శరీరం కూడా తోలు లెక్క ఊసిపోయి పడి ఉండు…కాళ్ళు, సేతులు తమామ్ కట్టెలాగయినాయ్.. మంది మస్తుగొచ్చిండ్రు…”అన్నది బాలమ్మ.
”తెలంగాన కోసం బలిదానం ఇస్తుండ్రు… చానామంది…గీ పోలీసోళ్ళు పిల్లలెంటనే పడ్డరు. పిల్లల్ని చానా చానా గోస పెడుతుండ్రు.” వెంకమ్మ అన్నది.
”ఆళ్ళు ఆకలికి చాలా కష్టపడుతుండ్రు.. మెస్సులు బందాయె.. కరెంటు బందాయె… నీళ్ళు బందాయె… ఇంట్లో నే చానా బాదయితంది. పిల్లల బాల్ లెక్క ఆడుతున్నరు….” అన్నది బాలమ్మ.
”పిల్లల రాళ్ళతోని, కట్టెలతోని కొడుతుండ్రూ… గ్యాసు వదులు తండ్రు.. ఒకమ్మాయికి కళ్ళు పోయినా యంట. చాలామందికి దెబ్బలు తగిలినాయంట. ఆడపిల్లల యాడబడితే ఆడ సేతులేసి తోస్తుండ్రు….” అన్నది వెంకమ్మ. ఇద్దరు మౌనంగా అయిపోయారు.
”మనసు బాదయితంది గానీ…మనం గరీబోళ్ళం…ఏం సేస్తమక్కా…. ఏమన్నా గా పిల్లల ఇద్దమన్నా ….నాకాడ ఏమున్నయ్…ఇగో…”చేతి సంచి చూపిస్తూ” ఒక దాంతో గంజినీళ్ళు, ఉప్పు గళ్ళ ఏసుకొని తెచ్చినా…కాసింత బువ్వ ఉంటే గింత సింతకాయ తొక్కేస్కొని తెచ్చినా… ఎవళ్ళకయినా… తిననీకి పెడ్తమాని…” అంది బాలమ్మ.
”ఈ పిల్లల తల్లిదండ్రులు మనసొంటే ళ్ళేనంట. సెట్టంత కొడుకుల గిట్లయితంటె… ఆళ్ళ గోస ఎట్లుంటదో….నేనూ గింత బువ్వ తెచ్చినా…”
”ఈయాల పొద్దు పొడిసందాకా ఈడనే ఉందం…ఎంకక్కా…”
”అట్టనే బాలమ్మా…ఏదయితే అదయితది…” అన్నది వెంకమ్మ.
లేడీసు హాస్టలు గుండా ఆర్ట్స్ కాలేజీకి వచ్చే దోవలో అక్కడక్కడా పోలీసు క్యాంపులు పెట్టుకుని వున్నారు. సరిహద్దులో యుద్ధం జరుగుతోందా అన్నట్టుగా ఉన్నది అక్కడి వాతావరణం. బాలమ్మ, వెంకమ్మా ఇద్దరూ ధైర్యంగా నడుచుకుంటూ ఆర్ట్స్ కాలేజీ మెయిన్ రోడ్డు దగ్గరకు వచ్చారు. ఎదురుకుండా ఇద్దరు పోలీసులు లాఠీలు ఊపుకుంటూ వస్తున్నారు.
”యాడ నుండి వస్తన్నారే….లం….లారా… ఎల్లిపొండి”అంటూ నల్లగా తుమ్మ మొద్దులాగా ఉన్న పోలీసాయన లాఠీని బాలమ్మ మీద ఝాళిపించాడు.
”మేమీడ పనిచేసోటోళ్ళం…..డూటీ చేయనీకి వచ్చినాం… ” అంది బాలమ్మ.
”డూా…. గీ….ఎల్లిపోండి…” అంటూ లాఠీతో కాళ్ళమీద కొట్టాడు . కాళ్ళమీద లాఠీదెబ్బ పడగానే ”అమ్మా” అని గ్టిగా అరిచింది బాలమ్మ.
”సంచిలో ఏమున్నాయ్…” మళ్ళీ ఆ పోలీసాయనే గద్దించి అడిగాడు.
”బువ్వ….” అన్నది వెంకమ్మ.
‘తీ…..తీ…. ఆడపెట్టండ్రి…”గదిమాడు.
బాలమ్మ, వెంకమ్మ సంచీల లోంచి బాక్సులు తీయబోయారు. ఇంతలోకి అక్కడకు వచ్చిన గుబురుమీసాల పోలీసాయన” ఆడ…దూరంగా పెట్టండి” లాఠీని దూరంగా చూపిస్తూ అన్నాడు…. ఆ సంచిలో బాంబులు ఉన్నాయెమో నన్నంత భయంతో…
కొంచెం వెనక్కి జరిగి సంచిలోంచి బాక్సుల్ని తీసి కింద పెట్టేరు . బాలమ్మ, వెంకమ్మ. లాఠీలతో కచ్చిగా, బలంగా కొడుతూ… ”ఏమున్నాయే…” అంటూ బూతులు తిట్టటం మొదలు ప్టోరు పోలీసులు. వాళ్ళు కొట్టే దెబ్బలకు బాక్సులు ఎగిరి మట్టిలో పడ్డాయి. మూతలు ఊడిపోయి బాక్సులు దూరంగా పడ్డాయి. అన్నం, గంజి అంతా నేలపాలయ్యింది. వాళ్ళు కొట్టే లాఠీ దెబ్బల కంటేకూడా బాక్సుల్ని విసరివేయటం బాలమ్మకు, వెంకమ్మకు ఎంతో బాధనిపించింది. నిశ్ఛేష్ఠులయి చూస్తుండి పోయారు.
”పొండి…పొండి… ”అంటూ లాఠీలతో కొడుతుంటే పరుగెత్తటం మొదలు పెట్టేరు ఇద్దరూ. కొంత దూరం దాకా వెంటబడి తరిమారు. పరుగెత్తి, పరుగెత్తి, కాలిబాట గుండా చెట్ల చాటుకెళ్ళి ఆగి పోయారు. రొప్పుతూ, ఆయాసపడుతూ….
”ఎంకక్కా…ఆళ్ళు ఏం సేసినా మనమయితే ఈడనే ఉందాం… ఏమాంవ్” అన్నది బాలమ్మ.
”అట్లాగే బాలమ్మ…ఈడనే ఉందాం… ఎంతగానం మనల్ని ఉరికిస్తరో… కొడ్తరో గదీ చూద్దాం…” అంది వెంకమ్మ.
”పిల్లల్ని అరిగోస పెడుతుండ్రు…. అందరం ఉంటెనే ఆళ్ళకు ధైన్యం వస్తది.” అన్నది బాలమ్మ.
”అట్టనే…ఉందాం….” అన్నది వెంకమ్మ.
చెట్ల మధ్యలో ఉండే కాలిబాటలో అక్కడక్కడా విద్యార్థులు కనపడుతున్నారు. పోలీసు క్యాంపుల ముందు పోలీసులు ఉన్నారు. చెట్లలో ఉండే రాళ్ళమీద బాలమ్మ, వెంకమ్మ ఇద్దరూ కూర్చుండి పోయారు.
ఇంతలో రెండు పెద్ద పెద్ద డేషియాలను మోసుకుంటూ నలుగురైదుగురు కాలిబాట గుండా ఆర్ట్స్ కాలేజ్ వైపుకు వెళ్తూ కనపడ్డారు. ముందుగా ఇద్దరు ఒక డేషియాను తీసుకుని కాలిబాట గుండా మెయిన్ రోడ్డు మీదకు వెళ్ళారు. వాళ్ళు మెయిన్ రోడ్డు మీదకు వచ్చీరాకముందే పోలీసులు చుట్టుముట్టి నోటి కొచ్చినట్లల్లా బూతులు తిడుతూ, వాళ్ళను కొట్టుకుంటూ రోడ్డుకు అవతలి వైపున ఉన్న పోలీసు వ్యాను ఎక్కించారు. ఆడేషియాలో ఉన్న పులిహోరను మొత్తం నేలపాలు చేశారు. దూరంగా చెట్లలో కూర్చొని చూస్తున్న బాలమ్మ, వెంకమ్మలకు వాళ్ళ మాటలయితే వినపడటం లేదు గానీ వాళ్ళను కొట్టటం, వ్యాను ఎక్కించటం కనపడుతూనే ఉంది. ఇద్దరూ మనసు చిక్కబట్టుకున్నారు. రెండవ డేషియా తీసుకు వస్తున్న వాళ్ళు దానిని పోలీసులకు అందనీయకుండా ఉంచటం కోసం కాలిబాటలో వదిలేశారు. వీళ్ళను కూడా తిడుతూ పోలీసులు వ్యాను ఎక్కించారు. చెట్ల సందులో కూర్చొని ఉన్న బాలమ్మ, వెంకమ్మ లిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఒకరి మనసులో మాట మరొకరికి అర్ధమయినట్టుగా ఇద్దరూ చెట్ల సందులోంచి కాలిబాటకు వచ్చి కూర్చునే డేషియాను రెండు వైపులా పట్టుకొని తోసుకుంటూ తోసుకుంటూ చెట్లలోకి తెచ్చారు. దాదాపుగా ఒక గంట సేపు ఆ చెట్లలోనే కూర్చుండి పోయారు. ఇంతలో కాలిబాట గుండా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు.
”హ్యుమన్ రైట్స్ కమీషన్ ఆర్ట్స్ కాలేజికి వస్తోందంట. ఈ పోలీసోళ్ళు ఇక ఎళ్ళిపోతరు…” అని మాట్లాడుకుంటున్నారు.
”పోలీసోళ్ళు ఎళ్ళిపోతుండ్రంట.. ఆళ్ళు సెప్పుకుంటుండ్రు” నెమ్మదిగా వెంకమ్మతో అన్నది బాలమ్మ. పోలీసులు వ్యానుల్లో ఎక్కి వెళ్ళిపోతున్నారు. బాలమ్మ, వెంకమ్మ ఇద్దరూ చెట్ల సందు నుండి బయటకు వచ్చారు. డేషియాను చెట్లలోంచి బయటకు లాగారు. డేషియా మూత తీశారు. డేషియాలో ఉప్మా వుంది.
”బాబూ… ఇటార’…ఒక్కపాళి ఇటార” అంటూ అటుగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను పిలిచారు బాలమ్మ, వెంకమ్మ.
”అక్కా…ఏమయిందక్కా…” ఒక విద్యార్థి అడిగాడు. డేషియాను చూపిస్తూ ‘ఈ దేకీసాలో …ఉప్మా ఉంది… ఎవళ్ళో తెచ్చి ఈడ పెట్టిండ్రు . పోలీసోళ్ళు ఆళ్ళను వ్యానులోకి ఎక్కించుకుండ్రు. మేమీ చెట్లకాడకు గుంజినాం.” అన్నారు బాలమ్మ, వెంకమ్మ.
”మీరు చాలా మంచి పని చేసిండ్రక్కా.. విద్యార్థులు చాలా మంది అన్నం తిని రెండు రోజులయితోంది. ఈ డేషియాను ఆర్ట్స్ కాలేజీ కాడికి తీస్కపోదాం….” అని పక్కనున్న ఇంకో విద్యార్థితో అన్నాడు. బాలమ్మ, వెంకమ్మ, వైపు తిరిగి ‘మీరూ..రాండ్రి..” అన్నారు వాళ్ళతో పాటుగా ఆర్ట్స్ కాలేజీ దగ్గరకు వెళ్ళారు బాలమ్మ, వెంకమ్మ, అక్కడంతా ఉడికీ ఉడకని అన్నాలు, పులిహోర, పేపర్లు, పేపరు ప్లేట్లు చిందర వందరగా పడి ఉన్నాయి. ”బాలమ్మా సెత్త తీద్దాం….నడు” అన్నది వెంకమ్మ. ”అట్టనే అంటూ బాలమ్మ, వెంకమ్మ ఇద్దరూ చెత్త తీసి శుభ్రం చేసే పనిలో పడిపోయారు. అన్నాన్ని చేతుల్తో ఎత్తిపారేస్తూ… వెంకమ్మ బాలమ్మతో ” ఆళ్ళ…. ఇంటిలో పీనుగెల్ల… గీ పోలీసోళ్ళు…గింతన్నాన్ని గిట్ల చేస్తరా…” ”అవ్… సూస్తనే బాదయితంది… అన్నది బాలమ్మ.
శుభ్రం చెయ్యటం అవగానే చేతులు కడుక్కున్నారు. చాలా మంది అన్నము, వాటర్ బాటిళ్ళు పేపరు ప్లేట్లూ తెస్తున్నారు. విద్యార్థులందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు. విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్న వెంకమ్మ, బాలమ్మ అంటున్నారు…
”పోరాడాలె….పోరాడి గెలవాలె…. పోరాడితేనే తెలంగాణ వస్తది కాల బెట్టుకోకిరి….”
(2010 జనవరిలో ఉస్మానియా యూనివర్సిటి లో జరిగిన సంఘటన ఆధారంగా…)
-కవిని
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~