డైమండ్ హెడ్ మాన్యుమెంట్: ఉదయం హానోలూలూ లో స్నోర్కిలింగు టూరు నించి తిరిగొచ్చి అలిసిపోయి ఉన్నా, హానోలూలూలో మాకున్న రెండు రోజుల సమయంలో చూడాల్సిన లిస్టు లో ఆ రోజు రెండు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంది. మొదటిది డైమండ్ హెడ్ మాన్యుమెంట్. రెండు లక్షల సంవత్సరాల కిందట పెల్లుబికిన అగ్నిపర్వతపు కొన. రెండవ ప్రప్రంచ యుద్ధ కాలం నాటి మిలటరీ స్థావరం. హవాయీ లో అమెరికా కు చెందిన మొదటి యుద్ధ స్థావరం.
[spacer height=”20px”]సాయంత్రం నాలుగైదు గంటల వేళకు డైమండ్ హెడ్ ప్రాంతానికి చేరుకున్నాం. కారు పార్కింగునానుకుని రెండు మూడు షెడ్లు ఉన్నాయి.
[spacer height=”20px”]ఆ పక్కనే మెత్తని ఐసు, హాట్ డాగ్ లు, ప్రెట్ జిల్సు అమ్మే ట్రక్కు కనబడగానే పిల్లలు అటు పరుగెత్తేరు. వెచ్చగా ఉన్న వాతావరణంలో దిగగానే ఐసు తినాలని అనిపించింది అందరికీ.
[spacer height=”20px”]ఐసులు తిని, పక్కనే ఎక్కే ఎత్తులో ఉన్న చెట్ల మీదకు చకచకా ఎక్కి ఆట మొదలు పెట్టేరు పిల్లలు ఏదో పార్కులో ఆడుకోవడానికి వచ్చినట్లు. నిజానికి మేం అక్కణ్ణించి కొండ మీదికి ఎక్కి, దిగి రావడానికి గంట సేపు పడుతుంది.
[spacer height=”20px”]నాకు చెట్లు , చుట్టూ పచ్చిక చూడగానే ఏదయినా చెట్టు కింద చేరి, హాయిగా నిద్రపోవాలనిపించింది. ఇక సిరి సరే సరి. అడుగు కూడా వెయ్యను, ఎత్తుకోమని పేచీ మొదలు పెట్టింది.
సత్యని, వరుని వెళ్లి రమ్మని చెట్టు కింద దేశ ద్రిమ్మరిలా పడకేసేను.తిరిగొచ్చి వీళ్లు ఫోటోలు చూస్తూంటే అయ్యో, ఎలాగైనా వెళ్ళి రావల్సింది అనిపించింది.
[spacer height=”20px”]అంత ఎత్తు నుంచి మేఘాల ప్రవాహాల్లో అత్యద్భుతంగా కనిపించే ఒవాహూ ద్వీపాన్ని, చుట్టూ పర్వతాల మీద బొమ్మరిళ్ళలా ఉన్న ఇళ్ళని, అలల వెలుతురు మేలి ముసుగు కప్పుకుని లేత నీలి అంచు చీర తో దోబూచులాడుతున్న విశాల సముద్రాన్ని చూసి తీరవలసిందే.
[spacer height=”20px”]చెట్టు కింద సేద తీరుతున్నపుడు అమెరికాలో మేమున్న చోట అన్నీ ఉన్నా, బయట తిరగగలిగే ఇలాంటి హాయైన వెచ్చని వాతారవరణం దొరకకపోవడం కొరతగానే తోచింది.
[spacer height=”20px”]అదే సమయంలో నవ్వు కూడా వచ్చింది. ఈ మాత్రం చెట్టు కింద పడుకోవడానికి హవాయి రావాలా? అని.మరి నేను శేషసాయిలా నిద్రకుపక్రమిస్తే సిరిని ఎవరు చూస్తారు? అసలే బయటికి తీసుకు వస్తే తుర్రుమని పరుగెత్తే పిల్లాయె.
[spacer height=”20px”]తననీ నా పక్కన పడుకోబెట్టుకుని కథ చెప్తానని ఉపక్రమించాను. ఎప్పుడూ మేం చెప్పుకునే ఏడు చేపల కథ అయిదు నిమిషాల్లో అయిపోయింది.కథ ఇలా కాగానే మళ్లీ పరుగు. ఇలా లాభం లేదని నేను పడుకున్న చెట్టు కొమ్మ మీద ఎక్కించాను.రెండు నిమిషాల్లో కిందికి దూకేస్తానని గొడవ చేసింది.
[spacer height=”20px”]ఇక లాభం లేదని, నా పర్సు బెల్టు తన చుట్టు తిప్పి కట్టి దగ్గరకు కూచోబెట్టుకుని ఆడుకోమని కాసిన్ని ఆకులు, కొమ్మలు తుంచి తెచ్చి ఇచ్చాను.అప్పటికి స్థిరంగా కూచుని ఆట మొదలెట్టింది. నేను తనని ఆనుకుని కళ్లు మూసుకున్నాను.
[spacer height=”20px”]సత్య వాళ్లు తిరిగొచ్చి నన్ను చూసి ఒకటే నవ్వడం మొదలు పెట్టేరు. తీరా చూస్తే సిరి ఆకులన్నీ తుంచి నా నెత్తి మీద పోసింది. చిన్న పుల్లల్ని జుత్తునిండా దూర్చింది. అదన్న మాట అంత స్థిరంగా, దీక్షగా ఆడుతున్న ఆట.
కాస్సేపు ప్రశాంతంగా కళ్లు మూసేసరికి ఉదయం నించి ఉన్న అలసటంతా తీరి, మంచి బలం చేకూరినట్లనిపించింది నాకు.
మనోవా ఫాల్స్ : ఇక తరువాత ప్రదేశం మనోవా ఫాల్స్. నగరాన్ని ఆనుకుని దగ్గర్లో ఉన్న ఫాల్సు కదా అని ఆరుగంటల ప్రాంతమవుతున్నా బయలుదేరిపోయేం.
[spacer height=”20px”]మనోవా ఫాల్సు ట్రైల్ పట్టుకుని కిందన పార్కు నించి పర్వతారోహణ చెయ్యాల్సి ఉంటుంది.
అప్పటి దాకా ఉన్న ఇళ్లు, మాములు రోడ్లు దాటి చిక్కని అటవీ ప్రాంతంలా ఉన్న ప్రదేశంలోకి అడుగుపెట్టగానే వాతావరణం మొత్తం మారి పోయింది.
[spacer height=”20px”]ఒక్క సారిగా మబ్బు కమ్మి, వాన మొదలయ్యింది. అయినా ముందు మూడు రోజులూ బిగ్ ఐలాండ్ లో వర్షంలో తడుస్తూనే తిరుగుతూ ఉన్నామేమో, ఈ మాత్రం వానకి జడిసేది లేదని కారు పార్కు చేసాం.
కారు పార్కింగు దగ్గర్లో ఏదో రిసార్టు ఉంది. అక్కడి నుంచి ఫాల్సుని ఆనుకుని ఉన్న పార్కు ముఖ ద్వారం వరకూ ఉన్న సన్నని రహదారి మీద నడక సాగించేం.
[spacer height=”20px”]మమ్మల్ని దాటుకుని ఇద్దరు ఆడవాళ్లు, ఇంచుమించు సిరి వయసున్న పాప ముందుకు వెళ్తూండడం చూసి ఇంకా చాలా మంది లోపల ఉండి ఉంటారని వాళ్ల వెనకే బయలు దేరేం. కానీ తర్వాత అర్థమయింది మేం మాత్రమే ఉన్నామని.ముఖ ద్వారానికి దగ్గర్లో ఉన్న కంకర రాళ్ల గుట్ట ఎక్కి పిల్లలు ఫోటోలని ఆగిపోయేరు. మేం ద్వారం దగ్గర చూసిన వాళ్లు మా కంటే ముందు వెళ్లిపోయేరు.
[spacer height=”20px”]ఆ మలుపు దాటి మరో మలుపుకి వెళ్లేమో లేదో మామూలు రహదారి ఆగిపోయి, బాగా సన్నని కొండ దారి ప్రారంభమయ్యింది. వర్షం కురుస్తూండడం వల్ల కాళ్ల కింద అడుగు పడకుండా చిత్తడిగా ఉంది. పొరబాటున జారకుండా తలా ఒక కర్రా చేత బట్టుకున్నాం. ఈ హడావిడంతా నచ్చో, ఏమో గానీ సిరి పేచీ పెట్టకుండా కర్ర ముక్క పుచ్చుకుని బానే నడవడం ప్రారంభించింది.
[spacer height=”20px”]సరిగ్గా అరగంట నడిచేమో లేదో, ఆకులతో, తీగలతో, త్రోవ కనిపించని చీకటి ఆవరించింది. కానీ భలే అందంగా ఉందా ప్రదేశం. నేల రాలిన గులాబీ రంగు అడవి పూలతో నేల మెరిసిపోతూ ఉంది. ఆకుల మీద కురుస్తున్న వర్షపు చప్పుడు స్పష్టంగా వినిపిస్తూ గాంధర్వ గీతంలా భ్రమ కలిగింది.
ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.
[spacer height=”20px”]మా వెనక గానీ, ముందు గానీ ఎవరూ లేరు. కాస్సేపట్లోనే పిల్లలు బాగా అలిసిపోయి ఇంకా ఎంత దూరం అని అడుగడం మొదలు పెట్టేరు. సత్య జలపాతం అంచు కనబడే వరకైనా వెళ్దామని ముందుకు దారి తీసేడు. మా చేతిలో బాటరీ లైటు కూడా లేదు. వాన ఆగినప్పుడల్లా సెల్ఫోను లైటు వాడుతూ మెల్లగా ముందుకు కదిలేం. నాకు మెల్లగా భయం మొదలయింది.
[spacer height=”20px”]అదృష్టం కొద్దీ మా ముందు వెళ్ళిన ఆడవాళ్లు తిరిగొస్తూ మాకు ఎదురయ్యారు. నేను ఇంకా ఎంత దూరం నడవాల్సి ఉంటుందో వాకబు చేద్దామని వాళ్లని పలకరించేను.
[spacer height=”20px”]వాళ్లు మేమున్న చోటి నించి మరో పావుగంట దూరం వరకూ ముందుకు నడిచినా జలపాతం శబ్దం కూడా వినబడక వెనుతిరిగేరట. చీకటి వల్ల నిజంగా మరో గంటలో జలపాతం చేరినా అక్కడేమీ కనిపించక పోవచ్చని చెప్పేరు.
[spacer height=”20px”]బతుకుజీవుడా అని, నేను వాళ్లని అనుసరించేను. నేను వెనక్కు మళ్లడం చూసి పిల్లలు కూడా నాతో బయలుదేరేరు. ఇక సత్య వెనక్కు రాక తప్పలేదు. తిరిగి వస్తున్నపుడు నడక కష్టం తెలియకుండా ఉండేందుకు ముందు నడుస్తున్న వాళ్లతో కబుర్లు మొదలెట్టేను.
[spacer height=”20px”]అందులో ఒకామె దక్షిణ అమెరికా లోని అర్జంటీనా నుంచి వచ్చింది. అక్కడేదో తోలు వ్యాపారం లో భాగస్వామురాలినని చెప్పింది. అర్జంటీనా అనగానే “చేగువేరా” దేశమన్న మాట అని చకచకా మాటలు కలిపేను. మరొకామె ఆమె స్నేహితురాలు. లాస్ ఏంజల్సు లో హౌస్ క్లీనింగు సంస్థ నడుపుతూంది. ఆమె కూతురు ఆ చిన్నపాప. భయం వేస్తుందో ఏమో, ఉన్నట్టుండి కయ్యి మని అరుస్తూ ఉంది పిల్ల. ఆ వెంటనే సిరి ఏడుపు, అన్నీ ప్రతిధ్వనించి మా నడకని మరింత ఆలస్యం చేస్తున్నాయి.
[spacer height=”20px”]వాళ్ళ స్పానిష్ యాసలో ఇంగ్లీషు నాకు బాగానే అర్థం అవుతుండడంతో మధ్య మధ్య స్పానిషు మాటలు వాడుతూ వాళ్లతో కబుర్లు కొనసాగించేను.
[spacer height=”20px”]దారిలో ఒక జంట మాకు అప్పుడప్పుడే పైకి వెళ్తూ కనిపించేరు. అందులో మగాయన “కొండ మీద జలపాతం చుట్టూ లైట్ల షో పెట్టేరటగా” అన్నాడు ఆగి. “ఊహూ”, మాకు తెలియదని తల అడ్డంగా ఊపుతూ, మేం జలపాతాన్ని చూడకుండానే వెనక్కు మళ్లుతున్నామని చెప్పేను. అతను ఫక్కున నవ్వి “అక్కడ లైట్ల షోలు ఉంటాయని నమ్మితే ఇంకాస్త ధైర్యంగా నడవొచ్చని అలా చెప్పేను. నాకు చీకట్లో జలపాతాన్ని చూడడం ఇష్టం” అన్నాడు.
అతనితో నడుస్తున్న ఆవిడ, “ఏవీ అనుకోకండి” ఇతనన్నీ ఇలాగే సరదాగా మాట్లాడుతాడు”. అంది.
నేనూ నవ్వి, వాళ్లకి “గుడ్ లక్” అని చెప్పి ముందుకు వచ్చేసేను.
[spacer height=”20px”]వరు నన్ను చూసి, “మమ్మా, కొత్త వాళ్లతో అలా ఎలా మాట్లాడేస్తావు? బెరుకుగా అనిపించదా?” అంది.
[spacer height=”20px”]సత్య నవ్వుతూ మా వైపు చూసి, “నువ్వూ అలా ప్రయత్నించాలి. అలా బెరుకు లేకుండా ఉండడం నేర్చుకోవాలి.” అన్నాడు.ఈ సందట్లో మాతో నడుస్తున్న వాళ్లు ముందుకు వెళ్లిపోయేరు. అయ్యో, వాళ్లకి వీడ్కోలైనా చెప్పలేదే అనుకున్నాను.
[spacer height=”20px”]మొత్తానికి ఇదొక మంచి అనుభవం. “అడవి దారి మలుపుల్లో అదరి చూసీ, కొండ తిరిగి కోన తిరిగి గుసగుసలాడీ…..” అనే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పాట గుర్తుకు వచ్చింది.
[spacer height=”20px”]రాత్రి భోజనం: మళ్లీ కారు పార్కింగుకి చేరుకునే సరికి చీకటితో బాటూ అందరికీ ఆకలి కూడా ప్రారంభమయ్యింది.ఊర్లో ఎక్కడో ట్రక్కులతో భోజనం ఆరుబయట అమ్మే తిరనాళ్ల వంటివి జరుగుతున్నాయని సత్య గూగుల్ చేసి చెప్పేడు.మరింకేం, అక్కడి నుంచి మరో అరగంట లో చేరుకున్నాం.వస్తున్నపుడు కొండ రహదారి ఎత్తు పల్లాల మీంచి అందంగా వెలిగిపోతున్న హానోలూలూ నగరం అత్యంత సుందరంగా దర్శనమిచ్చింది.
[spacer height=”20px”]ట్రక్కుల్లో అన్ని దేశాల భోజనమూ దొరికే ప్రదేశానికి చేరేం. అది ఎగ్జిబిషను వంటిది కాదు. కేవలం భోజనం ట్రక్కులు మాత్రమే ఉన్న ప్రదేశం.
[spacer height=”20px”]యథావిధిగా మేం ఇండియన్ ట్రక్కు దగ్గర చేరి బిర్యానీ వంటి పోపన్నమూ, పన్నీర్ బట్టర్ మసాలా, రోటీలు తెచ్చుకుని ఆదరాబాదరా తిన్నాం.
[spacer height=”20px”]తమాషాగా కొండల్లో వాన మొత్తినా, నగరంలో చినుకు లేదు. అరగంటలో మా బట్టలు ఆరిపోయాయి.
[spacer height=”20px”]అక్కడే జర్మనీ దేశానికి చెందిన ట్రక్కులో మన దేశపు తీపట్టు వంటి క్రీపు, మెక్సికో దేశానికి చెందిన చోట ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తులు కొనుక్కుని తిన్నాం.
[spacer height=”20px”]హోటలుకి చేరేసరికి రాత్రి పదయ్యింది. ఈ ప్రయాణంలో మేం విమాన ప్రయాణం కావడం వల్ల బట్టలు కాసిన్నే పట్టు కెళ్లాం. వస్తూనే పిల్లలు నిద్రపోయేరు. మేం హోటలు లాండ్రీలో బట్టలు ఉతకడానికి వేసేం. అవి ఉతకడానికి ఒక మిషనుకి నలభై అయిదు నిమిషాలు, ఆరడానికి మరో నలభై అయిదు నిమిషాలు టైము పడుతుంది. ఇక తిరిగి రూముకెళ్తే ఖచ్చితంగా నిద్రపోతాం కాబట్టి ఆ సమయమంతా బయట నడుద్దామని రోడ్డు మీదికి వచ్చేం.
[spacer height=”20px”]ఎబిసి స్టోర్సు: హానోలూలూలో బీచ్ రోడ్డులో ప్రతీ వీథి మలుపులోనూ ఎబిసి అనే పేరుతో పెద్ద స్టోర్సు ఉన్నాయి.మరీ ప్రతీ సిగ్నలుకీ ఒకటి ఉండడం చాలా ఆశ్చర్యమేసింది. పైగా ఏబిసి అన్న పేరేవిటో అనుకున్నాం. మొత్తానికి కనిపెట్టినదేవిటంటే ఎబిసి అంటేనే “All Blocks Covered” అన్నమాట.
[spacer height=”20px”]పందొమ్మిదో శతాబ్దపు ప్రథమార్థంలో జపాను దేశస్థుడైన సిడ్నీ కొసాసా ఈ చెయిన్ స్టోర్సుకి ఆద్యం పోసాడట. ఈ స్టోర్సుకి మొదట పెట్టిన పేరు “మిస్టర్ కె”. తర్వాతి కాలంలో ఎబిసి గా మారాయి. మేమున్న వైకికి ప్రాంతం లో మైలున్నర వ్యాసార్థంలో 37 స్టోర్సు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మొదట్లో లిక్కర్ అమ్మడానికి ప్రారంభించిన స్టోర్సు ఇప్పుడు ప్రతీ ఒక్కటీ అమ్మే పేరు గాంచిన స్టోర్సు అయ్యాయి. పైగా చవకగా కూడా సరుకులు లభ్యమవడం వల్ల ఏ స్టోరు చూసినా జనంతో కిటకిటలాడుతూంది. మేమూ వెళ్లి పిల్లలకి కాసిన్ని చాక్లెట్లు, హవాయీ చిహ్నమైన దేవగన్నేరు పూల ఆభరణాలు కొన్నాం. అవన్నీ అప్పటికప్పుడు ధరించేసి శకుంతలాదేవి లా పోజుపెట్టేను.
[spacer height=”20px”]సముద్ర తీరం : మొదటి రౌండు వాషింగు కాగానే వెనక్కి వచ్చి బట్టల్ని డ్రయ్యరులోకి మార్చి, మళ్లీ బయట పడ్డాం. ఈ సారి సముద్ర తీరం వైపు నడిచేం.
[spacer height=”20px”]అదేం విచిత్రమో సముద్రపు హోరే లేదు. బహుశా: అక్కడ ఆట్టే లోతులేని పలచని కెరటాల తీరం వల్లననుకుంటా.
[spacer height=”20px”]సముద్ర తీరంలో అనేక పూలమాలలు వేసున్న ఎత్తైన విగ్రహం దగ్గిర ఫోటోలు తీసుకున్నాం. ఆ తొమ్మిదడుగుల కాంస్య విగ్రహం 1890 లో జన్మించి సర్ఫింగులో హవాయికి ఒలింపిక్ మెడల్స్ సాధించి పెట్టిన “దుకే కహానమొకు” ది. ఆయన పేరుతో కనోవా క్లబ్ కూడా స్థాపించబడింది.
[spacer height=”20px”]మేం ఫోటోలు తీసుకుని వచ్చేస్తూ ఉంటే అక్కడే కాపలా తిరుగుతున్న సెక్యూరిటీ వచ్చి మా చేతికి కాసిన్ని దండలు తీసిచ్చేడు. అక్కడికి వచ్చిన యాత్రికులు వేసే దండల్ని ప్రతీ రోజూ రాత్రి పన్నెండు దాటేక తీసి పారేస్తారట. మీకు ఇంకా ఎన్ని కావాలో తీసుకోండని వచ్చిన వాళ్లకల్లా చెప్తూ ఉన్నాడు.
[spacer height=”20px”]నేను మాకు, పిల్లలకు నాలుగైదు తీసుకున్నాను. మంచి లేత సువాసన గుబాళించే దేవ గన్నేరు పూలంటే అసలే నాకు చాలా ఇష్టం. ఇక అప్పట్నించి మర్నాటి వరకూ అక్కడికి వచ్చిన చాలా మంది టూరిస్టుల్లా మేం కూడా దండలు మెళ్లో వేసుకుని తిరిగేం సరదాకి.
[spacer height=”20px”]ఆ దండల్ని వాడిపోయినా ఇంటికి కూడా తెచ్చి చాన్నాళ్లు దాచేను.
నును వెచ్చని తీరంలో ఆహ్లాదమైన సముద్రపు గాలి, అందమైన పూలమాలలు. నిజంగా దేవలోకంలో ఉన్న అనుభూతి కలిగింది హానోలూలూ లో.
[spacer height=”20px”]కాస్సేపు తీరాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు మీద బల్ల మీద చతికిలబడి కబుర్లు చెప్పుకున్నాం.
మొత్తం ప్రయాణంలో అత్యంత అపురూపమైన ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లకు కడుతూ ఉన్నాయి.
(ఇంకా ఉంది)
– కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~