నా కళ్లతో అమెరికా-61 (యాత్రా సాహిత్యం )- కె.గీత

(హానోలూలూ-ఒవాహు ద్వీపం- భాగం-1)

సాయంత్రం పొద్దుగుంకుతున్న వేళ బిగ్ ఐలాండ్ కు వీడ్కోలు పలికి ఒవాహూ ఐలాండ్ లో ఉన్న రాజధానీ నగరం, హానోలూలూకు గంట విమాణ ప్రయాణం లో చేరేం.

అప్పుడప్పుడే చీకటి పడ్తున్న వేళ, మబ్బుకమ్మిన ఆకాశంలోంచి కింద మరో రెండు మూడు ద్వీపాలు కూడా ఛాయా చిత్రాల్లా అగుపించాయి.

ఒవాహూ తీరం వెంబడి హానోలూలూ నగరపు ధగద్ధగమాన విద్యుత్కాంతులు నాగరికతకు ప్రత్యక్ష సాక్ష్యంగా మెరుస్తున్నాయి.

ఆకాశంలోంచి అప్పుడప్పుడే ఆ ద్వీప సందర్శనకు విచ్చేసిన అంతరిక్ష జీవిలా అపురూపంగా చూస్తూ అడుగుపెట్టాను.
హానోలూలూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లో దిగగానే శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చినంత సంబరపడిపోయారు పిల్లలు. నాగరికతకు, సౌఖ్యానికి, ఇంటర్నెట్టు, సెల్ఫోన్లకు ఎవరు మాత్రం అతీతులు!

బిగ్ ఐలాండ్ లో జీపు తీసుకున్నా, ఇక్కడ మాత్రం మాకున్న రెండ్రోజుల సమయంలో నగరం చుట్టుపక్కలే తిరగాలని నిర్ణయించుకున్నందువల్ల కారు తీసుకున్నాం.

ఒవాహు మూడవ పెద్ద ద్వీపం. హవాయీ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఇక్కడే నివసిస్తారు. హవాయీ రాజధాని హానోలూలూ ఈ ద్వీపంలో ఉండడం అందుకు ప్రధాన కారణం. మాకు ఈ ద్వీపంలో రెండు రోజుల పాటు ఉంటాం. మర్నాడు నగరం చుట్టూ ఉన్న ప్రధాన ప్రదేశాల సందర్శన, ఆ మర్నాడు “పెరల్ హార్బర్” వంటి స్థానిక ప్రదేశాల సందర్శనకు కేటాయించాం.

మా హోటలు సముద్ర తీరం నించి నడిచే దూరంలో ఉంది. హోటలు చాలా పెద్దది. పదహారో అంతస్థు కావడం వల్ల ఆకాశంలో ఉన్నట్లే ఉంది. దిగువన అదే ధగద్ధగమానమైన దీప కాంతుల్తో.

గంటలో భోజనం కోసం బయటకు వచ్చేం. మేం ఎక్కడికి వెళ్ళినా ఒక పూటైనా ఇండియన్ భోజనం కోసం వెతుకుతాం. బిగ్ ఐలాండ్ లో ఎక్కడా ఇండియన్ హోటల్ లేదు. హానోలూలూలో తప్పని సరిగా ఉంటుందని తెలుసు. హోటలు నించి అయిదు మైళ్ల దూరంలో రెండు, మూడు ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ దాదాపు మూసేసే సమయం అయిపోతున్నందున అన్నీ తెరిచి ఉంటాయన్న నమ్మకం లేదు. మొత్తానికి త్వరగానే చేరుకున్నాం. రెస్టారెంట్ కి పార్కింగు ఏరియా లేదు. పక్కనే ఉన్న సూపర్ మార్కెట్టు పార్కింగు బిల్డింగులో కారు పెట్టి నడుచుకుని రెస్టారెంటు వరకూ వచ్చాం. వచ్చేటప్పుడు మా కారుకి తాళం వేసినా లెట్లు వెలుగుతూనే ఉన్నాయన్న విషయం లిఫ్టు కదిలే ముందు చూసేను నేను. కానీ రెస్టారెంట్ కట్టేస్తారన్న ఆదుర్దాతో బయటకు వచ్చేసేం. తీరా చూస్తే రెస్టారెంటులో భోజనానికి టేబుల్స్ ఖాళీ లేవు. అరగంట వెయిటింగు అన్నారు. విధి లేక పేరు ఇచ్చి బయటికొచ్చాం. నాకు మా కారులో లైట్లు ఆగలేదన్న విషయం గుర్తుకొచ్చి వెనక్కి వెళ్ళేను. కారు పార్కింగు ఏరియా నిర్మానుష్యంగా ఉంది. గబగబా కారు లైట్లు ఆపి, వెనక్కి పరుగెత్తేను. నేను తిరిగొచ్చేసరికి హఠాత్తుగా వాన మొదలైంది. నిద్రకి జోగుతున్న సిరిని ఎత్తుకుని సత్య వానలో నిలబడి ఉన్నాడు. వరు సరేసరి అలిసిపోయి వేళ్లాడుతూంది. అప్పుడు గుర్తుకొచ్చింది హవాయీలో ఏ ద్వీపంలోనైనా ఆ సీజనులో హఠాత్తు వానలు పడతాయని. అదృష్టం కొద్దీ హోటలు లో టేబులు ఖాళీ అయిందని లోపలికి పిల్చారు. నార్త్ ఇండియన్ హోటలు కావడం వల్ల రోటీ, కర్రీలు ఆర్డర్ చేసేం. రెస్టారెంటు పేరు “కెఫె మహారాణి”. గోడలకున్న రాజాంత:పురాల కుడ్య చిత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి.

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

బిగ్ ఐలాండ్ లో ఉదయం నించి సాయంత్రం వరకూ ఎండలో సముద్రంలో ఆడేరేమో పిల్లలు మంచమ్మీదికి చేరగానే గుర్రు పెట్టి నిద్రపోయేరు. నాకేమో సముద్ర తీరానికి వెళ్లాలని ఉంది. కానీ కాలంలో మూడు గంటలు వెనక్కి వచ్చినందువల్ల హవాయీ సమయం తొమ్మిదయ్యే సరికి అందరికీ నిద్రలు ముంచుకొచ్చేస్తున్నాయి. అప్పటికే పదిన్నర దాటింది. సముద్ర తీరానికి వెళ్లాలన్న నా అభిలాషను మర్నాటికి వాయిదా వేసేను. పైగా మర్నాడు ఉదయం 7 గంటల స్నోర్క్లింగు టూరు బుక్ చేసేడు సత్య. అయిదున్నరకల్లా లేచి తయారవ్వాలి.

మర్నాడు ఉదయం ఆరుగంటల కల్లా స్విమ్మింగుకి అనువైన దుస్తులు పేక్ చేసుకుని హోటలు లాబీ లోకి వచ్చి చేరేం. పిల్లలు ఇంకా నిద్రకి జోగుతూండడం వల్ల నేను లాబీ లో కూచున్నాను. అక్కడ టేబుల్ లాంపులన్నీ పైనాపిల్ ఆకారం లో భలే అందంగా ఉన్నాయి. కెఫేలో కాస్త పాలు, కాఫీలు తాగేక, సత్య టూరు బస్సు కోసం కిందికి వెళ్లి నిలబడ్డాడు. అరగంటైనా పిలుపు రాలేదు. వరును పంపించేను. మరో పావుగంటకి బస్సు ఇక్కడికి కాదు, పక్క హోటలుకి వస్తుందన్నాడు సత్య. తెలతెల్లారుతూన్న వేళ సిరిని ఎత్తుకుని నడక మొదలెట్టేం. నును వెచ్చని ఉదయం ఎంతో బావుంది. పక్క హోటలు అంటే పక్క వీధి, అక్కడి నుంచి ఫోను చేస్తే మరో పక్క వీధి అన్నారు. అలా అలా సముద్ర తీరానికి చేరేం. అక్కడ బస్సు వాళ్లు చెప్పిన చోట మరి కొంత సేపు నిలబడ్డాం.

తీరం లో అందమైన చెట్ల వరుసలు, ఉదయపు ఆహ్లాదపు గాలి ఒక వైపు పిలుస్తూన్నా, మేం బస్సుకోసం వెతుకుతూ రోడ్డు ని అటు దాటి ఇటు దాటి అక్కడక్కడే తిరగసాగాం.

చివరికి అక్కడి నించి మరో రెండు సందుల వెనక, హోటళ్ల వెనక సందులో తప్ప ఆ చుట్టుపక్కల టూరిస్టు బస్సులు ఆగవన్న విషయం అక్కడికి చేరేక గానీ గమనించలేకపోయాం.

చైనా వారి టూరిస్టు సర్వీసు అది. మా కోసం అంత వరకూ ఫోన్లు చేసి, దారి చెప్పిన డ్రైవరమ్మాయి మాకు బస్సులో మొదటి సీట్లు చూపించింది. అప్పటికే బస్సులో ఉన్న వారి అసహనపు ముఖాలు చూడకుండా కూచున్నాం.

ఆ టూరు వాళ్లు మమ్మల్ని స్నోర్కిలింగు పార్కు వరకూ తీసుకెళ్లి, వెనక్కి తీసుకుని రావడమే కాకుండా స్నోర్కిలింగుకి కావలసిన సామగ్రి అంతా ఇస్తారు. అవన్నీ టిక్కెట్టులోనే భాగం.

సముద్ర తీరంలోనే దాదాపు అరగంట ప్రయాణించి ఒక చిన్న షాపు దగ్గిర ఆగింది మా బస్సు. అక్కడ మరో అరగంట మా సైజులకు తగ్గ స్నోర్కిలింగు సామగ్రి తలా ఒక సంచీ తీసుకున్నాక, మరో చిన్న బస్సు వచ్చి మమ్మల్ని ఎక్కించుకుని మరో పదినిమిషాల్లో “హనౌమా బే” కు చేరుకుంది. ఇచ్చిన సంచీ సామగ్రిలో నీటి అడుగున గాలి పీల్చడానికి వీలుగా ముఖానికి గాలి గొట్టపు మాస్కు, కాళ్లకు బాతు కాళ్లలాంటి తొడుగులు, నీళ్లలో పొరబాటున మునిగిపోకుండా సేఫ్టీ కోట్లు మొదలైనవి ఉన్నాయి.

ఇందులో ఎంత ప్రయత్నించినా ముఖానికి పెట్టుకునే ఎక్విప్మెంటు నాకు అస్సలు కంఫర్టబుల్ గా అనిపించలేదు. ముక్కు మొత్తం నొక్కేస్తూ ఊపిరి పీల్చడమే కష్టమైపోయింది. ఇక సిరి సరేసరి. సేఫ్టీ కోటు తప్ప ఏవీ వేసుకోనని పేచీ మొదలు పెట్టింది. సత్య, వరు మాత్రమే అవన్నీ కవచ కుండలాల్లా మొత్తం సమయమంతా ధరించేరు.

హనౌమా బే కొండ మీద మా బస్సు దిగి టిక్కెట్టు కౌంటరు లైనులో టిక్కెట్లు తీసుకున్నాం. మనిషికి రోజుకి ఏడున్నర డాలర్లు. పన్నేండేళ్ల లోపు పిల్లలకు ఫ్రీ.

నిజానికి మా అంతట మేం కారులో వచ్చి, అక్కడ ఎక్విప్మెంటు రెంటుకి తీసుకోవచ్చు. చాలా మంది అదే చేస్తున్నారు కూడా. ముందుగా ఇలా టూరు ఏజన్సీ ద్వారా బుక్ చేసుకోనవసరం లేదని అనిపించింది. పైగా ఎక్విప్మెంటు అందరికీ మొదటే కొనుక్కోవడం అనవసరం. మాలా గ్రూపు ఉన్నపుడు ఒక్కళ్ళు తీసుకుని చూడడమో, అసలు ఏ ఎక్విప్మెంటు అవసరమో అవే తీసుకోవడమో మంచిది.

ఇక కిందికి వెళ్లే ముందు జాగ్రత్తల కోసం చిన్న గ్రూపు లెసను పెట్టేరు. అక్కడ ఉన్న సహజ సిద్ధమైన జలచరాల్ని, కోరల్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం గురించిన జాగ్రత్తలివి. కోరల్స్ ని తాకటం గానీ, వాటి మీద నడవడం గానీ చెయ్యొద్దని, జలచరాల్ని వీలయినంత దూరం నించి చూడమని చెప్పేరు.

కొండ కిందికి చేరుకొవడానికి చిన్న ట్రాములున్నాయి. $2 మనిషికి టిక్కెట్టు తీస్కుంటే రానూపోనూ రెండు సార్లకి పనికి వస్తుంది. నడిచి కూడా సులభంగా చేరుకోవచ్చు. సిరితో కష్టమని మేం ట్రాములో వెళ్లేం.

అప్పటికి దాదాపు తొమ్మిదిన్నర కావస్తూంది. మేం పన్నెండు గంటలకి తిరిగి వెనక్కి వచ్చి పార్కింగు లాటులో మా బస్సుని అందుకోవల్సి ఉంది. ఎక్కడికక్కడ జనం బాగానే ఉన్నారు అప్పటికి.

ట్రాములో కొండ దిగే ముందు పై నించి కనబడే అందమైన దృశ్యం ఎప్పటికీ మరిచిపోలేనిది.

హనుమా బే సహజ సిద్ధంగా ఏర్పడ్డ రెండు కొండల మధ్య అర్థ చంద్రాకారంలో లోపలికి చొచ్చుకువచ్చిన సముద్ర తీరం. సముద్రంలో అంతర్లీనంగా దాగి ఉన్న అగ్నిపర్వత శిఖరం. కనుచూపుమేర నీళ్ల అడుగున అత్యంత స్పష్టంగా కనబడేలా తెల్లని ఇసుక అతి పలుచని కెరటాల పిల్లసరస్సు లాంటి తీరం. ఆట్టే లోతు లేకుండా విశాఖపట్నం ఋషికొండ బీచ్ లా ఉంది.
ఆ నీటిలో నడుం లోతు మునగాలంటే సముద్రంలో కాస్త లోపలికి నడిచి వెళ్లాల్సిందే. నీటి అడుగున అందమైన రంగు రంగుల చేపలు, కోరల్స్ కు ఈ తీరం ప్రసిద్ధి.

నేను, వరు మోకాలి లోతు వరకూ వెళ్లొచ్చేం కానీ మాకు తెల్లని ఇసుక తప్ప ఏవీ కనబడ లేదు.

సత్య, వరు చాలా దూరం వరకూ వెళ్ళి, నిజంగా ఎక్విప్మెంటు అంతా సద్వినియోగం చేసేరు. సిరి, నేను తీరాన ఇసుక లో గుడి కట్టడానికి కాలితొడుగుల్ని నీళ్లు తెచ్చుకునే గిన్నెల్లాగా వాడాం.ఇక ముఖాల మాస్కులు భద్రంగా సంచీల్లోకి వెనక్కు వెళ్లేయి. సిరి ఉన్నట్టుండి అన్నీ ఇసుకలో కప్పెట్టే ఆట మొదలెట్టింది. నేను తీరాన అక్కడక్కడే తక్కువలోతులో ఈదులాడుతూ సిరిని కనిపెట్టుకుని ఉన్నాను.

నును వెచ్చని సముద్ర తీరంలో హవాయీ లో మొదటి సారి సముద్రంలోకి దిగినందువల్ల నీళ్లలో ఎక్కువ సేపు గడపాలనిపించింది నాకు.

ఆ రోజు చక్కగా ఎండ కాస్తూంది పైగా. ఎంతో ఆహ్లాదంగా గడుస్తూంది అక్కడ. కాస్సేపు వచ్చి ఇసుకలో సిరి పక్కన కూచున్నాను.

సత్య మధ్యలో రెండు సార్లు వచ్చి సిరిని తను చూస్తాను, నన్ను వెళ్ళమని పంపించాడు. వరు, నేను కాస్త లోపలికి వెళ్లి తిరిగొచ్చేసాం. నేను మాస్కు మొత్తం ముఖానికి పెట్టుకోకుండా కేవలం కళ్ళ వరకే తగిలించుకున్నాను. ఆ మాస్కు అద్దాల వల్ల నీళ్లలో ప్రతీదీ భూతద్దంలో చూసినట్లు పెద్దగా కనిపిస్తాయన్న మాట. నీళ్లలో అతి పెద్దవిగా, స్పష్టంగా కనిపిస్తూన్న
మా పాదాలు తప్ప నాకైతే చేపలు, కోరల్స్ కనబడలేదు. తిరిగి వచ్చి, పలుచని నీళ్ళలో ఒడ్డునే కూచుంటూ, మాస్కు తీయబోయేసరికి నా చెవికి ఉన్న ముత్యపు కమ్మ నీటిలో పడిపోయింది. నేను కిందికి చూసేసరికి వెంటనే కనిపించింది. కానీ లేత అలలకి ఇసుకలో క్షణంలో కప్పడిపోసాగింది. వెంటనే నేను నా రెండు అరచేతులతో అక్కడ కమ్మతో బాటూ ఉన్న ఇసుకని గట్టిగా ఒడిసి పట్టుకున్నాను. చేతులు తీస్తే నీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఒక్కళ్లం నీళ్లలో వెతకాలంటే కుదరదు. మరొకరి సాయం కావాలి, నాతో ఉన్న వరుని సిరి దగ్గిరికి పంపించి, సత్యని పిలిపించాను. కొంచెంగా వేళ్లు వదులుతూ తనని మాస్కు పెట్టుకుని వెతకమని చెప్పాను. తనకి దొరకలేదు. తనని చేతులు అడ్డుగా ఉంచమని నేను మాస్కు బిగించుకుని నీటిలో తలముంచాను. ఎంత అందమైన దృశ్యమో అది! నీళ్ల పైన సూర్య కాంతి ధగధగా మెరుస్తూంది. తెల్లని అందమైన ఇసుక కాంతితో సమానంగా మెరిసిపోతూంది. ఇసుక మరీ మెత్తగా లేదు కాబట్టి పరిశుభ్రంగా ఉన్న ఆ ప్రదేశంలో నిమిషంలో నా చెవి కమ్మ అప్పుడే నీళ్లలోంచి పుట్టిన ముత్యంలా ప్రత్యక్షమై కనిపించింది. “హమ్మయ్య” అనుకుని నీటిలోంచి బయటపడి తిరిగొచ్చి చెవుల కమ్మల్ని ఇక సత్య పర్సులో వేసేసాను. బరువెందుకని ఆ రోజు నా పర్సు తెచ్చుకోలేదు. కళ్లద్దాలు, సెల్ ఫోనులు ఎవరి చెప్పుల్లో వాళ్లవి పెట్టుకున్నాం.

అప్పటికి పదకొండు కావస్తూంది. పన్నెండు గంటలకి కొండ మీద మా బస్సు అందుకోవలిసి ఉంది. సత్య చివరిగా ఒక్క సారి చూసొస్తానని మళ్లీ సముద్రంలోకి వెళ్లేడు.

అన్నీ పేకప్ చేద్దామని చూస్తే నాకు వరు చెప్పులు, సత్య కళ్లద్దాలు కనబడలేదు. వరు చెప్పుల మాటకేంగానీ సత్యవి ఖరీదైన కళ్లద్దాలు.

సిరి అప్పటిదాకా ఇసుకలో కప్పెట్టే ఆట ఆడిందని గుర్తుకు వచ్చి, వరు, నేను గబగబా పక్కనే ఇసుక కదిపిన ఆనవాళ్లలో చేతుల్తో తవ్వేం. వరు చెప్పులు ఒక్కోటి ఒక్కో చోట ఇసుకలోపల దొరికేయి. అక్కడెక్కడా కళద్దాలు మాత్రం లేవు, సత్య మాస్కులో కళ్లద్దాలు పెట్టుకుని ఉంటాడని అనుకున్నాను. తీరా సత్య తిరిగొచ్చేక చూస్తే తన దగ్గిర కూడా లేవు.
ఇక మేం కూచున్న ఆరడుగుల మేరా చుట్టూ ఇసుకని కాళ్లతో గాలించేం. కాస్సేపు వెతుకులాట తర్వాత బస్సు సమయం అయిపోతూండడంతో తిరుగుముఖం పట్టేం.

కళ్లద్దాలు అలా ఎలా పోయాయో నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అక్కడ మేం కూచున్న చోట లేవు. అలాగని ఎవరూ పట్టుకెళ్లరు. అమెరికా లో ఎవరూ పక్క వారి వస్తువులు పట్టుకెళ్లరు. నిజానికి ఎప్పుడూ ఏవైనా పోతే వెంటనే వదిలేసే తత్త్వం కాదు నాది. వాటి వెంట తిరిగి, ఆలోచించి కనిపెట్టే వరకూ నిద్ర పట్టదు నాకు.

ట్రాముకి పెద్ద లైను ఉంది. అక్కణ్ణించి పైకి వచ్చి ఇంకా పది నిమిషాలు సమయం ఉండగా పిల్లలు ఏదో తింటామని అడిగితే కొనిపెట్టి, నేను లాస్ట్& ఫౌండ్లో చూసొద్దామని వెళ్ళేను.

సత్య బస్సు వస్తే మమ్మల్ని పిలుస్తానని అన్నాడు. అమెరికాలో లాస్ట్ & ఫౌండ్ లు చాలా చక్కగా పనిచేస్తాయి. వస్తువులు దొరికితే $10 పోస్టేజీ ఛార్జీలు కట్టించుకుని ఇంటికి పంపుతారు కూడా.

నేను ఫారం నింపి తిరిగి వచ్చేసరికి సత్య బస్సు వెళ్లిపోయిందని చెప్పేడు. బస్సు గంటకొకసారి వచ్చే సమయానికి సరిగ్గా స్టాండులో రెడీగా ఉండాలట. రెండు నిమిషాల కంటే ఎక్కువ వాళ్ళు వెయిట్ చేయరట. మాకు పొద్దుట చెప్పిన ప్రకారం మేం బస్సు మిస్సయ్యి పోతే మరో బస్సు ఎక్కడానికి $50 డాలర్లు ఫీజు కట్టించుకుంటామన్నారు.

ఆహ్లాదంగా, అందంగా ఉన్న సముద్రతీరాన ఈతి బాధలేవిట్రా అని తలపోటు పట్టుకుంది. సత్య కి డూప్లికేటు కళ్లద్దాలు మా దగ్గర లేవు, ఇంట్లో ఉన్నాయి. హవాయీలో ఇంకా రెండ్రోజులు తిరగాల్సి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక డ్రైవ్ నేను మాత్రమే చెయ్యాలి.

ఇవన్నీ తలుచుకుని నీరసంగా కూచున్నాడు తను, పిల్లలు సరేసరి బాగా అలిసిపోయి వాళ్ల నాన్నకి చెరో వైపూ వేళ్లాడుతూన్నారు.

బస్సు ఎలాగూ వెళ్లిపోయింది, మరో గంట టైముంది కనుక నేను మళ్లీ తీరానికి వెళ్లొస్తానని బయలుదేరేను.

ట్రాము స్టేషన్లో కౌంటరు దగ్గిర ఉన్న సెక్యూరిటీ అతను నన్ను గుర్తుపట్టి టిక్కెట్టు మరోసారి తీసుకోకుండా నన్ను అతనితో బాటూ చిన్న ట్రాము బండిలో కింది వరకూ తీసుకెళ్లేడు.

అంతే కాకుండా అతని చేతిలో ఉన్న వాకీటాకీతో మాట్లాడి కొండ దిగువన ఉన్న ఇతర కౌంటర్లలో కూడా కళ్లద్దాలు దొరికేయేమో వాకబు చేసేడు.

నేనతనికి ధన్యవాదాలు చెప్పి, మేం కూచున్న చోటికి వచ్చి మరో రౌండు వెతికేను. అంతే కాకుండా తీరం వెంబడి అటూ, ఇటూ కాస్త దూరం వెతికి, దొరకక తిరిగొచ్చేను. మళ్లీ వచ్చి లాస్ట్ & ఫౌండ్ లో అడిగేను. ఈ సారి కౌంటరు వాళ్ళు లోపలి నించి దొరికిన కళ్ళద్దాలని పెద్ద బ్యాగు తెచ్చి గుమ్మరించారు. దాదాపు వంద ఉండి ఉంటాయి. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇంత మంది కళ్లద్దాలు పడేసుకున్నారా! సంవత్సరానికి మిలియను మంది సందర్శించే ఆ బీచ్ పైకి కనబడేంత అమాయకమైంది కాదన్న మాట. తర్వాత ఆన్ లైనులో చదివేం. అత్యధికులకు ఉంగరాలు పోతుంతాయట.

అప్పుడిక నాకు నిర్థారణగా అర్థమైన విషయం ఏవిటంటే సత్య కళ్లద్దాలు తీరంలో కాకుండా, నీళ్లలో పడిపోయి ఉంటాయని. నా చెవి కమ్మ వెతికే హడావిడిలో తన కళ్ళాద్దాలు జేబులో పెట్టుకుని నీళ్లలోకి వెళ్లి ఉంటాడు. అలా హనుమా బే లో ఆ విహార యాత్ర కళ్ళాద్దాల తర్పణతో చేదుగా ముగిసింది.

ఒంటిగంట బస్సు ఎక్కి, వెనక్కి వచ్చి మా ఎక్విప్మెంటు రిటన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఛార్జీ వెయ్యకుండా వాళ్లకి విషయం చెప్పి ఒప్పించాను.

హోటలుకి తిరిగొచ్చి స్నానాలు చేసి ఎక్కడి వాళ్లం అక్కడ పడి నిద్రపోయాం అలిసిపోయి.

(ఇంకా ఉంది)

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో