మహిళా సాధికారత-భారత రాజ్యాంగ రక్షణలు(వ్యాసం ) -డా.ఎన్. రాజశేఖర్ .

ISSN 2278-478

IMG_20141104_090706మహిళలు సర్వతో ముఖాభివృద్ధి చెందినపుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలో స్త్రీ ఆర్థిక, సామాజిక స్వావలం భన కలిగి ఉంటుందో ఆదేశం అభివృద్ధి పధంలో పయనిస్తుంది. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు ఆస్థాయిలో అవకాశాను, అధికారాను అందుకోవడంలేదు. ఇంకా అనేక రంగాలో మహిళలు సాధికారతను సాధించాల్సివుంది.

మహిళాసాధికారత అనగానేమి ? మన భారత రాజ్యాంగంలో అందుకోసం ఏర్పాటు చేసిన అంశాలను పరిచయం చేయడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యము.

సాధికారత అంటే …?

మహిళా సాధికారత గురించి తెలుసుకునే ముందు ‘సాధికారత’ అనగా ఏమిటో తెలుసుకోవాలి. ‘సాధికారత’ అనగా వ్యక్తి తన హక్కులను బాధ్యతను తెలుసుకొని, తనకున్న శక్తి యుక్తులను సమగ్రంగా ఆవిష్కరించుకొని అందిన అన్ని అవకాశాలను వినియోగించుకొని సమాజానికి, దేశానికి ప్రపంచానికి ఉపయోగపడడటం.

సాధికారత అనేది విభిన్న అంశాల కలబోత. సాధికారత అనగా సామర్థ్య నిర్మాణ ప్రక్రియ. ప్రతివ్యక్తి తన వ్యక్తిగత లేదా సామూహిక జీవనానికి సంబంధించిన విషయాలలో స్వయం నిర్ణయాన్ని తీసుకొనే ధైర్యాన్ని, సామర్ధ్యాన్ని, స్వేచ్ఛనూ కలిగి ఉండటం, ఉత్పాదక వనరుల పై నియంత్రణ కలిగి ఉండి వాటిని అభివృద్ధి చేయడం, నిర్మించడం.

వ్యక్తి స్వయం ప్రతిపత్తి కలిగి వుండి తన జీవన కారకాలైన ఆర్థిక, సాంఘిక మరియు రాజకీయ సాధికారతను కలిగి వుండటం. ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉండటం, మరియు విద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం తన సమస్యను తానే పరిష్కరించుకొనే సామర్ధ్యాన్ని కలిగివుండటం. సంపదను, అధికారాన్ని అన్ని వర్గాల మద్య పున:పంపిణీ చేయడం సాధికారతలో భాగమే అని గమనించాలి.

మహిళా సాధికారత అంటే …?

పైన సాధికారతలో పేర్కొన్న అంశాన్ని మహిళలు కలిగి వుండుటను మహిళాసాధికారత అని చెప్పవచ్చు. అనగా మహిళలు తమ జీవితంపై స్వేచ్ఛను, అధికారాన్ని కలిగి వుండాలి. విద్య, సాంకేతిక, పరిశోధన, వైద్య, కళ, సాహిత్యం, క్రీడలు , రాజకీయాలు , అధికారం మొదలగు అన్ని అంశాలో వారి ఎదుగుదలను, భాగస్వామ్యానికి అవసరమైన అన్ని అవకాశాలను వారికి కల్పించడం. దురదృష్టవశాత్తు అన్ని రంగాలలో మహిళలకు తగిన భాగస్వామ్యం లేదని చెప్పవచ్చు.

మహిళాసాధికారత అనగా మహిళలను వారి జీవితానికి సంబంధించిన అంశాలో స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి వుండటం. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాలలో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండటం. నిర్ణయాలు తీసుకొనే స్వేచ్చ, ఎంపిక చేసుకొనే సామర్ధ్యాన్ని కలిగి వుండటం. ఆర్థిక స్వతంత్రాన్ని, రాజకీయ అధికారాన్ని కలిగి ఉండటం. స్త్రీ పురుష సమానత్వాన్ని ఆమోదించడం.

అయితే భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టినదని చెప్పవచ్చు. అందులో భాగంగానే పంచవర్ష ప్రణాళికలలో ‘మహిళా సంక్షేమానికి’ ‘మహిళాసాధికారతకు’ ప్రాధాన్యతను ఇస్తూ వస్తుంది. ముఖ్యంగా 8వ పంచవర్ష ప్రణాళిక (1992- 97) లో ఈ ప్రాధాన్యాన్ని చూడవచ్చు.

1982-83 లో ప్రారంభించిన ‘డ్వాక్రా’ 1992 లో మహిళా కమీషన్‌ ఏర్పాటు 2001లో ప్రారంభించిన జాతీయ మహిళా సాధికారత విధానము మొదలగునవి ఇందులో భాగంగానే అని గమనించాలి.

రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలు :

స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వము మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్నదని చెప్పవచ్చు. రాజ్యాంగంలో స్త్రీ పురుషులిరువురికి సమానంగా ప్రాధమిక హక్కును కల్పించడం ఇది మాత్రమే కాకుండా వివిధ చట్టా ద్వారా మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తున్నదని చెప్పవచ్చు.

* హిందూ వివాహ చట్టం-1955

* వరకట్న నిరోధ చట్టం-1956
* హిందూ వివాహము మరియు విడాకుల చట్టం -1955
* బాల్య వివాహాల నిరోధక చట్టం -1976
* సమాన వేతన చట్టం -1976
* మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం-1986
* స్త్రీల అసభ్యకర ప్రదర్శన నిరోధక చట్టం – 1986
* సతీ నిరోధక చట్టం – 1987
* గర్భ నిరోధక చట్టం – 1971
* గర్భస్త లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం- 1992
* 73, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీలు , మున్సిపాలిటిలలో రాజకీయ రిజర్వేషన్లు.
* రాజ్యాంగంలో ఏ విధమైన లింగ వివక్షతను నిషేధించటం జరిగింది.
* రాజ్యాంగంలో ప్రకరణ 15(1), 15(2)లు ప్రభుత్వాలు స్త్రీ మరియు బాలిక సంక్షేమము కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాని పేర్కొన్నాయి.
* ప్రకరణ 16 ప్రభుత్వరంగంలో మహిళలకు సమాన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.

అయినప్పటికిని ఇంకా సాధించవలసినది ఎంతో వుంది. ఎన్ని చట్టాలు చేసినా, పధకాలు ప్రవేశ పెట్టినా ఫలితాలు ఆశించినంతగా లేవనేది సత్యం.

తీసుకోవలిసిన చర్యలు :
ముందుగా స్త్రీని పురుషునితో సమానంగా గుర్తించి గౌరవించాలి. వారి పట్ల నేడు జరుగుచున్న అత్యాచారాలు , గృహహింస, లైంగిక దాడులను నివారించి దోషులకు వెంటనే కఠినంగా శిక్షను అమలు చేయాలి. మహిళ విద్య, ఉద్యోగాభివృద్ధికి కృషి చేయాలి. వారికి వారికి గల రక్షణ పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగించాలి.

ముఖ్యంగా వివాహం విషయంలో మహిళకు స్వేచ్చ , స్వీయ నిర్ణయాధికారం ఉండాలి . ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించటం ఆపెయ్యాలి . అటువంటి వారిని శిక్షించాలి . అయితే మన భారతీయ సమాజంలో చట్టాల కంటే సమూల మార్పులతోనే మనం అనుకున్నది సాధించగలం . రాజకీయంగా ఎన్నికైన మహిళలు వారి భర్తల రాజకీయ జోక్యాన్ని నివారించాలి . మహిళా సాధికారం అనేది కేవలం చట్టాలతో మాత్రమే వచ్చేది కాదు డానికి అందరూ పాటు పడినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది .

-డా.ఎన్. రాజశేఖర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , Permalink

Comments are closed.