. అలా ఎవరన్నా అంటే ఆలోచిస్తాను నాకు ఎందుకు గర్వం అని … కాకపోతే yes నాకు గర్వం ఉండాలి ఎందుకంటే నేను self made … వంటరి పోరాటం చేస్తూ ఎదిగాను. నాలాగా నా కూతురు మైక్, స్టేజి ఫోబియతో పెరగద్దని తనని చిన్నాప్పటినుంచి నాటకాలు, టివి యాంకరింగ్ వాటిలో ప్రోత్సాహం ఇచ్చాను. ఇవాళ మూడు భాషల్లో అనర్గళంగా వేలమంది ఉన్న సభలో కూడా మా అమ్మాయి మాట్లాడగలదు… ఎలాంటి పాత్ర అయినా అవలీలగా రంగస్థలం మీద నటించగలదు. నా మనవరాలిని, మనవడిని కూడా అలాగే పెంచమని చెప్పాను . నా మనవరాలు చక్కటి ఆర్టిస్ట్ అద్భుతంగా పెయింటింగ్ చేస్తుంది.

ఇప్పుడు నా కదల మీద , నా నవల మీద , నా రేడియో నాటకాల మీద ఆంధ్ర యూని వర్శిటీలో ఇద్దరు విద్యార్ధులు పి హెచ్ . డి చేస్తున్నారు. ఇది కూడా నాకు చాల తృప్తిని ఇచ్చింది ఎందుకంటే నాకు ఎవరూ పరిచయం లేదు.. ఎలాంటి సిఫారస్ లేదు .. కేవలం నేను రాసిన “అతిధి” నవల చదివి నా దగ్గరకు వచ్చి నా రచనల మీద పి. హెచ్. డి. చేసేందుకు అనుమతి కోరారు. వాళ్ళ ప్రొఫెసర్ తో లెటర్ తెచ్చారు. అంతే .

ఇవాళ చాలా కాలం తరవాత నా పాఠకులతో మనసు పంచుకునే అవకాశం లభించింది చాలా ఆనందంగా ఉంది .

ఈ అవకాశం కల్పించిన మీకు, విహంగ అధిపతి పుట్ల హేమలత గారికి ధన్యవాదాలు.

విజయలక్ష్మిగారు నేను అడిగిన ప్రశ్నలకు చాలా వివరముగా జాబులిచ్చారు. మీకు నా ధన్యవాదాలండి.

విజయలక్ష్మిగారి పుస్తకాలు అన్ని ప్రముఖపుస్తకాల షాప్ లల్లో దొరుకుతాయి.

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, ముఖాముఖిPermalink

One Response to తెల్లగులాబి(పుస్తక సమీక్ష ) – మాలా కూమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో