నా జీవనయానంలో (ఆత్మకథ )- జీవితం… – కె. వరలక్ష్మి

       నా పెళ్ళిచీరలు, అంతకుముందటి లంగావోణీలు అన్నీ చిరుగులు పట్టేసాయ్. ఆ చిరుగులు కనబడకుండా సూదీ దారంతో కుట్టేసి కట్టుకునేదాన్ని. నాకదేమీ సిగ్గుపడాల్సిన విషయంగా అన్పించేది కాదు. కానీ, పెళ్ళికి మంచిచీర కట్టుకుని వెళ్లాలి కదా! మా అత్తగారు పెళ్లిలో పెట్టిన చీర ఒకటే బాగుంది. తీరా బయలుదేరేవేళకి మా అత్తగారు ఆ చీరని తీసుకుని కట్టేసుకున్నారు. నేనేదో సాదాచీర కట్టుకుని వెళ్లాను. నాళం వారి సత్రంలో పెళ్ళి. నన్ను చూసి పెళ్ళికూతురు జాలిగా ముఖం పెట్టి ‘అయ్యో, పాపం వదినకి ఒక మంచిచీరైనా లేదే’ అంది. నన్ను చూసి ఎవరైనా జాలిపడితే నాకది చాలా అవమానంగా అనిపించేది. ఆ మాటకి నేను చాలా చిన్నబుచ్చుకున్నాను. అయినా, లేచి హుషారు తెచ్చుకుని పెళ్ళిలో గలగలా తిరిగేసేను. భోజనాల దగ్గర మా అత్తగారి ఒంటిమీద నా చీరను చూసి నాకు నిజంగా ఏడుపొచ్చేసింది.ఆవిడ వంటల దగ్గర కల్పించుకుని చీరమీదంతా సాంబారు, కూరలగ్రేవీలు పోసేసుకున్నారు. ఇంటికొచ్చి ఒకరోజంతా నీళ్లల్లో నానబెట్టి ఒదిలేసారు. అసలే లేత బూడిదరంగు – అంచుకున్న ఆకు పచ్చరంగు ఊరిపోయి చీర కట్టుకోవడానికి పనికిరాకుండా అయిపోయింది.

         సాధారణంగా ఏచిన్న పండగొచ్చినా ఆ వంకతో మా వాళ్ళు నన్ను పుట్టింటికి పిల్చుకెళ్ళి పోయేవారు. ఆ సంవత్సరం మా నాన్నమ్మ పోవడంవల్ల వాళ్లకి పండుగలు లేవు. ఉగాదికి పూజ ఎలాగూ చేసుకోం. ఉగాది పచ్చడంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న కలిపిన ఉగాదిపచ్చడిని ఆ రోజు అన్నం మానేసి మరీ తినేదాన్ని. ‘మనం ఉగాదిపచ్చడి చేసుకుందామాండీ?’ అని మా అత్తగార్ని అడిగాను. ‘సరేలే’ అన్నారు. కాస్సేపయ్యాక ‘చేసేను తిను’ అన్నారు. నేను ఆత్రంగా గిన్నెలన్నీ వెతుకుతూంటే ‘అదేం ఆ పక్కన ప్లేటులో, ఇంట్లో ఎవరూ తినరు. నీకొక్కదానికే చేసేను’ అన్నారు. చూస్తే చిన్నపచ్చడి ప్లేటులో పల్చటి చింతపండునీళ్ళు, నాలుగు వేపిన శనగపప్పు బద్దలు, దానిపైన చిటికెడు పంచదార, చిటికెడు వేపపువ్వు, అంతా కలిపి ఒక చెంచాడు కూడా లేదు. నోట్లో వేసుకుంటే గొంతుదిగని ఘోరమైన రుచి. నన్నుచూడాలని మా అమ్మ వచ్చి వెళ్ళగానే ఆవిడ మాటల్ని, నడకని, చీర కట్టుకున్న విధానాన్ని చులకనగా మాట్లాడేవారు మా అత్తగారు. మా అత్తగారు ఉబ్బసంతో బాధపడుతూండేవారు. కాస్త మబ్బేసినా, వాతావరణం చల్లబడినా రాత్రీ, పగలూ పడుకోలేక, కూర్చోలేక, ఆయాసం. దగ్గుతో విలవిలలాడిపోయేవారు. అలాంటప్పుడు నాకూ, రాణీకి నిద్ర ఉండేది కాదు. ఉప్పు వేయించి, దళసరి గుడ్డలో పోసి కాపడం పెట్టేవాళ్ళం. అర్ధరాత్రి పుల్లలైపోతే పరిసరాల్లోని కంచెలు, చెత్తచెదారం ఏరి తెచ్చి మంటపెట్టేవాళ్లం. మా మావగారు రాత్రి పన్నెండు గంటలకి గుప్పెడు పిత్తన పరిగెలో కాస్త మాంసమో తెచ్చేవారు. అప్పటికప్పుడు దాన్ని వండి ఆయనకి భోజనం పెట్టాల్సివచ్చేది. కోనేరుపేట ఊరంతా నిద్రపోతున్నవేళ మేం మాత్రం నిశాచరుల్లా తిరుగుతుండేవాళ్లం. రాత్రుళ్ళు పొయ్యికిందికి లేక ఇబ్బంది పడలేక పగలు తీరికవేళల్లో వెళ్ళి జీడిమామిడి తోటల్లో పుల్లలు చితుకులు ఎరుకుచ్చే వాళ్ళం.

        మోహన్ తనకన్నా రెండేళ్ళు జూనియర్లతో Bsc చదివేడట. గాంధీపురంలో ఉన్న రమణమూర్తితో కలిసి వాళ్ళింటిదగ్గర చదువుకుంటున్నాడట. వాళ్ళ నాన్నగారు మంచి ప్రాక్టీసు ఉన్న లాయరట. ఆయన క్లయింట్ల వల్ల వీళ్ళ చదువుకు ఆటంకం కలుగుతూ ఉండేదంట. కోనేరుపేటలో చదువుకోవాలని నిర్ణయించుకుని బుక్స్ తీసుకుని వచ్చేశారు. మొదటిసారి అతన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతను నాకన్నా చిన్నవాడిలా ఉన్నాడు. తనసొంతసైకిలు మీద వచ్చేవాడు. భోజనానికి మాత్రం వాళ్ళింటికెళ్ళి వస్తుండేవాడు. అతనితో స్నేహంవల్ల మోహన్ లో కొంచెం మార్పు వచ్చినట్లనిపించింది. ఒకసారి రమణమూర్తి మమ్మల్నిద్దరినీ వాళ్ళింటికి పిల్చుకెళ్ళాడు. అతనికి తల్లి లేదు. ఒక అక్క ఉంది. ఆమెకప్పటికి ఇంకా పెళ్ళికాలేదు. ఇల్లంతా ఆవిడే చక్కబెట్టుకుంటుందట. ఒక వంటమనిషి, పనిమనిషి సాయంతో. నేను మొదటిసారి మంచినేతితో చుట్టిన పూతరేకులు వాళ్ళింట్లోనే తిన్నాను. ఆవిడ నన్ను ఆప్యాయంగా పలకరించేవారు. వాళ్ళ పెరట్లో ఉన్న పసుపు సంపెంగ చెట్టు చుట్టూ నేను ప్రదక్షిణాలు చెయ్యడం చూసి పూలు కోయించి ఇచ్చింది. ఆ పూలు పూసినంత కాలం రమణ మూర్తి రోజూ దోసెడు సంపెంగపూలు తెచ్చేవాడు. కోనేరుపేట సెంటర్లో కొత్తగా సైకిలుషాపు పెట్టేరు. మా అత్తగారిని కాకాపట్టి అద్దెసైకిలు మీద నన్ను ముందు కూర్చోబెట్టుకుని మోహన్, తన సైకిలు మీద రమణమూర్తి అప్పుడప్పుడు సెకండ్ షో సినిమాలకు వెళ్ళేవాళ్ళం.

        మొత్తానికి ఆ సంవత్సరం మోహన్ పరీక్ష గట్టెక్కాడు. రమణమూర్తి AMIE చదవడానికి మద్రాసు వెళ్ళిపోయాడు. మోహన్ కి ట్రెయినింగ్ కాలేజీలో BED సీటు వచ్చింది.

        ఉన్నట్టుండి మా అత్తగారు ‘నాకొడుకు ఇంజనీరు అవుతాడనుకున్నాను. నీధ్యాసలో పడి BSc నే అన్నిసార్లు రాసేడు. ఇంక ఈ BED ఎప్పుడు గట్టెక్కుతాడో’ అన్నారు.

             అంతలో మా నాన్నమ్మ సంవత్సరీకానికి నేను జగ్గంపేట వెళ్లాల్సి వచ్చింది. దానికి కడపలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న మా రెండోమేనమామ వచ్చేడు. నాకొక ఐడియా వచ్చింది. ‘మావయ్యా, మీ ఊళ్ళో కాలేజ్ ఉందా?’ అని అడిగేను. ‘ఆ.. ఉంది. కడపంటే ఏవన్నా చిన్న ఊరనుకున్నావా ఏంటి?’ అన్నాడు. ‘నాన్నా, నేను మావయ్యతో వెళ్ళి పి.యు.సి. అక్కడ చదువుకోనా, ఆసరికి మోహన్ బి.ఇ.డి కూడా అయిపోతుంది’ అన్నాను. ‘మావయ్య, తీసుకెళ్తానంటే, అలాగే ఎళ్ళమ్మా, అన్నారు. మా నాన్న. ‘దానికేం భాగ్యం, ఒక ఏడాది చదివించలేనా?’ అన్నాడు మావయ్య. ‘అయ్యో పెళ్ళైన పిల్లని అత్తింటివారికి చెప్పకుండా’ అంటూ గోల పెట్టేసింది మా అమ్మ.

మర్నాడే ప్రయాణం-
ఆ రోజు మా నాన్న చేత ప్రామిసరీనోటు మీద సంతకాలు పెట్టించుకుని మూడువేలు, ఏదైనా వ్యాపారం పెట్టుకోడానికి అప్పుగా ఇచ్చేడు మా మేనమామ. మా అమ్మమ్మగారి కుటుంబాన్ని మా నాన్న ఎలాంటి అవసరాలకైనా ఎలా ఆదుకున్నారో, పెళ్ళిళ్ళు- పేరంటాలు ఎలా దగ్గిరుండి జరిపించారో, మా అమ్మ వాళ్లకెంతంత పెట్టేదో గుర్తుకొచ్చింది నాకు. నా తిండికీ, చదువుకీ కూడా బహుశా మా నాన్న డబ్బులు కట్టాల్సి రావచ్చు. అందుకే మా మావయ్యతో విడిగా చెప్పేను. ఓ పదిమంది పిల్లల్ని ట్యూషన్ కి కుదిర్చిపెడితే నాకు సాయంచేసినట్టవుతుందని.

          మర్నాడు మా నాన్న, మావయ్య, వెంట నేను రాజమండ్రి జాంపేటలో ఓ పెంకుటింట్లో ఉన్న మావయ్య మరదలు ఇంటికి వెళ్లాం. వాళ్ళిద్దరూ పనిమీద బైటికెళ్లగానే ఆవిడ నా పని పట్టింది. ‘హవ్వ.. హవ్వ.. అని నోరు నొక్కుకుని, ‘’కాపరానికి నీళ్ళొదిలేసుకుని మేనమావ ఎంట ఎలిపోతన్నావా..’ అంటూ తన లెక్చర్ తో నన్ను హడలగొట్టేసింది. ట్రెయిన్ ఎక్కడం, కొత్త ఊరు, కొత్త చదువు అనుకుంటూ ఎంతో హుషారుగా బయలుదేరిన నాకు ఒక్కసారిగా హుషారంతా మాయమైపోయి దిగులు, భయం పట్టుకున్నాయి. ‘ఏమైతే అవనీలే’ అని ధైర్యం తెచ్చుకున్నాను. స్టేషన్లో రైలు ఎక్కించి మా నాన్న వెనక్కెళ్ళిపోయేరు. నాకప్పటికి రైలుబళ్ళ పేర్లు కూడా తెలీవు. చిన్నప్పుడు సామర్లకోట నుంచి అన్నవరం ప్రయాణం తర్వాత మళ్లీ ఇదే రైలెక్కడం. ఎన్ని గంటలకి ఎక్కేమో ఇప్పుడు గుర్తుకు రావడం లేదు కానీ, జనరల్ కంపార్టుమెంటులో కూర్చుని ప్రయాణం చేసి నెల్లూరులో అర్ధరాత్రి కాబోలు దిగేం. స్టేషను నుంచి బస్టాండుకి నడిచి వెళ్ళి బస్సెక్కేం. ఉదయం కడప లోని అఘాడీలో అద్దెకుంటున్న మావయ్య వాళ్లింటికి చేరుకున్నాం. నన్ను చూసిన అత్తమ్మ ముఖంలోని ఆశ్చర్యం నాకిప్పటికీ గుర్తుంది. ముందుకు కాస్త పెద్ద గది, దాని వెనుక సన్నని సందులాంటి గది. ముందు గది నుంచే లోపలికి దారి. వెనుక గదికి జైలుగదిలాగ పైనెక్కడో చిన్న వెంటిలేటరు. ఇంటికెదురుగా వాకిట్లో ఒక మనిషి మాత్రం పట్టేటంత వంటగది. చిన్న కర్రలపొయ్యి మీద వంట. మావయ్య డ్యూటీకెళ్ళిపోయాక అత్తమ్మ ప్రశ్నల పరంపరలో మునిగిపోయి, అలాగే నేలమీద వాలిపోయి నిద్రలోకి జారుకున్నాను.

               ప్రయాణ బడలిక వల్ల మొదటిరోజు గమనించలేదు కానీ, అత్తమ్మ వంట అతిపొదుపుగా చేస్తోంది. చిట్టిగ్లాసుడు బియ్యంరవ్వతో ఉప్మా చేసి తనకీ, మావయ్యకీ రెండేసి టేబుల్ స్పూన్లు నాకూ, వాళ్ల పిల్లలకీ ఒక్కొక్క స్పూను వడ్డించింది వాళ్లకి ఇద్దరు పిల్లలు. పిల్లవాడు రెండో తరగతి, అమ్మాయి ఒకటో తరగతి చదువుతున్నారు. వాళ్లకేమీ చిరుతిళ్ళు ఉండేవి కావు. ఒక చిన్నగ్లాసుడు బియ్యాన్ని చిట్టి తపేళాతో అన్నం వండి, ఒక కూరో, పులుసో కొద్దిగా చేసి, తనకీ, మావయ్యకీ కొంచెం పెద్ద కెరళ్ళు, నాకు పిల్లలకీ ఇడ్లీ అంతేసి కెరళ్ళు వడ్డించి గిన్నె ఖాళీ చేసేది. మళ్లీ కావాలనుకుంటే ఇక ఉండేది కాదు. పిల్లవాడు ఆకలికి ఆగలేక నా కంచంలోని అన్నాన్ని తీసేసుకునేవాడు. అత్తమ్మ చూడనట్టే ఊరుకునేది. పైగా, ‘తిండి ఎక్కువ తినే పిల్లలు తొందరగా వయసును మించి ఎదిగిపోతారు. అందుకే తక్కువ పెడతాను’ అనేది. మావయ్య చూస్తే రోజూ జేబులనిండా బోలెడన్ని డబ్బులు తెచ్చేవాడు. ఆర్థికంగా ఎదగాలనే కోరిక తెచ్చే కాపీనం అదని నాకప్పటికి అర్థం కాని వయసు. ఆకలికి ఆగలేకపోయేదాన్ని. నేను అందరికీ సక్కుబాయిలాగా కన్పించేదాన్ని కాబోలు. వచ్చిన మర్నాటినుంచే వీళ్ళు కూడా నన్ను పనిమనిషిని చేసేశారు.

                   చీకట్లింకా వీడకముందే మావయ్య లేచి నా చేతికి రెండు బిందెలిచ్చి ఆయన ఒక బకెట్ పట్టుకుని వీధి చివరి హేండ్ పంపు దగ్గరకి తీసుకెళ్ళేవాడు. ఆయన నీళ్ళు కొట్టడం, నేను మోసుకొచ్చి అన్నిచోట్లా కుండీల్లో నింపడం, అదయ్యాక అంట్లు తోమడం, ఇల్లు తుడవడం, వగైరా. నేను మావయ్యకి గుర్తు చేసేను. ట్యూషన్స్ గురించి. ‘ముందు మా పిల్లలకి చెప్పు. అప్పుడు చూద్దాంలే’ అన్నాడు. సాయంకాలాలు వాళ్లకి చదువు చెప్పడం మొదలుపెట్టేను. అలా జీతం బత్తెం లేని, కడుపునిండా తిండి పెట్టక్కర్లేని పనిమనిషినైపోయాను. అసలు వీళ్ళు నన్ను చదివిస్తారా అని డౌటు పట్టుకుంది నాకు. దానికి తోడు అత్తమ్మ సూటీ పోటీ మాటలు. కంట్లో నలుసు పడి కన్ను నలుపుకున్నా ‘యాక్షను బాగానే సేసేస్తున్నావే’ అనేది. అన్నిటికీ కసురుకోవడం, విసుక్కోవడం, కూర్చుంటే గది బైట ఉన్న మెట్టు మీద కూర్చోవాలి. బైట నడిచే జనం కూడా కనబడకుండా గేటుకి చెక్కతో చేసిన పార్టిషన్ లాంటిది ఉండేది. అది ముస్లిమ్స్ ఇల్లు కావడం వల్ల అలా ఉండేదట. ఇక డాబాపైకెక్కి పరిసరాల్ని పరికించే అవకాశం లేకుండా మనిషికన్నా ఎత్తైన పిట్టగోడలు వాటికి అక్కడక్కడ అరచెయ్యంతేసి రంధ్రాలు.

            ఇల్లు గలామెకి ముగ్గురు కొడుకులు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భర్తపోతే ఆమె నిలబడి పెంచుకొచ్చిందట. మధ్యవయసులో ఉన్నా అందంగా ఉండేది. తెల్లని ఒంటిచాయ. పిల్లలు ముగ్గుర్నీ హైస్కూలు చదువులు మధ్యలో ఆపేసి పనుల్లో పెట్టేసిందట. పెద్దకొడుకు థానూఖాన్ ది నా వయసు. లేదా మరో రెండేళ్ళు పెద్దో ఉండచ్చు. అచ్చం తల్లిలా పెద్దపెద్ద కళ్లతో, కుతూహలం నిండిన చూపుల్తో ఉండేవాడు. నేను చూస్తే తడబడేవాడు కానీ, చూడనప్పుడు తదేకంగా నా వైపు చూసేవాడట. పిల్లలు చెప్పేవాళ్ళు. ఇల్లు గలామెకి కూతుళ్ళు లేకో ఏమో ‘బేటీ బేటీ’ అంటూ నన్ను ఇష్టంగా చూసేది. చీకట్నే లేచి ఆపాలు పోసి వీధులో తిరిగి అమ్ముకునేవాళ్లకు వేసేది. మా అత్తమ్మ చూడకుండా పంచదార చల్లిన ఆపాలు నాకు ఇస్తూ ఉండేది. థానూఖాన్ కాఫీ పొడి మిల్లులో పనిచేసేవాడట. సాయంకాలం ఇంటికొస్తూ మావయ్య పిల్లలకి రోజూ స్వీట్లు తెచ్చి ఇచ్చేవాడు. నేను వెళ్ళేక నాకు కూడా తెచ్చేవాడు. ఇవ్వడానికి సంశయించి వాళ్లమ్మ కిస్తే, ఆవిడ నాకు ఇచ్చేవారు. ఆవిడకు తెలుగులో మాట్లాడ్డం అసలు వచ్చేది కాదు. నేను నా హైస్కూలు పరిజ్ఞానంతో హిందీలో మాట్లాడేదాన్ని.

                   నేను వెళ్ళిన వారం రోజులకి రంజాన్ నెల ప్రారంభమైంది. థానూఖాన్ తెల్లవారుఝామునే లేచి మసీదుకి వెళ్తూ పిల్లవాడు శంకర్ ని తీసుకెళ్ళేవాడు. వచ్చేటప్పుడు పటికబెల్లం, బాదం పప్పులు తెచ్చేవాళ్ళు. పనులన్నీ ముగిసేక ఇల్లుగలామె వాకిట్లో బల్ల వేసుకుని చేతితో సేమ్యాలు తయారుచేస్తూ ఉండేది. అలాంటి పద్ధతి ఒకటుంటుందని నేనదే మొదటిసారి చూడటం. సాయానికి ఆవిడ చెల్లెళ్ళు వచ్చేవారు. ఆఖరి చెల్లెలు మొదటిసారిగా గర్భవతిగా ఉందట. ఆ పాలబుగ్గలు, కళ్ళు, జుట్టు ఆ సౌందర్యం చూసి తీరవలసిందే. నేనైతే చూపు తిప్పుకోలేకపోయేదాన్ని. మా అత్తమ్మ ఎందుకో వాళ్ళని దూరంగా ఉంచేది. వాళ్ళేమివ్వబోయినా తీసుకునేది కాదు. రంజాన్ రోజు వాళ్ళిచ్చిన పలావ్, కూరలు వెనక్కిచ్చేసింది. ‘ఛీ , వాళ్ళు చేసినవి మనం తినకూడదు’ అంది. నాకైతే ఒక్కసారి వాళ్ళింట్లోకెళ్ళి తినేసి రావాలని చాలా అన్పించింది. అత్తమ్మ కాపలా కూర్చుంది. ఒకరోజు మావయ్య నీళ్ళు కొడుతూ ‘ఏమే, పెద్దయ్యాక నువ్వింత అందంగా తయారవుతావని తెలిస్తే నేను ఇంకొన్నేళ్ళు ఆగి నిన్నే చేసుకునే వాడినే’ అన్నాడు. వేళాకోళం కాబోలులే అని నేను పట్టించుకోలేదు. కుండీలో నీళ్ళు వంపి బిందె కింద పెట్టిన నన్ను ఆ తెల్లవారుఝామునచీకట్లో వెనకనుంచి వాటేసుకున్నాడు.

– కె. వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో