నా జీవనయానంలో(ఆత్మకథ )… జీవితం – కె వరలక్ష్మి

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

21వ తారీఖు రాత్రి 7 గంటలకి కడుపులో సన్నగా నొప్పి వచ్చింది. మొదటి కాన్పు కావడం వలన అదేం నొప్పో నాకు అర్థం కాలేదు. అందుకే మా అమ్మకి చెప్పలేదు. అసలే మా అమ్మా నాన్నా మా మావయ్య పెళ్ళాం అన్న మాటలకి కుమిలిపోతూ ఆ వర్రీలో ఉన్నారు. నాకేమో కొంత ఆగి నడుములో నొప్పి ప్రారంభమైంది. పొట్టలోంచి ఇంకొంచెం గట్టి నొప్పి, వికారం, వామిటింగ్ సెన్సేషన్, ఒకేసారిగా రకరకాల నొప్పులు. కళ్లు తిరిగినట్టై నాకంతా అయోమయం అయిపోయింది. కాస్సేపటికి నా పరిస్థితిని మా అమ్మే గమనించింది. కాన్పు సమయమని మా అమ్మకి అర్థమైపోయింది.

మా అమ్మకు కాన్పులన్నీ చాలా సులువుగా జరిగేయి. నొప్పి వచ్చిన అరగంటలో, ఒకోసారి ఎరుకల మంత్రసాని ఇంకా రాకముందే బిడ్డ కేర్ మనేది. నాకూ అలాగే అనుకుని మా హాల్లో ఎప్పుడూ తన కాన్పులు జరిగిన చోట , అచ్చొచ్చిన మంచం అనే నులకమంచం వేసి దుప్పటైనా లేకుండా నన్ను దాని మీద పడుకోమంది. పడుకున్న నేను నిమిషంలో లేచి కూర్చున్నాను. నులకవీపు వెనుక గుచ్చుకుపోతోంది. ఈలోపల మా నాన్న వెళ్ళి డా॥ జయ గారి హాస్పిటల్లో నర్సు కమలమ్మని పిల్చుకొచ్చేరు. ఆవిడ పరీక్షించి కాన్పు సమయం వచ్చిందని చెప్పింది కానీ, నాకు నొప్పులు ఆగిపోయాయి.. కమలమ్మగారు వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వచ్చింది. ఆయనో ఇంజక్షను ఇచ్చారు. నొప్పులు ఉధృతంగా వచ్చి మళ్లీ ఆగిపోయాయి. మళ్లీ ఇంజక్షను, మళ్లీ నొప్పి, క్షణం ఒక యుగమైపోయింది. నొప్పులు ఇవ్వలేనంత, ఓర్చుకోలేనంత బలహీనమైన శరీరం, తెల్లవారుఝామునెప్పుడో స్పృహ పోయిందట. డాక్టరు గారు కాకినాడ తీసుకెళ్ళిపోమన్నారట. అప్పటికి ఈ ఊళ్ళో గైనకాలజిస్ట్ ఎవరూ లేరు. డాక్టరు కాకినాడ తీసుకెళ్ళమన్నారంటే ఆ మనిషి చావుబ్రతుకుల్లో ఉన్నట్లు అర్థం చేసుకునేవారు. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఆ నమ్మకం కొనసాగుతోంది. ఆటోలు గానీ, టేక్సీలుగానీ లేని రోజులు. మా నాన్న ఉదయం ఫస్టుబస్సులో సామర్లకోట వెళ్ళి టేక్సీ పిల్చుకొచ్చేరట. దానివెనుక సీట్లో నన్ను పడుకోబెట్టి తీసుకెళ్ళి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసేరట. పరిస్థితి ఇంతవరకూ తెచ్చుకుంటారా అని డాక్టర్లు కోప్పడ్డారట. ఎవరో ఒకర్నే బతికించగలమని కాస్సేపు, ఇద్దర్నీ బ్రతికించలేమని కాస్సేపు అన్నారట. మా అమ్మా నాన్నా లేబర్ రూం బైట ఏడుస్తూ కూచున్నారట. సిజేరియన్ చెయ్యడానికీ వీలు కాని పరిస్థితి అట. రోజంతా నాకు ఏవేవో ఇంజక్షన్లు ఇస్తూనే ఉన్నారట. మా అమ్మైతే చాలా మంది దేవుళ్ళకి మొక్కేసిందట. బిడ్డ బైటికి వచ్చే భాగాన్ని కిందవరకూ కట్ చేసి ఫోర్ సెప్స్ తో బిడ్డను బయటికి తీసేరట. 22వ తేదీ రాత్రి ఏడు గంటలకి అబ్బాయి పుట్టేడు. ఏడున్నర ప్రాంతంలో నా చెంపలమీద కొడుతూ ఎవరో నా చెవిలో పేరు పెట్టి పిలుస్తుండగా మెలకువ వచ్చింది. తెల్లని బట్టల్లో అమృతమూర్తిలా నవ్వుతూ అందమైన నర్స్ మృదువుగా పలకరిస్తూ నా ముఖం మీదకి వంగి చూస్తోంది. నేను కళ్ళు తెరవగానే అమ్మయ్య అన్నట్లు గుండెల మీద చెయ్యి వేసుకుని అటు చూడమని వేలు చూపించింది. నా కాళ్లవైపు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు బిడ్డను తలకిందులుగా పట్టుకుని నీళ్ళతో కొడుతూ వీపు మీద చరుస్తూ ఏమేమో చేస్తున్నారు. బిడ్డలో చలనం లేదట. ఏడవలేదట. నా గుండె గుభిల్లుమంది. రెప్పవాల్చడం మరచిపోయి అటే చూస్తున్నాను. ధైర్యంగా ఉండమని నర్స్ నా భుజాన్ని నిమురుతోంది. ఉన్నట్టుండి కాళ్ళూ చేతులూ విదిలించి తుళ్ళిపడిన బిడ్డ గొంతులోంచి సన్నని స్వరం వినిపించింది. అది మంద్రంలో వాయించిన వేణునాదంలా అన్పించింది నా చెవులకి. డాక్టర్ల మొహంలో గొప్ప రిలీఫ్ కన్పించింది. నర్స్ వాళ్లనుంచి బిడ్డను తీసుకుని నా కళ్ళ ఎదుట పట్టుకుని చూపించింది. ‘ఇప్పటివరకూ ఈలోకంలో లేదు కానీ, బిడ్డను చూడగానే ఎంత ఆనందం అమ్మాయికి’ అని హాస్యమాడింది. ఇప్పుడిలా రాస్తానని తెలీదు కానీ, లేకపోతే వాళ్లందరి పేర్లూ రాసుకుని దాచుకునేదాన్ని. నాకూ బిడ్డకూ ఒకే నంబరున్న ట్యాగ్స్ కట్టి బిడ్డను తొట్టిలో పడుకోబెట్టారు. ఫోర్ సెప్స్తో తియ్యడం వలన బిడ్డ తలభాగం పొడవుగా సాగిపోయింది. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తోంది. కానీ కన్నార్పకుండా వాడినే చూడాలనిపిస్తోంది. ఈ ఆనందాన్ని మోహన్ తో పంచుకోవాలనిపిస్తోంది. హాస్పిటల్ వాళ్లు లోపలికి రానివ్వడం లేదేమో! అంతలో మా అమ్మ, నాన్న కాకినాడలో P.R. కాలేజీలో ఇంటర్ చదువుతున్న మా పెద్ద తమ్ముడు వచ్చేరు. ఉదయం నుంచి మోహన్ పెళ్ళి వాళ్లింట్లో పేకాటలో ఉన్నాడట. బిడ్డను మురుగులో (ఒళ్లు కడగకముందు చూడాలని కబురుచేస్తే ఏడు గంటలకి వచ్చి చూసి వెంటనే వెళ్ళిపోయాడట. గొప్ప మనోవ్యధతో గుండె పిండేసినట్టై ఏడుపు పొంగి వచ్చింది. నర్స్ నా తల నిమురుతూ ‘నీ అంత రంగుతో అందమైన కొడుకు పుట్టాడు. ఆనందంగా నవ్వుతూ ఉండాల్సిన సమయంలో ఏడవచ్చా?’ అంటూ ఊరడించి మరో ఇంజక్షను ఇచ్చింది. తెల్లవారేవరకూ మెలకువరాని నిద్ర పట్టేసింది.

ఉదయాన్నే నన్నూ బాబునీ జనరల్ వార్డులోకి మార్చారు. అప్పటికి కాకినాడ గవర్నమెంటు హాస్పిటల్ నిర్వహణ చాలా బాగుండేది. ఛీప్ పి.జి. రాజుగారు ఎంతో బాగా నిర్వహిస్తారని చెప్పుకునేవారు. ప్రతి పేషెంటుకీ ఒక బెడ్డు, పక్కనే పిల్లలకోసం ఉయ్యాల, రోజూ దుప్పట్లు మార్చడం, బాత్ రూమ్స్ క్లీన్ గా ఉంచడం, రాజుగారు స్వయంగా వచ్చి చూసి వెళ్ళేవారట. చిక్కని కాచిన పాలు, తాజా బ్రెడ్స్, మంచి భోజనం అంతా బాగుండేది. హౌస్ సర్జన్స్ ని వెంట బెట్టుకుని రెండు పూటలా పెద్ద డాక్టర్లు రౌండ్లకి వచ్చేవారు. అందరినీ ఆదరంగా పలకరించే వారు. సకాలంలో వైద్యం అందుతూ ఉండేది.

ఉదయాన్నే మా నాన్న, మోహన్ వెళ్ళిపోయేరు. మోహన్ సెలవు పెట్టి రాజమండ్రి వెళ్ళి సాయంకాలానికి వాళ్ళ అమ్మగార్ని, అమ్మమ్మగార్ని తీసుకుని వచ్చేడు. ‘మా నాన్న పుట్టేడు అంటూ మా అత్తగారు మురిసిపోయేరు. ఆవిడకు వాళ్ళ తండ్రి గారంటే చాలా ఇష్టం.

హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ పంచడం ఆలస్యం చేస్తారేమోనని మా అమ్మ కిచెన్ దగ్గరకివెళ్ళి ఫ్లాస్కులో పాలు పోయించుకుని వచ్చేది. అసలే పాలంటే నాకు ఇష్టం కావడం వల్ల ఆరారగా ఆ చిక్కటి పాలను ఆస్వాదిస్తూ తాగుతూండేదాన్ని. ముందురోజు పడిన గాభరావల్ల రెస్టు లేకపోవడం వల్ల మా అమ్మ కబోర్డులో పెట్టబోయి ఫ్లాస్కు ఎత్తేసింది. ‘అయ్యో.. అయ్యో.. అని ఎంతగానో కంగారు పడిపోయింది. ‘పోనీలేమ్మా ఎలాగూ వేడిపాలు తాగకూడదు కదా! తర్వాత మరొకటి కొనుక్కుందాంలే,’ అని ఊరడించాను. జగన్నాధపురంలోని మా పెద్ద మావయ్యగారి ఇంటినుంచి మా అమ్మకు మామూలు భోజనం, మూడవరోజునుంచి నా కోసం బాలింతల పథ్యం భోజనం వచ్చేది. ఫ్లాస్కు పగిలిపోయిందని విని స్టీలు జగ్గు పంపింది. మా అత్తమ్మ, మా పెద్దత్తమ్మ, పెద్ద మావయ్యల గురించి మరీ మరీ చెప్పుకోవాలి. మా అమ్మ పుట్టింటికి ఎప్పుడెళ్ళినా ఎంతో ప్రేమగా చూడడమే కాదు ఇలాంటి అవసరాల్లో అంతదూరం నుంచి వండి తెచ్చేవారు. రామ్ దాస్ కంపెనీలో మెకానిక్ గా పనిచేస్తూ అంత చిన్న జీతంలో మా మావయ్య ఏమీ సంపాదించి ఉండకపోవచ్చు కానీ, మంచితనంతో మా మనస్సుల్లో నిలిచిపోయేరు. మావయ్య లేడు కానీ వృద్ధాప్యంలోనూ పనులన్నీ చక్కబెట్టుకుంటూ, ఆరోగ్యంగా తిరుగుతూ మా అత్తమ్మ ఇప్పటికీ ఉంది.

మా పెద్ద తమ్ముడు ఇంటర్ చదువుతూ బి.సి హాస్టల్లో ఉండేవాడు. కాస్త లీజర్ దొరికితే బాబు హాస్పిటల్ దగ్గరే కావడం వల్ల వచ్చేసి బాబుని ఎత్తుకోవడమో, చూస్తూ కూర్చోవడమో చేసేవాడు. మా చిన్న తమ్ముడి తర్వాత మళ్లీ మా ఇంట్లో పసివాడు బాబే. వార్డులోకి వచ్చిన మొదటిరోజే ‘అక్కా, నాకొక అయిదు రూపాయలు ఇవ్వవా’ అని అడిగేడు. మా అమ్మ కోప్పడింది. ‘ఇంకా ఏం ఖర్చులుంటాయో తెలీదు. నీకిప్పుడెందుకు డబ్బులు?’ అంటూ నా తలకింద పెట్టుకున్న చిల్లరలోంచి ఐదు రూపాయలు తీసి ఇచ్చేరు. కాస్సేపట్లో వాడు ఎర్రరాయి పొదిగిన బుల్లి బంగారు చుట్టు ఉంగరమొకటి తెచ్చి బాబు వేలికి తొడిగేడు. నేను పాలు బాగా తాగుతుండటం వలన బోలెడన్ని పాలు పడ్డాయి. కానీ, నా కుట్లు మూలంగా లేచి కూర్చోవడం, నడవడం కష్టంగా ఉండేది. దాంతో పొజిషన్ కుదరక అయిదారురోజుల వరకూ బాబుకి పాలు తాగడమే రాలేదు. ఎప్పుడూ నిద్రపోతూనే ఉండేవాడు. మా అమ్మ చెవి నులిమి మెలకువ తెప్పించి నోట్లో పెడితే ఒక గుక్క పీల్చుకుని వాటిని పెదవులనుంచి బైటికి వదిలేస్తూ వళ్ళీ నిద్రలోకి జారుకునేవాడు. కొందరు పిల్లలు, రాత్రి, మరికొందరు పగలు ఏడుపుతో వార్డు ఎగరొచ్చేస్తుంటే వీడు మాత్రం నిద్రపోతూనే ఉండేవాడు. మొదటి బిడ్డ కావడం వలన నాకు అన్నిటికీ భయంగానే ఉండేది. నేను నిద్ర మానేసి పక్కన పడుకున్న వాడినే చూస్తూ ఉండేదాన్ని.

ఒకరోజు మోహన్,. ఇంకోరోజు మా నాన్న వచ్చి రాత్రి వరకూ ఉండి చివరి బస్సులో ఇంటికెళ్ళేవారు. ఇంకో రోజు మా నాన్న వచ్చి రాత్రి వరకూ ఉండి చివరి బస్సులో ఇంటికెళ్ళేవారు. ఏదో రోజు విప్పుతామన్న కుట్లు ఎనిమిదోరోజు విప్పేరు. మా నాన్నను ఇబ్బంది పెట్టడం ఎందుకని బస్సులో వెళ్దాం అన్నాను. కానీ, మోహన్ ట్యాక్సీ పిల్చుకొచ్చేడు. తనే డబ్బులిచ్చేడు. ఇంటికి చేరేసరికి దీపాల వేళైంది. మసీదు సందులోంచి వచ్చి కారు మా గేటు ముందు ఆగగానే మా చెల్లెళ్లిద్దరూ, చిన్న తమ్ముడూ ఒక్క పరుగున వచ్చేసి బాబుని ఎత్తుకోవడానికి పోటీ పడ్డారు. మా నాన్న ఎవరికీ ఇవ్వకుండా పొత్తిళ్లతోబాటు జాగ్రత్తగా తీసుకొచ్చి గుమ్మం ముందుకొచ్చేక మోహన్ కిచ్చేరు. ఈలోపల మా అమ్మ ఇంట్లో కెళ్ళి తెల్లన్నం, ఎర్రన్నం, పసుపన్నం మూడు ముద్దలు పళ్ళెంతో తెచ్చి దిష్ఠి తీసింది. పారాణి నీళ్ళు చెంబుతో తెచ్చి మరోసారి దిష్టి తీసి కుడికాలు లోపలబెట్టి రమ్మంది. మర్నాడు తెల్లారిందగ్గర్నించీ చుట్టుపక్కల వాళ్లు చుట్టాలు చూడ్డానికి రావడం మొదలుపెట్టారు. ‘అమ్మో ఎంత గండం గడిచింది’ అని అందరూ బుగ్గలు నొక్కుకున్న వాళ్ళే. ఆ రోజుల్లో కాకినాడంత దూరం 30 మైళ్ళు వెళ్ళి హాస్పిటల్లో పురుడు పోసుకుని రావడమంటే మా ఊరి జనానికి అదో విచిత్రం.

ఇంటందరికీ పిల్లవాడితోడిదే లోకమైపోయింది. మా నాన్నైతే, బైటికెళ్లడం తగ్గించేసి గోడకి చేరబడి బొత్తన కాళ్లమీద కూర్చుని, ఆ కాళ్ళమీద మనవడ్ని వేసుకుని ఊపుతూ ఉండేవారు. వాడు నిద్రలో సడి చేసినా బాబు నాకు నిద్రాభంగం కలగకూడదని అర్థరాత్రైనా ఎత్తుకునే ఉండేవారు. సాధారణంగా పసిపిల్లలు కేర్ కేర్ మని అకారణంగా ఏడుస్తారు. మావాడు అలా ఏడవక చుట్టుపక్కల వాళ్ళొచ్చి, ‘మీ ఇంట్లో పసిపిల్లాడు ఉన్నట్టే లేదు’ అనేవారు. వాడికి స్నానం కూడా మా అమ్మ భయపడుతూ భయపడుతూ అతి మృదువుగా చేయించేది. వాడి దీర్ఘమైన ఏడుపు నాలుగు దీర్ఘాక్షరాలంత ఉండేది.

మేం ఇంటికొచ్చిన వారం రోజులకే పెద్దాపురం నుంచి మా అత్తగారి ఆయా పిన్ని చూడ్డానికి వచ్చింది. చీర కుచ్చిళ్ళు వెనక్కి దోపుకునిబాబుకి నూనె రాసి నలుగు పెట్టింది. నాలుగు బిందెల నీళ్ళు కాయించి స్నానం చేయించింది. ఆరోజు పిల్లాడి గొంతు అందరూ విన్నారు. సాగిపోయిన తలకాయ వెనుక ఒత్తింది. నూనె చుక్కలు పోసి ముక్కును పైకి ఒత్తింది. వేళ్ళు జొలిపి గొంతులో కఫం లాగింది. నేను భయంతో లోపలి గదిలోకి పారిపోయేను. మా అమ్మ చెమటల్తో తడిసిపోయింది. పిల్లవాడు ఎర్రగా కందిపోయి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయేడు. ఆరోజు నుంచీ బొజ్జనిండా పాలు త్రాగడం, ఆకలేస్తే ఏడవడం, కళ్ళు విప్పి చూస్తూ కాళ్ళూ చేతులూ కదుపుతూ ఆడుకోవడం సాగించేడు. పెద్దావిడ చెప్పింది. ‘పసిపిల్లలకి ఇలాగే స్నానం చేయించాలి. ఆళ్ళు తొందరగా ఎదగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఇదెంతో ముఖ్యం’ అని అలా మూడు నెలలపాటు వారం వారం వచ్చి చేయించేది.

ఆ సందర్భంలోనే వాళ్ళబ్బాయి మా మూడో ఆడపడుచు పార్వతిని చేసుకోనంటున్నాడని, మా పెద్దచెల్లిని ఇమ్మని అడిగింది. మా అమ్మ హడిలిపోయింది. గొడవలైపోతాయని భయపడింది. ఆవిడ పదే పదే అడుగుతూంటే చెల్లూరులో ఉన్న మా పిన్ని ఎడ్రస్ ఇచ్చిందట. మా పిన్ని సవితి కూతురు మంచి అందగత్తె. ఆ పిల్లతో వాళ్లబ్బాయికి పెళ్ళి చేసిందావిడ. దాంతో మా అత్తగారు వాళ్లమీద ఆశలు పెంచుకుని పెట్టిన ఖర్చంతా వృధా అయిపోయింది. దాంతో మా అమ్మ వాళ్ళమీదా నా మీదా ద్వేషం బాగా పెరిగిపోయింది మా అత్తగారు వాళ్ళకీ.

-కె .వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

 

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో