తుమ్మచెట్టుకు
మరులు గొలుపు సింగారపు పూలు పూసినట్లుగా
నిస్సార రాత్రీ !
నిన్ను రంగులమయం చేస్తున్నాను –
ఇదిగో
నా పెదాల పైని పొగల నర్తకి
నీకు –
రోదసీ రోదనను
చెట్ల ఆకులూ గడ్డిపరకలూ పంచుకొంటున్నాయి
చెమ్మర్చుతూ –
చలి
డిసెంబర్ నెలను
చప్పరిస్తోంది
పచ్చని మేఘాంబరాన్ని తొడిగిన
పల్చని చంద్రుని మల్లే
నగర దీపాలు
మంచు చలువ అద్దాల్తో చూస్తున్నాయి
ఇదో పుష్పించని
ఊపిరాడని
ఆస్తమా నెల –
అరుస్తున్న తీతూ పిట్ట రాగంతో
లేని లూక్రేషియాను
సార్తో
పిలుస్తున్నాడు
రా రమ్మని –
ఎత్తుకెళ్తోన్న గాలిలోని
గద్ద నోట్లోంచి జారి
దారిసారి పైన పడి
కసికొద్దీ కాట్లేస్తున్న కట్లపాము వంటి
శీతల పవనాల తమాల మాసమా !
బిడ్డకు పాలివ్వలేని నిస్సహాయ తల్లివి
ఆర్ద్రత చచ్చిపోయిందని గొణుగుతూ
సౌందర్య వర్ణాల్ని మింగిన
చీకటి దుప్పట్ని కప్పుకొంటూ
సార్తో
లేని లుక్రేషియాతో చెబుతొన్నాడు
పో …. పొమ్మని –
డిసెంబర్ !
లేత చిగురుటాకుల్ని
మొరటుగా కొరికి నములుతున్న
మృత్యు స్పర్శ –
బహుశా
దూరంగా ఎవరో
దీపం ముట్టిస్తున్నారు
లేత చేతులు కాలిన కమురు వాసనతో
పొగ ఎగుస్తోంది
– ఇక్బాల్ చంద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to డిసెంబర్ – ఇక్బాల్ చంద్