ముసుగు-5 (కథ ) -శ్రీసత్య గౌతమి

                                         రామారావు, రేవతి బిత్తరపోయి … “పోనీ మీ అమ్మావాళ్ళని కొద్దిరోజులు తెచ్చుకోమ్మా, అబ్బాయినడిగి. క్రొత్త కదా .. బెంగపడుతున్నావేమో… ” ఏం చెప్పాలో … ఎలా చెప్పాలో తెలియని పరిస్తితిలో అలా చెప్పేశారు నిజానికి సరితకి ఏ ప్రాబ్లం లేదన్న విషయం, ముఖ్యంగా ఆమెకి ఎవరన్నా భయం లేదన్న విషయం ప్రసాద్ కి తప్పా… అక్కడున్న అందరికీ తెలుసు.

                           కాకపోతే ప్రసాద్, సరితకు దగ్గిరయిపోయి … వీళ్ళకి దూరమయిపోవడం వల్ల … ఆమెగురించి చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలడంలేదు.మరుసటి రోజునుండీ, వంట తానే చేస్తానని సరిత బయలుదేరింది. పోనీలే మెల్లగా కలుస్తోందీ అని సంతోషపడ్డారు. పాపం వాళ్ళేమి అడ్జస్ట్ అయినా ప్రసాద్ గురించే కదా … మరి ఒక్కగానొక్క కొడుకాయె.అతను చెప్పా పెట్టకుండా సరితను పెళ్ళిచేసుకున్నందుకు మనసు ముక్కలయిపోతున్నా … మళ్ళీ కూడదీసుకొని బ్రతుకుతున్నారు.

                   సరిత ప్రసాద్ ను ఆడిస్తోందన్న విషయం అర్ధం అయిపోయింది రామారావు, రేవతీలకు. అతని అమాయకత్వానికి కూడా బాధను దిగమింగుకుంటున్నారు, అయినా సరిత ప్రతీ అవకాశాన్ని తనకు అనుగుణంగా మార్చుకొని వారి మనసుల మీద గట్టి దెబ్బ వేస్తూనే ఉంది విరిగేదాక.ఇహ తాను వంటింటి రాణి అయిపోయి … అత్తగారిన్ని కేవలం తనకు గిన్నెలు కడగడానికి, నీళ్ళుపట్టడానికి, ఇల్లు చిమ్మడానికి అన్నట్లుగా ఒక హెల్పర్ ని చేసుకొంది. నిజానికి రేవతిని తన ఇంట్లోనే ఒక పని మనిషిని చేసేసింది కోడలు సరిత.

                                             ఇంకేమన్నా అంటే … మన పన్లు మనం చేసుకోవడం తప్పేముంది అని అటున్నది. తాను మాత్రం కేవలం వంట చెయ్యడం వరకే చేస్తుంది.వంటయ్యాక మళ్ళీ మామూలే తయారవ్వడం … లోపలకెళ్ళిపోవడం ప్రసాద్ వెళ్ళిపోయాక. మళ్ళీ సాయంత్రం వంటకు అన్నీ పనిమనిషిలా రేవతి రెడీ చేస్తే … సరిత ఫ్రెష్ గా తయారయ్యి క్రిందకి వచ్చి గిన్నెలు ఒకసారి ఆడించేసి … వంట చేసి పడేస్తుంది. మిగితా పన్లు రేవతికే. అంతే తప్పా … కలిసి మెలిసి అన్నిపన్లు చెయ్యడమనేది ఉండదు.

రామారావు, రేవతి కొడుకు, కోడలిని కూర్చోబెట్టి అందరితో కలవమని మాట్లాడినందుకు ఇది పర్యవసానం!

                                                                 ***************
                                   ఇహ నెలకు ప్రసాద్ సంపాదన, రామారావుగారి పెన్షన్, ఇతరత్రా సేవింగ్స్ వల్ల వచ్చే వడ్డీలు, ఏదో కొద్దిగా పంటల మీద వచ్చే డబ్బులు ఇలా అన్నీ కలిపి మొత్తంగా బాగానే ఉంది ఇంటికి సరిపడా అన్ని విధాలా … సొంత ఇల్లుకూడా కాబట్టి, ఖర్చులు మామూలు స్థాయిలో నే ఉన్నాయి, అప్పులేమీ లేవు.

                                 అయినా సరితకు వాళ్ళ మధ్య ఉండడానికి బాధ మొదలయ్యింది, మరి తనవాళ్ళకి ముట్టజెప్పడానికి కుదరక పోయేసరికి. ప్రసాద్ ఇల్లు చూస్తే చాలా క్లోజుడు వ్యవహారం. ఎక్కడా తాను వ్రేలు పెట్టడానికి లేదు, పైగా తాను ఉద్యోగం కూడా మానేసింది ఎందుకంటే సరితది ఆ హాస్పిటల్ లో కాంట్రాక్టు పొజిషన్ మాత్రమే. అది అయిపోయింది, మానేయక తప్పలేదు. అది కూడా ఒక ప్రక్క తినేస్తున్నది సరితకు.

                                 ఇంతలో కౌముది కాలేజీకొచ్చేసింది కాబట్టి… ఆమె క్రొత్త కాలేజీ జాయినింగు విషయాలు, హడావిడి. ఆ పిల్ల చదువుతానంటే డాక్టర్ ని చెయ్యాలని చూస్తున్నారు.

                                   సరితకు ఏ మాత్రం ఇష్టం లేదు, ఆ బాధ్యత ఎక్కడ ప్రసాద్ మీద పడుతుందో, ఆ ఇంట్లో బాధ్యతలతో ప్రసాద్ ఎక్కడ కూరుకుపోతాడో, తానెక్కడ అక్కడే ఉండిపోవాల్సివస్తుందో … ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలతో నిత్యం సతమతమవుతున్నది సరిత.

                            కౌముది కి ఇంటర్మీడియట్ ఇంకా పూర్తేకాలేదు, ఒహటే గొడవ … ఆ పిల్లకు పెళ్ళి చేసేయమని ప్రసాద్ చెవిలో.“ఇదేమన్నా నా ఇష్టమా మా చెల్లెలికి పెళ్ళి చేసేయ్యడం? మా అమ్మా, నాన్నల ఇష్టం పైగా తన ఇష్టం కూడా. అయినా ఏమంత వయసు ముదిరిందని? చిన్నపిల్ల”…

                                  అంతే ఇహ ఏడుపు లంఘించుకున్నది సరిత. ముక్కు చీదుకుంటూ … “ఏం నేను మాత్రం చిన్న పిల్ల ని గానా, మిమ్మల్ని పెళ్ళి చేసుకొని బాధ్యత పడటంలేదా?”అది విని రేవతి షాక్ తినేసింది … “ఏంటీ చోద్యం? ఆమె చిన్న పిల్లనా? ఇంటి బాధ్యత పడుతున్నదా? పైగా తన చిన్న కౌముది తో సాపత్యమా?”

                                 సరితకి ఏమాత్రం కూడా నదురు బెదురు లేదు. ఏ మాటబడితే ఆ మాట అనేయడమే. వాటన్నిటికీ ప్రసాద్ తలాడిస్తున్నాడా లేదా అని మాత్రమే చూస్తుంది. ఇక ఎవరినీ, దేన్నీ పట్టించుకోదు.ఒకవేళ తనకేమన్నా మిగితావాళ్ళు ఇలా కాదు, అలా అని చెప్పినా … వెంటనే ప్రసాద్ ను వాళ్ళ మీదకు వాళ్ళని ఎదుర్కొనే ఒక ఆయుధంలా తయారు చేసేస్తున్నది అతి చాకచక్యంతో.

                                       ఇలా నెలలు గడుస్తున్నాయే తప్పా… ఒక్కసారి కూడా సరిత కుటుంబీకులు స్క్రీన్ ముందరకొచ్చి ప్రసాద్ కన్నవాళ్ళని కలవలేదు.సరిత ప్రోద్భలంతో కౌముది పెళ్ళి విషయం ఎత్తాడు ప్రసాద్, ఇంటర్మీడియట్ అవ్వగానే పెళ్ళి చేసేద్దామని. రామారావు ఆశ్చర్యపోయారు.

                                 “కౌముది కి ఇప్పుడు పెళ్ళేమిటి? తాను ఇంకా చదువుకొని, తన కాళ్ళమీద తాను నిలబడగలగాలి” కరక్టే. పెళ్ళిచేసేస్తే ఆ పాట్లేవో పెళ్ళిచేసుకున్నవాడే పడతాడు కదా? మనకెందుకు ఖర్చు? … వణుకుతున్న కంఠంతో అన్నాడు ప్రసాద్.రామారావు కి అర్ధం అయ్యింది.

                                           “ఇవి నీ అభిప్రాయాలు కావని నాకు తెలుసు, ఎందుకంటే కౌముది ని డాక్టర్ ని చెయ్యాలని నా కన్నా, మీ అమ్మ కన్నా కూడా నువ్వే ఎక్కువ కలవరించావ్. మొన్నమొన్నటివరకూ నీ కల అదే. ఇద్దరం కలిసి నర్సింగ్ గోం పెట్టుకుంటామని కూడా అన్నావ్. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే … నేనర్ధం చేసుకున్నాను. క్రొత్తవాళ్ళొచ్చాక, క్రొత్త నిర్ణయాలొస్తాయి. అయినా నేనింకా బ్రతికే ఉన్నాను… మర్చిపోయావా? క్రొత్తవాళ్ళకి ఆ విషయం చెప్పలేదా నువ్వు? ఈ ఇంటి యజమానిని నేను. నిర్ణయాలు నేను తీసుకుంటాను, నువ్వు కాదు!

                                       వెంటనే సరిత ఏడుపులు పెడబొబ్బలు మొదలయ్యాయి.“రెక్కలు ముక్కలు చేసుకొని, మీ అబ్బాయి సంపాదించి పెడుతుంటే … కూర్చొని అందరూ మెక్కడం కాదు టైముకి. ఇంటికి మొత్తం ఎంత డబ్బొస్తోంది? ఖర్చులెంత? మిగులు ఎంత? లెక్కలు ఇప్పటికిప్పటికే తేలాలి. అప్పుడు నిర్ణయాలు జరగాలి”

                                       ప్రసాద్ బిత్తర పోయాడు ఆమె లా పాయింట్లకి. అయినా సరితా గౌరవాన్ని కాపాడాలనే నిర్ణయించుకున్నాడు. రామారావు, రేవతీలకు పూర్తిగా అర్ధమయ్యింది. తాను డబ్బుల వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందనీ, దానికి కౌముది పెళ్ళి ఒక వంక అని. రామారావు సరిత ఆలోచనని పారడానికి అంగీకరించలేదు.

                                     వెంటనే “కౌముది పెళ్ళికీ, ఆ విషయానికి ముఖ్యంగా నీకు ఏ సంబంధం లేదు. కౌముది నా కూతురు, నా యిష్టం దానికి ఎప్పుడు పెళ్ళి చెయ్యడమనేది.ఎంత వస్తోంది, ఎంతపోతోంది – ప్రసాద్ సంపాదన మొన్నటికి మొన్న స్టార్ట్ అయ్యింది, అంతవరకూ అతడు స్టూడెంటే.
                                              ఇహ నువ్వు. వచ్చి ఆర్నెల్లు కూడా పూర్తిగా కాలేదు, నీకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చడం నీకంత మంచిది కాదు.అంటే … కొడుకు కోడలికి ఏమాత్రం గౌరవించరా? మా మాటకేమాత్రం విలువలేదా?” … ఉక్రోషపు మాటలు మాట్లాడ సాగింది సరిత.

                                       “ప్రతిదానికి మా వాడిని బైండ్ చేసుకొని నువ్వాడుతున్న ఆటలు ఆపు. ముందు కౌముది పెళ్ళిలో నువ్వు తలదూర్చడమే తప్పు!” రామారావు ఆవేశంగా అన్నారు.చూశారా అండీ. మీకిచ్చే విలువ ఇంతే. బాధ్యత పడలేదు పడలేదు అంటారు. పడదామని ఏదయినా ఒక మంచి విషయం చెబితే … ఇలా మీద పడిపోతున్నారు. అసలు మీకు ఈ ఇంట్లో విలువే లేదండీ!” అని పొడి వేసింది ప్రసాదుకు సరిత.

                                                 ఈ వింత వింత మాటలకి రేవతీ, రామారావుల గుండెలు కోయబడుతున్నాయి. వాళ్ళు కల్లో కూడా ఊహించని మాటలు, నిందలు వాళ్ళకి ఎదురవుతున్నాయి.అయినా ప్రసాదేమీ మాట్లాడటంలేదు. సరితకది పరాభవంగా, ఫ్రస్ట్రేటడ్ గా వుంది.

                                  ఇక ప్రసాద్ యొక్క నిశ్శబ్దాన్ని భరించలేక సరిత తానే బ్రేక్ చేసింది. “మరి మేమంటే మీకు విలువలేనప్పుడు, అక్కర్లేనప్పుడు మేమెందుకు ఇక్కడే పడివుండాలి? ఒక్కగానొక్క కొడుకు. మాకు రావల్సిందేదో మాకు పడేస్తే మేము మాదారేదో మేము చూసుకుంటాం, మీకు తలకొరివి పెట్టాల్సింది ఆయనే… కన్న కొడుకుని అంత ధు:ఖ పెట్టకూడదు”

                                           రామారావు, రేవతీలు హతాశులయ్యారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కౌముది అమాయకం గా చూస్తున్నది. ప్రసాద్ తలవంచుకొని కూర్చున్నాడు. ఎవరు ఎవర్ని ధు:ఖపెడుతున్నారు? అర్ధంకాలేదు ఎవరికీ.డబ్బుకోసం సరిత ధు:ఖ పడుతున్నదే తప్పా … ఎవరికీ అర్ధం కావడంలేదు సరిత మాటల్లోని ఆంతర్యాలు. కానీ ఆమెని ఎదిరించే ధైర్యాన్ని ఎందుకో ప్రసాద్ కోల్పోయాడు.

                            ఇలా కౌముది పెళ్ళి మొదలు … ఏ విషయం వచ్చినా … ఆస్తి పంచి ఇచ్చేయడాలు, ఇంట్లోంచి వెళ్ళిపోతానండాల దగ్గిరకొచ్చి ఆగిపోతోంది.
                                                            ************************

                                  అలా ఆగిపోవడం కూడా సరితకు బాధను కలిగిస్తున్నాయి, సంభాషణ ముందుకెళ్ళకపోవడం, అక్కడితో ఆగిపోవడం.కొడుకు చాతకానితనం, ఒక్కడేకొడుకు ఎక్కడ దూరమవుతాడనే భయం … బలహీనతలుగా మారి ఆ యింటిని పట్టి కుదిపేస్తున్నది.

                                    తానే వంటింటి మహారాణవ్వడంవల్ల … ఒక స్టేజ్ కి వచ్చేసరికి రేవతిని వంటింట్లోకి రావడం ఆపించేసింది సరిత.రేవతిగారు సాహసించి తన వంటింట్లోకి తాను వచ్చి ఏదయినా తనకు నచ్చిన పని చేసినా సరిత గొడవచెయ్యడం, భీష్మించుకొని మిగితాపనులు పాడుచెయ్యడం లేదా అత్తగారు  చేసినదాన్ని పారబోసి ఏదోక వంకతో మళ్ళీ దాన్ని చేసి చేసి అందరికీ పడెయ్యడం చేస్తోంది.

                                ఇక రామారావుగారు ఇవన్నీ భరించలేక …కొడుకుని తక్షణం ఆమెని తీసుకొని వెళ్ళిపొమ్మని శాసించారు.ఇలా జరగడమే కావలసిన సరిత ఆనందానికి ఆనకట్టలేదు.మామగారు అనడం మొదలు, చక చకా సామాన్లు, బట్టలు సర్ధడం మొదలెట్టేసింది.

                             ప్రసాద్ కు ఏమాత్రం కూడా  ఆలొచించుకోనీయలేదు. అందరి మనసు నొప్పిదాలు, కన్నీళ్ళమధ్య … తానొక్కతే లబ్ధి పొంది ప్రసాద్ ను బయటకు తీసుకొని వెళ్ళిపోయింది.అలా వెళ్ళిపోవడం, వెళ్ళిపోవడమే …. ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ తల్లి చావుతో … పశ్చత్తాపం తల్లి శవాన్ని చేరాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, వాళ్ళ ముద్దూ ముచ్చట్లు కూడా ప్రసాద్ తల్లిదండ్రులు ఎరగరు.

                                     చుట్టాలు, స్నేహితులు ముందు ఒక ప్రక్క పూర్తిగా తలెత్తుకొని తిరగలేకపోయినా … అది విషాద సంఘటన అవ్వడం వల్ల ఎక్కువ ప్రశ్నలకు గురి కాకుండా తప్పించుకున్నాడు.చావు కార్యక్రమాలన్నీ అయిపోయాక … వీలునామాల ప్రసక్తి వచ్చింది.

దాన్ని లాయర్ చదివాక … సరితకి అంతమందిలో తలకొట్టేసినట్లయ్యింది.
అత్తగారి పేరనే ఆస్తులన్నీ ఉండడం మూలాన … అది ఒక పెద్ద వళ్ళు మంట అయిపోయింది సరితకు. ఈలోపున ఆ ఆస్తిని, ఇంటిని తన తదనంతరం తన భర్తకు, ఆయన తదనంతరం …తన ముగ్గురు సంతానానికి సమానంగా ఆవిడ వ్రాసేసరికి… అగ్గి మీద గుగ్గిలమయిపోయింది సరిత మనస్సు. ఆఖరికి, ఇన్నేళ్ళయినా కూడా ఆ ఆస్థికి, ఆ ఇంటికి తాను స్వయాన అధికారి కాలేకపోయింది… తన వాళ్ళకి ఎలా మొహం చూపించుకోవాలి? తానేమీ సాధించలేకపోయింది కేవలం ప్రసాద్ సంపాదించే నాలుగు గవ్వల్ని తప్ప! అంతా రేవతమ్మ తల్లే తన కైవసంలో పెట్టుకొంది, జాగ్రత్తగా తన భర్తకి, తన ముగ్గురు (అందులో ప్రసాద్ కూడా ఉన్నప్పటికీ) పిల్లలకే దక్కించిందే తప్పా … నాకేమొరిగింది?…. ఇలా తనకు గొప్ప పరాభవం ఎలా అంటే ద్రౌపది నవ్వితే ధుర్యోధనుడు ఎలా పరాభవం ఫీల్ అయ్యాడో అలాగే సరిత రగిలిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఆస్తిపాస్తులన్నిటినీ తాను పూర్తిగా కైవసం చేసుకొని తాను తనవాళ్ళకు తానెంత ప్రతిభావంతురాలో చూపించుకోవాలనుకొంది. మరి అది ఆవిడ పుట్టింటి ఆచారం. ఏ ఇంటి చిలుక ఆ ఇంటిపలుకులే గా పలుకుతాది !!!

                                   ఇలా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చివరివరకూ జరుగకపోయేసరికి … ఆ అక్కసంతా … ఆల్జామియర్ వ్యాధితో బాధపడుతూ, భార్య పోయి కొడుకు దగ్గిర హాస్పిటల్ లోనే ఒక పేషంట్ లా ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రామారావు మీద చూపించేసింది.

                                   ఎన్నాళ్ళని ట్రీట్ మెంట్ పేరుతో తండ్రిని సరిత వప్పుకోవడం లేదని, హాస్పిటల్ లోనే పెడతాడు ప్రసాద్? హాస్పిటల్ స్టాఫ్ కూడా చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు.అందుకే సాహసించి సరిత మాట కాదని తండ్రిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఇది మరో పరాభవం సరితకు.

                                         ఓ నాలుగు రోజులు పోయాక ఒక మధ్యాహ్నం చుట్టు పక్కల వాళ్ళు ఎవరూ లేకుండా జాగ్రత్తగా చూసుకొని, కారెక్కించి తీసుకువెళ్ళి మతిస్థిమితం లేని రామారావుగారిని ఎక్కడో వదిలేసి వచ్చేసింది.

                                     ప్రసాద్ ఆ చుట్టు ప్రక్కలంతా వెతికాడు, మరి అక్కడనుండి రామారావుగారు పాపం ఎక్కడికి వెళ్ళిపోయారో …. ఎవరికీ దొరకలేదు. బ్రతికున్న తండ్రిని పోగొట్టుకున్నందుకు గుండె పగిలేలా ప్రసాద్ ఏడ్చాడు. నలుగురిలో చూపించుకునేందుకు సరిత విచారాన్ని ప్రకటించుకున్నది.

                                                                           (సమాప్తం)

కథలుPermalink

One Response to ముసుగు-5 (కథ ) -శ్రీసత్య గౌతమి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో