నా జీవనయానంలో (ఆత్మ కథ )-62- తిరిగి జగ్గంపేటకి – కె. వరలక్ష్మి

కె.వరలక్ష్మి

అక్కడ సాధారణంగా పాలేర్లు, పని వాళ్ళు లేదా ఇంటి మగవాళ్ళు నీళ్ళు తోడుకొచ్చేవారు. మా ఇంట్లో ఉన్న చిన్న ఇత్తడి కూజా బిందెతో నడుమున పెట్టుకుని నేను నీళ్ళు తెచ్చుకునేదాన్ని. ఆ రోజు మిట్టమధ్యాహ్నం వంట అయ్యాక నీళ్లకి బయలుదేరాను. నూతి దగ్గర ఎవరైనా ఉంటే నీళ్ళు తోడి పొసేవారు. ఎవరూ లేరు. వేవిళ్ల వికారం, తిండి తినని నీరసం కలిసి గొప్ప ఇరిటేషన్ వచ్చేసింది. ఎలాగో నీళ్ళు నింపుకుని నడక మొదలుపెట్టాను. సగం దూరం వచ్చాక కుడివైపు కాలవమీద సన్నని సిమెంటు వంతెన దాని వెనుక ఉన్న ఇల్లే కొప్పిశెట్టి మాస్టారి ఇల్లని, మోహన్ అక్కడే పేకాడుతుంటాడని ఇది వరకు ఎవరో చెప్పారు. బిందెను వంతెన దిగువ వదిలేసి తలకి తగిలేంత కిందికి ఉన్న పెంకుటింటి చూరు కింద వంగి లోపలికెళ్లాను. వెలుతురు లోంచి వెళ్ళిన నాకు కాసేపటి వరకు ఏమీ కనిపించలేదు. ఇంటి వెనుక అది వంటిల్లు కాబోలు. మాస్టారి పెళ్లాం పొయ్యి మీద ఏదో వండుతోంది. నేను ఆగకుండా లోపలికెళ్ళిపోయాను. కొంత పెద్దగా ఉన్న హాలులాంటి ముందుగదిలో సిగరెట్ పొగ మధ్య నాలుగు బ్యాచ్లుెగా కూర్చుని మగవాళ్ళు పేకాడుతున్నారు. ఒక బేచ్ లో నోట్లో సిగరెట్ తో మోహన్ కనిపించాడు. ఆ దృశ్యం చూసి నాకు పట్టరాని దుఃఖం వచ్చేసింది. ఏడవడం మొదలు పెట్టాను. అందరూ షాక్ అయినట్టు చూడ్డం మొదలుపెట్టారు. ఆవేశంతో నా గొంతులోంచి మాట పెగలలేదు. ‘నేను మా ఇంటికెళ్ళి పోతాను’ అని కీచుగొంతుతో ఒక్క అరుపు అరిచి వెనక్కి తిరిగాను. వంటింటి బైట వాకిట్లో మాస్టారి పెళ్ళాం నడుము మీద చేతులుంచుకుని నిలబడి ఉంది, ‘ ఇదిగో చూడమ్మాయ్, మొగోడు కష్టపడి సంపాదిస్తాడు. తన సంపాదన తన ఇష్టం. కొంత ఇశ్రాంతి కోసం ఇలాగేదో ఆడుకుంటారు. డబ్బు పోతాదని నీ బాద కాబోలు. ఎదవ డబ్బు, ఇయాల పోతే రేపు సంపాదిస్తారు. కట్టుకున్న పెళ్లాంగా మనం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు సుకంగా ఉండనియ్యాల’ అంటూ క్లాసు మొదలుపెట్టింది. ఆవిడకి నా కన్నా పెద్ద కూతుళ్ళు, కొడుకులు ఉన్నారట. నాకసలు ఆవిడ ముందు నిలబడాలనిపించలేదు. బిందె చంకనెత్తుకుని వచ్చేసాను. ఇరవై ఏళ్ళ తరువాత ఆ కుటుంబం జగ్గంపేటలోని మా ఇంటికి వచ్చినపుడు ఉన్న ఊళ్ళోని ఇల్లూ వాకిలీ అమ్మేసుకుని, చిన్న ఉద్యోగమేదో కాకినాడలో చేస్తున్న పెద్ద కొడుకింట్లో ఉంటూ, ఇంకా స్థిరపడని పిల్లలతో బాటు ‘పాట్లుపడుతున్నాం’ అంది నిర్వేదంగా. పెద్దాయన పెన్షనుతో పేకాడుతుంటాడట. ఆవిడ గొంతులో ఇదివరకటి ధాటి లేదు.
[spacer height=”20px”]మోహన్ ఒక సెలవురోజు వెళ్ళి బాబుని తీసుకు వచ్చేశాడు. ‘నాగురించి ఎందుకు ఆలోచిస్తావ్? పిల్లాణ్ణి చూసుకుంటూ హాయిగా ఉండక’ అన్నాడోసారి. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనిపించింది. మా అమ్మ చెప్పిన ప్రకారం కొద్దిగా బియ్యం, పప్పు కలిపి మెత్తగా ఉడికించి, నెయ్యి పోసిఒకసారి, చారుపోసి ఒకసారి గుజ్జుగా కలిపి వాడిని చంకనెత్తుకుని గిన్నె పట్టుకుని కాలవ గట్టునో, కొబ్బరిచెట్లలోనో తిప్పితేగానీ తినేవాడు కాదు. ఒక్కసారి నోట్లో పెట్టిన గోరుముద్ద ఎంతసేపయినా బుగ్గలో ఉంచుకునేవాడు. వాడు టాయ్లె ట్ కి వెళ్తే తీసుకెళ్ళి కాలవలో నుంచోబెట్టేదాన్ని. ఆ నీళ్ళమీద కొట్టి ఆడుకోవడం వాడికి ఇష్టంగా ఉండేది. చిన్న కాలవ కాబట్టి భయం ఉండేది కాదు. రోజంతా వాడి పనుల్తోనే సరిపోయేది.
[spacer height=”20px”]మోహన్ పదో తరగతి పేపర్లు దిద్దవలసి ఉంది. అందుకని సెలవుల్లో అక్కడే ఉండిపోయాం. అప్పటికింకా జిల్లా కేంద్రంలో పేపర్లు దిద్దే పద్ధతి రాలేదు. ఒక జిల్లా పేపర్లు మరో జిల్లాలో ఎక్కడికో వెళ్ళేవి. మోహన్ కి సైన్సు, లెక్కల పేపర్లు వచ్చేవి. ఆన్సర్ షీట్ దగ్గర పెట్టుకుని నేను కూడా పేపర్లు దిద్దేదాన్ని. ‘ఎందుకంత టైం తీసుకుని శ్రద్ధగా దిద్దుతావు? టకటకా వేసి పడేద్దూ’ అనేవాడు మోహన్. ‘చేసేపని ఏదైనా పర్ఫె?క్ట్గా ఉండాలి’ అనేదాన్ని నేను.
కందికుప్పకు చెందిన సైన్స్, లెక్కలు చెప్పే మాస్టారొకాయన జగ్గంపేటకు దగ్గరలో ఉన్న కిర్లంపూడి హైస్కూల్లోచేస్తున్నాడట. ఆయన మోహన్ కి మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ కోసం ఉత్తరం రాసేడు. మరోమాట కూడా రాసేడు. కిర్లంపూడికి చెందిన మాస్టారొకాయన జగ్గంపేటలో చేస్తున్నాడని, ఆయన ఒప్పుకుంటే మీరు నేరుగా జగ్గంపేటకే వెళ్ళొచ్చని, తీరాచూస్తే ఆయన నేను స్కూలుఫైనల్లో ఉండగా వచ్చిన మాస్టారే. ముగ్గురూ ఉత్తరాలు రాసుకుని, కాకినాడ DEO ఆఫీసుకెళ్ళి ప్రయత్నాలు చేసుకున్నారు. ఇక సెలవులు ముగుస్తాయనగా కందికుప్పకీ, దొంతికుర్రుకీ అక్కడి జనాలకీ బై చెప్పేసి, రోజంతా కురిసిన కుండపోత వర్షంలో సామాన్లూ, మేమూ తడిసి ముద్దై కాకినాడ వచ్చేసరికి లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. రిక్షాల్లో జగన్నాధపురం వెళ్ళి, మా అమ్మగారింటి వాకిట్లో సామాను, ఇరుకింట్లో మేమూ తలదాచుకుని, మర్నాడు మధ్యాహ్నానికి జగ్గంపేట చేరుకున్నాం, ఆర్డర్స్ రాగానే ఇల్లు చూసుకోవచ్చని మూటలు విప్పకుండా సామాన్లు అలాగేఉంచేసి మా పుట్టింటి దేవుడి గది అరుగుమీద సర్ది, ఇవతలివైపు ధాన్యంగది అరుగుమీద బొగ్గులకుంపటి మీద వంట చేసేదాన్ని. స్కూల్స్ తెరిచేశారు. జగ్గంపేటలో ఉన్న మాస్టారు నిర్ణయం తీసుకోవడం లేదు. మోహన్ రోజూ కేరియరు పట్టుకుని బస్సులో కిర్లంపూడి వెళ్ళొస్తున్నాడు. ఆరోజు మోహన్ కి కేరేజి సర్దేసి, బాబుకోసం పాలు కాస్తున్నాను. మా నాన్న స్నానం చేసి పూజ కోసం దేవుడి గదిలోకి వెళ్తూ.. ‘ఛీ.. ఛీ గుమ్మం నిండా సామాన్లేంటి? పెళ్ళిచేసిపంపించినా మాకు పీడ విరగడవ్వలేదు.’ అన్నారు. నా మనసు బాణం దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయింది. నాకు తెలీకుండానే నా కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. పుట్టింట్లో అవమానం ఎంతగా భరించరానిదో తెలిసివచ్చింది. ‘ఇంకొక్కవారం’ అని నచ్చచెప్పబోతున్న మోహన్ని ‘ప్లీజ్ బండి తీసుకురండి’ అని బ్రతిమిలాడాను. సామానుతోబాటు నన్నూ బాబునీ, ఒంటెద్దుబండి ఎక్కించి మోహన్ బస్సులో వెళ్ళిపోయాడు. మేం అక్కడికి చేరేసరికి కిర్లంపూడికివతల ఉన్న చిల్లంగిలో రెండు గదుల ఇల్లు తీసుకుని శుభ్రం చేయించి పెట్టాడు. చిల్లంగిలో ఎవరో మోతుబరిరైతు కుటుంబానికి చెందిన ఔట్ హౌజ్ అది. ధాన్యం కొట్టు గదులలాంటి రెండు గదులు. ఒకటి వంటకి ఇంకొకటి ఉండటానికి సర్దుకున్నాం. ఇల్లుగలవాళ్ళే పొదుగుదగ్గర చిక్కని పాలు పోసేవారు. ఇల్లుగలావిడ నల్లగా, లావుగా, ఎత్తుగా ఉండేది. జానెడు వెడల్పు జరీ అంచుల చీరలు కట్టుకుని, ఎప్పుడూ ఒళ్ళంతా చాలా నగలు అలంకరించుకుని ఉండేది. కానీ, ఆవిడ కళ్ళల్లో ఏదో దయ నిండి ఉండేది.[spacer height=”20px”] రోజూ సాయంకాలాలు పెద్దింటి వాకిట్లో నగిషీ పనిచేసిన చెక్కకుర్చీలో కూర్చుని పెద్దగిన్నెతో నేతిలో ఉడికించిన బెల్లం తీగపాకం తింటూ ఉండేది. వాకిట్లో ఏదో పని చేసుకుంటున్న నాకు ఒక గిన్నెతో పంపించింది. నేను మొహమాటపడుతుంటే ‘తినమ్మా నడుముకి మంచి బలం చేస్తుంది’ అంది. నేను ఇష్టంగా తినడం చూసి రోజూ పంపించేది. ఏదో అలా మసలుతున్నాను గానీ, అవమానం తాలూకు దుఃఖంతో తల్లడిల్లిపోతున్నాను. ఎదుట ఎవరూ లేకపోతే ఏడుపు ముంచుకొస్తోంది. నేను నైన్త్ చదివేటప్పుడు కొన్ని నెలలు మాకు తెలుగు చెప్పిన మీసాల తెలుగుమాస్టారిది కిర్లంపూడే అని, ఆయన నన్ను అడిగేరని మోహన్ చెప్పాడు. ఆదివారం నాడు మాస్టారింటికెళ్ళాం. ఆయన చాలా ఆత్మీయంగా పలకరించి స్కూల్లో నేను చదివే విధానం గురించి, నా అణకువ గురించి మోహన్ ఎదుట పొగిడారు. వారింట్లోంచి మనుచరిత్ర అడిగి తెచ్చుకున్నాను. పూర్తిగా చదవనేలేదు. మ్యూచువల్ ఆర్డర్స్ వచ్చేసాయి. ఈ బుధవారం వెళ్ళాం. మళ్ళీ బుధవారం నాడు ఒంటెద్దు బండిమీద సామాను వేసుకుని తిరిగి జగ్గంపేట రావాల్సి వచ్చింది. ‘జగ్గంపేట వెళ్ళొద్దు. ఇక్కడే ఉండిపోదాం; అని మోహన్ కి చాలా చెప్పి చూసాను. ట్రాన్స్ఫర్ కేన్సిల్ చేయించుకొమ్మని బతిమాలాను. ‘ఇప్పుడిక అది వీలుపడదు’ అన్నాడు మోహన్.
[spacer height=”20px”]దొంతికుర్రు నుంచి వచ్చిన వెంటనే నేను కొన్ని ఇళ్ళు చూసాను. ఇప్పుడు శ్రీరామ్ నగర్ లో ఇరిగేషన్ ఆఫీసు నడుస్తున్న బిల్డింగు ఉన్న చోట బుద్దాలపోలయ్య అనే యాదవుడి పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంటిముందు ధాన్యంగాదెకి గుమ్మం పెట్టించి అద్దెకివ్వబోయారు. కిటికీలు, వెంటిలేటర్లు లేవు. అప్పటికింకా శ్రీ రామ్ నగర్ ఏర్పడలేదు. హైవేను ఆనుకుని నాలుగైదు ఇళ్ళు ఉండేవి. ఇప్పుడు శ్రీరామ్ నగర్ ఉంటున్న ప్రాంతం అంతా చెరుకుతోటలు, వరిపొలాలు, అద్దె ఐదురూపాయలే కానీ, ఊరికి దూరం అన్పించి వద్దనుకున్నాం. తర్వాత శివాలయం వీధిలో దిబ్బమ్మగారి మండువాలోగిలికి పైన ఆగ్నేయంలో ఒకే ఒక చిన్న గది ఉంది. దిబ్బ అంటే లావు అన్న అర్థం తూర్పు గోదావరిజిల్లాలో లేదు. అయినా గానీ కోమటింటి ఆడపడుచు మహాలక్ష్మి గారు బాగా లావుగా ఉంటుందని ఆవిడ్ని అందరూ దిబ్బమ్మ అనేవారు. మండువాలో ఒక్కత్తే కూచుని బొగ్గుల కుంపటి మీద వండుకుంటున్న ఆవిడ ఆ గిన్నె దించేసి చిక్కటిపాలల్లో చారెడు పంచదార, టీపొడి వేసి టీచేసి ఇచ్చారు. మంచి టీ ఎలా పెట్టచ్చో నాకు అప్పుడే తెలిసింది. అంత పెద్ద మండువాలోగిట్లో ఆవిడ ఒక్కరే ఎలా ఉంటున్నారా అని నాకు ఆశ్చర్యమేసింది. ఆవిడ చాలా ఆప్యాయంగా పై గది తాళంచెవి ఇచ్చి, చూసివచ్చాక, ‘ఐదు రూపాయలివ్వు చాలు. పోనీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు. వచ్చి ఉండండమ్మా. ఇంతింట్లో ఒక్కదాన్నీ ఉండలేకపోతున్నాను’ అంది. కానీ, అది ఎప్పటిదో పాతఇల్లు. వెదురుగడల శ్లాబ్ మీద వేసిన గది కావడం వల్ల నడుస్తుంటేనే నేల ఊగుతోంది. ఆ ఇల్లు సరిదేనీలాచలం (ఎస్.వరలక్ష్మి) తండ్రి గారిదట. ఇంటికొచ్చాక చెప్తే ‘అమ్మో, అంత పాతింట్లో ఉండద్దు’ అనేసారు మా నాన్న. ఆ ఇంటి స్థానంలో ప్రస్తుతం మా మాస్టారి కొడుకులు నూజిళ్ళ రాంబాబు, సూరిబాబు కొత్త ఇళ్ళు నిర్మించుకున్నారు. ఇక మూడవది గెద్దపేట రామకోవెల వెనక కోండ్రోతువాళ్ళు అప్పటికి కొత్తగా కట్టుకున్న డాబా ఇంట్లో దక్షిణం వైపున్న పోర్షను. ముందు విశాలమైన అరుగు, వెనక కాస్త పెద్ద గది, దాని వెనుక చిన్న గది. అద్దె పదిహేను రూపాయలు. ఇంటి వెనుక తాటాకుల దడి బాత్రూం. కొత్తగా కట్టడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంది. ముఖ్యంగా ఇంటినిండా మనుషులున్న పెద్ద కుటుంబం. నేను బండిని నేరుగా అక్కడికే పోనిచ్చాను. మోహన్ చకచకా సామాన్లు సర్దేశాడు. తను అలాంటి పనుల్లో చురుగ్గా ఉండేవాడు. పల్లెటూళ్లల్లో ఏ మాటయినా ఇట్టే ఊరంతా పాకిపోతుంది. మేం వచ్చినట్టు తెలిసినట్టుంది మర్నాడు మా అమ్మ వచ్చింది. ఆ రోజు మేం వాళ్ళింట్లోంచి వెళ్తున్నప్పుడు తను కన్నీరు మున్నీరు కావడం చూసాను. వస్తూనేబాబుని ఎత్తుకుని ముద్దులు కురిపించింది. నేను ముభావంగా ఉండిపోయాను. ‘వచ్చినప్పటినుంచీ మోహన్రావు సెంటర్లో పేకాట ఆడతన్నాడంట. పైగా బ్రాకెట్లు కట్టడం అంట. నీతో చెప్తే బాధపడతావని అనలేదు. ఆరోజు అల్లుడి మీద కోపం ఆపుకోలేక అలాగ అనేసారు. అని చెప్తుండగా మా నాన్న వచ్చారు. ‘ఇంకా కోపం పోలేదా నా తల్లికి’ అంటూ నా దగ్గరకొచ్చి తలనిమిరారు. ముగ్గురికీ ఏడుపాగలేదు. బాబుని తీసుకెళ్ళిపోయారు. అపార్థాలు తొలగి మనసు తేలికపడింది కానీ మోహన్ విషయంలో దిగులు పట్టుకుంది. అతనితో గొడవ పడేందుకు ఇష్టమూ ఓపికా ఉండేవి కావు. పైగా ఎవరైనా వింటే ఏమనుకుంటారో అనే భయం ఒకటి. దాన్నే మోహన్ అలుసుగా తీసుకున్నాడు. నేనతన్ని అడిగినప్పుడు ‘ఏం నీడబ్బుల్తో, మీ నాన్న డబ్బుల్తో ఆడుతున్నానా? నా సంపాదన, నా ఇష్టం’ అన్నాడు. నేను నిస్సహాయంగా ఉండిపోయాను. ఆఫస్టుకి నా చేతికి ఇరవై రూపాయలిచ్చి ‘ఇంటద్దె కట్టి నెలనెలా ఇరవై ఇస్తాను. ఇంటిని ఎలా నడుపుతావో నాకు తెలీదు. మధ్యలో అడగద్దు’ అన్నాడు. నేను దానికే మురిసిపోయి ఏం కొన్నా పద్దు రాసి అతనికి లెక్క అప్పగించేదాన్ని. బియ్యం, పాలు లాంటివి ఇల్లుగలావిడ దగ్గరే కొనేదాన్ని. వాళ్ళ చేలోంచి వచ్చిన కూరగాయలు ఊరికే ఇచ్చేవారు. ఆ వీధిలో ఇంచుమించు అందరూ పొలం పనులకి వెళ్ళేవారు. నేను గర్భంతో ఉన్నానని ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు ఫోటో స్టూడియో నడుపుతున్న గంగాధరం అప్పుడు చిన్నవాడు. వాళ్లమ్మ చేలోంచి చిన్న చిన్న పీతల్ని అన్నం పట్టుకెళ్ళిన కెరేజీలో నింపుకొచ్చేది. వాటితో పులుసు చాలా బాగుండేది. ఇల్లు గలవాళ్ళు తరచుగా ధాన్యం ఆడించి హాల్లో రాశిగా పోసి బాగుచేసేవారు. ఆ బియ్యం రుచి చాలా బావున్నట్టుండేది. అదేపనిగా తింటూండేదాన్ని.

– కె వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో