నా జీవనయానంలో-జీవితం..54 (ఆత్మ కథ)- కె.వరలక్ష్మి

ఒక రోజు పాపమ్మ మిల్లు పనికి తను రావడం వీలుపడలేదని బాబ్జీ అనే పదేళ్ల కుర్రాణ్ణి పంపింది . వాడు బలే చురుకైన వాడు . తుర్రు తుర్రుమని పిట్టలా నిలిచిన చోట నిలవకుండా పరుగులెత్తే వాడు . ఒంటి మీద చిన్నదో , పెద్దదో నిక్కరు తప్ప , ఆ నిక్కరు దోపుకొనే మొలతాడు తప్ప ఒంటి మీద మరో ఆచ్చాదన ఉండేది కాదు . కత్తిరింపు లేక దుబ్బు జుట్టు మొహం మీద పడిపోతూ , ఎండల్లో తిరగడం వలన రాగి రంగుకు తిరిగిన మేని ఛాయతో , నిక్కరు ఎగలాక్కుంటూ ఉండేవాడు . ఆ మధ్యాహ్నం ఇంటికెళ్లి వచ్చేటప్పుడు దోసెడు దోర రేగు పళ్లు – అప్పుడే కోసినవి తెచ్చి “అక్కా …అక్కా…” అని నా కోసం వెతికి “తినక్కా “అని నా దోసిట్లో పోసేడు . నేను ఇష్టంగా తినడం చూస్తూ తెగ సంతోషపడి పోయేడు . ఆ సాయంకాలం పని ముగిసి ఇంటి కెళ్లే ముందు “ అక్కా , నేనొక పాట పాడనా “ అంటూ ఘంటసాల గారి పాటొకటి పాడేడు . నేను తెల్లబోయి వింటూ ఉండిపోయేను . వాడు పెరిగిన వాతావరణం వల్ల సాహిత్యం సరిగ్గా పలకలేకపోయి ఉండవచ్చు గాని రాగం , తాళం ఎక్కడా తప్పకుండా అద్భుతంగా పాడుతున్నాడు . మంచి మంచి పాటలన్నీ వాడి నాలుక మీదే ఉన్నాయి . ఆ రోజు నుంచీ వాడు నాకు అనుకోకుండా లభించిన తమ్ముడైపోయాడు . పనిలోకొచ్చినా రాకపోయినా ఒక నారింజ పండో , బత్తాయి పండో , బాగా పండిన జీడి మామిడి పళ్ళో ఏదో ఒకటి తెచ్చి ఇచ్చి ‘తినక్కా ‘ అని అక్కడే కూర్చునేవాడు . చిలక కొట్టిన జామ పళ్లు, మామిడి పళ్లు ఒకటేమిటి , వాడి అభిమానానికి అంతుండేది కాదు . రోజూ పాటలు పాడి విన్పించేవాడు . ఆకలితో ఉన్నా చెప్పేవాడు కాదు . నేనే గమనించి అన్నం పెట్టేదాన్ని . వాణ్ణి ఎవరోకని వదిలేస్తే పిల్లలు లేని యాకోబు పెళ్లాం తెచ్చి పెంచిందట . కాని , చదువూ సంధ్యా లేకుండా వాణ్ణలా గాలికి వదిలేసారు . వాడికి నచ్చితే పనిలోకి వెళ్తాడు . లేకపోతే లేదట . అలా చెట్లంట పుట్లంటా తిరగడం చూసి కాయలూ పళ్లూ దొంగతనంగా కోసుకురమ్మని వాళ్లే ప్రోత్సహించే వాళ్లట ,” నీకు మాత్రం దొంగ కాయలు తేవటం లేదక్కా , ఒట్టు “ అని నెత్తిన చెయ్యి పెట్టుకుని నవ్వుతూండే వాడు . “ ఆడు దొంగోడమ్మాయ్ , జాగర్త “ అంటూండేవారు మా అత్తగారు . వాడు ఎత్తుకుపోవడానికి మా దగ్గరేమున్నాయని ?తీరికగా కన్పిస్తే పలక బలపం ఇచ్చి కూర్చోబెట్టేదాన్ని వెంటనే తలనొప్పో , కడుపు నొప్పో వచ్చేసేది వాడికి . నేను చెవి పట్టుకోబోతే దొరక్కుండా పరుగెత్తే వాడు . మా జీవితానికొక స్థిరత్వం ఏర్పడ్డాక వాణ్ణి తీసుకెళ్లి చదివించాలని నిర్ణయించుకున్నాను అప్పుడే . జగ్గంపేటలో స్థిరపడ్డాక కోనేరు పేట వచ్చి ఎంక్వైరీ చేస్తే మేం ఊరొదిలినప్పుడే వాడూ ఎటో వెళ్లిపోయాడని తెలిసింది .
ఆ తర్వాత రాసిన ‘పాప’ కథ లో ‘బాలిగాడు ‘ కేరెక్టర్ లో కొంత బాబ్జీ కూడా ఉన్నాడు . ఎప్పుడు వాడు గుర్తొచ్చినా నా కళ్లల్లో నీళ్లూరతాయి .

ఆంటీ కూతురు విజయకి పెళ్లవుతూనే నెలతప్పి కొడుకు పెట్టేడు . వాళ్లాయన విజయవాడలో ఏదో మెడికల్ కంపెనీలో పని చేస్తూ కేంపుల కెళ్తూ ఉండేవాడట . అందుకని ఆ అమ్మాయి ఎక్కువగా పుట్టింట్లోనే ఉండేది . నేను కన్పిస్తే చాలు పిల్లవాడు రమేశ్ ‘అత్తా …అత్తా ‘ అని హత్తుకుపోయేవాడు . నాతో కోనేరు పేట వచ్చేసి ఎన్ని రోజులైనా ఉండిపోయేవాడు . వాడికి మొదటి పుట్టినరోజు రైల్వే క్వార్టర్స్ లో చేసేరు . దానికి మేం వెళ్లినప్పుడు ఆంటీ మా అత్తగారితో “అక్కయ్యా , నీ కోడలికేవీ కడుపూ గిడుపూ రావట్లేదేంటి . ఇదేవన్నా మాసికమ్మేమోనే “ అంది .

“ఛ , ఊరుకో చెల్లీ , బైట్లవుతుంది “ అందీవిడ .

అప్పుడే నాకు మాసికమ్మ అన్న పదానికి అర్ధం తెలిసింది . నా అవమానాల పర్వం ఎప్పటికి ముగుస్తుందో నాకర్ధం కాక , దుఃఖాన్ని దిగమింగుకున్నాను. ఆ సాయంకాలం మా అత్తగారు నన్ను లేడీస్ హాస్పిటల్ కి తీసుకెళ్లేరు . అది బ్రిటిషర్స్ కాలం నాటిదట . మా అత్త గారి కాన్పులన్నీ అక్కడే అయ్యాయట . ఆవిడ క్రిస్టియానిటీ తీసుకోడానికి కారణం ఆ హాస్పిటలేనట . రైల్వే క్వార్టర్స్ దగ్గర్లోనే ఉంది . అక్కడి డాక్టరు నన్ను పరీక్షించింది . ఆడవాళ్ల గర్భం లోపలికి చెయ్యి పెట్టి అలాంటి పరీక్షొకటి చేస్తారని నాకప్పుడే తెలిసింది . నేను సిగ్గుతో ముడుచుకు పోయాను . “ శరీరాన్ని అలా బిగబట్టేసుకోకూడదనీ , రిలాక్స్ డు గా ఉండాలనీ “ డాక్టరు ఏమేమో చెప్పింది . నేను మాత్రం కళ్ళెత్తి ఆవిడ వైపు చూడలేకపోయాను. ఫైనల్ గా ఏ లోపం లేదని మా అత్తగారికి చెప్పింది .

మేం తిరిగి వచ్చేటప్పుడు ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చి వాళ్లింట్లో ఉన్న ఒక అబ్బాయిని మా అత్త గారికి అప్పగించింది ఆంటీ . “ ఈ కుర్రోడు పల్లెటూరోడు . చెప్పినట్టు ఇంటాడు . మీ ఇంట్లో ఉంచుకుని తిండి పెట్టు . ఏదైనా ఉద్యోగం దొరికేక ఉష నిచ్చి పెళ్లి చేసేద్దాం . దానికి సంబంధాలు కుదరాలంటే కష్టం ” అంది. అతను మాతో వస్తూ నన్ను “అక్కయ్యా ‘ అన్నాడు . నాలుగు రోజులయ్యాక తన కన్నా చిన్నదాన్నని తెలిసి ‘చెల్లాయ్ ‘ అనడం మొదలు పెట్టేడు . అతనొచ్చేక మా ఇంట్లో హఠాత్తుగా పద్ధతులు మారేయి . ఉదయం టిఫిను , మంచి మంచి కూరలు , వారం వారం బిర్యానీ లాంటివి వచ్చేయి . పాలు రోజుకు రెండు లీటర్లయ్యాయి. ఆర్నెల్లకు పైగా అతను ఖాళీగా ఉన్నాక పాలిటెక్నిక్ డిప్లోమో హోల్డర్ కావడం వల్ల గోదావరి మీద నిర్మాణంలో ఉన్న రెండవ రైల్ కం రోడ్ బ్రిడ్జ్ పనిలో నెలకు 170 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది . అప్పటికే రాణితో అతనికి దగ్గరితనం పెరగడం వల్ల వాళ్లిద్దరికీ పెళ్లి జరిగింది . కేవలం ఈ కుటుంబ సభ్యులు , ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో అన్నవరం లో జరిగింది . అన్నవరం దగ్గర్లోని శాంతి ఆశ్రమం పక్కనే చిన్న పల్లెటూరు వెళ్లి కొడుకుది . వాళ్లు కట్టుకుని వచ్చిన రెండెద్దుల బళ్ల మీద మేం కూడా ఆ ఊరెళ్లాం . అప్పుడే నేను మొదటిసారి శాంతి ఆశ్రమాన్ని చూసేను . పక్కనే ఉన్న ధారకొండ చూడ్డానికి వెళ్లినప్పుడు రాళ్ల మధ్య నుంచి సన్నగా గలగలమని పై నుంచి ప్రవహించి వస్తూన్న ఆధార ఎక్కడి నుంచి వస్తోందో చూద్దామని ఎత్తైన ఆ కొండ పైకి మోహన్ , నేనూ ఎక్కేసాం . దారిలో ఎక్కడో ధార మాయమైపోయింది . కొండ పైన అంతా సమతలమైన రాతి చప్టా . మంచి ఎండ వేళ , గొంతు ఎండి పోవడం మొదలైయింది . మేం ఎక్కి వచ్చిన సన్నని కాలిబాట ఎంత వెదికినా కన్పించలేదు . దాహంతో ప్రాణాలు పోతాయేమో అన్పించి , చేతిలో చెయ్యేసుకుని ముళ్ల కంచెల్లోంచి కిందికి దిగి వచ్చే సరికి ఒళ్లంతా ముళ్లు గీరుకుపోయి రక్తాలు చిమ్మేయి . ధారలో కూచుండి పోయి దోసిళ్లతో నీళ్లు తాగితాగి కోలుకున్నాం .

అదో సాహసం అప్పటికి .

కోనేరు పేట రెండో ఇంట్లో ఒక గది రాణీ వాళ్లకి కేటాయించేరు . మా పెళ్లికి ఫోటోలు లేవు కాబట్టి వీళ్ల వెంట వెళ్లి రాజమండ్రిలో ఫోటో స్టూడియో లో వాళ్ల కర్పూర దండలు మేం కూడా వేసుకుని మూడేళ్ల తర్వాత ఫోటో తీయించుకున్నాం . ఎప్పుడో వాళ్ల చెల్లి దగ్గర తాకట్టు పెట్టిన రాణీ చిన్నప్పటి జూకాలు పెళ్లి కోసమని అడిగి తెచ్చి , పెళ్లయ్యాక మళ్లీ ఇచ్చేసారు మా అత్తగారు . రోల్డు గోల్డు పడక ఆ అమ్మాయీ ఉత్త చెవుల్తోనే ఉండేది .

అలా రాణీ చదువు తొమ్మిదో తరగతిలో ఈసారి శాశ్వతంగా ఆగిపోయింది . తన భర్తకు ఉద్యోగం ఉండడం వలన తనకి ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండేది . అతను ఎలాంటి చెడు అలవాట్లు లేని మంచి వ్యక్తి . భార్యను ప్రేమగా చూసుకునే సాత్వికుడు .
మా నాన్నమ్మ పోయిన కొత్తల్లోనే మా పిన్నమ్మ తన సొంత ఊరు వెళ్ళిపోయిందట . అలా జగ్గంపేటలో నన్నెంతో ప్రేమించే మరో వ్యక్తిని కోల్పోయేను. తర్వాత ఇక ఎన్నడూ ఆమెను చూడనే లేదు . జీవితంలో స్థిరపడ్డాక , తనని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవాలని ఎంతగా వెదికినా తన ఆచూకీ తెలీనే లేదు .

కోనేరన్నయ్య ద్వారా నా ఫ్రెండ్ లీలకు మంచి సంబంధం కుదిరింది . అన్నయ్య s . కోట ఫిలిం రిప్రజెంటేటివ్ గా వెళ్లినప్పుడు ఆ థియేటర్ వాళ్లబ్బాయి చినబాబుకి సంబంధాలు చూస్తున్నారని తెలిసి మా నాన్నకు ఉత్తరం రాసేడు . వాళ్లు రెండు కారుల్లో మా ఇంటికే వచ్చేరు . పెళ్లి కొడుకు మద్రాసులో సౌండు ఇంజనీరింగ్ చేసాడట . చక్కని పలువరుస , బుగ్గల మీద డింపుల్స్ తెల్లగా , బలంగా , హేండ్స మ్ గా ఉన్నాడు . లీల వాళ్లమ్మ ఎందుకోగాని తానేమీ ఇవ్వలేనని , పెళ్లి ఖర్చులు కూడా పెట్ట లేనని చెప్పింది . వాళ్లు నవ్వుకుని ‘ మాకేమీ వద్దు , పిల్లనివ్వండి చాలు ‘ అంటూ వంద తులాల బంగారం పెట్టి నిశ్చితార్ధం చేసుకున్నారు . ఈ రోజుల్లో నిశ్చితార్దానికి పెళ్లంత హడావుడి చేస్తున్నారు కాని , ఆ రోజుల్లో అమ్మాయికి చీర , నగ , బొట్టు పెట్టి వెళ్లే వారు . లీల అత్తవారికి పొలాలు , తోటలు , దొడ్లు ,ఇళ్లు , బస్సులు , లారీలు , సినిమా హాల్స్ ఇంకా ఎన్నెన్నో ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నాయట . తండ్రి వైశ్యుడు , తల్లి కాపు కావడం వలన అన్ని ఆస్తులున్నా చిన బాబుకి ఎవరూ పిల్ల నివ్వలేదట . లీలది కూడా అదే పరిస్థితి కావడం వలన అవకాశం అలా తోసుకొచ్చింది . త్వరలోనే s . కోటలో చాలా ఘనంగా పెళ్లి జరిగింది . వాళ్లు రెండు బస్సులు పంపి జగ్గంపేట నుంచి పెళ్లి వాళ్లని తీసుకెళ్లేరు. పెళ్ళిలో లీలకు అలంకరించిన వడ్డాణం , వంకీలు , బంగారు జడలాంటి కొన్ని కేజీల బంగారం చూసి ఆశ్చర్యపోయాను . ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు మా నాన్నను బాబాయ్ అనీ , నన్ను చెల్లెమ్మా అనీ పిలుస్తూ ఎంతో ఆదరంగా చూసేడు . పెళ్లిలో నాకు లేత అరిటాకు పచ్చ జార్జెట్ చీర , మా అమ్మకు త్రెడ్ వర్క్ చేసిన కాఫీ రంగు టెరికాట్ చీర పెట్టేరు . ఈ చీర నీకే బాగుంటుంది అంటూ మా అమ్మ తన చీర నాకే ఇచ్చేసింది . నడుస్తూంటే కుచ్చిళ్లు ముందుకు తుళ్లుతూ అప్పటి జార్జెట్ చీరలు ఎంతో బావుండేవి . ఈ రెండు చీరల్తో బాటు సన్నంచు జరీ బుటాల కోరా రంగు వెంకటగిరి చీర ఒకటి ఇష్టంగా దాచుకుని అప్పుడప్పుడు ఎవరింటికైనా వెళ్లినప్పుడు కట్టుకునేదాన్ని . ఆరు నెలలైనా అయ్యిందో లేదో …అత్తయ్య గారు , రాణి హుకంపేట చాకలికి చీరలిచ్చి ఇస్త్రీ చేయించుకునే వారు . నేను కూడా ఆ మూడు చీరలు ఇచ్చేను . మర్నాడే ఏదో పండగని జగ్గంపేట తీసుకెళ్లేరు . నెల తర్వాత వచ్చేక అడిగితే నా చీరలు తెచ్చేడట కాని మూడు చీరలకి ముప్పావలా ఇచ్చేవాళ్లు లేరని వెనక్కి పట్టుకు పోయేడట . ఎంత ప్రయత్నించినా ఆ చీరలు మళ్లీ నాకు దొరకలేదు . ఆ ఇంటికి అంత పరాయి దాన్ని నేను .

పెళ్లి తర్వాత మా లీలలో ఊహించని మార్పు వచ్చింది . మూడో రోజు పుట్టింటికి వచ్చే సరికే s .కోట యాసలో మాట్లాడ్డం మొదలు పెట్టింది . స్నేహితులం వెళ్తే సరిగా మాట్లాడేది కాదు . తన నగల్ని చూడ్డానికే వెళ్లే మన్నట్టు కొత్త కొత్త నగల్ని ప్రదర్శనకు పెట్టేది . ఒకలాంటి అతిశయం ప్రదర్శించేది . క్రమంగా దాని పుట్టింటి వాళ్లంతా చేస్తున్న పనులన్నీ వదిలేసుకుని దాని ఇంటికి చేరి పోయేరు బెల్లం చుట్టూ ఈగల్లా . కూర్చుని తింటూ దాని ఆస్తుల కొండల్ని కరిగించడం మొదలు పెట్టేరు . లీలకు పిల్లలు కలగలేదు . దాని పెళ్లి నాటికీ ఐదేళ్ల వాడైన వాళ్ల పెద్దక్క కొడుకునీ , తమ్ముడి కూతుర్ని అనివార్యంగా పెంపకానికి తీసుకోవాల్సి వచ్చింది . చినబాబు తెలివైనవాడే కాని , రెండో మూడో సినిమాలు తీసి చేతులు కాల్చుకునే సరికి లంకంత బంగ్లాతో బాటు అతని వాటాకొచ్చిన ఆస్తులన్నీ పోయాయట . దీని పుట్టింటి జనాలందరూ మెల్ల మెల్లగా వెనక్కి తిరిగి వచ్చేసారు . కారుల్లో తిరిగిన చినబాబు షాక్ తట్టుకోలేక యాభై ఏళ్ళైనా నిండకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయేడు . పెంచిన పిల్లల్తో బాటు అయిన వాళ్లెవరూ పట్టించుకోక , షుగర్ కి మందులు కొనుక్కునే డబ్బులు కూడా లేక అతి దీనంగా రెండేళ్ల క్రితం మరణించింది లీల . చినబాబు పోయినప్పుడు నేను తనకి ఉత్తరం రాసేను .’నీకెవరూ లేరనుకోకు ,మనిషికి ముఖ్యమైన కూడు , గుడ్డ , నీడ నా ఇంట్లో కల్పిస్తాను . వెంటనే బయలుదేరి రా , కలిసి జీవిద్దాం ‘అని థేంక్స్ అని ఓ కార్డు రాసి పడేసింది . అంతే ……

– కె.వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో