నా కళ్లతో అమెరికా-52 (యాత్రా సాహిత్యం ) – కె .గీత

                                                                    డాడ్జిరిడ్జ్ (భాగం-2)

మర్నాడు ఉదయం తొమ్మిదిగంటల కల్లా వరుని స్కీయింగు క్లాసుకి తీసుకెళ్లాలి. నిజానికి సత్యకు, వరుకు పది గంటలకే క్లాసు. కానీ చిన్న పిల్లల్ని గంట ముందే తీసుకు వెళ్లి క్లాసు వాళ్లకి అప్పగించాలి. మేమున్న హోటలు నించి 5 మైళ్లలో ఉన్న స్కీ రిసార్టుకి ఘాటు రోడ్డులో ఎంత మెల్లగా వెళ్లినా మహా అయితే అరగంట చాలు. కానీ అందరం రెడీ అయ్యి హోటలు లో బ్రేక్ ఫాస్టు చేసి తొమ్మిది గంటల కల్లా రిసార్టుకి చేరుకోవాలంటే కనీసం ఆరు గంటలకి లేవాలి. ఎప్పుడూ అందర్నీ అనుకున్న టైముకి రెడీ చేయడం, వెంట పడడం నా బాధ్యత.

మా హోటలు గదిలో ఏసీ పెద్ద శబ్దం చేస్తూ రాత్రంతా మమ్మల్ని బాగా ఏడిపించింది. తెల్లారి లేవడం అందరికీ కష్టమైపోయింది. పిల్లల్ని ఎంత లేపినా లేవరే! బద్ధకం వదులుతుందని వెల్తురు కోసం కర్టెన్లు మొత్తం తెరిచాను. బయటి దృశ్యం చూసి మహదానంగా ఒక్క కేక పెట్టాను. కిటికీ బయట రాత్రంతా నల్లని రంగు పూసుకున్న అడవంతా శ్వేత వర్ణంతో మిలమిలా మెరిసిపోతూంది. ఆకాశం లోంచి తెల్లని దూది చుక్కల వాన కురుస్తున్నట్లు మంచు కురుస్తూంది. కిటికీని ఆనుకుని ఉన్న రూఫ్ మీద దాదాపు అడుగున్నర మందాన మంచు నిండిపోయి ఉంది.

నా కేకలు విని పిల్లలు ఒక్క ఉదుటున లేచి కిటికీ దగ్గిరికి వచ్చారు. నేను అందిన కోటు వేసుకుని, బూట్లు తొడుక్కుని “మంచు కురవడం ఆగిపోతుందేమో..నేనొక్క సారి బయటికెళ్లి తడిసి వస్తాను” అని పరుగుతీయబోయాను.

నా ఆనందానికి కారణం లేకపోలేదు. అంతలా మంచు కురవడం చూస్తున్న మొదటి క్షణమది. నాతో బాటూ పిల్లలూ తయారయ్యేరు. వీళ్లందర్నీ తీసుకుని పొద్దున్నే బయటికి వెళ్తే తయారు చేసేదెవరు? అసలే అనుకున్న సమయానికి వరుని క్లాసుకి అప్పగించాలి. సమయం మించిపోతుంది. “బయట ఇవేళంతా మంచు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్టులో ఉంది” అన్న సత్య మాటలు చెవినెక్కించుకుని ఆగిపోయాను. గబగబా పిల్లల్ని అనుకున్న దానికంటే అరగంటే ముందే తయారు చేసి బ్రేక్ ఫాస్టు కోసం కిందికి తీసుకు వచ్చేసేను. మా హోటలు పైన గదులు, కింద రెస్టారెంటు. కిందికి అడుగు పెట్టి అద్దాల్లోంచి పార్కు చేసి ఉన్న మా కారుని చూడగానే మా తల గిర్రున తిరిగింది. కారు కనిపించకుండా అడుగున్నర, రెండడుగుల మందాన మంచు పేరుకుపోయి ఉంది. అక్కడ కార్లు ఉన్నాయనడానికి సాక్ష్యంగా కార్ల మధ్య కాస్త ఖాళీ స్థలానికి, కార్లకి ఎత్తులో భేదం మాత్రం కనిపిస్తూ ఉంది.

సత్య ముఖం లో గాభరా కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది. కారు సరి కొత్తది కాబట్టి స్టార్టు కాదేమోనన్న దిగులులేదు. మరి దేనికి భయపడ్తున్నట్టు? అదే అడిగేను. మెల్లగా గొంతులోంచి భారంగా అన్నాడు. “కారుకి చెయిన్లు లేకుండా ఈ మంచులో ఎలా?” అని.

IMG_0061

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

నాకు నవ్వు వచ్చింది. ఇంటి దగ్గర ఆ సంభాషణ వచ్చినపుడు తేలిగ్గా కొట్టిపరేసి, ఇప్పుడు గాభరా పడితే వచ్చిన లాభం ఏవిటి? కానీ ఇలాంటి కష్ట సమయాల్లో గాభరా పడ్తూ కూచోడం కాదు, తెలివితేటలు ఉపయోగించాలన్నది నా సిద్ధాంతం.

“డోంట్ వర్రీ” నేను రెస్టారెంటు వాళ్లనడుగుతా అమ్ముతారేమో” అన్నాను. అన్నానే గానీ సమాధానం నాకూ తెలుసు. వాళ్లు అమ్మరనీ, దగ్గర్లో అలాంటి స్టోరేమీ లేదని.

అయినా సత్య గాభరా తగ్గించడం కోసం “అడిగొచ్చాను. ఇక్క డికి మైలున్నర అవతల డాడ్జిరిడ్జ్ వెళ్లే దారిలో స్టోరు ఉందట.” అక్కడాగి కొందాములే. అన్నాను.

రెస్టారెంటులో కూచున్నంత సేపూ కారు విషయం వదిలేసి హాయిగా బయటి మంచు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ నేను, కారు గురించే ఆలోచిస్తూ అన్యమనస్కంగా సత్య గడిపేం. పిల్లల ఆనందం చెప్పనక్కర లేదు. ‘ఎప్పుడెప్పుడు మంచులోకి పారిపోదామా’ అని రెడీగా ఉన్నారు.

మాకొచ్చిన ఇంకో చిక్కేవిటంటే మేం స్కీ రిసార్టుకి వేసుకుని వెళ్లడానికి కావలసిన కోట్లు, బూట్ల తో సహా అన్నీ కారు డిక్కీ లో ఉండిపోయాయి. రాత్రి మేం వచ్చే వేళకి ఇలా మంచు కురిసి అన్నీ మునిగిపోతాయని ఏ మాత్రం ఊహించలేదు మేం. మేం ఎక్కడ హోటళ్లలో దిగినా కావలసిన సామాన్లు మాత్రమే రూములోకి పట్టుకెళ్తాం. మిగిలినవన్నీ ఎప్పుడూ కారు డిక్కీలోనే వొదిలేస్తాం. ఇదొక గుణపాఠమైందిప్పుడు.

ఇక బ్రేక్ ఫాస్టు ఎంత త్వరగా తెమిలిస్తే అంత మంచిదని నేను ఆలోచిస్తూంట, వరు పేన్ కేకులు, సత్య ఆమ్ లెట్ అంటూ ఏవేవో ఆర్డరు చేసేరు. ఎంతకీ తెమల్చరే టిఫిను సెక్షను.

కారుదాకా వెళ్లొస్తానని నేను బయటికి వచ్చేను. డిక్కీలోంచి సామాన్లు నేను తీస్తానని తాళాల్ని నాతో తెచ్చేను. అదృష్టం కొద్దీ మా కారుని హోటలు గట్టుకి ఆనుకుని ఉన్న పార్కింగులో పార్కు చేసేం. అంటే కారు డిక్కీ దగ్గరికి సరిగ్గా ఆరడుగుల దూరంలో ఉన్నానన్నమాట. నా కాళ్లకి సాక్సులు కూడా లేవు. ఉన్న చెప్పులతో మంచులోకి అడుగు పెట్టాను.
అప్పుడప్పుడే రాలిన సుతి మెత్తని మంచులోకి అడుగు పెట్టిన మొదటి క్షణం ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పటి నుంచో మస్తిష్కాంతరాళాల్లో పొరలుగా దాగి ఉన్న ఆనందం ఒక్కసారిగా కాళ్ళ వేళ్ల లోంచి ఒళ్ళంతా జలజలా పాకి ఆకాశాన్నంటిన సంబరం చుట్టిముట్టింది.

సరిగ్గా రెండడుగుల్లో నా చెప్పు తెగి వచ్చింది. ఇక డిక్కీ దగ్గిరికి వెళ్లి, డిక్కీ మీద ఉన్న మంచుని గ్లోవ్స్ వేసుకున్న రెండు చేతులతో తుడిచి, పై నుంచి కురిసే మంచులో తడుస్తూ ఒక్క క్షణం నించున్నానో లేదో, చలికి వెన్ను లోంచి ఒణుకు వచ్చెయ్యడం మొదలెట్టి చేతులు, కాళ్లు కొంకర్లు పోవడం మొదలయ్యాయి. ఇక డిక్కీ లోంచి కోట్లు వగైరా తీసే సమయానికి సత్య పరుగెత్తుకొచ్చి నా చేతిలోవి అందుకున్నాడు. రెండు, మూడు రౌండ్లలో అన్నీ తెచ్చి హోటలు గట్టు మీద కుప్ప పోసేం. ఇక ఓర్చుకోవడం నా వల్ల కాలేదు. పరుగెత్తుకుని లోపలికి వచ్చి పడ్డాను. హోటలు కార్పెట్ మీద కాళ్లు ఆన్చి నడవలేక పోతున్నాను. ఇక అక్కడే గోడకి ఉన్న ఫైర్ ప్లేస్ దగ్గిరికి కుంటు కూంటూ వెళ్లి వేడి కాగడం మొదలెట్టేను. దాదాపు పదిహేను నిమిషాల తర్వాత కాస్త స్వాధీనంలోకి వచ్చాయి కాళ్లు. మరో అరగంట అక్కడలా వృథా అయ్యింది మాకు.

ఈ లోగా సిరి మా వెనకే పరుగెత్తుకొచ్చి మంచులో మొత్తం దిగబడిపోయీంది. తనకి బట్టలు మొత్తం మార్చాల్సి వచ్చింది. మా అందర్లోకీ చాలా దృఢమైంది సిరి. దేనినీ పెద్దగా పట్టించుకోదు. పెదాలు వొణికి పోతున్నా “ఇటీస్ సో కోల్డ్” అంటూ ఉంది గానీ ఏడవలేదు పాపం.

ఇక పిల్లలూ, మేం అక్కడే స్కీ బట్టలు తొడిగేసుకుని, స్కీ బూట్లతో సహా వేసుకున్నాం. అప్పటికి మంచి వెచ్చగా అనిపించింది. ఇక తర్వాతి పని ఈ కారుని మంచులోంచి రోడ్డు వరకూ తీయడం. పిల్లల్ని కారులో కూచోబెట్టి సీటు బెల్టులు పెట్టేం. సత్య కారు స్టార్టు చేస్తూంటే నేను రివర్సు చూస్తానని బయట నిల్చున్నా. మాది ఫోర్ వీల్ డ్రైవ్ ఇంజను కాకపోవడం వల్లనో, మంచు తీవ్రత వల్లనో కారు చక్రాలు గియ్యి మని అక్కడక్కడే తిరుగుతున్నాయి కానీ ఒక్క ఇంచి కూడా వెనక్కి జరగలేదు.

నేను చేతులకి గ్లోవ్స్ తొడుక్కుని వీలయ్యినంత వరకూ మంచుని చక్రాలకి అడ్డు తప్పించే పని చేస్తూనే ఉన్నాను. బయట బాగా గడ్డ కట్టిపోతూండడంతో మేం స్థానాలు మార్చుకున్నాం. అయినా ఫలితం లేదు. ఇక నేను డ్రైవింగు సీటులో కూచుని మెల్లగా బయటి డైరక్షన్స్ ప్రకారం రివర్సుకి ప్రయత్నం చేసేను. బయట ఒకట్రెండు కార్ల వాళ్ళు వచ్చి సులభంగా రివర్సు చేసుకుని వెళ్లిపోయారే గానీ ఒక్కళ్లూ ఆగి మాకు సాయం చెయ్యడానికి రాలేదు.

ఇక సత్య “గివప్ చేసేద్దాం. ఇవేళ్టికి మనం స్కీయింగు కేన్సిల్ చేసేసుకుని లోపలికి వెళ్లిపోదామని” అనడం మొదలు పెట్టేడు. అసలేదీ అంత సులభంగా ఒదలని నేను ఎలా ఒప్పుకుంటాను? “స్థిమితంగా మరో సారి ప్రయత్నిద్దాం” అన్నాను. ఇద్దరం కలిసి మొత్తం టైర్లకి అడ్డుగా ఉన్న మంచంతా చేతులతోనే తవ్వేం. “మరో సారి ప్రయత్నిస్తానని” నేను స్టీరింగు ముందు కూచుని ఈ సారి కొంచెం తెలివి తేటలు ఉపయోగించి ఎంత వరకూ వెనక్కి వచ్చేనో అంతా ముందుకి నడిపి ఫుల్ గేరులో వెనక్కి నడిపేను. చిత్రంగా ఒక్క ఉదుటున రోడ్డు మీదికి లంఘించింది కారు.

ఇక ఆలస్యం చెయ్యకుండా సత్యని కూడా ఎక్కించుకుని కారుని ముందుకి తీసేను. అప్పటికే మా ముందున్న కార్ల అడుగుజాడల్లో మెల్లగా పోనిచ్చాను. ఎక్కడ రోడ్డు దిగినా మా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. బయట అంత మంచు కురుస్తూన్నా, మా ఇద్దరి ముఖాలకీ చెమటలు పట్టేయి. అతి కష్టం మీద ఒక మైలు దాటి వచ్చేం. దగ్గర్లో షాపు ఉందన్న బోర్డు వరకూ వచ్చి లోపలికి వెళ్ళే దారి చూస్తే, అంతా అయోమయం. అంతా మంచులో కప్పబడిపోయి ఉంది. లోపలికి వెళ్ళినా షాపు ఆ మంచులో తెరిచి ఉంటుందన్న గేరంటీ లేదు.

అప్పటి వరకూ నా ప్లాను ఏవిటంటే సత్యని, వరుని స్కీ రిసార్టులో వొదిలి, సిరిని తీసుకుని నేను మళ్లీ హోటలుకి వచ్చి రిలాక్స్డ్ గా పదకొండు గంటలకి మళ్లీ వెళ్లడం. ఇక అక్కడ రోడ్డు మీద మంచులో డ్రైవ్ చేసేసరికి నాకది మంది పని కాదనిపించింది. చంటిపిల్లతో నేను ఎక్కడ త్రోవ తప్పినా చాలా కష్టం . అందుకే ఇక అంతా కలిసే ఉందామని డిసైడ్ చేసుకున్నాం. అలా ఆ ఉదయం చేసిన 5 మైళ్ళు డ్రైవ్ గొప్ప ఎడ్వెంచరస్ డ్రైవ్. నా డ్రైవింగు చరిత్ర లోనే బెస్ట్ డ్రెవ్. అదంతా వీడియో తీయమని ఎంత మొత్తుకున్నా సత్య వినలేదు. “ఇక్కడ భయం తో ఛస్తూంటే నీ వీడియో గోలేవిటని” కొట్టిపారేసేడు. భలే సాహసోపేతమైన మంచి అనుభవమది. మాకు కారు టైర్ల చెయిన్లు రిసార్టు వరకూ వెళ్ళిపోయినా దొరకలేదు.

అప్పటికే వరుని దించాల్సిన క్లాసు స్టార్టు కూడా అయిపోయింది. ఇక సాయంత్రం వెళ్లే ముందు చూసుకుందామని కారు ఆపుకుని మంచులో పిల్లల్ని పట్టుకుని లోపలికి పరుగు తీసేం.

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో