పుట్టినప్పుడు నా లేత పిడికిళ్ళలో
పొదుపుకున్నది అక్షరాన్నే !
చిన్నప్పుడది …. పాల చెక్కిళ్లతో
బోసి నవ్వుల వాగ్దానంలా
ఒద్దికగా ముడుచుకొని ఉండేది
కొన్నాళ్ళకి …..కళ్ళు తెరిచిన పుస్తకంలా
ఒళ్లు విరుచుకున్న స్వేదంలా
నిటారుగా నిలబడింది
ఆకాశంలోకి సూటిగా ఎగిసిన పతంగమైంది
నిరంతరం ఓ వెదుకు దీపమైంది .
ఆపైన సాధికార స్వరంలా ఎగిసింది
స్వీయ అస్థిత్వ ప్రకటనంతో
స్వయం ప్రకాశ నక్షత్ర మైంది .
మానవత్వాన్ని నింపుకొన్న
అమ్మతనమైంది
ముమ్మాటికి వెన్నెముకలా
నిలబెట్టిన వజ్రా యుధమైంది
అప్పుడు ….ఇప్పుడు …ఎప్పుడూఆ అక్షరం పిడికిట్లోనే …పాపాయిలా నేను !
– సి.భవానీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to పిడికిలి (కవిత )- సి.భవానీదేవి