దేశమంటే మత్తు కాదోయ్ – క్రిష్ణ వేణి

Our greatest glory is not in never falling, but in rising every time we fall- Confucius


అభిషేక్ చౌబే డైరెక్ట్ చేసిన ‘ఉడ్తా పంజాబ్’(Udta Punjab) విడుదలకు ముందే వివాదానికి గురయిందన్నది అందరికీ తెలిసినదే. సినిమా మీద సాగిన చర్చ చాలా మట్టుకు డ్రగ్ menace మీదనా, రాబోయే ఎసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మీద పడే దాని ప్రభావంమీదా అయినప్పటికీ, సమస్య మరింత లోతైన ఒక వ్యాధికి ఆనవాలు అన్నది మాత్రం యదార్థం.

సాంస్కృతికంగా సుసంపన్నంగా, భౌతికంగా బలంగా, సాంప్రదాయకంగా గర్వంగానూ ఉండే పంజాబ్ రాష్ట్రం మాదకద్రవ్యాలకి పుట్టిల్లు ఎలా అయింది! ఎప్పుడయింది? ఇప్పుడక్కడి పరిస్థితి ఈశాన్య రాష్ట్రాలకన్నా కనాకష్టంగా మారిన కారణాలేమిటి!
డ్రగ్స్ దుర్వినియోగం మధ్య 80’ల్లో ప్రారంభం అయింది. 90’ల్లో పరాకాష్టకి చేరుకుంది. ఆ తరువాత pharmaceutical డ్రగ్సూ, డిసైనర్ డ్రగ్సూ వచ్చాయి. అకాలీ దల్ కానీ, బిజెపీ కానీ లేక ముందటి కాంగ్రెస్ అయినాకానీ- అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలూ ఈ గంభీరమైన సమస్యని నిర్లక్ష్యపెట్టాయి. కేంద్రప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకునే ఏ ప్రయత్నం చేయలేదు.
పార్టీ ఆఫీసునుంచీ మూలమూలలవరకూ, డ్రగ్స్ దుర్వినియోగం యువతని అంతం చేస్తోందనే వినిపిస్తుంది. ‘చిట్టియా కలాయియాన్ దే’ అన్న పాటలో ఉన్న ‘చిట్టా’ (chitta)మాట ఇప్పుడు పంజాబ్లో తెల్లటి హెరాయిన్ పౌడర్‌ని ఉదహరించడానికి ఉపయోగపడుతోంది.
క్రిత0 ఎన్నో సంవత్సరాలుగా ఈ డ్రగ్ సమస్య గురించిన రిపోర్టులు పేపర్లలోనూ, పత్రికల్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటి గురించిన పాటలెన్నో యూట్యూబ్లో కూడా ఉన్నాయి. రాహుల్ బోస్ ఏంకర్ చేసిన ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది.
వీడియో చూడండి.
The Directorate of Revenue Intelligence, The Narcotics Control Bureau మాత్రమే కాక, ఆఖరికి Intelligence Bureau కళ్ళ ఎదుట కూడా డ్రగ్ స్మగ్లింగ్ భారీ ఎత్తున, నిక్షేపంగా కొనసాగుతోంది. క్షయమవుతున్న ఈ రాష్ట్రానికి, ఈ డిపార్టుమెంట్లన్నీ కేవలం ప్రేక్షకులుగానే మిగిలాయి. సెక్రెటెరియేట్, పోలీసు-అందరికీ దీనిలో జోక్యం ఉంది. ఇకపోతే, దీనికి రాజకీయ మద్దతు ఎలానూ ఉంది.
పాకిస్తానుకీ, భారతదేశానికీ మధ్య 553 కి.మీ.ల పొడుగున్న అంతర్జాతీయ సరిహద్దు వద్దే ఈ సమస్యకి సమాధానం దొరుకుతుందని పంజాబ్ ప్రభుత్వమూ, పోలీసూ చెప్తూ దీన్ని ఆపడానికి తగిన చర్య తీసుకోవడం లేదని Border Security Force (BSF)ని నిందిస్తాయి. తను catch-22 పరిస్థితిలో చిక్కుకుందనీ, సరిహద్దు మీదుగా వచ్చే డ్రగ్స్ సంఖ్య అతి స్వల్పమనీ BSF చెప్తుంది.
అక్కడి డ్రగ్స్ దుర్వినియోగం గురించిన పుకార్ల వల్ల, AIMS పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో సర్వే చేసింది. కేంద్ర ప్రభుత్వపు అనుమతితో, పంజాబ్ రాష్ట్రం ఖర్చుతో సర్వే జరిగింది. రాష్ట్రపు జనసంఖ్య ఒక కోటీ తొంబై వేలయి ఉండగా, AIIMS సర్వే కొన్ని వేల మందిని మాత్రమే మచ్చుకి తీసికోగలిసింది. నికార్సైన సంఖ్యేదీ తేలనప్పటికీ, AIIMs అధ్యయనం ప్రకారం, 18-25 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో 73.5% వ్యసనానికి బానిసలయినవారు. వీరిలో 30% కన్నా పైన HIV-positive. దేశంలో, డ్రగ్సుకి సంబంధించిన కేసులు ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే 50% పై చిలుకు.
పోలీసుల సహాయం లేకుండా ఈ నెట్‌వర్క్ పని చేయలేదు అని AIIMS లో ఎడిషనల్ ప్రొఫెసర్ అయిన ఆనంద్ పటేల్ చెప్తారు. ప్రతీరోజూ 20 కోట్ల రూపాయలు హెరాయిన్ మీదా, హఫీమ్ మీదా ఖర్చవుతున్నాయి. ఒక సంవత్సరపు వ్యాపారం 7500 కోట్ల రూపాయలది. పల్లెవాసులు కూడా ఈ డ్రగ్ స్మగ్లింగ్లో జోక్యం ఉన్నవారే.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్- నార్కో వార్ మీద 8 నెలలు పని చేసి, కిందటి నెల పలుమార్లు రిపోర్ట్ చేసింది. రిపోర్ట్ సంబంధంగా 11,000 మందిని అరెస్ట్ చేశారు. కానీ దాడి జరిగినది వ్యసనపరులమీద. డ్రగ్స్ మీద కాదు. రాష్ట్రంలో అసలు మాదకద్రవ్యాల సమస్యే లేదని అక్కడి హెల్థ్ మినిస్టర్ చెప్పారప్పుడు. ఒక్క పెద్ద చేపా పట్టుపడలేదు. పెద్ద పట్టణాల్లో అరెస్టయిన ఏ న్యూసూ లేదు.
డ్రగ్స్ సులభంగా దొరికే కారణం- అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ నుంచి వ్యాపారం ప్రారంభం అయి, పంజాబ్ మీదగా యూరప్ వరకూ సాగడం. కాబట్టి పంజాబ్ కేంద్ర బిందువయింది- ప్రత్యేకంగా, హిరాయిన్ దొంగరవాణాకి.
రెండో సమస్య సంశ్లిష్ట డ్రగ్స్. అవి తయారు చేసే ముడి సరకు సులభంగా దొరుకుతుంది కాబట్టి విరివిగా దొరుకుతాయి. వీటిని కొనుక్కోడానికి జమ్మూనుంచి అమ్రిత్‌సర్, లుధియానా, పాటియాలాకి విద్యార్థులొస్తారు. అడ్వాన్స్ డబ్బు చెల్లించబడుతుంది. కలుసుకునే చోటు నిర్థారించబడుతుంది. డ్రగ్స్‌ని సేకరిస్తున్నప్పుడు, వ్యసనదారులు ఒంటరిగా ఉండాలి. వాళ్ళని మరెవరూ పంపలేదని నిశ్చయపరచుకుంటారు పెడ్లర్స్.
పల్లెల్లో డ్రగ్ సేవన చేసే చిన్నపిల్లలు ఎంతమందో! పిల్లలు పేదవారైతే, తమ భాగాన్ని ఉపయోగించుకుని, తక్కినది మార్కెట్ వెలకి అమ్మివేస్తారు.
ఒక వ్యక్తి వద్ద కనుక డ్రగ్ చాలా కొద్ది మోతాదులోనే దొరికి, సదరు వ్యక్తి అది తన సంత వాడుకకేననీ అమ్మడానికి కాదనీ ఒప్పుకున్నప్పుడు, ఆ వ్యక్తిని జైలుకి పంపకుండా పునరావాస కేంద్రాల్లో ఉంచుతారు. ఎక్కువ మోతాదుతో పట్టుబడినప్పుడు జైల్లో వేస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం- జైల్లో పెట్టబడిన డ్రగ్ ఎడిక్టులకి యధావిధిగా తమ డ్రగ్ డోస్ దొరకడం. అంటే ఎక్కడో అక్కడినుండి సప్ప్లై కొనసాగుతుందనేగా!
పంజాబ్లో టెర్రరిస్మ్ సంవత్సరాల్లో ఆస్థులు పోగేసుకున్న చాలామంది ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లు, రిటైర్ అయిన తరువాత, తమ ఆడంబరమైన జీవన శైలిని కొనసాగించడానికి ఈ డ్రగ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. రాజభవనాల్లాంటి వారి స్వంత ఇళ్ళూ, డజనుమంది నౌకర్లూ, పెద్దపెద్ద కార్లూ, ప్రభుత్వాలిచ్చే జీతాల/పెన్షన్లతో నడపడం సాధ్యం కాదే!
ఈ డ్రగ్స్‌కి గిరాకీ ఎక్కడినుంచి వస్తుంది? హరిత విప్లవంతో పాటు రాష్ట్రానికి కలిగిన కలిమి, చదువుకున్న/ఎక్కువ చదువుకోని యువతని కూడా పుట్టించింది. యువతకి ఆర్ధిక అవకాశాలు లేకపోవడం డ్రగ్ సేవనకి దోహదం చేసింది. వారికి పొలాల సేద్యం మీదకానీ, తమ తండ్రుల దారిలో నడవడం మీద కానీ ఆసక్తి లేదు.
ఇండియా పాకిస్తాన్ బోర్డర్‌కి అతి సమీపంలో ఉన్న అమ్రిత్సర్ అయినా, గుర్దాస్‌పుర్ అయినా, తరన్ తరన్ అయినాకానీ- ఈ ఊళ్ళకి ఆ బోర్డరే ఒక శాపం.
అమ్రిత్‌సర్‌కి రెండు కి.మీ దూరం కూడా లేని మక్బూల్‌పురాలో ప్రతీ కుటుంబంలో కనీసం ఒకరైనా డ్రగ్స్ పాలిట పడి మరణాన్ని కొనితెచ్చుకున్నవారే. ఇప్పుడీ ఊరిని ‘Village Of Widows’ అని పిలుస్తారు. రాష్ట్రం ఈ గ్రామం గురించి పట్టించుకోకపోతే కనుక, ఇది కాస్తా త్వరలోనే, ‘దయ్యాల గ్రామం’ అయే ప్రమాదం ఉంది.
Drug 2మనకి దళిదవాదులున్నారు, స్త్రీ వాదులున్నారు. మనం లింగ సమానత్వాన్ని ప్రొమోట్ చేస్తాం. గే హక్కులని సమర్థిస్తాం. కానీ డ్రగ్ దుర్వినియోగానికి విరుద్ధంగానూ, డ్రగ్సుని ప్రొమోట్ చేస్తున్న వాళ్ళ మీదా పోరాడే ఏక్టివిస్టులెవరూ కనిపించరేం! ఈ ఒకే ఒక్క సినిమా ఎంత తేడా అని కల్పించగలదు? ఇప్పుడు ఈ సమస్య ఉన్నది నార్త్ ఈస్టుతో పాటు పంజాబ్లోనే. కానీ భారతదేశంలోనేగా? మిగతా రాష్ట్రాలకి కూడా పాకదూ!
ఎలాగో అలాగున డ్రగ్ సరఫరా గొలుసుని పూర్తిగా తెంచేసి, డ్రగ్ స్మగ్లర్లని అరెస్ట్ చేయవలిసిన అవసరం ఉంది. డ్రగ్స్ దొరకకపోయినప్పుడు, ఉపసంహరణ లక్షణాలు (withdrawal symptoms) కనపడతాయి. మరణాలు కూడా సాధ్యమే. కనుక, ఏకకాలంగా సరైన డి ఎడిక్షన్ సెంటర్లని ఏర్పరచాలి. యథాస్థానానికి వచ్చినవారికి సమాజంలో ఒక చోటు కావాలి కాబట్టి, ఆ తరువాత కౌన్సెలింగు అవసరమూ పడుతుంది.
ఒక పూర్తి తరాన్ని డ్రగ్స్‌ పేరిట కోల్పోయి, ‘నన్ను కాపాడండి’ అంటూ మౌనంగా రోదిస్తున్న రాష్ట్రపు నాశనాన్ని ఆపడానికి- ప్రభుత్వమూ, ఎన్జీవోలూ, సామాజిక కార్యకర్తలూ, వాతావరణం ఉత్పత్తి సమూహాలు –అందరూ కలిపి అవగాహనని కలిగించడానికీ, నాయకులమీద ఒత్తిడి తేవడానికీ, తమ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించని అధికారుల మీ ఏక్షన్ తీసుకోడానికీ సహాయపడాలి.

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , Permalink

28 Responses to దేశమంటే మత్తు కాదోయ్ – క్రిష్ణ వేణి