నా జీవనయానంలో (ఆత్మ కథ )-63- భక్తి నిర్వేదం – కె వరలక్ష్మి

కె.వరలక్ష్మి

ఇల్లుగలావిడ కూడా ‘నీళ్ళోసుకున్నప్పుడు ఏం తినాలన్పిస్తే అయ్యి తినాలమ్మా’ అంటూ ఒక తపేలాలో బియ్యం నింపి ఇస్తుండేది. ఆ సమయంలో అంత ఇష్టంగా, చివరికి కాన్పు బల్లమీద కూడా తినాలన్పించిన బియ్యం కాన్పు తర్వాత వాటి జోలికి పోవాలన్పించలేదు. అన్నం వండటానికి బియ్యం కడుగుతున్నప్పుడు కూడా నోట్లో వేసుకోవాలనిపించేది కాదు. ఇల్లు గల వాళ్ళ పిల్లలు నారిబాబు, కృష్ణ వాళ్ల చెల్లెలు, ‘అక్కా, అక్కా’ అంటూ నాతో ఇష్టంగా మసలేవాళ్ళు. మోహన్ కి స్కూల్లో పాఠాలు బాగా చెప్తాడని మంచి పేరొచ్చింది. ‘స్కూల్ ముగిసాక ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పొచ్చు కదా అన్నాను. ఆ బిజీలో పడితే వ్యసనాలకి దూరమౌతాడేమోనని నాకొక ఆశ. మర్నాడే ఇరవై మంది టెన్త్ క్లాసు పిల్లలొచ్చి అరుగు నిండా కూర్చున్నారు. మోహన్ స్కూలు నుంచి వచ్చి వాళ్ళ ముందు కుర్చీలో కూర్చుని ట్యూషన్ చెప్పడం ప్రారంభించాడు. నాకు చాలా సంతోషం కలిగింది. మధ్యమధ్యలో టీ పెట్టి ఇస్తూ హోమ్ వర్కులు దిద్దుతూ నేను కూడా సాయం చెయ్యడం ప్రారంభించేను. ఒక వారం రోజులు స్థిరంగా ఏం చెప్పాడో తర్వాత నుంచి పిల్లలకి ఏదో ఒక వర్క్ ఇచ్చి చేస్తూ ఉండమని బైటికెళ్ళిపోయేవాడు. లేదా అసలు స్కూలు నుంచి వచ్చేవాడు కాదు. ఆ ట్యూషన్స్ భారం నాపైన పడింది. డెలివరీ టైం వరకూ ఎలాగోలా లాక్కొచ్చాను. ఆ తర్వాత అందరూ మానేసారు. మోహన్ తెలివైన వాడేకానీ వ్యక్తిగా ఒక స్థిరత్వం ఉండటం లేదని నాకర్థమైంది. ఇంటిపని, వంటపని ట్యూషన్ చెప్పడానికి ప్రిపేర్ కావడం ఒకటే బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఉదయాన్నే వంట చేసేసి మోహన్ కి భోజనం పెట్టి పంపించేదాన్ని. పది గంటలకి తెమిలి గ్రంథాలయానికి వెళ్ళి నాకు నచ్చిన బుక్కొకటి తెచ్చుకునేదాన్ని. మధ్యాహ్నం లీజర్ టైంలో మోహన్ వచ్చేసరికి పకోడీలు, బజ్జీలు లాంటి అల్పాహారం, టీ చేసేదాన్ని. తనటు వెళ్ళగానే తెచ్చుకున్న పుస్తకం చదవడం, ఏదో ఒకటి రాయడం చేసేదాన్ని. అప్పటికి గ్రంథాలయం వేణుగోపాలస్వామి గుడిముందు ఇప్పుడు శాస్త్రిగారు ఉంటున్న చోట పాత ఇంట్లో ఉండేది. ఆ ఎదుట ఇప్పటికీ ఉన్న పాత గోడౌను లాంటి ఇంట్లో లైబ్రేరియన్ శివాజీ గారు, హిందీ అక్కయ్య గార్ల కుటుంబం ఉండేది. మేమున్న ఇంటి నుంచి బాగా దగ్గర.

అపార్థాలు తొలగినా నాకెందుకో మా అమ్మ వాళ్ళింటికి వెళ్లాలన్పించేది కాదు. వాళ్లే వచ్చి చూసి వెళ్తూండేవారు. బొగ్గులకుంపటికి తోడుగా కిరోసిన్ గ్యాస్ స్టవ్ కొన్నాడు మోహన్. రెండిటిమీదా వంట తొందరగా అయిపోయేది. వంటల్లో కొన్ని ప్రయోగాలు చేసేదాన్ని కాని ఎక్స్ పర్ట్ ని కాలేకపోయాను. చేతనైన కొన్నీ మా అత్తగారు నేర్పించినవే ఏ విషయాన్నైనా ఎంతోబాగా గుర్తుపెట్టుకునే నాకు వంటకి సంబంధించినవేవీ గుర్తుండవు. ఇప్పటికీ అంతే. మా మావగారికి లైన్ ఇన్స్పెఅక్టరుగా ప్రమోషను వచ్చి కుటుంబం మళ్లీ రాజమండ్రి వచ్చేసారట. ఆయన జోన్ లో జగ్గంపేట కూడా ఉండేది. అందువల్ల తరచుగా వస్తుండేవారు. మోహన్ అమ్మమ్మగారు అప్పులు తీర్చలేక ఎస్టేటు మొత్తం అప్పిచ్చిన గారపాటి చౌదరిగారికిచ్చేసి, వాళ్ళిచ్చిన కొద్దిపాటి మొత్తం కూతుళ్ళు అయిదుగురికీ పదేసి వేలు చొప్పున ఇచ్చేరట. మా అత్తగారి డబ్బు అప్పులవాళ్ళకి సరిపోయిందట. ఎస్టేటుకి నైరుతి మూలలో సెంటున్నర స్థలం ఉంచుకుని దాంట్లో రెండు గదుల పెంకుటిల్లు కట్టుకున్నారట. దానికోసం ఇటుక, పెంకు, తాటివాసం లాంటివి మోహన్ జగ్గంపేట నుంచే బళ్లమీద పంపించాడట. ‘అప్పులు చేసేను’ అని అంటుండేవాడు. ఆర్థిక విషయాల్లో కల్పించుకోవద్దన్నాడని నేనేం మాట్లాడేదాన్ని కాదు. ఒకసారి మాత్రం ‘మీ అమ్మమ్మగారు మిమ్మల్ని కొడుకులాగా చూసేరు కదా, ఆవిడ ఆస్తిని పరాయిపాలు కాకుండా కాపాడాల్సింది’ అన్నాను. ‘అదేమన్నా వందల్లో వ్యవహారం అనుకుంటున్నావా, లక్షల్లో వ్యవహారం, పాతికవేల అప్పు ఎప్పటికప్పుడు వడ్డీ కట్టక ఆస్తిని మింగేసింది. మనం కల్పించుకుంటే ఆవిడ కూతుళ్ళూ, అల్లుళ్ళూ ఊరుకుంటారా? పెద్దజీతాలు తెచ్చుకుంటున్న అల్లుళ్ళు పట్టనట్టు ఊరుకున్నారు. నూటడెబ్బై రూపాయల జీతంతో మనమేం చెయ్యగలం?’ అన్నాడు. నేనైతే నెలనెలా వచ్చే అద్దెలోంచి వడ్డీ కట్టేసి, ఒకషాపు అమ్మేసి అసలు తీర్చేసి మిగిలిన ఎస్టేటు పోకుండా కాపాడేదాన్ని అంటూ ఊరికే మనసులో అనుకున్నాను.

వాళ్ళనాన్నగారు వచ్చినపుడు మోహన్ స్కూల్లో పర్మిషన్ తీసుకుని వచ్చేసి మాంసమో, చేపలో కొనుక్కొచ్చేవాడు. వీధి అరుగుమీద మడతమంచం మీద దుప్పటివేసి మంచినీళ్ళు అందించి సకల మర్యాదలూ చేసేవాడు. నేనేమో పైటచెంగుభుజాల మీదుగా కప్పుకొని వడ్డించడం. ఆయన బిగుసుకుపోయి ఎటో చూస్తూ కూర్చోవడం నిన్న మొన్న జరిగినట్టనిపిస్తోంది.

1970 డిశంబరు 10 ఉదయం మోహన్ స్కూలుకెళ్లాక ఇంట్లో ఏదో చక్కబెడుతూండగా కడుపులోంచి నొప్పి మెరుపులా జరజరా ఒళ్లంతా పాకినట్టైంది. మొదటిసారి నాకు ఇలాంటి నొప్పి వచ్చిన గుర్తు లేదు. పావుగంట తర్వాత ఇంకొంచెం ఉధృతంగా వచ్చేక కాన్పు సమయమని అర్థమైంది. ఇల్లుగల వాళ్లంతా పొలానికెళ్ళిపోయేరు. వీధిలోకి వచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు. రిక్షాలు దొరికే ప్రాంతం కాదు. ఏమైతే అయిందని ధైర్యం తెచ్చుకుని ఇంటికి తాళం వేసి నడక మొదలుపెట్టాను. రెండడుగులు వేసి రామాలయం గోడ పక్క నడుస్తూండగా ఒకసారి, గోలిశ్రీరాములుగారి ఇంటిగోడ పక్క ఒకసారి, కాసా వాళ్ల పాతింటి గోడ పక్క ఒకసారి, తోట రామారావు గారి గోడ పక్క ఒకసారి వచ్చిన నొప్పుల్ని గోడలు పట్టుకుని ఓర్చుకున్నాను. అక్కడి నుంచి ఉధృతమైన నొప్పుల్ని పంటి బిగువున భరిస్తూ మా అమ్మవాళ్ళింటికి చేరుకున్నాను. మా నాన్న రిక్షా కోసం పరుగెత్తారు. మా అమ్మ గబగబా కావాల్సినవన్నీ సర్దేసింది. నేను, మా అమ్మ యానాదుల తూము దగ్గరకి చేరుకునే సరికి మా నాన్న స్కూలుకెళ్ళి మోహన్ ని తీసుకుని వచ్చేశారు. అప్పటికి కాకినాడ బస్సులు యానాదుల తూము దగ్గర ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడునన్ని బస్సులు లేవు. బస్సొచ్చే వరకూ చీర కొంగు నిండుగా కప్పుకొని మా అమ్మ భుజాన్ని ఆనుకుని నిలబడ్డాను. బస్సొచ్చి, మేం కాకినాడ జనరల్ హాస్పిటల్ కి చేరేసరికి రెండో మూడో అయినట్టుంది. లేబర్ రూంలో నా పక్కనే ఉన్న మరో ఇద్దరి కేకలు, ఏడుపులు వినేసరికి నాకు భయం పట్టుకుంది. నొప్పి, బాధ భరించగా భరించగా రాత్రి 12.05 కి పాపాయి పుట్టింది. వెంటనే ఏడుపు అందుకుని హాస్పిటల్ మారుమ్రోగేలా చేసేసింది. మళ్లీ నాకు కుట్లు పడటం వల్ల హాస్పిటల్లో ఏడురోజులు ఉండాల్సొచ్చింది.

పిల్లల పుట్టిన తారీకులు, టైం, నక్షత్రం, తిధి వగైరాలు మోహన్ డైరీలో నోట్ చేశాడు. ఎరియర్స్ వచ్చేయట మేం ఇంటికి వచ్చేసరికి నా నెక్లెస్ విడిపించి తెచ్చి ఇచ్చాడు. ఇక రాదనుకుని దాని మాటే మరచిపోయిన నేను నిజంగానే సర్ప్రైిజ్ అయ్యాను. మా అమ్మ వాళ్లింట్లోంచి 21వ రోజే మా ఇంటికి వచ్చేశాను. రోజూ మా అమ్మ వచ్చి పాపాయికి స్నానం చేయించి వెళ్ళేది.

మోహన్ మామూలే. రాత్రంతా పేకాట, బ్రాకెట్ నంబర్లు అంటూ తెల్లవారుఝామునెప్పుడో వచ్చేవాడు. సెలవొస్తే అట్నుంచటే రాజమండ్రి వెళ్ళిపోయేవాడు. తను చేస్తున్న ఉద్యోగానికి ఆ ప్రవర్తన మంచిది కాదని చాలా చెప్పి చెప్పి విసిగిపోయాను. అప్పటికి మా తెలుగు మాస్టారు వేణుగోపాలస్వామి ఆలయంలో భాగవత పురాణం చెప్తున్నారు. సంధ్యవేళ అవుతూనే పాపాయిని ఎత్తుకుని గుడికెళ్ళే దాన్ని. టవల్ పరిచి పాపాయిని పడుకోబెట్టి పురాణకాలక్షేపం ముగిసే వరకూ ఉండి వచ్చేదాన్ని. గుళ్ళో మురళీలోలుడొకపక్క, మాస్టారు చెప్పే సద్వచనాలొకపక్కా నాకు గొప్ప సాంత్వన కలిగించేవి. సహనం వహిస్తే మంచిరోజులవే వస్తాయి అంటూ మాస్టారు చెప్పే మాటలు నా గురించే చెప్తున్నట్లుండేవి. ప్రవచనాల్లో కలిపి జీవితానికి అన్వయించుకోవాల్సిన మాటలు కూడా కొన్ని చెప్తూ ఉండేవారు. మనిషి బ్రతకడానికి తినాలి తప్ప తినడానికి బ్రతకకూడదు’ మనిషి తన కొచ్చే ఆదాయంలో ఒక్క రూపాయైనా వెనకేసుకోవాలి తప్ప అప్పు చెయ్యకూడదు.’ ‘ఉపకారం చెయ్యలేకపోయినా ఫర్వాలేదు ఎవరికీ అపకారం తలపెట్టకూడదు’ ‘పుట్టేం- గిట్టేం అన్నట్టు కాకుండా జీవితకాలంలో ఏదో ఒకటి సాధించాలి’ లాంటివి. ఆయన చెప్పిన ఏ మాటైనా నాకు శిరోధార్యమే అన్పించేది. ఆయన మాటలు నాకొక ధైర్యాన్నిచ్చి వెన్నుదన్నుగా నిలిచేవి.

అప్పటికా గుడి శిధిలావస్తలో ఉండేది. తుప్పలు, పిచ్చి మొక్కలు లేచి ప్రదక్షిణం వీలుపడేది కాదు. గోడలు పడిపోయి, నేలమీది రాళ్లు లేచిపోయి, గుడిగోడలు మాసిపోయి ఏదోగా ఉండేది. అంతా కలిపి పది పదిహేను మంది పెద్ద వయసు వాళ్ళు వచ్చి కూర్చునేవారు. అక్కడ నేను, అక్కయ్యగారు (మాస్టారి భార్య) మాత్రమే చిన్నవాళ్ళం. ధీరగంభీర స్వరంతో రాగయుక్తంగా పద్యాలు చదువుతూ మనసుకు హత్తుకునేలా ప్రవచించేవారు మాస్టారు. ఇప్పటికాలం అయ్యింటే ఆయనకు చాలా పేరొచ్చి ఉండేది.

పాపాయికి మూడవనెల రాగానే అదే గుడిలో మాస్టారిచేతే ‘గీతా మాధవి’ అని నామకరణం చేయించాం.
నా చీరలన్నీ పాతవైపోయాయి. మోహన్ కి ఉద్యోగం వచ్చి ఏడాదిన్నర అయ్యింది. మొహమాటపడి ఊరుకుంటే కొనేలా లేడని చీర కొనిపెట్టమని అడిగాను. ‘డబ్బు లెక్కడున్నాయ్’ అన్నాడు ఠకీమని. ‘మీ వాళ్ళని కొనిపెట్టమను’ అని కూడా అన్నాడు. అంతే, నేనింక ఏనాడూ అతన్ని అడగలేదు. బహుశా భార్యలు భర్తల్తో వ్యవహరించే విధానం అది కాదనుకుంటాను. అందుకే ఆ తర్వాతి కాలంలో నాకన్నా చిన్నవాళ్ళు కూడా నన్ను ‘చేసేవులే, తెలివి తక్కువ కాపురం’ అన్నారు.

నెలనెలా మోహన్ ఇరవై ఇవ్వగానే రెండు రూపాయలు తీసి ఒక డబ్బాలో వెయ్యడం మొదలుపెట్టాను. ఆరునెలల తర్వాత పన్నెండు రూపాయల్తో మొదటిసారిగా ఒక ఫుల్ వాయిలు చీర కొనుక్కున్నాను. ఐదుముక్కలు కలిపి కుట్టిన బంగారు పసుపు రంగు చీర. నేరేడు పండు రంగు సిల్కు దారం కొని అతుకులు కనబడకుండా రెండు వేళ్ళ వెడల్పున ఎంబ్రాయిడరీ చేశాను. అప్పుడప్పుడే కొత్తగా చాలామంది వరలక్ష్మీ పూజలు, వ్రతాలు చేస్తున్నారని, నన్నూ చేసుకోమని మా అమ్మ చెప్పింది. ఆ చీర- జాకెట్టు పూజ దగ్గరపెట్టి తీసి కట్టుకున్నాను. అందరూ ‘చీర బావుంది’ అంటూంటే నాకేదో సాధించినంత తృప్తిగా అనిపించింది. అది చూసి ఏమనుకున్నాడో మోహన్ నా పుట్టినరోజుకి అరవై రూపాయలు పెట్టి బెత్తెడు వెడల్పు తెల్లసిల్కు దారపు ఎంబ్రాయిడరీ అంచున్న పాలపిట్టరంగు బిన్నీ సిల్కు చీర కొని తెచ్చాడు. అప్పటికి అరవై రూపాయలంటే ఖరీదైన చీర అని అర్థం. కట్టుకుంటే రాయల్ గా ఉండేది.

అప్పుడెప్పుడో చదువుకునే రోజుల్లో అదివారప్పేటలో నేను చూసిన శివబాలయోగి ప్రసిద్ధుడై బెంగుళూరులో ఆశ్రమం నిర్మించారట. ఊళ్ళో ఆయనకు భక్త బృందం ఏర్పడి సర్పంచి గారింటి వాకిట్లో భజనలు చేస్తున్నారని, ఆడా మగా పూనకాలొచ్చి ఒకళ్లమీదొకళ్ళు పడిపోతున్నారని విని చాలా జుగుప్స కలిగింది. నా ఫ్రెండ్ లీల వాళ్లన్నయ్య తన హోటల్ కి శివబాల హోటల్ అని పేరు పెట్టేశాడు.

మేం జగ్గంపేటలో ఉండటం మా అత్తగారికి ఇష్టం లేదట. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటుండేవారు. కొడుకుని రాజమండ్రికి ట్రాన్స్ ఫర్ చేయించుకోమని చెప్పేవారు. అదంత సులభం కాదనే వాడు మోహన్. ఎందుకు కాదో నాకూ తెలీదు. అయినా ఆ తల్లీ కొడుకుల సంభాషణల్లో నేనెప్పుడూ కల్పించుకునేదాన్ని కాదు.

– కె వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో