మానాన్నకు జబ్బు చేసాక మోహన్ అసలు చూడలేదు కాబట్టి చెల్లూరు నుంచి జగ్గంపేట వెళ్లేం . అప్పటికి నా దృష్టిలో మోహన్ ఒక ఎన్ సైక్లో పీడియా . అతనికి తెలీని విషయం ఉండదని నా అభిప్రాయం . కనిపించిందల్లా చూపించి ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉండేదాన్ని . రైటో – రాంగో ఠపీమని ఆన్సరు చెప్పేవాడు . ఒకోసారి నేను చిన్న బుచ్చు కునేలాగా కసిరి పడేసే వాడు .
మా నాన్నను చూసి ఆ సాయంకాలమే బయలుదేరాం . ఈ లోపల నేను “ నాన్నా , మీ అల్లుడి చదువుకి స్కూల్ టీచర్ ఉద్యోగం మాత్రమే వస్తుంది . మనూళ్లో టీచర్ పోస్టులేవైనా ఖాళీ అవుతాయని తెలిస్తే ఒక ఉత్తరం రాయండి “ అని మా నాన్నతో చెప్పేను .
మేమెక్కిన బస్సు లాలాచెరువు దగ్గర ఆపేసారు . పోలీసులు లారీల్ని పక్కకి హైవే లోకి మళ్లిస్తున్నారు . బస్సుల్ని మాత్రం ఆపేస్తున్నారు . జనం అక్కడ దిగి నడుచుకుని రాజమండ్రి ఊళ్లోకి వెళ్తున్నారు . మేమూ ఆ జన సమూహంలో పడి నడక మొదలు పెట్టేం . ఆ రోజు ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి రాజమండ్రి వచ్చేరట . మరి కాస్సేపట్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారట . సెంట్రల్ జైలు కివతల రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసి కొన్ని వేల మంది కూర్చోడానికి ఏర్పాటు చేసేరు . జైలుకు ఆనుకుని తూర్పు ముఖంగా పెద్ద స్టేజి కట్టేరు . జనం తోపుడుకి వెళ్లి వెళ్లి మేం ఇంచుమించు స్టేజి ముందుకి చేరుకున్నాం . అప్పటి నాయకులకి ఇప్పటిలా భయాలు లేవు . శాస్త్రీజీ ఓపెన్ టాప్ జీప్ లో నిలబడి వచ్చేరు . యువకుల్ని సైన్యంలో చేరమని , జనాన్ని పొదుపు పాటించమని ఉపన్యసించేరు . నేను ముఖా ముఖి చూసిన మొట్టమొదటి దేశ నాయకుడాయనే .
మా అత్తగారు వెనకా ముందూ ఆలోచించకుండా తనకి ఎప్పుడేంతోస్తే అది చేసేసేవారు . పొగాకు నారుమళ్ల టైంలో మా అరుగు మీద ఒక కిరాణా దుకాణం పెట్టేరు . ఆవిడ రాజమండ్రిలో అప్పు పెట్టి తెచ్చిన సరుకులు ఇక్కడ పని వాళ్లకి అరువు ఇచ్చేవారు . దానిలోని సరుకుల్నే మేం ఇంట్లోకి వాడే వాళ్లం . తిను బండారాలన్నీ పిల్లలు తినే వారు . అరువు పట్టుకెళ్ళిన వాళ్లు కొందరు ఇచ్చి , మరి కొందరు ఎగవేసి చివరికి ఓ పెద్ద నష్టం తేలింది .
మా అత్తగారి చిన్న చెల్లెలు సరస్వతి గారి అత్త మామల్ని తీసుకొచ్చి ఓ గదిలో పెట్టేరు . ఎనమండుగురు పిల్లలు , ఓ పెద్దావిడ – అంతా కలిసి పదకొండు మంది . మిల్లులో వచ్చిన బియ్యం ఆ కుటుంబానికే సరిపోయేవి కావు . ఉన్న ఒక్క గదీ మా అందరికీ సరిపోయేది కాదు .
1968 లో ఉగాది పండక్కి మోహన్ , నేను మా పుట్టింటికి వెళ్లేం . నన్ను ఉంచమని మా వాళ్లు అడగడంతో నాలుగు రోజులుండి మోహన్ వెళ్లిపోయేడు . మే నెలలో ఒక రోజు ఉదయం నిద్ర లేచిన నేను లేచి నిలబడలేకపోయాను . నా కళ్ల ముందున్నవన్నీ గిర్రున తిరుగుతున్నట్టు అన్పించింది . కడుపులో దేవేస్తూ విపరీతమైన వికారం . నాకేదో అయిపోతోందని భయం వేసి ‘ అమ్మా ‘ అని అరిచేను . మా అమ్మ పరుగెత్తు కొచ్చింది “ ఏమైంది ఏమైంది “ అంటూ , నన్ను తీసుకెళ్లి నూతి చప్టా మీద కూర్చో బెట్టింది . పచ్చని రంగులో కఫం వెళ్లుకు రా సాగింది . అది మొదలు ఏ వాసనా పడేది కాదు. మా అమ్మకు వెంటనే అర్ధమైపోయింది నాకు నెల తప్పిందని . ఇంట్లో అందరూ సంబరపడి పోయేరు . నాకు మాత్రం ఏ ఆహారమూ నోటికి పోయేది కాదు . పాలు , నీళ్లు ఏవి గొంతులో కెళ్లినా వాంతులైపోయేవి . పది రోజులయ్యే సరికి లేవలేనంత నీరసంతో కట్టె పుల్లలాగ అయిపోయేను . ఇంట్లో వంటల వాసన లేవీ పడేవి కావు . దూరంగా ఎవరింట్లోంచో వచ్చిన వాసన గల వంటకం కావాలన్పించేది . పాపం మా అమ్మ గిన్నె పట్టుకుని వెళ్లి అడిగి తెచ్చేది . దాన్ని చూసేక అదీ నోటికి పోయేది కాదు . వెలుతురు చూడలేకపోయేదాన్ని. గదిలో పందిరి మంచం కింద చీకట్లో పడుకునేదాన్ని . నెల గడిచే సరికి ఎవరో ఒకరు రెక్క పట్టుకుని నడిపించాల్సినంత బలహీనంగా అయిపోయాను . ఇదేదో అనారోగ్యమేమోనని నాకు అనుమానం పట్టుకుంది . డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాలని మా అమ్మకీ అన్పించలేదు . నా అంతటికి నేను వెళ్లే ఓపిక లేదు . వేవిళ్ల వాంతులు తగ్గడానికి డాక్టర్లు మందులిస్తారని తెలీని అమాయకపు జనం మా వీధి వాళ్లు . గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి మందులూ , చివరికి తలనొప్పి మాత్ర కూడా కడుపులోకి వెళ్లకూడదని , వెళ్తే బిడ్డకి హాని అని నమ్మేవారు .
ఐదవ నెలలో కొంత నెమ్మదించి నట్టు అన్పించేక కోనేరు పేట వెళ్లేను . ఇక్కడ బ్రతిమలాడి తిన్పించే వాళ్లెవరూ లేరు . మిల్లులో అప్పుడే ఆడిన బియ్యంతో వండే అన్నం ఉడుకుతూంటే ఆస్మెల్ చాలా బావున్నట్టుండేది . ఒక రోజు వేడి గంజితో పచ్చి మిరపకాయ నంజుకుని తాగాలన్పించింది . గంజి చల్లారే వరకూ ఆగలేక ముందు మిరపకాయ కొరికే సాను . కారం నషాళానికంటి విలవిలలాడి పోయేను .
అంతకు ముందు కొంత కాలంగా పెద్దాపురం నుంచి మా అత్తగారికి పిన్ని వరసయ్యే ఒక పెద్దావిడ ప్రతి ఆదివారం రావడం పోవడం సాగిస్తోంది . ఆవిడకొక కొడుకు ఉన్నాడట . హైస్కూల్ల్లో డ్రిల్లు మాస్టరట . ఈవిడేమో హాస్పిటల్లో ఆయా అట . వాళ్లబ్బాయికి పెళ్లి సంబంధం చూడమని మా అత్తగార్ని అడిగింది . మూడో అమ్మాయి పార్వతిని ఇచ్చి చెయ్యాలని అనుకున్నారు . అంతే , ఆవిడొచ్చినపుడల్లా కోడి కూరలు , పలావ్ లు చేసేవారు . పెద్ద పెద్ద స్టీలు కేన్ లతో పిండి వంటలు , పులస చేపల పులుసు లు పంపించేవారు .
వాళ్ల అత్తింటి వాళ్లు వస్తే రాణి తల్లి వెంట తిరుగుతున్న కోడి పిల్లల్ని పట్టుకుని వంకాయలు తరిగినట్టు తరిగేసి కూర వండేది . ప్రసాదు పిచ్చుకల్ని కొట్టు కొస్తే కాల్చి తినే వాళ్లు . ఆ చర్యలకి , ఆ వాసనలకి నాకు కడుపులో దేవేసి వాంతులైపోయేవి .
మరో పక్క మోహన్ తౌడు గుంతలో చుట్టుకుని పడుకున్న పెద్ద పొడ పాముని , వంటింట్లో కొచ్చిన రెండు తలల పాముని , కోళ్ల గంపలో దూరినప్పుడొక సారి , వాకిట్లో మా మావగారి మంచం కింద పడగ విప్పి ఆడుతున్నప్పుడొకసారి తాచు పాముల్ని చంపేడు . నాకింక రాత్రీ పగలూ పడుకుంటే చాలు పాములు కలల్లో కొచ్చేవి .
బాబ్జీ పుల్ల పుల్లని చింత కాయలు , సీమ చింతకాయలు కోసుకొచ్చి ఇచ్చేవాడు . రోజూ క్రమం తప్పకుండా మా ఇంటి వెనక తోటల్లోంచి రెండు మూడు కొబ్బరి బొండాలు తెచ్చి కొట్టి ఇచ్చేవాడు . లేత కొబ్బరి ఇష్టంగా తినాలన్పించేది .
మోహన్ ని వెంటనే బయలు దేరి రమ్మని మానాన్న నుంచి ఉత్తరం వచ్చింది . ఇద్దరం కలిసి వెళ్లేం . మా హైస్కూల్లో నాకు చదువు చెప్పిన మా వారణాసి జోగారావు మాస్టారు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ పోస్టు తన అల్లుడికి వేయించమని మా నాన్న ఊరి సర్పంచ్ చిట్టిబాబు గార్ని అడిగేరట . ఆయన వీరవరం వెళ్లి మినిస్టరు తోట రామస్వామి గార్ని కలుద్దాం అన్నారట . అప్పటికప్పుడు మా ఇంట్లో వట్టి పోయిన గేదె ను వంద రూపాయలకు అమ్మేసి , ఓ యాభై మా అమ్మ కిచ్చి , మరో యాభై జేబులో పెట్టుకుని , సర్పంచి గారికి తెలిసిన వాళ్లెవరిదో కారులో పెట్రోలు పోయించి మోహన్ ని , సర్పంచి గార్ని తీసుకుని వీరవరం వెళ్లేరు . మినిస్టరు గారు వీళ్ల కారులో కాకినాడ వెళ్లి పోస్టు వేయించి అప్పాయింట్ మెంటు ఆర్డరు చేతి కిచ్చి పంపించేరు . మోహన్ మా ఊరి హైస్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచరుగా అప్పటికప్పుడు చేరి పోయేడు .
కడుపులోని బిడ్డ అదృష్టం అన్నారందరూ .
అప్పటి వరకూ జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా లోపల బిడ్డ కదలికలు నాలో కొత్త జీవం పోసాయి . అది అబ్బాయో , అమ్మాయో తెలీదు కాని , నా జీవితానికదే సర్వస్వం అన్పించ సాగింది . బిడ్డ కదలికల్ని మోహన్ కూడా ఇష్టంగా అనుభూతించేవాడు .
ఇక ఫర్వాలేదు , జీవితానికొక దారి ఏర్పడింది కాబట్టి నా బిడ్డని ఏ లోటూ లేకుండా జాగ్రత్తగా పెంచుకుంటాను . అవధి లేని మాతృత్వ భావన నన్ను ఆనందంలో ముంచేసేది .
ఊరికి దక్షిణంలో కాకినాడ రోడ్డు పక్కన రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ కట్టుకున్న ఇంట్లో ఓ గది , వెనక వంటగది , ముందుకు చిన్న గ్రిల్స్ వరండా ఉన్న పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు మోహన్ . ఓ నెలకి సరిపడా వంట సరుకులు , గిన్నెలు , ఇంట్లోదే నవారు మంచం , పరువు పట్టుకెళ్లి సర్ది వచ్చింది మా అమ్మ . మొదటి ఆదివారం నాడు రాజమండ్రి వెళ్లి అందరికీ చెప్పి మా అత్తగార్ని పిలుచుకుని వచ్చేం . మా అమ్మ దీపం వెలిగించి పూజ చేసి పాలు పొంగిస్తే , మా అత్తగారు ప్రార్ధన చేసేరు . మా అమ్మ ఇచ్చిన సామగ్రి మా అత్త గారి కేమీ సంతృప్తి కలిగించలేదు . “ఇదే నా , కూతురుకి పెట్టే సారి ?” అని మొహం మీదే అడిగేసారు . “ ఇంత కొంచెం ఇత్తడి సామానా , మా అమ్మ నాకు ఎంత ఇచ్చిందో తెలుసా , ఇప్పడు కాకపోతే ఇంకెప్పుడు పెడతారు ? నీకు నోరు లేదా ? “ అని నా మీద కోప్పడ్డారు . మా అమ్మ చిన్న బుచ్చు కోవడం చూసి నాకూ కళ్లల్లో నీళ్లు వచ్చేయి . వాళ్ల పరిస్థితిని కళ్లారా చూస్తూ నేనేమీ అడగలేక పోయాను .
ఇల్లు గల వాళ్లకి పాడి గేదె ఉంది . ఉదయం మోహన్ కి కాఫీ కి పాలు , పెరుగు , రాత్రి పడుకోబోయే ముందు నేను తాగడానికి కాచినవి ఓ గ్లాసు పాలు ఇల్లు గలావిడే ఇచ్చేది . మోహన్ రాజమండ్రి నుంచి చిన్న డబ్బా కుంకుమ పువ్వు కొనుక్కొచ్చాడు . నేను కాఫీ , టీ లు తాగే దాన్ని కాదు . చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుని పాలు తాగే దాన్ని . అణా పుల్లల కట్టని అతి పొదుపుగా మంట పెడుతూ చిన్ని వంట , సొంత సంసారం , మిగతా సమయంలో మా మాస్టారు ఇచ్చిన టీకా తాత్పర్యాలతోడి వాల్మీకి రామాయణాన్ని పఠించడం . నేను ఇష్టంగా తింటున్నానని అక్కయ్య గారు రెండు మూడు సార్లు పులుసు ఉప్పిండి చేసి తెచ్చారు .
మా పెద్ద చెల్లెలు ఏడో తరగతిలో చదువు చాలించి ఇంట్లో ఉంది . చిన్న చెల్లెలు ఎనిమిది చదువుతోంది . నాకు సాయంగా వచ్చి పనులు చక్క బెట్టి వెళ్తూండేది .
అంతా బాగానే ఉండేది కాని ఊళ్లో ఎవరు కాలం చేసినా ఆ ఊరేగింపు మా ఇంటి ముందు నుంచే వెళ్లేది . ఇంటికి వెనక వైపు ద్వారం తెరిస్తే కోనేటికవతల శవ దహనం కన్పించేది . భయం వేసేది . జనవరిలో వాళ్ల అమ్మమ్మ గారు రమ్మన్నారంటూ మోహన్ నన్ను రాజమండ్రి తీసుకెళ్లేడు. అప్పటికి నాకు తొమ్మిదో నెల నడుస్తోంది . వంట చేసి పెట్టి తిన్నాక , ఏం తినాలని ఉంది తెప్పించి పెడతాను “ అన్నారు . నాకు మామిడి పండు తినాలని చాలా అన్పిస్తోంది . కాని , అది సీజన్ కాదు కదా ! ఆవిడ ఎక్కడి నుంచి ఎలా తెప్పించేరో పెద్ద రసాల మామిడి పండొకటి నా చేతిలో పెట్టేరు . నాకిప్పటికీ ఆశ్చర్యమే అది .
తొమ్మిదో నెలలో అద్దె ఇల్లు ఖాళీ చేయించి మా పుట్టింటికి తీసుకొచ్చేసారు . మా చిన్నిల్లు ఖాళీ చేయించి అందులో సామాన్లు సర్దించింది మా అమ్మ .
నెలనెలా జీతం అందే వేళకి మా అత్తగారు వచ్చి మోహన్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లేవారు . మొదటి నెల క్యూరియాసిటీ కొద్దీ మోహన్ ని అడిగేను “ మీకెంత జీతం వస్తుంది ? అత్తయ్య గారికెంత ఇస్తున్నారు ?’ అని , “ అవన్నీ నీ కనవసరం . ఇంకెప్పుడూ ఇలాంటి ప్రశ్న లెయ్యకు “ అన్నాడు . నేను కొంత చిన్న బుచ్చు కున్నా , అలా అడగకూడదు కాబోలు అనుకుని నా రామాయణ పఠనంలో మునిగి పోయాను .
ఫిభ్రవరి 20 న మా బాబూరావు బావ పెళ్లి మా పెద్ద నాన్నగారి అమ్మాయితో జరిగింది . ఆ పెళ్లి కొచ్చినప్పుడు మా రెండో మావయ్య భార్య మా నాన్నను వడ్డీ కట్టడం లేదని నానామాటలూ అంది . అలాంటి అనుభవం మా నాన్నకి కొత్త నిర్ఘాంత పోయి నిరుత్తరంగా ఉండిపోయారు . మర్నాడే తనివ్వాల్సిన బాకీకి బదులుగా గ్రాంట్ లో భూమి రెండెకరాలు రిజిస్టర్ చేయించి ఇచ్చేసారు . మూడు వేలకి , దాని వడ్డీకి ………………………..
-కె . వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~