మెక్సికో నౌకా యాత్ర- భాగం-3
నౌకలోని వింతలు- విశేషాలు
పదంతస్తుల భవనం లాంటి అతి పెద్ద నౌకలో మా గదిలో సామాన్లు పడేసి వెనువెంటనే నౌకంతా చుట్టి రావడానికి నిర్ణయించుకున్నాం.
మా బస మూడో అంతస్తులో కావడం వల్ల గది బయట ఉన్న వరండాలో నుంచి వచ్చి లిఫ్టు ఎక్కే ముందు కిందికి వెళ్ళాలా, పైకి వెళ్లాలా అని సందేహించాం.
భోజనాల వేళ కావడంతో అన్నిటి కంటే పైన పదో అంతస్తులో ఉన్న ఫుడ్ కోర్టుల దగ్గర్నించీ ఒక పట్టు పడదామని బయలుదేరేం.
పదో అంతస్తు అటు మూల నించి ఇటు వరకు భోజన సదుపాయాలు ఉంటాయి. వరసగా ఉన్న రకరకాల హాళ్లలో, రకరకాల పుడ్ వెరైటీలు ఉంటాయి.
బయట కూర్చుని తినేందుకు కూడా అనువుగా దారికిటూ అటూ కుర్చీలు, మధ్యలోచిన్న స్విమ్మింగు పూల్స్ కూడా ఉన్నాయి.
లోపల హాల్స్ లో ఇండోర్ ఫుడ్ కోర్ట్స్ కి అనువుగా సిట్టింగ్ ఏరియాలతో అన్నీ ఎక్కడా తీసిపోని విధంగా సదుపాయాలు ఉన్నాయి.
అన్నిటికంటే అందరికీ బాగా నచ్చే విషయం ఏవిటంటే ఫుడ్ టిక్కెట్టులోనే భాగం కాబట్టి తినేందుకు విడిగా డబ్బులు కట్టనవసరం లేదు.
24 గంటలూ ఏదో ఒక ఫుడ్ కోర్టు తెరిచే ఉండడంతో భోజన ప్రియులకు చాలా మంచి అవకాశం.
పిల్లలకు ఇష్టమైన ఉడకబెట్టిన మొక్కజొన్నలు, పీజా, నూడుల్స్ వంటి వాటితో బాటూ రకరకాల మాంసాహారాలు, రకరకాల కేకులు, ఎంత తిన్నా తరగని ఐస్క్రీము మిషన్లు, లిమిట్ లేని జ్యూసులు, కూల్ డ్రింకులు ప్రత్యేకంగా అలరించేయి మమ్మల్ని.
షిప్పులో మొదటగా భోజనం చేస్తున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్లాలో, ఏం తినాలో అనే సందిగ్థత, తీరా తిన్నాక అయ్యో మరేవో చూసుకోలేదే అన్న బాధ కలగడం సహజం అందరికీ.
అందుకే ముందుగా కనబడ్డ ఫుడ్ కోర్టు లైనుల్లో నిలబడకుండా నిజానికి చెయ్యాల్సినదేవిటంటే ముందు క్షుణ్ణంగా అన్ని ఫుడ్ కోర్టు లు తిరిగి చూడాలి. చూసేక ఎక్కడ నచ్చితే అక్కడ నచ్చినవన్నీ పళ్లెంలో పెట్టి తెచ్చుకుని తినొచ్చు. అది అర్థమయ్యాక మా పని తేలిక అయిపోయింది.
ఇక కడుపు నిండా తిన్నాక తర్వాత పని షిప్పు లోని ప్రతీ ఒక్క విశేషమూ తిరిగి చూసి రావడం.
ముందుగా అన్నిటి కంటే పైనున్న టెర్రెస్ మీదికి అధిరోహించేం. ఆ టెర్రస్ నించి మధ్యలో ఫుడ్ కోర్టు లు ఉన్న పదో అంతస్థు కనిపిస్తూనే ఉంటుంది.
షిప్పు ఆ మూల నించి ఈ మూల వరకూ పైన పదకొండో అంతస్థులో నడవడానికే చాలా సమయం పడుతుంది.
ముందుగా ఒక వైపుగా ఉన్న మినీ గోల్ఫ్ ఆటకు దిగేరు సత్య, పిల్లలు. అది దాదాపు ఒక గంట సేపు పట్టే ఆట.
ఇక నేను వీళ్లకి ఫోటోలు తీయడంతో బాటూ ఆ ప్రదేశానికి ఆనుకుని ఉన్న వరండా లోంచి కనిపిస్తూన్న సముద్రానికి కళ్లప్పగించేను.
బాగా మంచి ఎండగా ఉండడంతో అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న నీడల్లో కూర్చుని ఆ కాస్సేపూ గడిపేను.
అక్కడి నుంచి షిప్పు మధ్యకి నడిచే దారిలో షిప్పు బయటి గోడని ఆనుకుని గట్టిగా కట్టిన లైఫ్ బోట్ల ని చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అవి కూడా చాలా పెద్దవి.
అవి దాటుకుని ముందుకు నడిచి మనుషులు గళ్ళలో నడుస్తూ ఆడే చదరంగం కాస్సేపు ఆడేం.
అక్కడే చిన్నపిల్లల డే అండ్ నైట్ కేర్ సెంటర్లు ఉన్నాయి.
షిప్పులో పెద్దవాళ్లు మాత్రమే వెళ్లే కొన్ని షోలకి పిల్లల్ని రానివ్వరు. అటువంటప్పుడు పిల్లల్ని వయసుల వారీగా ఉన్న ఈ కేర్ సెంటర్లలో వదలొచ్చు. ఈ సదుపాయానికి మొదటి ఉచిత గంటలు కొన్ని ఉన్నాయి. ఆ సమయం దాటితే డబ్బులు కట్టాల్సి ఉంటాయి.
షిప్పు కి మరో మూలకి పెద్ద వాటర్ పార్కు ఉంది. పిల్లలు వెంటనే అటు పరుగు తీసేరు. కానీ అతి కష్టమ్మీద వాళ్ళని ఆపాం.
ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.
అందులో అడుగు పెట్టడానికి స్విమ్మింగ్ బట్టలు అవసరం కాబట్టి ఆ కార్యక్రమాన్ని మరుసటి దినానినికి వాయిదా వేసేం.
అన్నట్లు మేం ఈ హడావిడిలో ఉండగానే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో షిప్పులోకి ఎక్కగానే ఇచ్చిన వెల్ కమ్ గురించీ, జాగ్రత్తల గురించీ కూడా చెప్పుకోవాలి.
షిప్పు లోని వారందరికీ వెల్ కమ్ పార్టీ అనౌన్సు మెంట్ వచ్చింది. అంతా ఎనిమిదో అంతస్తులో ఉన్న పెద్ద థియేటర్ లో కూచోవాలి.
ఎక్కడ చూసినా బంగారం తాపడం పూసినట్లు మిలమిలా మెరిసిపోతూ ఉందా హాలు.
రెండస్తుల్లో అత్యంత ఖరీదైన గొప్ప సీట్లు ఉన్నాయి అక్కడ.
అంతా హాలులో సర్దుకున్నాక స్వాగత నృత్యాలు ప్ర్రారంభమయ్యేయి. అరగంట తర్వాత షిప్పులో పాటించవలసిన జాగ్రత్తల కోసం అందర్నీ టెర్రేస్ మీదికి తీసుకు వెళ్ళేరు. అందులో భాగంగా ఒక వేళ షిప్పు మునిగిపోతే లైఫ్ బోట్లలో ఎక్కేటప్పుడు వహించాల్సిన ముఖ్యాంశాలు ముందుగా చెప్పసాగేరు.
క్లిష్ట సమయాల్లో ముందుగా పిల్లల్ని, ఆడ వాళ్ళని పంపుతామని చెప్తుంటే, టైటానిక్ జ్ఞాపకం వచ్చి ఒళ్లు గగుర్పొడిచింది.
(ఇంకా ఉంది)
-కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~