తమిరిశ జానకి ‘మినీ కథలు’ (పుస్తక సమీక్ష)- మాలాకుమార్

మినీ కథలు
రచయిత్రి;తమిరిశ జానకి

మాలా కుమార్

మాలా కుమార్

మల్లీశ్వరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటానని నమ్మించి,చివరకు మోసం చేసి బాగా ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్ళాడాడు సారంగపాణి.ఆ మోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది మల్లీశ్వరి.అంతటి ఘనుడైన సారంగపాణి, తన దగ్గరా, స్నేహితుడు చంద్రం దగ్గరా ఐదువేలు తీసుకొని కనిపించకుండాపోయిన ఇంకో స్నేహితుడు సోమసుందరం తను ఉన్న ఊరు వస్తున్నాడని తెలిసి అత్యవసరంగా రమ్మని చంద్రాన్ని పిలుస్తాడు.తనను పిలిపించిన కారణం తెలుసుకున్న చంద్రం విస్తుపోతాడు.”ఏ కష్టాలల్లో ఉన్నాడో ఇవ్వలేకపోయాడు.మల్లీశ్వరి ప్రాణాలు తీసుకుంటే నీకు చీమ కుట్టినట్లైనా అనిపించలేదు.డబ్బు కంటే తీసిపోయే వస్తువులా ఆడపిల్ల మానప్రాణాలు”అని సూటిగా ప్రశ్నిస్తాడు “కనిపించనిజాడలు”కథలో.ఈ ఒక్క వాక్యముతో రచయిత్రి ఆడపిల్లల విలువ గురించి సూటిగా సమాజాన్ని ప్రశ్నించారు.

పదోతరగతి ఒకసారి కాదు మూడోసారి పోయింది భీముడికి.తల్లి తిడుతుందేమో నని భయపడ్డాడు కాని అమ్మ గంటలమ్మ “చదువులో తక్కువైతే వేరేవాటిల్లో తెలివితేటలు చూపించుకోకూడదా? వేరే రకంగా మంచి పనులు చేసుకొని బతక్కూడదా? కిదటేడాది గంగమ్మ కొడుకు పరీక్ష పోయిందని భావిలో దూకి చచ్చిపోయాడు.వాడికి బతికే ధైర్యం లేకపోయింది.నువ్వలాంటి పిచ్చి పని చేయలేదు.నువ్వలాంటి పనికిరానివాడివి కాదు పనికి వచ్చేవాడివే.” అని కొడుకు ధైర్యం చెబుతుంది చదువులేని గంటమ్మ.పరీక్షపోయింది అని భీరువుల్లా ఆత్మహత్య చేసుకుని తల్లితండ్రులకు కడుపుకోత పెట్టే పిరికి విధ్యార్ధులకు కనువిప్పు లాంటివి ఈ వాక్యాలు.

బాల్యం లో స్నేహాలు,ఆ స్నేహితాల్లో చెదురుమదురు కోపాలూ, వైరాలూ,వేళాకోళాలూ,ఎగతాళీ, ఎకసెక్కాలూ,అన్నీ ఇష్టాలై అల్లుకు పోయే పందిరి.ఆ అనుభూతులు పెద్దయ్యాకా మనసు లో పదిలంగా ఉంటాయి అని చక్కని అనుభూతితో చెప్పారు రచయిత్రి “పాతనోటు” కథలో.

జానకి “రేపు విచ్చుకోబోయే మొగ్గను చూసి సంతోష పడుతుంటాను నేను.అందమైన భవిష్యత్తు అది.తప్పకుండా అందమైన భవిష్యత్తుని చూస్తానన్న విశ్వాసం నా పెదవులమీద చిరునవ్వు ని చెరగనివ్వదు.మీరు మొగ్గను చూడరు.దాని కింద ఉన్న ముల్లునే చూస్తూ దిగాలు పడుతుంటారు.విచ్చుకోబోయే మొగ్గను విస్మరిస్తే మనస్థాపమే కదా మిగిలేది.””ఆత్మస్థైర్యమే ఆ చిరునవ్వు”కథలొని వర్ధని మాటలు ఎందరికో వెలుగుబాటలు.

పెద్దవాళ్ళు మాకాలం లో అని మొదలు పెట్టగానే చిన్నవాళ్ళు అబ్బ మొదలు పెట్టారు గా సోది అని విసుక్కుంటూ చిన్నగా తప్పుకుంటారు కాని “తాతగారూ బాగున్నరా ” కథలోని తాతగారు ఈ కాలం లో ఈ తరం పిల్లలకు అందుబాటు లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానము,వసతులు చూసి, ఈ కాలం పిల్లల్లో ఉన్న తెలివితేటలు చూసి ముచ్చటపడే తాతగారు!
మట్టి అంటేనే చిరాకు పడి భార్యను కూడా మొక్కల పని మానేయమని చిరాకుపడే విశ్వనాథరావు మట్టి విలువ తెలెసుకునే కథ “మట్టి”.

పాఠాలు నేర్పవలసిన పంతులయ్య పిల్లలతో పాఠాలు నేర్చుకోవలసివచ్చిన పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే “ఊరు బాగుపడాలి” కథ చదివి తెలుసుకోవలసిందే!

ఉన్న ఊరు వదిలి ఎక్కడా వుండనన్న మాస్టారు అనాధ ఐపోయిన నాగమ్మ కొడుకు సాయి కోసం ఊరును వదిలి త్యాగం చేసిన మహామనిషి మాస్టారు కథ “మానవ సంబంధాలు” .మానవసంబందాలు ఎంత విలువైనవో చెబుతారు రచయిత్రి ఇందులో.

ఆఫీసులో పని చేసే తోటి ఉద్యోగినలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీరభద్రయ్య మీద ఆ ఆఫీస్ ఉద్యోగిని లు చేసిన ప్రయోగం ఫలించింది “ఫలించిన ప్రయోగం కథలో!ప్రతి ఆఫీసు లోనూ వీరభద్రయ్య లాంటి కీచకులు ఉంటారు.ఉద్యోగినులు అలాంటి వారికి భయపడకుండా ధైర్యం గా ఉపాయము తో ఎదుర్కోవాలని ప్రభోదించారు జానకి గారు.

గత స్మృతులలో కొట్టుకుపోతూ మంచం మీద ఉన్న తాతమ్మ ను బాగుచేయాలని తాపత్రయపడే మనవరాలు అశ్విని.తాతమ్మ మీది అభిమానము హృద్యంగా చూపించారు.

ఇవేకాకఇంకా,”బతుకుబండి”,”మనసుమూగబోయింది”,”అమ్మాయిలూజాగ్రత్త”,”ఆకుపచ్చనిఅంతిమయాత్ర,””ఎటుపోతోందోఈలోకం”,”దృష్ఠికోణం,””ఒకచిన్నమాట”,”ఆరోజువస్తుంది”,”సంతోషం”,”గుండెనింపేదిమాటగుండెకోసేదిమాటే!”,”నేర్చుకున్నపాఠం”,”పరివర్తన”కథలు,మొత్తం ఇరవైఐయుదు కథలు ఉన్నాయి తమిరిశ జానకి గారు వ్రాసిన “మినీ కథలు”పుస్తకములో.వారానికి ఒక కథ చొప్పున నలభై రెండు కథలు సాహితీసేవ లో వ్రాశారు జానకి గారు. అందులో నుంచి ఇరవై ఐదు కథలను ఈ పుస్తక రూపము లో తీసుకు వచ్చారు.ఇందులోని ప్రతి కథా ఆణిముత్యమే. పాత్రల చిత్రీకరణ వాస్తవికము గా ఉంటుంది.మానవ జీవనసరళికకీ, రకరకాల మనస్తత్వాలకీ ప్రతిరూపాలు ఈ కథలు. ప్రతి కథలోనూ వాస్తవికతను సృజించారు.ప్రతి కథలోనూ మానవీయ విలువలు, జీవన మాధుర్యం ప్రతిబింబించాయి. చిన్న విషయమైనా ఆసక్తి కలిగించేలా చెప్పారు.కథా, కథనం పాఠకులను చదివించేలా ఉంది.

యాభైఐదు సంవత్సరాల క్రితము హైస్కూల్ లో ఉన్నప్పుడు మొదటి సారిగా మొట్టమొదటి రచన చేసారు తమిరిశ జానకి గారు.అన్ని ప్రముఖ పత్రికలలోనూ జానకి గారి , కథలు, కవితలు, నవలలు వచ్చాయి.ఇప్పటి వరకు సుమారు మూడువందల యాభై కథలు,పదిహేను నవలలు,రెండువందలయ్భై కవితలు,మూడు నాటికలు,కొన్ని వ్యాసాలు ప్రముఖ పత్రికలలోనూ, రేడియోలోనూ ప్రచురిపబడటమూ, ప్రసారము కావడమూ జరిగింది.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విధ్యాలయం ( హైదరాబాద్) వారు ధర్మనిధి పురస్కారము,ప్రతిభా పురస్కారము ఇచ్చి సత్కరించారు.కేసరి కుటీరం(చెన్నై) వారు గృహలక్ష్మి స్వర్ణ కంకణం ఇచ్చారు.

-మాలా కుమార్

ఈ పుస్తకము ప్రతులు అన్ని ప్రముఖ పుస్తకాల షాప్స్ లో దొరుకుతాయి.
ధర:100 రూపాయలు.
ఈ మినీ కథలు చదివి మీ అభిప్రాయము రచయిత్రి కి నేరు గా తెలపాలనుకుంటే ,
రచయిత్రి సెల్ నంబర్; 9441 187 182

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , , , Permalink

2 Responses to తమిరిశ జానకి ‘మినీ కథలు’ (పుస్తక సమీక్ష)- మాలాకుమార్