గాలి అలలపై తేలుతూ
ఒక స్వేచ్చా విహంగం
ధీమాగా
వాలుతూ, ఎగురుతూ
సూర్యకాంతిలో ముంచి
తన బంగారు రెక్కలను
ఆకాశమంతా పరుస్తుంది.
రెక్కలు కత్తిరించి,
కాళ్ళకు సంకెళ్ళు వేసిన
ఇరుకు పంజరంలో,
ప్రపంచాన్ని తట్టి లేపుతూ
గొంతెత్తి పాడుతుందో పక్షి.
వణికిస్తున్న భయాన్ని నింపుకుని,
తెలియని కోరికలు ఒంపుకుని,
పాట
అలలు అలలుగా సాగుతుంది.
దూరాన కొండలను చుట్టి వస్తుంది.
ఆ పాట ఒక స్వేచ్చాగానం.
స్వేచ్చ రెక్కలు విప్పిన పక్షి
చల్లగా సాగే పిల్ల గాలిలో మురుస్తుంది.
స్వాగతించే చెట్ల కొమ్మలను పలకరిస్తుంది.
పురుగుల కోసం నేలపై వాలుతుంది.
అయినా ఆకాశం తనదే అంటుంది.
రెక్కలు కత్తిరించి,
కాళ్ళుకు సంకెళ్ళు వేసిన
పంజరంలో పక్షి,
కలల సమాధులపై నిలిచి
వికృతంగా ధ్వనిస్తూ,
పీడకలలను పలవరిస్తూ,
తన నీడ చూసి తానే
ఉలికిపడుతుంది.
అయినా
నోరు విప్పి పాటే పాడుతుంది.
వణికిస్తున్న భయాన్ని నింపుకుని,
తెలియని కోరికలు ఒంపుకుని,
పాట
అలలు అలలుగా సాగుతుంది.
దూరాన కొండలను చుట్టి వస్తుంది.
ఆ పాట ఒక స్వేచ్చాగానం.
– టి.వి.ఎస్.రామానుజ రావు
—- మాయ ఎంజేలో “CAGED BIRD” కవితకు స్వేచ్చానువాదం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to స్వేచ్చా గానం- టి.వి.ఎస్.రామానుజ రావు