
P.Victor Vijaya kumar
కొద్ది నెలల క్రితం మొదటగా తారకం సార్ ను కలిసాను. అరుంధతి రాయ్ అంబేద్కర్ కుల నిర్మూలన పై రాసిన పుస్తకం పై వెల్లువెత్తిన నిరసన నేపథ్యంగా ఆయన అభిప్రాయాలను క్రోడీకరించి ఒక ఆర్టికల్ రాద్దామని ‘ విహంగ ‘ కోసం ఒక ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నా. ఎలాగోలా సార్ కాంటాక్ట్ ఒక మితృడి ద్వారా సంపాయించాక వెళ్ళి ఇంట్లో కలిసాను. రోహిత్ ఆత్మ హత్య సందర్భంగా వచ్చిన మొదటి పుస్తకం ‘ నక్షత్ర ధూళి ‘ ఆయన చేతిలో పెట్టాను. కుశల సమాచారాలు మొదలయ్యాయి. సార్ చాలా keen listener . ఆంధ్ర రాష్ట్రం లో భారీ పరిశ్రమలు మొదలయ్యాక భారీ ఇంఫ్రాస్ట్రక్చర్ రంగం లో ప్రధాన పాత్ర పోషించే ఫైనాన్స్ విభాగానికి హెడ్ గా స్వాతంత్ర్యం వచ్చాక ఒక్క దళితుడు లేదు. అయితే మొదటి సారిగా రాష్ట్రం లో నేను ఆ స్థానం వరకు private రంగం లో ఎదగ గలగడం ఒక పెద్ద బెంచ్ మార్కు అని నేను నా ఉపోద్ఘాతం లో భాగంగా చెప్తు న్నప్పుడు మాత్రం ఆయన చిందించిన ఆనంద కరమైన నవ్వు నాకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. కీన్ గా వింటున్న ఆయన ఆయన నా ప్రొఫెషన్ గురించి ఆరా తీసాడు. ఆయన ఇండస్ట్రీ గురించి నాతో మాట్లాడుతున్నంత సేపు ‘ మనలో ఒకడు ‘ నాతో మాట్లాడుతున్నాడు అన్న అటాచ్డ్ ఫీలింగ్ స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
భూమి , ఆకాశం తల కిందులైనా ఆయన దళిత పక్ష పాతి అంతే ! ఆయన అందుకే ‘ మన ‘ ఎదుగుదలను ఆహ్వానించడం , హత్తుకోవడం !!
మేము జె ఎన్ టీ యు అనంతపురం ఇంజినీరింగ్ కాలేజీలో చేసిన చారిత్రాత్మక పోరాటాల గురించి చెప్తుంటే ఆయనలో ఒక ఎక్జైట్ మెంట్. ” అరే ! నేనెలా మిస్ అయ్యాను మిమ్మల్ని ‘ అని సంభ్రమ పడ్డంతో పదేళ్ల తర్వాత కలిసిన పాత మితృడిలా సంభాషణ సాగించాడు.
తారకం సార్ గురించి తల్చుకోవాలంటే – మొదటగా రోడ్డు మీద పోయే దళితుడిని మనస్పూర్తిగా కౌగలించుకోగలిగే ప్రేమను గుర్తు తెచ్చు కోవాలి. ఆత్మ గౌరవానికి చాలెంజ్ గా నిలబడే ఈ బ్రాహ్మణీయ సమాజం లో ఎదుగుతున్న దళితుడంటే చూసి మనస్పూర్తిగా హత్తుకొనగలిగే నిర్మలత్వం ఉండాలి. నాలాంటి వాళ్ళు ఆయన ప్రజా జీవితం ముందు ఈక కన్నా తేలికైన వాళ్ళు.
ఎన్నో conventional memory లా తారకం సార్ ను తల్చుకునేది వద్దు. నిజాయితీగా తల్చుకుందాం. నిర్మలంగా తల్చుకుందాం. ముక్కు మొహం తెలీని వ్యక్తి గురించి గొప్పగా ఫీల్ అవ్వడం అందరికీ సాధ్యం అవ్వదు. సామాజిక ఎదుగుదల లో ఒక్క దళితుడు ముందుకెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో గుర్తించకపోతే గుండె నిండా నవ్వడం చాత కాదు. కేవలం అందుకే – పైన ఇచ్చిన చిన్న ఉపోద్ఘాతం.
నాకు ఆయనతో కలిసొచ్చిన ఆ గంటకు పైగా సమయం అర్థమైన విషయాలు చాలానే ఉన్నాయి. ఆయనకు ఎన్నో విషయాల పట్ల, వ్యక్తుల పట్ల కంప్లెయింట్ ఉంది. కాని మనస్సు నిబ్బరంగా , సైద్ధాంతిక విశ్వాసం తోనే అన్నీ ఎదుర్కోవాలనుకున్నాడు కాని వీధి పోరాటాలు ఆయన చేయలేదు. అలా చెయకపోవడం గొప్ప అని కాదు – అలా ఫోకస్డ్ గా ఉండడం , లక్ష్యం మీద మాత్రమే నమ్మకం కలిగి ఉండడం అందులో ఉన్న ఆయనకున్న ఆత్మ విశ్వాసం గొప్పది.
ఆరోగ్యం చితికి పోతున్నా కూడా ఆయన దీర్ఘ ప్రయాణాలు చేయడం ఆప లేదు. ‘ తప్పేట్టు లేదు ‘ అనే తృణీకరణ భావన ఆయనలో. కొడుకు సీనియర్ ఐ యే ఎస్ ఆఫీసర్ అయి ఉండి , తాను కూడా సీనియర్ అడ్వొకేట్ గా వ్యక్తి గతంగా జీవితం లో ఎంతో సాధించ గలిగి ఉండేవాడు ఆయన. కాని ఆయన నడిపే సింపుల్ జీవితం నిజంగా ఎంతో మంది ఎదుగుతున్న అంబేద్కర్ వాదులకు మార్గ దర్శకం. వ్యవస్థలో ఇమిడిపోయి, అగ్ర కుల నాయకుల చుట్టూ ‘ నెట్ వర్క్ ‘ చేయడం , వ్యక్తి గతంగా అంతో ఇంతో స్వలాభం కూడ గట్టుకుందాం అనుకునే అజెండా తో ముందుకెళ్లాలనుకునే అంబేద్కర్ వాదులు కళ్ళు విప్పి తారకం సార్ ఏర్పరిచిన చైతన్య స్రవంతిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
‘ పోలీసులు అరెస్ట్ చేస్తే ‘ అన్న పుస్తకం వచ్చినప్పుడు కాలేజీలో మా విద్యార్థులు ఎంతో శ్రద్ధగా చదవడం అది హాస్టల్ లో ఎన్నో చేతులు మారడం నాకు బాగా గుర్తు. న్యాయ వ్యవస్థను చట్ట పరిభాషను సామాన్య వ్యక్తికి కూడా అందించాలనే ఆయన తపన ఉంది అందులో.
మేము కాలేజీలో ఉన్న సమయం లో – దళిత గొంతుక అప్పుడే మొదలై బలంగా వినిపిస్తున్న రోజులు. కొంత మంది లెఫ్ట్ పార్టీల నుండీ బయట పడి , లెఫ్ట్ పార్టీలను విమర్శించే నిర్మాణాత్మక ప్రక్రియను సులువుగా పక్కకు నెట్టి, ఆడిపోసుకోవడం దళిత వాదం గా పరిగణించబడుతున్న సమయం అది. అదొక ట్రెండ్ మొదలయ్యింది. ఆ సమయం లో అందరు దళిత వాదుల సైద్ధాంతిక విశ్వాసం ఒక ఎత్తైతే, ఆయనకున్న సైద్ధాంతిక విశ్వాసం unparallel అని చెప్తే అతిశయోక్తి కాదు. ఆయన రాసిన ‘ కులం – వర్గం ‘ అనే సునిశితమైన పుస్తకం, దళిత సైద్ధాంతిక పోరాటాల్లో ఖచ్చితంగా ఎంచుకోదగ్గ సాంస్కృతిక పరికరం. కేవలం ఆరోపణలకే పరిమితం అవ్వకుండా, అంబేద్కర్ భావ జాలాన్ని నిశితంగా ఆకళింపు చేసుకుని నడిపిన విశ్లేషణ అందులో ఉంది. స్వయాన ‘ దళిత మహా సభ ‘ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో స్టీర్ చేసిన వాడు. ‘ కారం చేడు ‘ లాంటి కేసుల్లో న్యాయ వాదిగా నిలబడి ప్రజాస్వామిక వ్యవస్థ తీరు తెన్నులను దగ్గరగా పరిశీలించిన వాడు. ఒక బేలన్స్డ్ ఆర్గ్యుమెంట్ తీసుకుని రాగలిగే చైతన్యం తారకం సార్ కే అబ్బింది.
‘ సార్ ! మీ ఆరోగ్యం కొంచెం మెరుగయ్యాక ఇంటర్వ్యూ చేస్తానంటే ‘ తలూపి గుమ్మం దాక వచ్చి సాగనంపాడు కాని, నాకేం తెలుసు ‘ మెరుగు ‘ అనేది ఇక ఉండదని ?!
‘ దళితులు ‘ కూడా అంతో ఇంతో కన్స్యూమరిజం రుచి చూస్తున్న రోజులు ఇవి. దళిత వాదులు కెరీరిస్టులై మధ్య తరగతి వాదాన్ని వినిపిస్తున్న రోజులివి. అంబేద్కర్ పేరు చెప్పి జగ్జీవన్ రాం లాంటి వాళ్ల career aspiration ను సైద్ధాంతీకరిస్తున్న రోజులివి. ఆకలి తో అలమటించే దళితుడు, ఆత్మ గౌరవం తో ఎదగాలనుకునే వ్యవస్థ నిర్లక్ష్యం చేసిన దళితుడు – వీళ్ళపై మన లెన్స్ ల ఫోకస్ అడ్జస్ట్ చేసుకుని ప్రయారిటీని కల్పించాల్సిన అవసరం లో మనం అందరం ఉన్నాము. ‘ ఉన ‘ లాంటి ఉద్యమాలు మహర్ పోరాట చరిత్రను మరిపిస్తున్న రోజులు తెచ్చాయి. అంబేద్కర్ను విగ్ర హానికి , వ్యక్తి పూజకు పరిమితం చేసి సంతృప్తి పొందే రోజులు పోయాయి. దళిత వాదం ‘ పేరానోయిక్ ‘ గా ఉండినా ప్రశంసించే రోజులకు నెమ్మదిగా కాలం చెల్లుతుంది. ఈ రోజు దళిత వాదం ఇంకో మెట్టు ఎక్కాలంటే మనలో సైంటిఫిక్ టెంపరమెంట్ ఉండడం ప్రధాన అవసరం. అందుకు నిర్భయంగా విశ్లేషణను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. దుర్మార్గమైన అహేతుకమైన ఆరోపణలతో ముస్లిములను, దళితులను, ఆదివాసీలను ఊచకోత కోస్తున్న రాజ్యానికి వ్యతిరేకంగా ఒక సాలిడ్ భావజాలాన్ని నిర్మించాలి. మహిళలపై ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఝుళిపించే దౌష్టిక అత్యాచారాలు , అణచివేతకు సరి అయిన సైద్ధాంతిక సమాధానం కావాలి. అందుకు ప్రతి దళితుడు ఒక ప్రాపంచిక మానవుడు కావాలి. సామాజిక చలనాన్ని ఒడిసి పట్టి సహేతుకమైన విమర్శను ఒకటి మేనుఫేక్చర్ చేయాలి.
అందుకు తారకం సార్ లాంటి వాళ్ళను ఆదర్శంగా ఉంచుకోవడం – need of the hour !!
– పి. విక్టర్ విజయ్ కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
4 Responses to ఆయన ఉద్యమాల పూల వనం !-విక్టర్ విజయకుమార్