ఉష మెలకువ వచ్చినా బద్ధకంగా అలాగే పడుకుని వుండి పోయింది. ఉదయం నుంచీ ఎందుకో తల నొప్పిగా వుంది. ఆదివారం కావడంతో భర్త టిఫిను చేసి ఎక్కడికో వెళ్ళాడు. కాసేపు పడుకుందామని మంచంపై నడుం వాల్చేసరికి నిద్ర పట్టేసింది. ఎప్పుడు వచ్చాడో భర్త హేమంత్ అన్నం పెట్టుకుని తింటున్నట్లున్నాడు.
అత్తగారు పెద్దగా అంటోంది “ఏరా నీ పెళ్ళాం మహారాణి ఇంకా నిద్ర లేవలేదా? మొగుడికి కాస్త అన్నం పెట్టాలన్న ఇంగిత జ్ఞానం ఉంటేగా?”
“ పడుకోనీ లెమ్మని నేనే లేపలేదు. రోజూ పెడుతూనే ఉందిగా?”
“అయిందీ, దాన్ని సమర్దిస్తున్నావా? అనుకున్నా, దాని మీద ఈగ వాలనియ్యవు?” నిష్టూరంగా అన్నది తల్లి.
“ పోనిలే అమ్మా, ఉష కూడా పొద్దున్నించి ఏదో పని చేస్తూనే వుంటుంది. మధ్యాహ్నం కాసేపు పడుకుంటే తప్పేముంది?”
“సర్లే, నువ్వు నాకు చెప్పొచ్చావు, నాదే తప్పు. తల్లి లేని పిల్లని ఏదో జాలి పడి చేసుకున్నాం. దీనికి ఆ కృతజ్ఞత ఉంటేగా?”
“పెళ్లి బాగానే చేశారుగా అమ్మా ? నీ కోడలికి నువ్వంటే గౌరవమేకదా. ఏనాడైనా నిన్ను కాదని తను ఏమైనా చేసిందా?” అడిగాడు నవ్వుతూ.
“చేశారులే ఇంతోటి పెళ్లి, ఈ మాత్రం పెళ్ళి అందరూ చేస్తారు. ఇంతకన్నా బ్రహ్మాండమైన సంబంధం వస్తే ఆ పిల్లను ఇష్టపడక పోతివి. ఎంత ఆస్తిపరులు వాళ్ళు? అలాంటి సంబంధం కాదన్నావు. ఇప్పుడు మాత్రం నీ అత్తా మామల్ని పల్లెత్తు మాట అననివ్వవు. మీ నాన్న ఇలాగే వుండే వారా? నన్ను, మావాళ్ళను ఒంటికాలి మీద పరిగెత్తించే వారు. ప్రతి రోజు అర్ధ రాత్రి దాటాక గానీ వచ్చేవారు కాదు. అందాక నేను మేలుకుని ఉండాల్సిందే. అప్పుడు వచ్చి స్నానం చేసి, భోజనం చేసే వారు. ఆయన అన్నానికి వస్తున్నారంటే వణికి పోయే దాన్ని. ఆయన అన్నం తినే దాకా నేను అక్కడే నిలుచుని వుండే దాన్ని. భోజనంలో ఆధరవులు అన్నీ వేడిగా ఉండాల్సిందే. ఆ కాలంలో ఇప్పటికి మల్లే గ్యాస్టవులు ఏమైనా ఉన్నాయా? అన్నీ కిరసనాయిలు స్టవ్వు మీదే. అప్పటికప్పుడు అన్నీ వేడి చేసి ఆయనకు వడ్డించే దాన్ని. ఏది బాగుండకపోయినా కంచం విసిరేసే వారు.”
“అమ్మా, ఆస్థితో వచ్చిన కోడలు ఆస్థి వున్నదాని గానే ప్రవర్తిస్తుంది. అయినా నా కాళ్ళ మీద నిలబడి నేను సంపాదించుకోవాలి గానీ, మరొకరు ఇచ్చేది నాకు ఇష్టం వుండదు. నాన్న దాష్టికం, అత్తింటివారిని చిన్న చూపు చూడడం అవన్నీ అప్పటికీ, ఇప్పటికీ నువ్వు అసహ్యించు కుంటున్నావా, లేదా? మళ్ళీ నీ కొడుకు అలా చెయ్యాలనుకోవడం దేనికి? కోడలి మీద కోపమా? నేను ముందు నీ కొడుకునేనమ్మా, తర్వాతే దాని మొగుడ్ని.”
“పోరా, పో. నీ ఇష్టం, నువ్వెలా వుంటే నాకెందుకు?”
“ఇప్పుడేమైంది అమ్మా, ప్రతిదీ నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నాంగా. ఇంత చిన్న విషయానికి రాద్దాంతం ఎందుకు?”
ఇంక ఆ వాదన అంతటితో ఆగదని, ఉష లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది.
“అదిగో, వచ్చింది మహారాణి, వడ్డించమను.”
ఉష మాట్లాడకుండా “చారు పోయ్యమంటారా?” భర్తను అడిగింది.
హేమంత్ తల ఊపాడు. ఉష “మరి కాస్త అన్నం పెట్టుకోండి” అంటూ అన్నం వడ్డించి, చారు పోసింది.
“చెప్పగా, చెప్పగా ఇన్నాళ్ళకు నీకు ఈ మాత్రం జ్ఞానం వచ్చింది. మగాళ్ళకు ఎంత తినాలో తెలియదు. దగ్గరుండి మనమే కొసరి కొసరి వడ్డించాలి” నిష్టూరంగా కోడల్ని చూస్తూ అంది అత్త గారు.
-టి.వి.యస్.రామానుజ రావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~