Everybody with a womb doesn’t have to have a child any more than everybody with vocal cords has to be an opera singer — Gloria Steinem | American feminist activist.
‘థెరెసా మే’కి మేనల్లుళ్ళూ, మేనగోడళ్ళూ ఉన్నప్పటికీ- కన్నపిల్లలు లేరు కనుక దేశప్రధాని అవడానికి తానే ఎక్కువ అర్హురాలినన్న స్టేట్మెంట్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి అయిన ఆండ్రియా లీడ్సమ్ కొన్నాళ్ళ కిందట. థెరెసా మేకీ ఆమె భర్త ఫిలిప్‌కీ పిల్లలు పుట్టలేదు. జీవితం తనకి ఎంతందిస్తే అంతే ప్రాప్తమనుకుంటానని- మే చెప్పారు.
తనన్న మాటలకి లేచిన దుమారం వల్ల లీడ్సమ్ తన అభ్యర్థిత్వం వెనక్కి తీసుకున్నారనుకోండి. మన దేశంలో ఎవరూ అలా చేసిన దాఖలాలు కనిపించవు.
పిల్లలని కనడం గురించి లోకంలో ఆలోచనాధోరణి మారినప్పటికీ, బ్రిటన్లో కూడా మాతృత్వాన్ని ప్రధాని పదవికే ఒక అర్హతగా చేసినప్పుడు, మన దేశంలో ఉన్న సామాన్య స్త్రీల పరిస్థితేమిటి?
పిల్లలు లేకపోవడం అన్నది కొన్నాళ్ళ కిందటి వరకూ సామాజిక వెలిగా భావించబడుతుం డేది. ప్రత్యేకంగా గ్రామాల్లో. గొడ్రాళ్లని ఎగతాళి చేయడానికి సంకోచపడేవారు కాదు.
వివాహవ్యవస్థా, మాతృత్వం- ఇవన్నీ లేకుండా, స్త్రీ అసంపూర్ణమైనదన్న భావం లోతుగా పాతుకుని ఉండేది. భారత సమాజం సాంప్రదాయాలు, విలువలు సంస్కృ తి-వీటన్నిటినీ దారాలతో కలిపి అల్లబడినదే ఆదర్శ కుటుంబం అన్న అభిప్రాయాన్ని నమ్మేది. ఇప్పటివరకూ ఒక స్త్రీ విలువ ఇంటిని ఎంత బాగా నడుపుతుందో, ఒక వారసుడిని కనివ్వగలదో, లేదో అన్న వాటిమీదా ఆధారపడినదే.
సామాన్యంగా మనం ఒక సమాజంగా, నిశ్చిత మైలురాళ్ళ లోలోపలే ఉంటాం-ముందే గీసి పెట్టి ఉన్న ఒక టైమ్‌లైన్ ప్రకారం. ఒక పట్టణపు స్త్రీ చదువు పూర్తి చేసి (అదెంతైనా) ఒక నిర్దిష్ట వయస్సులో పెళ్ళి చేసుకుని, ఆ తరువాత పిల్లల్ని కనడం అన్నది ఆనవాయితీ.
పెళ్ళి ఆలశ్యమయితే, తెలిసినవాళ్ళు ‘ ఎప్పుడు చేసుకుంటావింక?” అని మొహంమ్మీదే అడుగుతారు. ఆ పెళ్ళి అయిన తరువాత, ‘ఇంకా విశేషమేదీ లేదా?’ అని అడగడానికి సంవత్సరం కూడా పట్టదు. ఇంకా ఆలశ్యం చేస్తే, ‘ఇప్పుడు తెలియదులే. వయస్సుమీద పడ్డాక- రోగమో, రొష్టో వస్తే చూసుకోడానికి ఎవరూ లేకపోతే కానీ తెలిసి రాదు’ అనో, ‘మరీ ఇంత స్వార్థమా? పిల్లల్ని పెంచడం కూడా ఇష్టం లేదూ?’ అనో, ‘జీవితం అంటే ఏమిటనుకున్నావు? బాధ్యతలూ నిర్వహించాలి.’ అనో, మరేవో అనడం సామాన్యం.
పిల్లల్ని కనాలో, కూడదో అన్నది మన సమాజంలో ఉన్న సాంఘిక, నైతిక ధార్మికత వల్ల నిర్దేశించబడుతుంది.
ఒక జంట తమకి పిల్లలు వద్దనుకుని పరస్పరం నిర్ణయించుకున్నా లేక ఒంటరి స్త్రీ మాతృత్వాన్ని కావాలనుకున్నా- అవి వారి వ్యక్తిగత ఎంపికలయి ఉండాలి.
ఒకానొకప్పుడు, పిల్లలు పుట్టడం అన్నది పెళ్ళికి పరమార్థం. ఇప్పుడు వాళ్ళు పుట్టబోయేముందే, తల్లి తండ్రులు ఎంతో ప్లానింగ్ చేసుకుంటున్నారు.
భారతీయ నారి అనే మూసలో ఇమిడి, దశాబ్దాలగా స్త్రీలు అంతర్గతంగా పితృస్వామ్యంలోనే జీవించారు. తల్లి అవడంలో ఉన్న తృప్తిని ఎవరూ కాదనరు. కానీ, స్తీలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్న కొద్దీ, ఆధునిక సంప్రదాయ వైరుధ్యం ప్రారంభం అవడం వల్ల, చాలామంది యథాతథ స్థితి నుండి దూరం అవుతున్నారు.
పట్టణపు మహిళలు ‘పిల్లలు కావాలా వద్దా’ అన్న ఎంపికమీద తమ హక్కు ప్రకటించుకోవడం హెచ్చవుతోంది. మాతృత్వపు దారిలో నడవకుండా, తమని తాము నిర్వచించుకోవడం ఎక్కువవుతోంది. పాటల్లో, సినిమాల్లో, పుస్తకాల్లో కూడా తల్లినీ, తల్లితనాన్నీ గ్లోరిఫై చేస్తూనే ఉన్నారు. అదిప్పుడు మాతృత్వం వద్దనుకునే స్త్రీల భుజాలమీద భారీ అయింది. ‘నాకున్న టైముని నాకిష్టం వచ్చినట్టు గడుపుకుంటాను. దానికి పిల్లల్నే కనాలా?’ అని ప్రశ్నించడానికి వీరు ధైర్యం సమకూర్చుకుంటున్నారు.
ఏమి చెప్పినప్పటికీ, పిల్లలు వద్దనుకోవడం అన్నది సులభమైన నిర్ణయమేదీ కాదు. తీవ్రమైన సామాజిక వత్తుడులని భరించే శక్తుంటే కనుక, అది వేరే సంగతి కానీ స్త్రీ చంద్రమండలానికి వెళ్ళగలిగినప్పటికీ, పిల్లలు లేకపోతే కనుక ఆమెకెక్కువ విలువ ఉండేది కాదు-ఇప్పటివరకూ.
ఏది ఏమైనా, సామాజిక వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇప్పటి పరిస్థితి ఒక దశాబ్దం కిందటికన్నా నయమే. సామాజిక వ్యవస్థలు, పోకడలు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. పిల్లలుంటే కనుక అతి ఖర్చుతో, పోటీతత్వంతో, విద్యావ్యవస్థతో కూడా పోరాడ్డమేకాక ఒక పెద్ద బాధ్యత నిర్వహించడం కూడా అని తల్లితండ్రులకి తెలుసు.
స్త్రీల ఉన్నత చదువుల వల్లా, వారికిప్పుడు కనిపిస్తున్న విస్తారమైన ప్రపంచం వల్లా, వారి అవధులు విప్పారి, జీవితంలో అర్థమూ, ప్రయోజనమూ కనుక్కునేటందుకు పిల్లలని కనడమే కాక, ఇంకా అనేకమైన మార్గాలున్నాయని వారికి తెలుస్తోంది. అందువల్లే కొందటి రెండు, మూడు దశాబ్దాలుగా DINKs( double income, no kids) జంటలు మనకి తరచూ తారసపడుతున్నాయి. వీడియో చూడండి.
కానీ, పిల్లలు వద్దనుకునే స్త్రీలని తీర్పు తీర్చడం మాత్రం సులభం. వారు స్వార్థపరులనీ, కుటుంబ వ్యతిరేకులనీ, వృత్తిపట్ల స్వీయభావావరోధం ఉన్నవారన్న ముద్రలు మాత్రం పడతాయి. పిల్లలున్నవారు తీర్పు తీరుస్తారు. పిల్లలు లేని వారు సంజాయిషీ ఇచ్చుకుంటారు.
పిల్లలు వద్దనుకునే కారణాలెన్నో ఇప్పుడు!
పిల్లల్ని కంటే, పనివాళ్ళ మీదైనా ఆధారపడాలి లేకపోతే అమ్మో, అత్తో ఆ బాధ్యత తలకెత్తుకోవాలి- వాళ్ళు ఒప్పుకుంటేనే.ఇకోలొజీ, సాంస్కృతిక వాతావరణం, హెచ్చవుతున్న కాలుష్యం, వ్యయం, భౌతికవాదం, నేరాలు – వీటన్నిటినీ లెక్కలోని తీసుకుని , ఇంకొక జీవిని ఈ లోకంలోకి తీసుకురావడం సరైనదేనా, కాదా అని కొందరు తటపటాయిస్తారు.
మాతృత్వం బానిసత్వానికి ఇంకో రూపం మాత్రమే. బాధ్యత చాలా ఉంటుంది. దానితోపాటు వచ్చే తమ దోష భాషమే కాక తమ తార్కిక అస్థిత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నది మరి కొందరి అభిప్రాయం.
పిల్లలగా ఉన్నప్పుడు చేయలేకపోయిన పనులన్నిటినీ ఇప్పుడు చేయొచ్చు. సంగీతం అయినా, పి ఎచ్‌డి పూర్తి చేయడం అయినా ఆర్టైనా సరే- ఆ తమ passion పిల్లల కోసమని వదులుకుంటే, బహుషా భవిష్యత్తులో పిల్లలని అసహ్యించుకొనే అవకాశం ఉంటుందేమో!-ఇంకో వాదన.
పిల్లలు లేకపోవడం వల్ల తాము అంసపూర్తైన స్త్రీలమని వారనుకోరు.మాతృత్వం overrate చేయబడింది. అది సంతోషాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు కానీ అది జీవితకాలపు బాధ్యత. దానికి వారు సిద్ధంగా లేరు.
తమ ఉద్యోగం వదులుకోవాలి. ప్రయాణాలని తగ్గించుకోవాలి. తమకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోలేరు.-ఇవన్నీ మరికొన్ని.
ఆఖరిగా- పిల్లలు వద్దనుకున్నవారికి కొన్ని కొన్ని సార్లు సందేహాలు కానీ పశ్చాత్తాపం కానీ కలుగుతాయా? తప్పకుండా. కానీ, పిల్లలు కలిగి ఉంటే, తమ జీవితంలో పిల్లలని పుట్టించకుండా గడిపే ప్రయత్నం ఎందుకు చేయలేదా! అని కూడా ఆలోచించే అవకాశమూ లేకపోలేదు. అన్ని రకాలైన జీవితాలనీ గడపడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ సందర్భాల్లో, తమ అంతర్బుద్ధిని నమ్ముకోవడమే ఉత్తమం.
పిల్లలు వద్దనుకున్న జంటలని మన సమాజం గౌరవించే రోజొకటి వస్తుందని ఆశిద్దాం.
ఎంపిక వ్యక్తిగతమైనంతమాత్రాన్న, అది సమాజాన్ని అగౌరవపరచడం మాత్రం కాదు.
ఎవరి ఆలోచన వారిది, ఎవరి నిర్ణయమూ/జీవితమూ వారిదే. పరిణామాలు భరించేదీ వారే.
-కృష్ణవేణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
17 Responses to నా సంపూర్ణత నాదే