ఆలోచనల్లో పడి ప్రసాదం పిలవడం వినలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి పిలిచేసరికి తలెత్తి చూశాడు. ప్రసాదం ఎప్పుడోచ్చాడో, బాల్కనీలోనిలబడి తన ఇంటికి రమ్మని సైగ చేశాడు. తన ఫ్లాటుకు తాళం వేసి, వాళ్ళ ఫ్లాటులోకి వెళ్ళాడు. ఆప్పటికే ప్రసాదం, వాళ్ళావిడా సోఫాలో కూర్చుని వున్నారు.
“నిద్ర పట్టడంలేదా సుబ్బూ?” అడిగాడు.
“లేదురా. నిద్ర రావడం లేదు. అలాఅని కూర్చుని ఏదైనా చదువుదామా అంటే, అదీ చెయ్యలేక పోతున్నాను. దేని మీద మనసు నిలపలేకపోతున్నాను. చుట్టూ ఉన్న మనుషులను ఇప్పుడు పరీక్షగా చూడడం మొదలుపెట్టాక, ఈ మానవ ప్రపంచం ఇంత మారిపోయిందేమా అని ఆశ్చర్యం, వేస్తున్నది. బతుకు పైనే విరక్తి పుడుతోంది. కానీ,బతకాలి తప్పదు. మనిషి చాలా పరాధీనుడు! జరిగినన్నాళ్ళు ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడి బతికేయడం అలవాటు చేసుకుంటాడు. ఆ మనిషి కనుచాటు కాగానే తల్లడిల్లి పోతాడు. రత్నం బతికి వున్నన్నాళ్ళు, నాకేంటని ధీమాగా బతికేశాను. ఇప్పుడు ఆమె పోయేసరికి చిన్న చిన్న సమస్యలకే తల్లకిందులు అయిపోతున్నాను. కొడుక్కి ,కోడలుకు మన చాకిరి కావాలి, మన సప్పోర్టు కావాలి. మన బాధలు,భయాలు,ఆలోచనలు వాళ్ళకు పట్టవు.ఇది స్వార్ధం అనాలో, అవసరం అనాలో! మనం ఏమనుకున్నా వాళ్ళ కోసం ఉండాల్సిందే. అదీ ఎంత వరకు? వాళ్ళ పిల్లలు పెరిగి పెద్ద అయ్యేంత వరకు!ఆ తర్వాత మన అవసరం తీరిపోతుంది. ఈ లోగా మన ఆరోగ్యాలు దెబ్బతింటే, మనం భారంగా కనిపిస్తాం. మనం బాగున్నన్నాళ్ళు గుడ్డిగా పిల్లలే జీవితం అనుకుని బతికేస్తాం. వాళ్ళు దానికే అలవాటు పడిపోతారు. ఇన్నాళ్ళూ నాకంటూ స్వంతంగా ఏదీ మిగుల్చు కోవాలనుకోలేదు. ఇవాళ ఏది నాది కాదనిపిస్తోంది.జీవితం అంటే ఇంతేనా అనిపిస్తోంది.” భారంగా నిట్టూర్చాడు.
ప్రసాదం లేచి అతని పక్కనే కూర్చున్నాడు. అతని భుజం మీద చెయ్యి వేసి. “సుబ్బూ, నువ్వున్న పరిస్థితిలో ఇలా ఆలోచించడం, బాధ పడడం సహజమే. మనిషికి, మనిషికి మధ్య సంబంధం డబ్బే అయ్యిందన్నదీ నిజమే, కాదనను. మనం మనంగా బతకాలి. ఎవరికోసమో మనమెందుకు బతకాలి? ఈ జీవితం మనది. దీన్ని ఎవరూ శాసించ లేరు, చివరకు మన పిల్లలైనా సరే! అనవసరమైన ఆలోచనలతో ఆరోగ్యం పాడుచేసుకోవడం మంచిది కాదు. వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించి మనసు పాడు చేసుకుంటావు? ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నీకు ఎప్పుడు దిగులుగా వున్నా, లేక తోచకపోయినా, ఇక్కడికి వచ్చెయ్యి.”
“సరే, కాసేపు చెస్ ఆడుకుందాం!” అని చెస్ బోర్డు కోసం లేవబోయాడు.
“ఇప్పుడా, ఇంత పొద్దుపోయాక !వద్దు, మిమ్మల్ని కూడా నా సోదితో నిద్రపోనీయకుండా కుర్చోబెట్టాను. నేను వెడతాను.మీరు పడుకోండి.అన్నట్లు, రేపు నేను మా బావ గారిని చూడడానికి వెడుతున్నాను” అంటూ లేచాడు.
“నేను కూడా రానా?” అడిగాడు ప్రసాదం.
“అక్కర్లేదులే! మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. ఆయనకు ఈ మధ్య బాగాలేదని విన్నాను. చూసి చాలా రోజులైంది, ఒకసారి చూసి వద్దామని, అంతే! అక్కడ నాకు ఏం తోస్తుంది?”
“రాగానే ఇటు వచ్చేసెయ్యి. భోజనం చేశాక మీ ఇంటికి వెడుదువు గాని” వెడుతున్న సుబ్రహ్మణ్యంతో చెప్పాడు.
“వంటరితనం మనిషిని క్రుంగదీస్తుంది బావా!” సరస్వతి సుబ్రహ్మణ్యం పై జాలి పడింది.
తలవూపుతూ ప్రసాదం భార్య వైపు ఆరాధనగా చూశాడు.
సరస్వతే లేకపోయినట్లయితే తను ఏమైపోయి ఉండేవాడో? ఆమె ఇంట్లో అడుగు పెట్టాక తన జీవితంలో కోల్పోయినదేదో తిరిగి పొందిన అనుభూతీ, ప్రశాంతత అనుభవించాడు. తమందరి కోసం ఆమె చేసిన త్యాగం నిజంగా మరిచిపోలేనిది. తన కోసం, అక్క పిల్లల కోసం, తనకసలు పిల్లలు లేకపోయినా పరవాలేదని చెప్పి, ఆ మాట మీదే నిలబడింది. తీరా పిల్లలు ఆమె మంచితనాన్ని అర్ధం చేసుకోలేక దురుసుగా ప్రవర్తించినా, వాళ్ళు చిన్న వాళ్ళు, అర్ధం చేసుకునే వయసు కాదంటూ తేలికగానే తీసుకుంది తప్ప, ఏ నాడూ కోపగించుకోలేదు.
కళ్ళు మూసుకుని పడుకున్న ప్రసాదం మనసు గత జీవితంలోకి జారిపోయింది.
-టి.వి.యస్.రామానుజ రావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~