జారిపోయిన మూడుముళ్ళు – క్రిష్ణ వేణి

             సుప్రీమ్ కోర్టు, త్వరలోనే అతి ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోగల అవకాశం ఉంది. ఇది భారతదేశపు చరిత్రలో కీలకమైన నిర్ణయం అవగలదేమో కూడా.
ఒక మొహమ్మదీయ పురుషుడు మూడు సార్లు, వరసగా ‘తలాక్’ అన్న మాటని ఉచ్ఛరిస్తే అది తత్‌క్షణమైన, చట్టబద్ధమైన విడాకులు పొందడమే-ఇప్పటివరకూ.
కిందటి సంవత్సరం అక్టోబర్‌లో, షయిరా బానో కాశీపుర్ జిల్లా(ఉత్తరాఖాండ్)లో ఉన్న తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమెకే కాక ఇతర ముస్లిమ్ స్త్రీలకి కూడా ఎప్పుడూ వచ్చే పీడకల, ఆమె పట్ల నిజంగా మారింది. ఆమె భర్త రిజ్వాన్, అలహాబాదునుంచి ఆమెకి తలాక్ నామా పంపాడు. అతను పిల్లలిద్దరినీ తనతోనే ఉంచుకున్నాడు. అప్పుడామె మనోవర్తి కూడా పొందలేదు.
                      35 సంవత్సరాల షయిరా- ముస్లిం పర్సనల్‌ లా(షరియత్‌)లో ఆచరించబడే తలాకె-ఇ-బిదాత్ (instantaneous triple-talaq-ITT), నికా, హలాలాహ్*1, బహు భార్యత్వం చట్టవిరుద్ధమైనవనీ, రాజ్యాంగ విరుద్ధమైనవనీ, అవి ఆర్టికల్ 14, 15, 21 మరియు 25 యొక్క ఉల్లంఘన అనీ ప్రకటిస్తూ రిట్‌ లేక ఉత్తరవు జారీ చేయమని సుప్రీమ్ కోర్టుని అభ్యర్థించింది.
రిజ్వాన్ బలవంతపెట్టడం వల్ల, షయిరా ఏడుసార్లు అబార్షన్ చేయించుకుంది. పెళ్ళయిన క్రిత 15 సంవత్సరాలలోనూ, ఆమె చేదు తప్ప సంతోషాన్ని అనుభవించలేదు.
భారతదేశపు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాధమిక హక్కులని ఉదహరిస్తూ, వ్యక్తిగత ఆచరణని ప్రతిఘటించిన మొదటి కేసు షయరాది.
                      ఈమె పెటిషన్ తరువాత, సుప్రీమ్ కోర్టు కేంద్రప్రభుత్వపు స్పందన కోరింది. ఫెబ్రవరీ 28న, ప్రొవిజన్‌కి గల న్యాయబద్ధతని ప్రశ్నించిన వకీలు అమిత్ సింగ్ మరియు వకీలు బాలాజీ శ్రీనివాసన్ చెప్పినది విన్న తరువాత, జస్టీస్ అనిల్ ఆర్.దవె మరియు ఏ.కె గోయల్ యొక్క బెంచ్ నోటీస్ జారీ చేసింది.
           ముస్లిము స్త్రీల పట్ల చూపే లింగ వివక్షతని పరిశీలించవలిసిన అవసరం ఉందనీ పెళ్ళి మరియు వారసత్వం మతంలో భాగం కావనీ, చట్టం కాలానుగుణంగా మారాలనీ, ఈ కోర్టు ముందే నిర్ణయించింది.
స్త్రీలు పురుషులకి చెందిన చరాస్తిలాగా చూసే ఈ ఆచరణలు, మానవహక్కులు మరియు లింగ సమానత్వంలాంటి ఆధునిక మూలసూత్రాలకి కానీ, ఇస్లామిక్ ధర్మానికి కానీ అనుగుణంగా లేవు.
ఒకసారి భర్త “తలాక్” అన్న తరువాత, రెండోసారి ఆ మాట ఉచ్ఛరించడానికి స్త్రీకి మూడు ఋతుస్రావాలు(ఇద్దా) దాటాక కానీ వీలుపడదని, ఖురాను 65:1 ని ఉదహరిస్తూ ముస్లిమ్ స్కాలర్లు చెప్తారు. ఈ అవధిలో, భార్యాభర్తా మధ్యవర్తులద్వారా రాజీ పడే అవకాశం ఉంటుంది. భర్త మొదటిసారో, రెండోసారో ‘తలాక్’ అన్నప్పుడు అతనికి ఆ తలాకుని 3 నెలల్లో ఉపసంహరించుకునే హక్కుంటుంది. అప్పటివరకూ స్త్రీ ఇంటి సామానుల్లో ఒకటిగా, ఎక్కడో అక్కడ పడి ఉంటుంది.
                భార్య ఋతుమతి అయినప్పుడు తప్ప “నేను నీకు విడాకులిస్తున్నాను” అని అనడానికి భర్తకి ఎప్పుడైనా హక్కుంటుంది. ఒకే వరసలో మూడు సార్లు అన్నప్పుడు, ఆ స్త్రీ ఇంక వీధిన పడవలిసినదే. అది హాస్యానికి అన్నా, తాగి ఉన్నప్పుడు అన్నా, ఒక ఎస్ ఎమ్ ఎస్ ద్వారా చెప్పినా, ఫేస్బుక్లో రాసినా, గోడల మీద రాసినా, వాట్సప్లో పంపినా కూడా- ఆ మాటలకి తిరుగు లేదు. దీనిలో ప్రశ్నలకి కానీ హేతువుకి కానీ తావు లేదు. అన్ని అభ్యంతరాలూ పక్కకి నెట్టబడతాయి. దీనికి ప్రతివాదం ఏమిటి!

               13101291_10153662523623576_108996320_nపాకిస్తాన్‌తో సహా 28 ముస్లిమ్ దేశాలు ITT ని రద్దుచేసి, విడాకులన్నీ కోర్టు ద్వారానే పొందాలని చట్టాలు ఏర్పాటు చేశాయి. మరి భారతదేశం ఇంకా 7వ శతాబ్దంలోనే ఉంటూ, దేనికోసం ఎదురు చూస్తోంది!
ముస్లిం పర్సనల్‌ లా ఈ విషయంపైన ప్రతిఘటిస్తూ కోర్టుకి పెటిషన్ పెట్టింది.
ITT ని రద్దు చేయమని 92% ముస్లిమ్ మహిళలు కోరుతున్నారు. భారతీయ ముస్లిమ్ మహిళా ఆందోలన్ సర్వే(BMMA) 2015లో, పది రాష్ట్రాలలో ఉన్న 4,710 మంది ముస్లిమ్ స్త్రీలని సర్వే చేసింది. 78% స్త్రీలు ITT ప్రకారం విడాకులు పొందారు. 8% కి హలాలాహ్‌ని పాటించమని చెప్పబడింది. 82% కి తమ పేరిట ఏ ఆస్థీ లేదు. 78% స్త్రీలు తమ స్వంత ఆదాయమంటూ లేని గృహిణులు. 55% స్త్రీలు 18 ఏళ్ళ కన్నా తక్కువ వయస్సులోనే పెళ్ళి అయినవారు.

                      13090022_10153662523628576_2114177988_n ఇన్నేళ్ళూ, ఎవరూ అడ్డు పడకుండా ముస్లిం పర్సనల్ లా జాగ్రత్త పడుతున్నాకానీ సుప్రీం కోర్టు జోక్యం ఇప్పుడు అత్యంతవసరమైన,ఆహ్వానించతగ్గ సహాయంగా కనిపిస్తోంది.కాకపోతే, భార్య కనుక విడిపోవాలనుకుంటే ‘ఖుల్’ లేక ‘ఖులా’ అనే ప్రక్రియ ఉంది. అదీ భర్త తప్పు లేనప్పుడే. అది కూడా, తను విడిపోవడానికి అనుమతి కావాలని భర్తని అర్థించినప్పుడు మాత్రమే.
             పరిస్థితి ఎక్కువ గంభీరంగా మారుతున్న కారణం ముస్లిమ్ పెర్సనల్ లా క్రోడీకరించబడకపోవడం. ఇది 1937 నుంచీ మార్చబడలేదు. దాన్ని స్థానిక మతాధికారులు ఏ విధానంగానైనా ఇంటర్‌ప్రెట్ చేయవచ్చు. అందువల్లే ఈ డిజిటల్ యుగంలో తమ భార్యలకి విడాకులు ఇవ్వడం ఎక్కువ సులభం అయింది. ఈ విడాకుల సప్రమాణతని కొంతమంది మతాధికారులు అంగీకరించడం వల్ల, ముస్లిం మతనాయకులందరూ కలిపి దీని గురించి ఏకాభిప్రాయానికి రాకపోతే తప్ప, చిన్నచిన్న కారణాలకే ముస్లిమ్ స్త్రీలు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు.
         సమస్య, ఇండియాలో భారతీయుందరికీ అన్వయించే Uniform Civil Code లేకపోవడం కూడా.
పర్సనల్ లా లో సవరింపు కోసమని, ముస్లిమ్ స్త్రీల డిమాండు క్రిత కొద్ది సంవత్సరాల్లో బాగా ఊపందుకుంది. కానీ “ఇది ఒట్టి మాటు వేయడం మాత్రమే. ‘ITT’ అన్నది స్త్రీలని అణిచివేసి, వారిని పూర్తిగా నాశనం చేసే విధ్వంసకరమైన పరికరం. దీన్ని సవిరించడంలో అర్థం లేదు. ఇది పూర్తిగా రద్దు చేయాలి” అని స్త్రీ హక్కుల స్పెషలిస్ట్ అయిన ముంబయికి చెందిన ఫ్లావియా ఆగ్నెస్ వాదిస్తారు.
ITTని బహిష్కరించి, ఈ ఏకపక్ష విడాకుల వ్యవహారాన్ని delegitimize చేయవలిసిన అవసరం షయరా బానో కేసు వల్ల స్పష్టంగా కనిపిస్తోంది. స్త్రీల సమానతకి అడ్డం పడుతున్న ఈ చట్టాలన్నీ అంతం అయే సమయం వచ్చిందేమో అన్న ఆశ కూడా కలుగుతోంది.
సుప్రీమ్ కోర్టు ఈ కేసుని పరిశీలిస్తూ, ఒక నిర్ణయంవైపు కదులుతుండగా భారత దేశపు సమాజంలోనే వివిధ మూలాలనుండి వివాదం పుట్టుకు వచ్చే అవకాశం మాత్రం ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, నిరాశ చెందే వారు అనేకమంది ఉంటారు- అది సాంప్రదాయవాదులూ అవవచ్చు లేకపోతే సంస్కర్తలైనా అవవచ్చు.
———————–
*1- విడిపోయిన భార్యా భర్తా కానీ తిరిగి పెళ్ళి చేసుకోవాలనుకుంటే, హలాలాహ్‌ని పాటించాలి. హలాలాహ్-అంటే ఆమె వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని అతడికి విడాకులిస్తేగానీ తిరిగి పాత భర్తని వివాహం చేసుకునేందుకు అర్హురాలు కాదు. అంతకన్నా ముందు ఆమె ‘ఇద్దత్‌’ని పాటించాలి. అంటే విడాకులు పొందాక మూడు నెలలు పాటు మళ్ళీ వివాహం చేసుకోకూడదు. పండగలకీ, పబ్బాలకీ దూరంగా ఉండాలి. ఇలా రెండు సార్లూ ఇద్దత్ పాటించిన తరువాత, తిరిగి పాత భర్తని వివాహం చేసుకోగలదు.

– కృష్ణవేణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీతPermalink

37 Responses to జారిపోయిన మూడుముళ్ళు – క్రిష్ణ వేణి