ముసుగు (కథ )- శ్రీసత్య గౌతమి

వినీత ఒక ప్రయివేటు హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తోంది. పెద్ద హాస్పిటల్. ఎంతోమంది స్టాఫ్ అది ఒక పేరు మోసిన లేడీ డాక్టర్ హాస్పిటల్, డాక్టర్ సత్యవతి గారి హాస్పిటల్.

“అమ్మా … పెద్ద డాక్టోర్ గారు ఎప్పుడొస్తారు తల్లీ? బాబుకి కుక్క కరిసి శానా సేపయ్యింది. రకతం కారిపోతాందమ్మా. మందేమన్నా పెట్టమ్మా. చీటీ రాసియ్యమ్మా. నెప్పికి ఇల ఇల్లాడిపోతున్నాడు” … ఆ పిల్లాడి తెల్లి గోల.

అంతకుమునుపే ఈవిడిలా అంటే వినీత ఒకసారి రంకె వేసింది … “ఓర్చుకోవాలి. కాంపౌండర్ రాందే నేనేం చేస్తాను? డెస్సింగులు గిస్సింగులు నేను కాదు చేసేది. నా దగ్గిరకి మందు చీటీలు రాయించుకోడానికి రండి అంతే”.

ఆ గసుర్లకి ఉలిక్కిపడి ఆ పిల్లాడి తల్లి … “ సినడాట్రమ్మగోరూ, అంత కోపం పడకండి తల్లే. పెద్దమ్మగోరు ఎప్పుడొస్తారు? అనడిగింది” (తెలివైనదే మరి!).

సినడాట్రమ్మగోరు అనగానే కాస్త అహానికి ఆముదంలా అనిపించి బుర్ర చల్లబడింది వినీతకి. కాస్త చిన్నగా నవ్వుకుంటూ “వచ్చేస్తారు” అంటూ తలనీలాలని ఒక పక్కకు నెట్టుకుంటూ చెప్పింది. అల్ప సంతోషి.

ఆ పిల్లాడి తల్లి ఆమె కళ్ళల్లోకి, పెదవుల్లోకి తేరిపార చూస్తూ నిలబడింది. ఆమెకి చదువులేకపోతే ఏం … వినీత అల్పమయిన మనస్తత్వాన్ని అర్ధం చేసుకొనేంత లోక జ్ఞానం ఉంది. మరికొద్దిసేపు చూసి ఆ పిల్లాడ్ని మరో హాస్పిటల్ కి తీసుకుపోతానని పక్కనున్న పేషంట్ తాలూకు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ సలహా కూడా తీసుకుంది.

డా. సత్యవతి చేయి చలవయిందనీ, ఆవిడ దగ్గిర చూపించుకొన్న రోగులకు ఆరోగ్యం బాగుపడుతుందనీ పేరు. అందుకే ఆవిడ హాస్పిటల్ కి అంత పేరు, పైగా స్టాఫ్ చాలా మంది ఉన్నారు.

సత్యవతిగారికే తెలియదు ఎంతమంది ఉన్నారో, హాస్పిటల్ మ్యానేజ్మేంట్ ఇప్పుడు సీనియర్ డాక్టర్లు చూస్తుంటారు. క్రొత్త స్టాఫ్ నియామకాలన్నీ వాళ్ళేచూస్తారు. అవసరమైన కమిటీల్లో మాత్రం తానుంటారు. ఆ వేళ క్రొత్త డాక్టర్ల కోసం ఇంటర్ వ్యూస్ కూడా ఉన్నాయి. సత్యవతిగారు ఓ.పి. చూశాక ఇంటర్ వ్యూ కమిటీలో కూర్చుంటారు.

వినీత సర్టిఫైడు నర్సేమీ కాదు. హాస్పిటల్స్ లో స్టాఫ్ గా కొంత అనుభవముంది, ఆ అనుభవంతోనే ఈ హాస్పిటల్ లో పనిచేస్తున్నది.

డా. సత్యవతి ఆదరా బాదరాగా కారు దిగి తన రూంలోకి నడుస్తున్నారు. ఎదురు చూస్తున్న పేషంట్లు, వాళ్ళ బంధువులు లేచి నిలబడ్డారు మర్యాదగా. వినీత కూడా. కాంపౌండర్ కూడా జస్ట్ అంతకు మునుపే లోపలికి వచ్చాడు.

డా. సత్యవతి వస్తూనే పేషంట్లని లోపలికి పంపించమన్నారు. మొదటగా కుక్క కాటుకు గురయిన పిల్లాడి తల్లి వాడ్ని తీసుకొని లోపలికి వెళ్ళింది. వెంటనే సత్యవతిగారు టి.టి. ఇంజక్షన్ వ్రాసి డ్రెస్సింగ్ చెయ్యడానికి కాంపౌండర్ దగ్గిరకి వెళ్ళమని ఆదేశించారు.

అలా చెప్తూ”ఎంతసేపయ్యింది కుక్క కరిచి?” … సత్యవతి అడిగారు.

ఆ పిల్లాడి తల్లి “శానా సేపయ్యిందమ్మా, తెల్లారుఝామున కర్సింది కుక్కా, అప్పుడే హాస్పిటల్ కి బయలుదేరామమ్మా” … అంది.

సత్యవతిగారు ఆశ్చర్యంగా “మరప్పుడొస్తే ఇప్పటిదాకా టి.టి. ఇంజక్షన్ పడలేదేం? మరో డాక్టర్ కూడా ఉన్నారుగా హాస్పిటల్లో అక్కడ చీటీ వ్రాయించుకొని కాంపౌండర్ చేతో, నర్స్ చేతో వేయించాల్సింది”.

“చీటీ రాసియ్యలేదమ్మా ఇనీతమ్మ”… పిల్లాడి తల్లి చెప్పింది.

సత్యవతిగారి భృకుటి ముడిపడింది గానీ ఏమీ అనలేదు. ఆ పిల్లాడితల్లి వెళ్ళిపోయింది వాడ్ని తీసుకొని.

ఓ.పీ. పూర్తయ్యాక తన హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు ధరఖాస్తులు పెట్టిన అభ్యర్ధులను ఇంటర్వ్యూ చెయ్యాలి. తను ఇంటర్ వ్యూ కమిటీ మీటింగ్ కి వెళ్ళే టైం వరకూ పేషంట్లను చూసి మిగితా వాళ్ళను తన హాస్పిటల్లోనే పని చేస్తున్న మరో డాక్టర్ దగ్గిరకి పంపించేసారు. తను బయటికొచ్చారు. అక్కడ అభ్యర్ధులు ఎదురు చూస్తున్న లాబీలోకి వెళుతూ మధ్యలో తల కుడివైపుకి త్రిప్పి చూసారు.

కాంపౌండర్ ఆఫీసు దగ్గిర వినీత పేషంట్ల బంధువులతోటి గప్పాలు కొడుతూ, నవ్వుతూ కనబడింది. ముందుకు సాగిపోయిన వినీత మళ్ళీ వెనక్కొచ్చి చూసారు.

ఊహు … వినీత ఎక్కడా ఈ లోకంలోనే లేదు. చుట్టూ గమనించే పరిస్థితిలో లేదు. ఆవిడ అక్కడినుండి కదిలి వెళ్ళిపోయారు.

ఇంటర్వ్యూకొచ్చిన డా. ప్రసాద్ మరియు ఇతర అభ్యర్ధులు లేచి నిలబడ్డారు. ఆవిడ నవ్వుతూ అందరినీ గ్రీట్ చేస్తూ కాన్ ఫెరెన్స్ గది లోపలికి వెళ్ళి కూర్చున్నారు. మొదటి అభ్యర్ధి హేమలత.

“డా. జి. హేమలతా … డా. హేమలతా” … ఆఫీస్ క్లర్క్ పిలిచాడు.

ఆ అభ్యర్ధుల మధ్యనుండి లేచి సన్నగా నిమ్మ పసుపురంగు కాటన్ చీరని పైట స్టెప్పులు పెట్టి, అందంగా కుచ్చీళ్ళు పెట్టుకొని ఒక జడవేసుకొన్న హేమలత లేచి హుందాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

ముప్ఫై నిముషాల తర్వాత బయటకు నవ్వుతూ వచ్చి ప్రసాద్ ప్రక్కన కూర్చుంది.

హేమలత మొదటి క్యాండిడేట్ కాబట్టి, మిగిలిన అభ్యర్ధులు ఆమె ఎలా ఇంటర్వ్యూ చేసివుంటుందా … ఇంటర్వ్యూ కష్టంగా ఉందా, సులువుగా ఉందా అనే విషయాలు ఆమె ముఖకవళికలను బట్టి అంచనా వెయ్యడానికి తాపత్రయ పడుతున్నారు. కానీ హేమలత మొహం లో ఏదీ తొణికిసలాడలేదు, ఒక్క ఆ నవ్వుతప్ప.

“ఇంటర్వ్యూ ఎలావుంది?” అడిగాడు ప్రసాద్.

“ఊ … ఫర్వాలేదు, బాగానే చేసాననుకుంటా. కానీ నాకు ఇంతకు మునుపు ఏ హాస్పిటల్ లోనూ పనిచేసిన అనుభవం లేదు కాబట్టి … ఉద్యోగం వస్తుందనే నమ్మకం తక్కువగానే ఉంది” … చెప్పింది హేమలత.

“ఎవరో ఒకరు ఇస్తేనే కదా అనుభవం వచ్చేది, అది వాళ్ళకూ తెలుస్తుంది. నీ అవసరం వాళ్ళకుందంటే తప్పకుండా ఇస్తారు” అని నవ్వుతూ చెప్పాడు ప్రసాద్.

ఆ ఆప్టిమిస్టిక్ ఆలోచన్లు, మాటలకే ఫిదా అవుతుంది ప్రసాద్ కి హేమలత! ప్రసాద్ మాటలు వింటుంటే హేమలతకు కొండంత బలం.

ఈ లోపల ఇద్దరు, ముగ్గురు క్యాండిడేట్స్ అయిపోయారు. తర్వాత ప్రసాద్ వంతు వచ్చింది. ముప్ఫై నిముషాల తర్వాత ప్రసాద్ కూడా నవ్వుతూ వచ్చాడు.

“ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయాక నాతో మళ్ళీ ఏదో మాట్లాడతానన్నారు” … ప్రసాద్ చెప్పాడు.

“ఓకే … నీకు ఉద్యోగం ఖాయం” హేమలత ఖాయం చేసేసింది.

“అలా ఎలా? నీకెలా తెలుసు?” ప్రసాద్ కు నవ్వొచ్చింది.

“ఎందుకంటే నన్ను ఉండమని చెప్పలేదు. లెట్ మి చెక్ విథ్ అదర్స్” … హేమలతకు ఆత్రుత మొదలయ్యింది.

“ఎక్స్క్యూజ్ మీ … మీకేమన్నా ఇంటర్వ్యూస్ అన్నీ అయ్యాక మళ్ళీ కలవమన్నారా?” తనలాగే ఇంటర్వ్యూ పూర్తయిన వాళ్ళనడిగింది ఒకవేళ తనకొక్కదానికే అడగడం మానేసారేమో అని!

“ఉహు … లేదు …” అన్నారు మిగితా అభర్ధులు.

“నాకు కూడా” పెదవి విరిచింది.

అందులో ఒక అభ్యర్ధి “ఏం … ఎవరినైనా అడిగారా?” అడిగాడు.

ప్రసాద్ గారిని ఉండమన్నారు, నన్నడగలేదు మీలో ఇంకెవరనన్నా అడిగారేమో” అనీ … హేమలత ఆత్రుత కెరటంలా ఉవ్వెత్తున ఎగిసి క్రింద పడింది.

ప్రసాద్ వాళ్ళ ఆత్రుతని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. “హయ్యో … హేమ నోట్లో నువ్వు గింజ నానదు కదా” … అని మనసులోనే అనుకొని నవ్వుకొని ఊరుకున్నాడు ప్రసాద్.

ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయాక డా. ప్రసాద్ ని మళ్ళీ కమిటీ లోపలికి పిలిచింది. ఒక ముఫ్ఫై నిముషాల పాటు లోపల సంభాషణ.

“డా. ప్రసాద్, ఇంతకు మునుపు మీకున్న అనుభవం మీకీ ఉద్యోగాన్ని తెచ్చి పెట్టింది. మీకొచ్చిన రికమండేషన్ లెటర్స్ మీ స్కిల్స్ ని చెప్తున్నాయి, అది మీకు ఒక బాధ్యతని అప్పజెప్ప బోతోంది. ఇది ఈ కమిటీ నిర్ణయించినది. మాకు సెపరేట్ గా ఒక పీడియాట్రిక్స్ యూనిట్ ని స్టార్ట్ చెయ్యడానికి మీ పూర్తి సహకారం కావాలి. అదీ 12 నెలల కాలంలో. అంటే చాలా త్వరగా జరగాలి. ఇది మీకు ఓకే నా?” అడిగారు సత్యవతి గారు.

“12 నెలల్లో అంటే …” అంటూ ఆలోచనలో పడ్డాడు ప్రసాద్.

మళ్ళీ సత్యవతి గారు “మీ సంశయం నాకర్ధ,మయ్యింది. మా స్టాఫ్ మీకు పూర్తి సహకారాలని అందిస్తుంది నాతో సహా. డబ్బులకు వెనుకాడాల్సిందేమీ లేదు. కొంతవరకు ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసాము. సమయాన్ని సరిగ్గా వాడుకుంటే 12 నెలల సమయం సరిపోతుంది.

ఇకపోతే … మీరు పోస్ట్ గ్రాడ్యువేషన్ (పి.జీ.) చెయ్యాలనుకుంటున్నారని ప్రొద్దున్న ఇంటర్వ్యూలో చెప్పారు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఐడియా. ఇది ఆరు నెలల్లో ఎలాగూ పూర్తయిపోతుంది, అంత లోపల మీకు పి.జి. లో సీట్ వస్తే మీరు రాజీనామా చెయ్యవలసిన అవసరం లేదు. మీరు స్టడీ లీవ్ పెట్టుకొని వెళ్ళవచ్చు” అని ఉద్యోగ బరోసా ఇచ్చారు సత్యవతి గారు.

మరి ప్రసాద్ క్యాండిడేచర్ అలాంటిది.

ఫైనల్ గా ప్రసాద్ కు ఒక సెపరేట్ యూనిట్ కంతటికీ ఇన్ చార్జ్ ని చేస్తూ దానికి తగిన వేతనం వగైరా అన్నీ మాట్లాడారు. అందుకే రెండవసారి అంతసేపు. ఆ తర్వాత కమిటీ అంతా డిస్పర్స్ అయ్యి తమ తమ రూముల్లోకి వెళ్ళిపోయారు.

డా. ప్రసాద్ ఒక సీనియర్ డాక్టరే మిగితా క్యాండిడేట్స్ తో పోలిస్తే. ప్రసాదొక కష్టజీవి. ఎం.బి.బి.యస్ చదువుతుండగానే సాయంత్రాల పూట సీనియర్ డాక్టర్ల క్లినిక్కులకెళ్ళుతూ థీరిటికల్ గా క్లాసుల్లో నేర్చుకుంటున్నది ప్రాక్టికల్గా పేషంట్లను చూడడంలో పెట్టేవాడు. వేరే తెలిసిన డాక్టర్స్ హాస్పిటల్స్ కి వెళ్ళి ఆపరేషన్స్ అసిస్ట్ చేస్తుండేవాడు. చేతికి డిగ్రీ వచ్చేటప్పటికీ ప్రజలకు వైద్యం చేసే అనుభవాన్ని బాగా సంపాదించుకున్నాడు.

మిగితా అభ్యర్ధులను మళ్ళీ పిలువలేదు గాని, పర్సనల్ గా తమ రూంస్ కు పిలుచుకొని మాట్లాడారు కమిటీ మెంబర్సు, అదే అక్కడే పనిచేస్తున్న మిగితా సీనియర్ డాక్టర్లు.

డా. సత్యవతి, హేమలతని దగ్గిరుండి డా. సీతారాం వద్దకు తీసుకు వెళ్ళారు. హేమలతని పరిచయం చేసి … హేమలత కేసి చూస్తూ …

“ఈ యూనిట్ కు డా. హేమ క్రొత్తగా చేరబోతున్న డాక్టర్” … అని చెప్పుతూ నవ్వారు.

థట్స్ ఎ సర్ ప్రైజ్ టు హేమలతా అండ్ ఎవ్రీ వన్. అందరి ముఖాల్లో ఆశ్చర్యం, హేమలతకు అదనంగా ఆనందం తొణికిసలాడింది. వెంటనే ఆ యూనిట్ లోని వాళ్ళందరి పరిచయాలు జరిగిపోయాయి.

వినీత కూడా ఆ యూనిట్లోనే.

రోజు రోజుకీ అందరూ పన్లో పడిపోయారు, పేషంట్లూ, మందులూ, ఇంజక్షన్లూ … క్రొత్త డాక్టర్లు కాస్త పాత డాక్టర్లు అయిపోతున్నారు. డా. ప్రసాద్ ఇంకా బిజీ అయిపోయారు.

రాను రానూ వినీతా మరియు ఇతర సిబ్బందికి తెలిసిందేమిటంటే హేమలతకు, ప్రసాద్ కూ చదువుకున్నప్పటి నుండీ స్నేహం, ఆమెకి ప్రసాద్ అంటే ఇష్టం. అది అందరికీ అర్ధమవుతున్నది. కానీ ప్రసాద్ కి తప్పా.

ప్రసాద్ కి ఎన్నిసార్లు హింట్ ఇచ్చినా ప్రసాద్ అర్ధం చేసుకోలేకపోవడం తన దురదృష్టం గా భావించుకుంటూవుంటుంది హేమలత.

దానికి కారణం లేకపోలేదు. ప్రసాద్ వాళ్ళ ఇంట్లో హేమలత తెలుసు. అతనింట్లో ఆమెని కూడా తమ పిల్లలల్లో ఒకతెగా గా చూస్తారే తప్పా … మరొక ఉద్దేశ్యం గానీ, తమ కొడుకు ఆమెని ప్రేమిస్తే బాగుండునూ … అని గానీలాంటి ఆలోచనలు వాళ్ళకి లేవు. ఒకవేళ అలా జరిగినా వాళ్ళు ఒప్పుకోరు కేవలం స్నేహానికి తప్ప. ఇది ప్రసాద్ కు అవగాహన ఉంది కాబట్టి అతని ఆలోచనలని ప్రక్కదారి పట్టించను కూడా పట్టించలేడు. అది హేమలతకు అర్ధం కాదు. ఇలా ఎవరి భావాలని వాళ్ళు మనసుల్లో పెట్టుకొని కాలం వెళ్ళబు చ్చుతున్నారు.

ఈ లోగుట్టు పెరుమాళ్ళకెరుకయినా అవ్వకపోయినా … మన వినీతకు మాత్రం అర్ధం అయిపోయింది. ఎందుకంటే హేమలతకూ, ప్రసాద్ కూ ముందే పరిచయం అని తెలిసినప్పటినుండీ వినీత ఒక కంట కనపెడుతున్నది. ప్రసాద్ ని చూడగానే హేమలత మొహంలో వెయ్యి వోల్టుల బల్బులు వెలగడం, ప్రసాద్ కనబడకపోతే ఆ బల్బులన్నీ ఫిలమెంట్లు కొట్టేసి, టప టపమని పోయి ముఖం నల్లగా అయిపోవడం వినీత కనిపెట్టింది. ఇలాంటి వాటిల్లో వినీతకు మంచి పరిజ్ఞానమే ఉంది.

మెల్ల మెల్లగా హేమలతకు దగ్గిరవ్వడానికి టైం టు టైం ప్రసాద్ విషయాలు తెలుసుకొని హేమలతకు అందజేయడం మొదలెట్టింది.

హేమలత వెంటనే వార్త అందుకొని ప్రసాద్ పిలవకపోయినా “జీ హుజూర్” అని ప్రసాద్ ఆఫీసులో హాజరవుతున్నది.

వినీత ఇదే అదను, అదే అదను అని ఇంకా చిలవలు పలవలు వేసి “ప్రసాద్ డాక్టర్ గారు హాస్పిటల్ కి రాగానే హేమలత వచ్చిందా లేదా” అని తననే అడుగుతున్నాడనీ, తాను కాఫీ ఆర్డర్ చేస్తే మీకు కూడా ఒక కాఫీ తెమ్మని చెప్తుంటాడనీ చెప్పి చెప్పి రెండు, మూడు సార్లు తానే కాఫీ తెచ్చి పెట్టి ప్రసాద్ మీద తోసేసింది, వినీత.

ఇదంతా హేమలతని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి వినీత ఆడుతున్న నాటకం.

ప్రసాద్ కు పెద్ద పట్టింపులేదు ఈ ఆడవాళ్ళ యాక్షన్స్ తో, హేమలతకు కొంచెం ఖాళీ వుండి తన పన్లలో సహకరించడానికి వస్తుందని అనుకుంటున్నాడే తప్పా.

హేమలతకు ఈ వినీత స్నేహం పట్టిన దగ్గిరనుండీ ప్రసాద్ మీదున్న పిచ్చి ముదిరింది. వినీతకు ఒకటే పని ఆమె పిచ్చిని ఎగదోయడం, తానే పని చెయ్యకుండా హేమలతకు అతుక్కుపోయి వుండడం, నెల రాగానే జీతం తీసుకోవడం.

వీరిద్దరి స్నేహం వెనకాతల ఎవరి స్వార్ధం వాళ్ళది. తనకన్నా సీనియర్ డాక్టర్ సీతారాం ఉన్నా, హేమలతతో తక్కువ పరిచయం ఉండడం వల్ల పెద్దగా ఏమీ చెప్పలేడు. వినీత తన చాకచక్యంతో ఎక్కువ పేషంట్లని సీతారాం కు పంపిస్తు న్నది.

హేమలత ద్వారా వినీత ప్రసాద్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. అతని మంచితనం, ఒకరికి సహాయం చేసే విధానం, అతని కుటుంబ పరువు ప్రతిష్టలు, పరిస్థితులు, వారి స్థితిగతులూ, అతని విద్యార్ధి దశ, వారిద్దరి మధ్య స్నేహం, తనకది ఎప్పుడు ఎలా ప్రేమగా మారిన విషయాల వరకూ ప్రతిఒక్కటీ చెప్పుకొంది వినీతకు హేమలత.

చాలా విచిత్రం కదా! కొందరు ప్రొఫెషనల్ గా డాక్టర్లవ్వూ, యాక్టర్లవ్వూ … వాళ్ళ వృత్తులు ఏమాత్రం కూడా ప్రవృత్తులను మార్చలేవు. చాలా కొద్దిమంది మాత్రమే ఆ హుందాతనాన్ని కలిగి ఉంటారు. హేమలత ఆ కోవకు చెందలేదని తెలిసిపోయింది కదా!!!

వినీత ఆమెకి మంచి చేస్తున్నట్లు అర్ధం పర్ధం లేని సహాయాలు చేస్తూ విషయాలన్నీ జాగ్రత్తగా సేకరించుకొని, తన అక్క సరితకు చేరెయ్యడం మొదలెట్టింది. ఆశ్చర్యంగాఉంది కదూ … ఆశ్చర్యమే మరి. ఒక మనిషి గురించి విషయాలు ఆ మనిషి ప్రమేయమే లేకుండా ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తాయో. అయితే ఈ విషయాలు అక్కకెందుకు? బ్రతకటానికి!!!

వినీతకు పెద్దగా చదువబ్బకపోవడంతో తూ తూ మంత్రంగా ఏదో ఇంటర్మీడియట్ చదువుతూండంగా మధ్యలోనే పెళ్ళి చేసేసారు. కానీ ఆమెకి భర్త, పిల్లలు అంటే పెద్ద బాధ్యతేమీ లేదు, ఏదో వాళ్ళున్నారంటే ఉన్నారు. ఏదో చెయ్యాలని ఆశ, ఎలా చెయ్యాలో తెలియదు. ఆమె దృష్టిలో అక్క సరిత ఒక గొప్ప తెలివైన ఘని. ఎందుకంటే అక్కకి ఎవరినైనా పడగొట్టే తెలివితేటలున్నాయి, ఆ తెలివితో తనకేం కావాలో అన్నీ తనకు తాను సమకూర్చుకుంటుంది, పైగా ఏమిచేసినా అడిగేవారు లేరు. పెళ్ళి చేసుకోలేదు అక్క. తన పరిస్థితిలా కాదు ఆమెది … కాబట్టి అక్కని మ్యానేజ్ చేసుకుంటే తనకి అన్నివిధాలా ఉపయోగం అని … ఆలోచనలు నిరంతరం దొర్లుతూ ఉంటుంది వినీతకు.

అందుకే వినీత, సరిత మీద నిఘా వేసి ఉంటుంది, సరిత వ్యక్తిగత విషాయాలను కూడా అడిగి తెలుసుకుంటూ తానున్నది అక్క కోసమే అన్నట్లు ఆమెను భ్రమలో ఉంచుతుంది.

ఇక సరిత విషయానికొస్తే, సరిత స్వేఛ్ఛగా జీవించాలనుకుంటుంది. ఎంత స్వేఛ్ఛగా అంటే తానేక్షణాన ఏ నిర్ణయం తీసుకుంటుందో తనకే తెలియదు. అనిపించిన వెంటనే తాను చేసేయ్యాలనుకుంటుంది. అలా జరగకుండా తననెవరైనా ఆపితే ఉద్వేగపడుతుంది, తను చెప్పినట్లు అవతలివాళ్ళు వినకపోతే ఆవేశపడుతుంది. అందుకనీ తనకు తెలిసిన ప్రపంచాన్నెప్పుడూ తన గుప్పిట్లోనే గట్టిగా పిడికిలి బిగించి పట్టుకొని ఉంటుంది. మరా పిడికిలి వదులయిన క్షణంలో తెలిసిన ప్రపంచం గనుక ఎదురు తిరీగితే దాన్ని సంభాళించుకునే లక్షణాలు తనలో లేవు. తన బలహీనత తనకి తెలుసు.
సరిత తన గుప్పిట్లో వినీతని కూడా పెట్టుకొంది, వినీతకు కావలసింది కూడా అదే.

తన పన్లన్నీ వినీత చేత చేయించుకుంటుంది సరిత. తన గుప్పిట్లో సరిత ఉందని వినీతా, తన గుప్పిట్లోనే వినీత ఉందనీ సరిత. ఇలా ఇద్దరికిద్దరూ దొంగాటాడుతుంటారు.కష్టపడకుండా సుఖంగా బ్రతకాలనుకునే వాళ్ళు ఇతరుల కష్టాన్ని దోచుకునేగా బ్రతుకుతారు? అక్కా చెల్లెళ్ళకు ఈ సుగుణం బాగానేఉంది.

హేమలత మాటలద్వారా, అనుభవిస్తున్న మూగవేధన ద్వారా అసలు ప్రసాద్కు హేమలత స్నేహితురాలనే తప్ప మరొక ఉద్దేశ్యమేమీ లేదని తెలుసుకున్న వినీత, అక్క సరితను పురిగొల్పింది, ప్రసాద్తో స్నేహం చెయ్యమనీ, వీలయితే పెళ్ళి చేసుకోమని.

దానికి సరిత … “పెళ్ళి చేసుకుంటే మొగుడూ, అత్త మామలు, ఆడబడుచులు వగైరా … ఇవన్నీ నా వల్ల కాదు. నేనెవరికీ తలవంచను” … అన్నది.

“తలవంచుకోమని ఎవరన్నారు? ఒక్కడే కొడుకట. పైగా అతనంటే వాళ్ళ అమ్మానాన్నకు, అక్క చెల్లెళ్ళకు ప్రాణమంట. నీ కొంగుకు కట్టేసుకో ఆ ప్రాణాన్ని. వాళ్ళ ప్రాణాలన్నీ నీ గుప్పిట్లోకొచ్చేస్తాయి. ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. ఎంతమందిలో ఈ బలహీనత ఉంటుంది? ఒక్కసారి వాళ్ళందరూ నీ చేతిలోకి రాగానే ఆస్థులన్నీ బ్రతిమాలో, భయపెట్టో రాయించేసుకుందాం. నేనుంటాగా నీకు సహకారంగా. ముందు స్నేహం చెయ్యి.

ఆ హేమలతని పక్కకి తప్పించే బాధ్యత నాది. అసలు ప్రసాద్ ని మాయాదర్పణంలో చూపించి ఆమెని ప్రసాద్ కి ఇంకా దగ్గిర చేసిందే నేను. ఇప్పుడా దర్పణాన్ని తీసేస్తా. నిజం తెలుసుకుంటుంది. ఈలోపుల నువ్వు ఎంటర్ అయిపో. సత్యవతిగారు స్టెనో కోసం చూస్తున్నారు. దేవుని దయవల్ల నీకక్కడ వచ్చేసిందంటే లైన్ సగం క్లియర్ అయినట్లే” … అలా ఒక కధలాగ తన స్వప్నాన్ని చెప్పేస్తుంటే అక్క సరిత కూడా ఆ స్వప్నంలోకి దూకేసింది.

దూకడమే తడువు ప్రసాద్ ని పరిచయం చేసుకోవడానికి పేషంట్ గా జెనెరల్ చెకప్ అని వినీత దగ్గిర చీటీ వ్రాయించుకొని వెళ్ళింది.

కాసేపు ప్రసాద్ నే తదేకంగా చూస్తూ చాలాసేపు మాట్లాడింది. ఆరోగ్యం గురించి, తీసుకోవలసిన డైట్ గురించి, అవసరం లేకపోయినా తానెలా డైట్ మెయింటైన్ చేస్తుందనీ… ఇంకా ఎలా చెయ్యాలనీ, అప్పుడప్పుడు తన మాటల్లో చిన్నప్పటి తన ఆటపాటలు … ఆటల్లో పడిపోవడాలు ఇప్పటికీ తనకి అప్పుడప్పుడు కలుగుతున్న నొప్పులూ … అబ్బో … తెగ మాట్లాడింది, అమాయకంగా గల గలా నవ్వింది. ప్రసాద్ కు మొదటిసారిగా విచిత్రం అనిపించింది, తర్వాత భోళా మనిషి అనుకొని బోల్తా పడ్డాడు. ఎందుకంటే లేచి వెళ్ళేటప్పుడు చెప్పింది తను సత్యవతిగారి దగ్గిర స్టెనో జాబ్ కి అప్లికేషన్ పెట్టినట్లు. వస్తుందో రాదో అనే భయాన్ని కూడా వ్యక్తం చేసింది. అన్నీ చెప్పిందిగానీ, ఇంకా తాను వినీతకి అక్కని అని చెప్పలేదు.

ఇంతకుమునుపు ఉన్న ఉద్యోగానుభవాన్నిబట్టి సరితకు ఆ హస్పిటల్లోనే ఉద్యోగం వచ్చేసింది. ఇంకేం … వినీతా, సరితలు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతున్నాయి. ఇతర హాస్పిటల్ పన్లుకూడా సరిత చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రసాద్ ఆఫీసుకి సంబంధించిన కొన్ని పనులు కూడా చేస్తున్నది.

కానీ సమస్య ఏమిటంటే … ఆఫీసు వాతావరణంలో కలిసి క్యాంటీన్ కి వెళ్ళడం కానీ … మరే చోటుకన్నా వెళ్ళడం కానీ కుదరడంలేదు. పైగా ప్రసాద్ ఎప్పుడూ సరితను ఆహ్వానించనూ లేదు.

హేమలత మాత్రం యధేచ్చగా ప్రసాద్ అఫీసుకి వెళ్ళగలుగుతోంది, తనతో కలిసి క్యాంటీన్ కయినా, ప్రసాద్ ఇంటికయినా వెళ్ళగలుగుతోంది.

మరి వీళ్ళు? దాంతో వినీతా, సరితలిద్దరికీ నషాళానికి అంటింది హేమలత మీద.

హేమలతని ఎలాగయినా ప్రసాద్ నుండి దూరం చేయాలని వినీత నిర్ణయించుకొని… హేమలతతో హటాత్తుగా మాట్లాడడం మానేసింది.

హేమలతకు కష్టం గా, ఇబ్బందిగా, బాధగా ఉంటోంది. ప్రసాద్ నుండి ఏ విషయాలు రావడం లేదు. అసలు ఉంటేగా? అవన్నీ వినీత కల్పనలు.

పాపం ప్రసాద్ ఎప్పటిలానే పనిలో బిజీ గా ఉంటున్నాడు. ఇక ఆగలేక వినీతని అడిగేసింది.

అప్పుడు వినీత … బాధగా మొహం పెట్టి ప్రసాద్ తన మీద అరిచినట్లు, తన పని అవ్వకుండా హాస్పిటల్ స్టాఫ్ఫ్ చీటికీ మాటికీ వచ్చి అడ్డంపడుతున్నారనీ, తాను ఎవరడిగినా లోపలికి పంపిస్తున్నదనీ, సాయంత్రం ఆరు వరకూ ఎవర్నీ రానివ్వొద్దని అన్నారని చెప్పింది.

“అంటే నన్నుకూడానా?” … అడిగింది హేమలత.

“ఎవ్వరినీ రానివ్వొద్దు” అంటే అందులో మీరుకూడా ఉన్నట్లే కదా? … అంది వోరగా ఒక చూపు చూస్తూ హేమలతకేసి.

ఆ మాటకి హేమలతకి ముఖం చిన్నబోయింది. అదే అదను అనుకొని వినీత …

“నిజమే హేమలతగారూ … ప్రసాద్ సర్ కి మీ మీద ఏ మాత్రం అదే లేదు, పోనీ మేమందరం అంటే వేరు ఆఖరికి మిమ్మలని కూడా మాలో ఒకరిగానే చూసారే తప్పా…! ఏదో అంతా మీ యావ! అయినా … ఆడపిల్లకి ఇంత యావ పనికిరాదు సుమా … పెళ్ళి కావలసినవారు. ఏదో పెళ్ళయినదాన్ని అని కొంచెం చనువుగా బుద్ధి చెప్పబోయాను అంతే … మీకింకా జీవితం అంటే తెలియదు కదా.. అని. మరోలా తీసుకోకండేం … ఇదంతా మీ మంచికే చెప్తున్నాను” అన్నది.

ఈ మాటలకి హేమలత అవాక్కయిపోయింది. చిన్నబోయిన ముఖం కాస్త నల్లగా అమావాస్య చంద్రుడయిపోయింది.

ప్రసాద్ కీ, తనకూ వంతెనలా ఉన్న వినీత నోట్లోంచి ఈ మాటలను పైగా “బుద్ధి చెప్పబోయాను” అన్నది.

ఆ మాట ఇంకా గట్టిగా తగిలింది. చాలా నొచ్చుకొని … ఒకవారం రోజులపాటు బాధ పడుతూ ఉండిపోయింది, పైగా వినీతని ఏమాత్రం అనుమానించలేదు. పైగా తానంత గట్టిగా చెప్పిందంటే ప్రసాద్ ఆమెని అంత గట్టిగా తిట్టాడనుకుందే తప్పా.

హేమలత మోసపోయింది వినీత దగ్గిర, ప్రసాద్ నే అనుమానించసాగింది.

తాను వెళ్ళకపోతే ప్రసాద్ కూడా పెద్దగా పట్టించుకోనట్లే ఉన్నాడు. ఎప్పుడు మాత్రం ఎవరిని మాత్రం ప్రసాద్ పట్టుకొని వ్రేలాడాడుకనుక? వినీత మాటలకు మోసపోయి హేమలత భ్రమించింది. ఇంకా భ్రమలోనే ఉండిపోయి రోజు రోజుకీ మనస్థాపానికి గురయ్యి, మదనపడుతూ మౌనమయిపోయింది.

ఇదంతా గమనిస్తున్న వినీత విజయగర్వంతో నవ్వుకున్నది. ఆ టైం అంతా వినీత, సరితకోసం కేటాయించడం మొదలుపెట్టింది.

సరిత పాత పరిచయం ఉండడం వల్ల ఏదో ఒక నెపంతో రోజుకి కనీసం రెండు మూడు సార్లయిన ప్రసాద్ తో మాట్లాడుతున్నది.

కొన్ని నెలలకు సరిత, ప్రసాదుల పరిచయం కాస్త వేరే దారిపట్టింది. ప్రసాదు సరిత వలలో పడ్డాడు.

ప్రసాద్ … హేమలతకు ఇంకా సరిత విషయం చెప్పలేదు. మామూలుగా అయితే ప్రసాద్ సరితతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రసాద్ మాట్లాడినప్పుడల్లా హేమలతకు మనసులో అలజడి తప్పడంలేదు. అలాగే సాగిపోతున్నది కాలం.

ప్రసాద్ అనుకున్న గోల్ సాధించాడు, సత్యవతిగారి మరియు ఇతర స్టాఫ్ సిబ్బంది సహాయ సహకారాలతో ఎక్విప్ మెంట్ తో సహా క్రొత్త యూనిట్టునంతా ఎస్టాబ్లిష్ చేసి తన బాధ్యతలు పూర్తి చేశాడు.

సత్యవతిగారు ప్రసాద్ నే ఆ యూనిట్ కి హెడ్ ని చేసేసారు. వినీతా, సరితలకు ఒకటే ఆనందం. హేమలత కూడా ఆనందించింది. కానీ ఇద్దరి అనందాలువేరు.

ఇదయ్యాక ఒకసారి హేమలతకు సరిత గురించి చెప్పాడు. హేమలత షాక్ తిన్నాది అది విని. ఇంతలో లోనే మరో షాకింగ్ న్యూస్ ఇచ్చాడు హేమలతకు, వినీత సరితకు అక్క అని.

హేమలతకు బుర్ర గిర్రున తిరిగింది. క్యాంటీన్లో ఈ మాట విని ఆఫీసులో కొచ్చి కూలబడిపోయింది చాలాసేపు. అప్పుడు మొత్తం అర్ధమయ్యింది వినీత తనని మాటలతో మోసం చేసి ప్రసాద్ ని మాయాదర్పణంలో తనకి చూపించి … మెల్లగా అతన్ని తన అక్కకు అంటగట్టిందనీ. ఆవేదన కలిగింది, ఆవేశంగా వినీతని అడిగింది.

వినీతకు ఇవన్నీ జరుగుతాయని ముందే తెలుసుగనుక … కూల్ గా సమాధానమిచ్చింది. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డరే తప్పా తనదేం ప్రమేయం లేదంది, తనకీ కూడా ఒకటి రెండు రోజుల ముందే తెలిసింది అని చెప్పింది.

హేమలత ఒక పిచ్చిది మళ్ళీ వినీతని నమ్మేసింది. అయినా తేరుకొని “ఆమె నీకు అక్క అని ఎందుకు చెప్పలేదు??” అని వినీతని అడిగింది.

దానికి కూడా కూల్ గా వినీత, “సరిత నా స్వంత అక్క కాదు, దూరపు చుట్టం” … అని కధ అల్లింది. మళ్ళీ మోసం!

ఆ సంధర్భంలోనే హేమలత, వినీతకు తన ఇంట్లో తనకు సంబంధాలు చూస్తున్నారనీ, తన మేనత్త కొడుకుని చేసుకోమంటున్నారనీ అతను ఇంజనీరనీ చెప్పింది.

దానితో మనసులోనే ఎగిరి గంతేసిన వినీత … ఆమెని పెళ్ళి చేసుకోమనే ప్రోత్సహించింది.

పైగా కుక్కకు ఒక బిస్కట్ వేసినట్లు ఒక క్రొత్త కాన్సెప్ట్ ఆమె బుర్రలో ప్రవేశపెట్టింది. “ఇలా ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకొని సెటిల్ అయి స్నేహాల్ని కొనసాగించడమే అందరికీ శ్రేయస్కర” మని.

ముందు అర్ధం కాలేదు హేమలతకు. తరవాత విశదీకరించి చెప్పింది ఎక్కడెక్కడి ఉదాహరణలతోనో.
“మా అక్కతో స్నేహం చేసుకొంటే ఎప్పుడంటే అప్పుడు మీరు మా అక్క ఇంటికి వెళ్ళొచ్చు. ప్రసాద్ గారినీ చూసుకోవొచ్చు. తెలిసిన మనిషి అయితేనే బెటర్. అదే ఎవరో ముక్కూ మొహం తెలియని మనిషయితే మిమ్మల్ని ఇంటికి రానిస్తాదా? వాళ్ళల్లో ఒక మనిషిగా ఉండనిస్తాదా?” … అని బేరాలు మొదలేసింది.

మనిషిలో ఎక్కడో దాగిన నల్ల నీడల్లాంటి గుణాల్ని బయటికి తీయడంలో వినీతది అందెవేసిన చెయ్యి. అక్కడ అక్కని ప్రసాద్ ప్రక్కన ఫిక్స్ చేసింది, హేమలతని పోటీలోకి దింపింది.

అందుకే స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. హేమలత ఆమె చెప్పినట్లుగా చెయ్యడానికి సిద్ధపడిపోయింది, ఆనందంగా పెళ్ళిచేసుకొంది … ప్రసాద్, సరితల పెళ్ళి గురించి నిరీక్షిస్తున్నది, తన ఎంట్రీ కోసం.
*************
ప్రసాద్ వాళ్ళింట్లో సరితను ఇష్టపడలేదు ఆమె కుటుంబ స్టితిగతులను తెలుసుకున్నాక, ఆమె ఇంటి వాతావరణం కూడా తమకు నప్పదని నిర్ణయించాక. వాళ్ళేమ్మాట్లాడటంలేదని ప్రసాద్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.

ఎవరూ మాట్లాడకపోయేసరికి వినీతా, సరితలకు జ్వరాలొచ్చాయి… ఇంతవరకూ వచ్చి కధ అడ్డం తిరిగితే ఎలా? అని.

అప్పటినుండీ నాటకాలు మొదలు. ప్రసాద్ కమిట్ అయిపోయాడు కదా పెళ్ళి చేసుకుంటానని చెప్పీ, బుర్ర తినడం మొదలెట్టారు పైగా హేమలత ఆల్ రెడీ వీళ్ళ ట్రాప్ లోఏ ఉంది కాబట్టీ … ఆమెని సలహా అడిగినా చేసేసుకోమనే చెప్తోంది. వీటన్నిటికీ బుర్ర పాడయి ఏమి చెయ్యాలో తెలియక ఇంట్లో ఎదిరించేసి సరితని ఫ్రెండ్స్ సహాయంతో చేసేసుకున్నాడు.

ఇక సరిత కోడలిగా అడుగు పెట్టిన దగ్గిరనుండి ప్రసాద్ ని ఆ కుటుంబం నుండి విడగొట్టే పధకాలే, ముఖ్యంగా అతని తల్లితో.

వినీతా, సరితలకు తల్లీ, మేనమామ తప్ప ఎవరూలేరు. వీళ్ళిద్దరూ వేసే ప్రతి వేషానికి వాళ్ళిద్దరే దన్ను. వినీతకు మొగుడు ఉన్నా, తృణప్రాయం. అలా ప్రసాద్ ని చెయ్యాలంటే ప్రసాద్ కుటుంబం ఒక అడ్డుగా ఉంది. ప్రసాద్ కేవలం మంచివాడవడంచేత, సరిత దుర్మార్గపు ఆలోచన్లని ఆపలేకపోతున్నాడు.

సరిత ఏమి చెప్పినా ప్రసాద్ నమ్మేస్తున్నాడు. హేమలత పరిస్థితే ప్రసాద్ ది కూడా.

ఇనుముని కాల్చికొట్టి కొట్టి వంచినట్లు, వినీతా సరితలు, వాళ్ళ కుటుంబం పూర్తిగా ప్రసాద్ జీవితాన్ని ఆక్రమించేసారు. ప్రసాద్ ని అతని కుటుంబం నుండి దూరం చేసేసారు.

చివరికి ప్రసాద్ ని పురిగొలిపి తనకు రావలసిన ఆస్థినంతా ఇవ్వకపోతే తలకొరివి పెట్టనని సవాలు చేయించారు. దానితో ప్రసాద్ తండ్రీ, తల్లీ అంత మాటనేసరికి అవమానం భరించలేక ఇంట్లోంచి పొమ్మన్నారు. ఆ తరువాత బెంగతో మంచమెక్కారు.

అదే కదా కావలిసినదీ సరితా వాళ్ళకూ, అయితే ఆస్థితో బయటికి వెళ్ళిపోవాలి లేదా ఆ కుటుంబంతో ప్రసాద్ కి పూర్తిగా కనెక్షన్ కట్ చేసి బయటికి పట్టుకుపోవాలి.

ప్రసాద్ కుటుంబీకులతో ఏ సమస్యా లేకపోయినా సరిత మానసిక పరిస్ఠితి ఏమిటంటే తాను కుటుంబ వ్యవస్థ లో ఉండే మనిషికాదు. అదే సమస్య. తనకు కావలసిన వ్యక్తులు తన గుప్పిట్లో ఉండాలి … వ్యవస్థలు కాదు. ఇక్కడ తనకు కావలసినది కేవలం ప్రసాద్. తానొక డాక్టర్ భార్య అనే పేరు, తద్వారా తనకొచ్చే సౌఖ్యాలు, డబ్బు, కారు, ఏసీ వగైరా …

ప్రసాద్ నుండి వచ్చేవేంటా అని చూసుకుంటున్నారే తప్పా సరితా, సరిత కుటుంబం … అసలు ప్రసాద్ కి ఏమి కావాలనేది వాళ్ళకనవసరం, ఆలోచించదలచలేదు కూడా.

డబ్బుతెచ్చేయంత్రంగా మారి పూర్తిగా వీళ్ళకే అంకితమాయ్యాక జీవితంలో అలిసిపోయాడు ప్రసాద్ … అప్పుడు తెలుసుకున్నాడు ఒకటీ ఒకటీ. ఏమిటి లాభం? ఈ లోపుల తల్లి చనిపోయింది ఒక్కగానొక్క కొడుకు కోసం తపించీ, తపించీ. ఆఖరి చూపులకి కూడా ప్రసాద్ నోచుకోలేదు.

తల్లి హాస్పిటలో ఉన్నప్పుడు ప్రసాద్ అక్క ఫోన్ చేస్తే … ఆ వార్త అందుకొని కూడా ప్రసాద్ కి చెప్పకుండా అప్పటికప్పుడు తన కూతిరి దగ్గిరకి హైదరబాద్ వెళ్ళాలని ప్రయాణం చేయించి ప్రసాద్ ని ఆఖరి చూపుకి అందకుండా చేసేసింది సరిత.

చుట్టాలూ, దగ్గిరవాళ్ళూ, స్నేహితులూ ఆ తల్లి చనిపోయాక … వీళ్ళు హైద్రాబాద్ లో ఉన్నారని తెలుసుకొని ఎలాగోలా అతన్ని కాంటాక్ట్ చేసి రప్పించి తలకొరివి పెట్టించారు. ఆ కార్యక్రమం అంతా అయ్యాక గొడవలు కూడా అయ్యాయి. అయితే మాత్రం ఆమెకి అవన్నీ పడతాయా?

ప్రసాద్ కృంగిపోయాడు, తండ్రిని జాగ్రతగా చూసుకుంటానని కజిన్స్ కి, అక్కచెల్లెళ్ళకీ, స్నేహితులకి మాటిచ్చాడు.
తండ్రిని వెంట తీసుకు వెళ్ళాడు.

తల్లి ఇంకా బ్రతికి ఉన్నప్పుడే ఆ తండ్రికి ఆల్జియామర్స్ స్టార్ట్ అయ్యింది వార్ధక్యం వల్ల, అతనిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాడు దగ్గిర బంధువులందరికీ, తల్లిని చూసుకోలేదనే పశ్చత్తాపంతో.

తల్లి చనిపోయిన నాటినుండి తండ్రి పరిస్థితి విషమించింది. అతని ఆల్జియామర్స్ కూడా ఎక్కువయిపోయింది, అతని ఆలనా పాలనా చూసుకోవడం ప్రసాద్ కి కష్టమయ్యింది. సరిత కోపరేషన్ పూర్తిగా నిల్లు.

మామగారిని హస్పిటల్లోనే పెట్టుకోమని, అక్కడి నర్సెస్ చేత చేయించమని, అక్కడి క్యాంటీన్ లోని ఫుడ్డు పెట్టించమనీ పోరేది సరిత ప్రసాద్ ని.

ప్రసాద్ ఎన్నాళ్ళని అలా చేస్తాడు? నలుగురూ మొహం మీద ఉమ్మేస్తారని చెప్పేవాడు సరితతో గొడవ పడేవాడు.

సరిత వినేది కాదు. అయినాసరే తండ్రిని బలవంతంగా హాస్పిటల్ నుండి ఇంటికి తెచ్చుకొని పెట్టుకొన్నాడు.

ఒక నెలరోజులయ్యాక … సరిత తన భర్త తన మాట ఎదిరించడం భరించలేక ప్రసాద్ లేనప్పుడు మతిలేని ఆ తండ్రిని కార్లో తీసుకువెళ్ళి ఏదో దారిలోనో వదిలేసి వచ్చింది.

ప్రసాద్ అడిగితే “తాను లోపల ఉన్నానని … ఎలా తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోయారో తెలీద” నీ అన్నది.

ఆ చుట్టు పక్కలంతా వెతికారు, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లయింట్ ఇచ్చారు. తండ్రి ఆచూకీ తెలియలేదు. ప్రసాద్ గుండె పగిలేలా ఏడిచాడు. అతని కుటుంబానికి ముగింపుని సరిత ఇలా ఇచ్చింది!!!

ప్రసాద్ కి హేమలతతో స్నేహం, హేమలతకి వినీతతో స్నేహం … ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్లు అతని కన్నవాళ్ళకి ముప్పు తెచ్చింది, అక్కాచెల్లెళ్ళకి, కజిన్లకు బాధను మిగిల్చింది. ఇక్కడ సుఖపడింది సరితా, సరిత కుటుంబం. మనుష్యులెవ్వరూ వ్రాయలేని ముగింపు దేవునికి మాత్రమే సాధ్యం. మరా దేవుడు వీరి ముగింపు ఎలా ఇస్తాడో?

స్వార్ధానికి రెక్కలొచ్చి ఆకాశవీధుల్లో ఎగిరే కీలుగుర్రాలయినప్పుడు స్వార్ధపరులకి మంచివాళ్ళు అలా “కీ” ఇచ్చుకునే కీలుబొమ్మలే అయిపోతారు.

మనుష్యుల స్వార్ధపు బుర్రల్లో తాండవించే ప్రక్రియలను సత్కార్యాలుగా భావించి క్రియారూపంలో పెట్టినప్పుడు ఈ క్రియలకు పేరేంపెట్టి “ముసుగు” వెయ్యాలి? పలకడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి “స్నేహమా” దానిపేరు?

— శ్రీసత్య గౌతమి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , Permalink

9 Responses to ముసుగు (కథ )- శ్రీసత్య గౌతమి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో