నా జీవనయానంలో (ఆత్మ కథ) – జీవితం..55 -కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక కాకినాడ హాస్పిటల్లో ఉన్నారని అమ్మమ్మ గారింటికి ఉత్తరం వచ్చిందట.ఆరోజుల్లో అదో పద్ధతి, ఏ కబురైనా పెద్దలకి తెలియజేయడం. నేను ఏడుస్తూ కూర్చున్నాను. అమ్మమ్మగారు, మా అత్త గారు నన్ను ట్రెయిన్లో కాకినాడ తీసుకుని వెళ్లారు. నేరుగా మా అమ్మమ్మ గారింటికి జగన్నాధపురం వెళ్లేం. ఆ వెనక కుమ్మరి వీధిలో ఉన్న నర్సింగ్ హోం లో జాయిన్ చేసి మా అమ్మ, పెద్దమావయ్య దగ్గరుంటున్నారట. మానాన్నను చూసి గుర్తుపట్టలేకపోయాను. మీద పడి భోరుమని ఏడ్చేసాను. వారం క్రితం ఒకరోజు భరించలేని కడుపునొప్పి వస్తే డా.జయగారు కాకినాడ పంపించేసారట.అదేం నొప్పో, ఏం వైద్యమో కాని మనిషి అస్థిపంజిరంలా అయిపోయారు. అంత నీరసంలోనూ నా తల నిమురుతూ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. నేను ఉండిపోతానని అడిగేను మా అత్తగార్ని.’’ అందరూ ఉండి ఏం చేస్తారు? వైద్యం జరుగుతా ఉంది కదా, మళ్లీ వద్దువుగానిలే పద ’’ అన్నారావిడ.

సాయంకాలం వరకూ ఉండి బయలుదేరాం.స్టేషన్ దగ్గరలోని బుడం పేటలో ఆంటీ పెద్దకొడుకు ప్రసాదు, మా చిన్న మావగారి కొడుకు అప్పారావు ఒక రూంలో ఉంటూ I.T.I చదువుతున్నారు. ట్రెయిన్ టైం అయ్యేవరకూ ఆ రూంలో కూర్చున్నాం. గదంతా ఒకటే నీచు వాసన,కాకినాడలో పుష్కలంగా దొరికే సొరచేపల్ని తెచ్చుకుని వండుకుని తినేముందు వాటి లివర్లు తీసి ఒక పెద్ద గాజు సీసాలో వేసి ఉంచుతున్నాడట ప్రసాదు,’’షార్క్ లివరాయిలు తయారు చేస్తాను, దాన్ని ముట్టుకోకండి’ ’అని అడ్డుపడుతున్నా వినకుండా, అన్నీ బైట చెత్త కుప్పలో పడేసి రూం శుభ్రం చేసారు మా అత్తగారు. నెల పైగా హాస్పిటల్లో ఉండి కోలుకుని మా నాన్న ఇంటికి చేరే సరికి వ్యాపారం కోసమని మా రెండో మావయ్య దగ్గర తీసుకున్న మూడు వేలుకాక మళ్లీ అప్పు చేయాల్సి వచ్చిందట.

అంతలో ఉష కి పెళ్లి కుదిరిందన్నారు. వెస్ట్ బెంగాల్ లోని ఆడ్రా నుంచి ఇద్దరు ఆడవాళ్లు రైల్వే లో పని చేస్తున్న వాళ్ల బంధువుల ఆబ్బాయి కి సంబంధం వెతుకుతూ వచ్చేరట. అమ్మమ్మ గారింట్లో ఉన్న ఉషని చూసేరట. ఫోటో అడిగితే వీళ్లు అప్పటికప్పుడు తీయించి ఇచ్చేరట. వాళ్లు వెళ్లిన పదిరోజులకి ఉత్తరం వచ్చిందట,’అమ్మాయి నచ్చింది, వచ్చే నెల ఫలనారోజు ముహూర్తానికి పెళ్లి చెయ్యడానికి సిద్ధంగా ఉండండి’ అని.

పెళ్లి వాళ్లు ఓ ఇరవైమంది ఐదురోజులు ముందే వచ్చేసేరు. రాజమండ్రి అమ్మమ్మ గారింట్లో వాళ్లకి విడిది. కోనేరుపేట ఇంటికి తాళం పెట్టేసి అందరం అక్కడికెళ్లిపోయేం . మా అత్తగారు నడుం బిగించి స్వయంగా వంటలు చెయ్యడం . మేం పై పనులు సాయం చెయ్యడం .పెళ్లి కోసం కొన్న బియ్యం పప్పులూ అన్నీ ముందే అయిపోయాయి. మా అత్తగారు అప్పు కోసం ఉరుకులు- పరుగులు. అంతకు ముందే విడిపించిన నా చెవిరింగులు మళ్లీ తాకట్టులోకి వెళ్ళిపోయాయి. మగ వాళ్లు బాధ్యతలు వహించని ఇళ్లల్లో ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో నాకప్పుడే అర్ధమైంది. పెళ్లి తర్వాత ఇంకో మూడు రోజులుండి అప్పుడు కదిలేరు మగ పెళ్లి వారు. మరోపక్క మా అత్త గారి చెల్లెళ్ల కుటుంబాలు, బైటి వాళ్లెవర్నీ పిలవక పోయినా ఖర్చు తడిసి మోపెడైంది.

ఇంతకీ అసలు సంగతి- ఉష ఉత్త అమాయకురాలు. పదహారు ఏళ్లు వచ్చినా ఏడేళ్ళ పిల్లలకుండే అవగాహన కూడా ఉండేది కాదు. పొడవైన కాళ్లు చేతులూ విసురుతూ నడిచేది. కింద ఏమున్నాయో చూసుకోకుండా తన్నుకుంటూ వెళ్ళిపోయేది. అలిగిందంటే మంకుపట్టే, అన్నం నీళ్లూ లేకుండా రోజుల తరబడి ఉండిపోయేది. అమ్మమ్మ గారింట్లో పనులన్నీ చేసి మిగిలిందేదో పెడితే తినడం. చిన్నతలకాయ, సన్నని పొడవైన శరీరంతో ఊగుతూ నడవడం చూసి పెళ్లి వాళ్లు గుసగుసలు పోయేరు. పెళ్ళైన కాస్సేపటి తర్వాత పెళ్ళికొడుకు వాకిట్లో మడతమంచం మీద సాగారితే వెళ్లి పక్కలో కూర్చుంది. అతను స్ప్రింగ్ యాక్షన్ లాగా లేచి నిల్చున్నాడు. చుట్టూ ఉన్న చుట్టాలందరూ కక్కలేక మింగలేక దిక్కులు చూసేరు. చివరికి వెళ్లే ముందు పెద్ద గొడవ పెట్టేసుకున్నారు- వేరే అమ్మాయి ఫోటో ఇచ్చి, ఈ అమ్మాయి తో పెళ్లి జరిపేరని. అందరూ నచ్చచెప్పి చక్కదిద్దేరు, ఇక, పెళ్ళికూతురు వెంట ఎవరెళ్లాలి అని చర్చ జరిగింది. అంత దూరం మా అత్తగారి చెల్లెళ్లు వెళ్ళం అన్నారు. వాళ్ల భయం వాళ్ళది-ఖర్చులు సొంతంగా పెట్టుకోవాలేమోనని. పెళ్లివాళ్ల రిజర్వేషన్స్ లో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలకి చోటుందట. అప్పటికప్పుడు నన్నూ,రాణీని ప్రయాణం చేసేరు.నా ఆనందానికి హద్దుల్లేవు. శరత్ చంద్రుడు,రవీంద్రుడు నడయాడిన వంగభూమిని చూసే అవకాశం వచ్చింది కదా అని, బయలుదేరే ముందు మా అత్తగారు మా ఇద్దరికీ చెరో ఐదు రూపాయలు చేతిలో పెట్టేరు.సాధక బాధకాలు తెలీని వయసు. హుషారుగా బయల్దేరాం . ఏ రాష్ట్రానికా రాష్ట్రంలో భూమి (నేల)వేరువేరుగా ఉంటుందని నాకప్పటికొక నమ్మకం. ఒరిస్సాలో, బెంగాల్ లో బండి దిగి మరీ పరిశీలించేను.
నా అవగాహనా రాహిత్యానికి నాకు చెప్పలేని నవ్వొచింది. ఇక బెంగాల్ రాష్ట్రంలో చిన్నచిన్న చెరువులు,ఆ చెరువుల్లో కలువలు ,స్నానం చేసి తడిబట్టల్తో నడుస్తున్న స్త్రీలు-ఎప్పుడో చూసినట్టు, ఆ పరిసరాలన్నీ నాకు తెలిసినవే అయినట్టు భావన.

ఆడ్రా రైల్వే క్వార్టర్స్ లో పెళ్ళికొడుకు మేనమామగారికిచ్చిన పెద్ద ఇంట్లో వాళ్ల అమ్మమ్మగారితో బాటు వీళ్లిద్దరూ కూడా ఉండాలి. త్వరలోనే ఇతనికి ఇల్లు ఎలాట్ అవుతుందట. మేం వెళ్లిన రెండోరోజు రిసెప్షన్ జరిగింది.రైల్వే ఉద్యోగులు అన్ని భాషలవాళ్లు కుటుంబాల్తో వచ్చేరు.అందరూ చెప్పుకొని ఒక కొత్త సంసారానికి కావాల్సినవన్నీ స్టవ్వు తో సహా కొనుక్కొచ్చేరు. చాలా బాగా జరిగింది. మా ఇళ్లల్లో పెళ్లికొడుకింట్లో యానాల సంబరాలు తప్ప ఈ తరహా రిసెప్షన్ చూడడం అదే మొదటిసారి నాకు. ఉష మాత్రం మమ్మల్ని చాలా ఇబ్భంది పెట్టేసింది. పూలజడవేస్తే విప్పిపారేసి చెవులమీదకి రెండు పిలకలు వేసుకునేది. ఒకటి చెప్తే మరోటి చేస్తూ పెంకెగా ప్రవర్తించేది. రైల్వే స్ట్రైక్ ప్రారంభమై మేం ఇరవై రోజులకు పైగా అక్కడ ఉండి పోవాల్సి వచ్చింది. అన్ని రోజులూ వాళ్లు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు .ముఖ్యంగా నన్నెందుకో ఆడా,మగా అంతా ఆత్మీయంగా చూసేరు. పక్క ఇళ్ళ బెంగాలీస్ తీసుకెళ్లి బెంగాలీ పద్ధతిలో చీర కట్టి, పాపిట్లో సింధూరం అద్ది ఫోటోలు తీసేవారు. పాలు,పెరుగు వ్యాపారం ఒరిస్సా వాళ్లు చేసేవారు. మనిషెత్తు జాడీలో ఉన్న మురుగు కంపు కొట్టే మజ్జిగ లోటాత్తో తోడి అమ్మేవారు. ఏ రోజుకారోజు మిగిలిపోయిన పాలు కాచి దాంట్లో పోసేస్తారట. నేనూ,రాణీ అందరిళ్లకీ వెళ్ళిపోయి అందరితో పరిచయాలు పెంచేసుకున్నాం. రోజూ కాలనీ అంతా చుట్టి వచ్చే వాళ్లం .తెల్లారేసరికి, సాయంసంధ్య వేళకీ అందరి ఇళ్ళ వాకిళ్లలో పొడవైన రాక్షసిబొగ్గు కుంపట్లు రాజేసిన తెల్లని పొగ నిండిపోయేది. నాలుగు రోజులకి నాకు గోధుమ చుక్కా రొట్టెలు పడక డైజెషన్ చెడిపోయింది. వాళ్లకి దొరికే పెద్ద పెద్ద గింజల ఉప్పుడు బియ్యం అసలు పడలేదు. అప్పటి స్కేర్సిటీని అనుసరించి బియ్యం రవాణా పెద్దనేరం.అయినా ఆంధ్రా నుంచి బట్టల అడుగున పోసి తెచ్చుకున్న బియ్యం నాకు వండి పెట్టేవారు.

అక్కడికి కలకత్తా చాలా దగ్గర. కాని మా దగ్గర డబ్బులు లేక శాంతినికేతన్, హౌరాబ్రిడ్జిని చూడాలనుకున్న నా ఆకాంక్ష నెరవేరలేదు. ఇంట్లో గొడవలు లేకపోతే పెళ్ళికొడుకు వాళ్లూ తీసుకెళ్లే వాళ్లేమోగాని అనుకోని గొడవలు అందర్ని డిస్టర్బ్ చేసేసాయి. ఉష పెళ్లి కొడుకుని దగ్గరికి రానివ్వడం లేదట. అది మొదటి గొడవ, మా అత్త గారు పది కాసుల బంగారం పెడతామని ఒప్పుకొని రోల్డుగోల్డు నగలు పెట్టిపంపేరట. అందుకే కాబోలు ఉష స్నానానికెళ్లినప్పుడల్లా ఆ నగల్ని తీసి మా దగ్గర పెట్టుకోమని చెప్పేరు. మేం పెద్దగా పట్టించుకోలేదు. అవి నల్లగా అయిపోయి రహస్యం బైటపడిపోయింది.

ప్రవాసాంధ్రులకి మతం మీద ,పూజల మీద నమ్మకాలెక్కువ. వాళ్లు సత్యనారాయణవ్రతం చేస్తున్నప్పుడు ’’నేను కూర్చోను, మేం క్రిస్టియన్స్’’అందట ఉష . అదో గొడవ. వాళ్లు మాతో పైకి ఏమీ అనలేదు కానీ వాళ్ళల్లో వాళ్ళే ఏమేమో అనుకునేవారు. మాకు బదులు పెద్దవాళ్ళెవరైనా వచ్చి ఉంటే బావుండేదని అన్పించింది. సుధాకర్ అనే వాళ్ల బంధువులబ్బాయి ఖరగ్ పూర్ లో పీ.జీ చేస్తున్నాడట. సెలవులు కావడం వలన అతను రోజూ ఉదయం,సాయంకాలం వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళేవాడు. అతనికి తెలుగు మాట్లాడటం వచ్చు కాని, రాయడం, చదవటం రాదు.ఎక్కడెక్కడి నుంచో పాత మేగజైన్స్ తెచ్చి ఇస్తూ ఉండేవాడు. పెళ్లి కొడుకు మేనమామ సత్యం గారు చాలా మంచి మనిషి. ఆయన ఒకప్పుడు ఫుట్ బాల్ ప్లేయరట .గేమ్ లో కాలు విరిగి కుంటుతూ నడిచేవారు.మా నాన్న వయసుంటుంది. ఆయనా నన్నెంతో ఆత్మీయంగా చూసేరు. ఆయన వల్ల ఇంట్లో గొడవలన్నీ సమసిపోతూ ఉండేవి.

మా తిరుగు ప్రయాణం రోజు సుధాకర్ నాతో ’’వచ్చే సంవత్సరం నా పీ.జీ. అయిపోతుంది. ఏదో ఒక రోజు జాబ్ లో జాయినై మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను మీరొప్పుకుంటే’’అన్నాడు. నేను ఆశ్చర్యపోయి ‘’సుధాకర్, నేను వీళ్ల అన్నయ్య భార్యని’’అన్నాను ’ అయినా సరే; మీరు అచ్చం బెంగాలీ అమ్మాయి లాగా ఉన్నారు’’అన్నాడు. నాకు నవ్వాలో, ఏడ్వాలోతెలీలేదు. అతను చాన్నాళ్ళు హిందీలో పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. నేను రిప్లై ఇచ్చేదాన్ని కాదు. ఎవరికీ హిందీ చదవటం రాదు కాబట్టి బతికిపోయాను. తిరుగు ప్రయాణంలో పెళ్లి కొడుకు మాకు తోడుగా వచ్చి దిగబెట్టేడు. దారిలో ఖరగ్ పూర్ లో ఆగవలసొచ్చింది. మొదటి సారిగా పెద్ద స్లమ్ఏరియాను అక్కడే చూసాను. చిన్న చిన్న గదులు, రేకుల కప్పులు, గోనెపట్టాల పార్టీషన్ లు,ఖరగ్ పూర్ లో నాకు బాగా గుర్తుండిపోయింది చైతన్యాశ్రమం, చైతన్యప్రభు ఆలయం, వాళ్లు కట్టి ఇచ్చిన చపాతీలు,బంగాళాదుంపల పొడి కూర తింటూ ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాం.

నెల తర్వాత అమ్మమ్మ గారింటికి ఉత్తరం వచ్చిందట’ ఈ అమ్మాయి ని భరించటం మా వల్ల కాదు, వచ్చి తీసుకెళ్లండి ‘అని. ఆ రోజు మా మావగారు బాగా తాగొచ్చి రాణీని, నన్ను బండబూతులు తిట్టడం మొదలు పెట్టేడు ఉష కి ఏమీ నేర్పించకుండా వచ్చేసేమని. నేను వినలేక చెవులు మూసుకుని అవతలింట్లోకి పారిపోయాను.

ఏడాది తర్వాత ఉషకి ఆరోగ్యం బాగాలేదని ఉత్తరం వస్తే మా అత్తగారు, ఆంటీ, వాళ్ళాయన రైల్వే ఫ్రీపాస్ మీద వెళ్లారు. టీ.బీ.తో చిక్కిశల్యమైపోయిన ఉషని తీసుకుని వచ్చేసారు. అంతే, ఆ తరవాత ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోయింది.
మా అవతలింటి అరుగుమీద పేకాట జోరుగా సాగుతుండేది. మోహన్, రాణీ, వాళ్ళాయన సుబ్బారావు ముఖ్యమైన సభ్యులు. తీరికగా ఉన్నప్పుడు నన్నూపిలిచి కూర్చోబెట్టి నేర్పించేరు. రెండు రోజులకే నాకా ఆట మొహం మొత్తిపోయింది. ఆ టైంలో ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు కదా అన్పించింది. నాకు చిన్నప్పటినుంచీ ఆ ఆట ఆడేవాళ్లంటే మంచి అభిప్రాయం లేదు. మా ఊళ్లో పేకాటగాళ్లు కొట్టుకోవడం, పొడుచుకోవడం, భార్యల్ని హింసించడం నాకు తెలుసు. అందుకే ఆ ఆటకొక గుడ్ బై చెప్పేసేను. సరదాకైనా కార్డ్స్ ని ముట్టుకోవడం నాకు కంపరంగా ఉంటుంది.

విజయకి రెండో కొడుకు పుట్టినప్పుడు పురిటి స్నానానికి మా అత్తగారు నన్నూ తీసుకెళ్లేరు . పురిటాలికి స్నానమైన నులకమంచం మీద నన్ను కూర్చోబెట్టి తలమీద బిందెల్తో నీళ్లుపోసేరు. మంత్రసాని ఒక చక్కెరకేళీ అరటిపండుని రెండు ముక్కలు చేసి తెచ్చి, నా నోట్లో పెట్టి, నమలకుండా మింగమంది. చక్కెరకేళీ కదా, నేను హాయిగా మింగేసేను. తర్వాత చాన్నాళ్లకి నాకు తెలిసింది. ఆ పండు లో పసివాడి ఊడినబొడ్డు పెట్టేరని. అలా చేస్తే గర్భసంచి తెరుచుకుని త్వరగా గర్బం వస్తుందని ఓనమ్మకం అట.

మా చిన్నాన్న రామారావు(పిన్ని భర్త)చెల్లూరు పంచదార మిల్లులో పని చేసేవాడు.మా ఇంటికొచ్చినప్పుడల్లా వాళ్ల ఓనరుకి తనెంత చెప్తే అంతేనని గప్పాలు కొడుతూ ఉండేవాడు . మోహన్ కి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఇద్దరం బయలుదేరి వెళ్లేం . పసలపూడిలో దిగేసరికి కాలవకివతల పాక హోటల్లోంచి వేడి వేడి పుణుగుల కమ్మని వాసన ఆహ్వానించింది . రిక్షా డబ్బుల్తో పెసర పుణుగులు కొనుక్కుని తింటూ నడిచి చెల్లూరు చేరుకున్నాం . ముందుగా ఉత్తరం రాయడం వలన మా చిన్నాన్న గైర్ హాజరు . అతను సరిగా పనికి వెళ్లక పోవడం వల్ల మా పిన్ని ఎంత పేదరికంలో మగ్గుతోందో చూసి వెను తిరిగేం .

-కె .వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో