వాసాలమింద కప్పడం (కథ)- ఎండపల్లి భారతి

          ac591cd16ddd4176f4e35ebb6007620f   నేనూ నా జతగత్తి పద్మా ఇద్దరమూ కలిసి తెల్ల గుర్రాలు కట్టిండే తేరునెక్కితిమి. మా తెల్లగుర్రాలతేరు పైకెగిరి నల్లమోడాను రాసుకుంటా పోతుండాది. పొయ్యిపొయ్యి ఒక పెద్ద పూతోటలో వదిలింది మమ్మల్ని. ఆ తోటంతా రకరకాల పూలచెట్లూ పండ్లమానూలూ నిండిపొయిండాయి. పూలు పెరుక్కుని జడల్ని నింపుకుని, పండ్లతో ఒడ్లు  నింపుకుండా ఉండాము.                     ‘‘మేయ్‌ బుజ్జీ, లెయిమే. ఆడబిడ్డ ఇంతవరకూ నిదరపోవచ్చా. పొద్దెక్కి బారడయింది. కాళ్లు నిగర తన్నుకొని పణుకోనుండావే, లెయిపైకి’’ అని నన్ను ఊపి ఊపి లేపతా ఉండారు ఎవురో. నేను గబక్కన లేసి కుచ్చుని అట్లా ఇట్లా బిత్తర చూపు చూస్తి. తేరూ లేదు, పూలతోటా లేదు. ఎదురుగా మా అవ్వ మటుకు ఉండాది. ‘ఇదంతా కలా’ అనుకొని సాపమిందనే కుచ్చుని ఉండాను.

‘‘లెయ్యే, ఈ పొద్దు సుక్కురోరం. బిరిన్న పనున్నీ చేసుకోని రాగవరెడ్డోళ్ల చేన్లోకి పనికి పోవా’’ అంటా పను చేస్తా ఉండాది అవ్వ.
నేను కండ్లు పుముకుంటా లేసి దొడ్లోకి పొయి పండ్లు దుద్దుకోని మొకము కడుక్కోని వస్తి. అంతలికే అవ్వ అన్ని పనులూ చేసేసి, పొయ్యిమింద ఎసుట్లో పిండిపోస్తా ఉండాది.

‘‘అవా, తాత ఏడకి పొయినాడవా’’ అని అడిగితి.

‘‘నిన్న రేత్రి ఇంటికే రాలేదు. ఆ సారాయంగడి కాడనే పొల్లాడతా ఉండాడేమో. సంగటి పొద్దుకు ముందో యెనకో వస్తాడులే’’ అనిందవ్వ. నేను అవ్వ యెనకాకు పొయ్యి నిలబడుకుంటి.

‘‘బుజ్జీ, నేను సంగటీ శారూ చేసేస్తాను. నువ్వు కుండ ఎత్తుకోని పొయ్యి బిరిన్న నాలుగు తడవలు నీళ్లు తేపో కొడుకా. అందరమూ నీళ్లు పోసుకుందాము’’ అనింది అవ్వ.

నేను కుండ ఎత్తుకుని బోరింగు కాడకి బయదేలితి. దోవలో పద్మకూడా ఒక కుండ ఎత్తుకుని వచ్చింది. మేమిద్దరమూ బోరింగు కింద కుండల్ని పెట్టి, బోరింగును కొట్టి కుండల్ని నింపుకొంటిమి. ఆ బోరింగు పక్కన్నే చిన్నగుట్ట ఒకటి ఉంటాది. దానిపేరు కదిరిగుట్ట. ఆ గుట్టనిండా సీతాపలం చెట్లు నిండుకోని ఉంటాయి. మేము కుండల్ని అట్లే పెట్టి, సీతాపలం కాయలకోసరం గుట్టమిందకి పోతిమి. నేను చెట్ల గుబురుల్లో దూరి కాయలు కోసిస్తుంటే, పద్మ ఒడి నింపుకుంటా ఉండాది.

‘‘ఓ పాపా, ఓ బుజ్జీ, ఏడకు పోతివే’’ అని మా అవ్వ కూత యినిబిచ్చేతలికి, గబగబా గుట్టను దిగితిమి. మా అవ్వ ఒక కడవను ఎత్తుకొని బోరింగు కాడకి వచ్చింది. కాయల్ని నింపుకుని చెక్కుకోనుండే మా ఒడుల్ని చూస్తా ‘‘ఏమే, నీకు చెప్పిన పనేమి, నువ్వు చేసే పనేమి, ఇంటికి రా నీ పని చెప్తా’’ అంటా కడవకు నీళ్లు నింపుకుని పొయింది. నేను కూడా కుండను ఎత్తుకుని అవ్వ యెనకానే ఇంటికి పోతి.

‘‘ఆ పరిగిలిదానికి పనీపాటా లేదు. దాని జతగూడి నువ్వూ చెడిపోతా ఉండావు. లెయ్యి, ఇంటెనకా నీళ్లు పెట్టిండాను, పోసుకోపో’’ అని తిట్టింది అవ్వ.

సంగటిపొద్దుకు పనున్నీ చేసేసి, నీళ్లు పోసుకుని, పమిదిలో దీపం పెట్టి, పటాలకు పూలు పెట్టి, దణ్ణం పెట్టుకునింది అవ్వ. ‘‘పాపా, సంగటిపొద్దు ఎక్కిపోయె. ఈపొద్దు రాగవరెడ్డోళ్ల పనికి పోవ్ల. రవంచ ఆల్చెంగాపోతే కన్నా మాటలు అడగతాడు ఆయన. రా రా తిందాము’’ అంటా నా గిన్నిలో సంగటి యేసి కూరపోసింది. మా అవ్వ కూడా యేసుకునింది. ఇద్దరమూ తింటా ఉండాము.

అదేపొద్దుకు రాగవరెడ్డి మా ఇంటితట్టుకు వచ్చి, మా తలాకిలికాడ నిలిసి ‘‘ఒసే లచ్చుమూ, యల్లబారండే పనికి’’ అని అరిసినాడు. ఆయప్ప కూతను యింటానే చేతిలోని పిడసను గొంతులో యేసుకుని మింగతా ‘‘వస్తి సామీ వస్తి’’ అనింది అవ్వ. అనెంక గబగబ రెండు కడులు మింగి, తుండుగుడ్డను బుజాన యేసుకుని, దొంతుల సందులో ఉండే వక్కాకు తిత్తిని నడుముకు చెక్కుకుని బయదేలింది.

‘‘నాయినా, నేను పోతా ఉండా. నువ్వు పిల్లోళ్ల జత కూడకుండా, ఎండపొద్దులో ఇంట్లోనే ఉండు. ఆ కుండాసట్టీ అట్ల కడిగెయ్యి. రెండు కట్టిలు తెగ్గొట్టి పెట్టు. జింకలోనిబండ కిందుండే చింతమానుకు ఇగురు బడిండాది. పొయ్యి రవంచ పెరక్కొచ్చి పెట్టు. మావిటాళకు చింతిగురు ఊరిబిండి నూరుకుందాము. అట్లే రెండు కడవల నీళ్లు తెచ్చిపెట్టు’’ అని పనులు చెప్పింది అవ్వ.

‘‘ఏడవ్వా మడి కోసేది’’ అని అడిగితే, ‘‘అదేనే, ముద్దలగుట్ట కింద’’ అనిందవ్వ. ముద్దలగుట్ట కాడ చెరుకుతోటలు ఉంటాయి. ఆ తోటల్లో జామచెట్లు కూడా ఉంటాయి. జామకాయలు చెరుకులూ గుర్తుకొచ్చి ‘‘అవా నేనూ వస్తానవా’’ అని అడిగితి.

‘‘వద్దే దెయ్యాలు ఉంటాయి ఆడ. ఎండకూడా ఎక్కువగా ఉండాది ఈపొద్దు. నువ్వు ఉండేదానికి మాన్లు కూడా లేవు ఆ తావన’’ అనిందవ్వ. నేను యిన్లేదు. రానే రావ్లనని ఏడిస్తి. ‘‘ఈ బట్టముండతో బాగైపోయెనే’’ అని గొణగతా నన్ను తోడుకొని పొయ్యింది.

మాయవ్వ యెనకంటి నాగవ్వ, గంగులవ్వ ఇంకా చానామంది పోతా ఉండారు. నేనూ వాళ్లెనకనే పొయ్యేది చూసి ‘‘ఏమే లచ్చుమూ దీన్ని తోడుకోని వస్తా ఉండావే, ఇంటికాడ వదిలేసి వచ్చుండకూడదా’’ అనిరి. ‘‘ఈ ముండ ఉంటే కదా. రానీ సంగటీనీళ్లూ లేక అల్లాడ్నీ’’ అనిందవ్వ. నా యెనకీటుతో పద్మవాళ్ల అమ్మ వచ్చింది. ఆయమ్మ యెనకీటుతో పద్మ కూడా వచ్చేసింది. దాన్ని చూసేస్తినా, ఆడనింటీ మా ఇద్దరిదీ ఒగటే నవ్వులూ కుసిలింతలూ.

మా అవ్వోళ్లు మడిలో పనిచేస్తా ఉంటే, జామచెట్లూ చెరుకుతోటలూ అన్నీ మావే. మాయవ్వ అబ్బుడబ్బుడూ తలెత్తి చూసి, అరిసేది. మేము యింటే కదా. అట్లే ఆ పొద్దంతా ఎర్రటి ఎండలో ఆడి ఆడి పొద్దుగుంకినంక ఇంటికి వస్తిమి. మావిటాళనింటీ ఆకాశంలో మబ్బూమోడంగా ఉండాది.

‘‘ఈపొద్దు కాసిన ఎండకి ఏడుపంట్ల వాన కురుస్తుంది’’ అనింది అవ్వ. ఆడిఆడి అలిసిపొయిన నాకు నిదర కండ్లమిందకు వస్తా ఉండాది. అవ్వ గొజ్జుపిసికి, సంగటి గెలికి ఉడుకుడుగ్గా ఒక ముద్ద పెట్టింది నాకు. తింటా తింటా అట్లే అరుగుమింద పడి నిదరపోతి.

తెల్లారి లేసి చూస్తే, మా ఇల్లంతా నానిపొయిండాది. ఇంట్లో తెట్టతెల్లంగా యెలుతురు కనపడతా ఉండాది. పైకి చూస్తే వాసాలు తప్ప కప్పడమే లేదు. నా చుట్టూ చూసుకుంటే, పొయ్యిగడ్డ పక్కన పణుకోనుండా.

‘‘అవా అవా, మనింటిమింద కప్పడం ఏమయిందవా’’ అని అవ్వని అడిగితి.

‘‘రేత్రంతా జోరువాన. వానకు తోడుగా గాలికూడా తోలింది. వడగండ్లు కూడా పడినాయి. ఆ గాలికి కప్పడం ఎగిరిపొయింది. వానకు ఇల్లంతా నానిపొయింది. పొయ్యిగడ్డ తావ రవంచ నానకుండా ఉంటే ఆడ పణబెడితిని నిన్ను’’ చెప్పిందవ్వ.

నేను లేసి బయిటికి వచ్చి చూస్తి. ఊర్లో అర్దము ఇండ్లకు కప్పడాలు ఎగిరిపొయిండాయి. కప్పలు బెకబెకమంటా ఉండాయి.
ఏ ఇంటికాడ చూసినా పిల్లోళ్లూ పెద్దోళ్లూ పొయి ఓగిడాకును మోపు కట్టుకోనొచ్చి ఇళ్లను కప్పుకుంటా ఉండారు. మా అవ్వా నేనూ పొయ్యి ఓగిడాకును మోపుకట్టి తెస్తిమి.

రేత్రి వాన కురిసింది కూడా తెలీకుండా నేను పొయ్యిగడ్డ పక్కన నిదరపోతే, మాతాత అరుగుమిందనే నిదరపొయినట్లు ఉండాడు. సారాయి మత్తు అబ్బుడే దిగినట్లుంది, కండ్లిప్పి ఇవతలికి వచ్చినాడు.

‘‘సారాయి తాగితిమా సంగటి తింటిమా అరుగుకు అడ్డంగా పడి పణుకొంటిమా, ఇదే బతుకు అయిపొయింది. ఇల్లేమి వాకిలేమి అని తెలుస్తుంటే కదా ఈవూరి మగనా బట్టకు’’ అని అవ్వ గొణగతా ఉండాది. వాటిని విని ఏమీ మాట్లాడలేదు మా తాత.

అవ్వ చిన్న చిన్న కట్టు కట్టి పైకి యిసిరేస్తా ఉంటే, పైకెక్కిన తాత, ఇంటికి పడిన బొక్కన్నీ కప్పేసినాడు. కడాన బెల్లమూ బియ్యమూ వేపాకూ కలిపి మూటకట్టి ఇంటిమీదకు యిసిరేసింది అవ్వ. అది గాలిదేవుని కోసరమంట. ఎబ్బుడైనా పెద్దగాలి వస్తే, గాలిదేవుడు ఇల్లును ఎత్తుకుని పోకుండా ఉండేదానికంట. అవ్వ చెప్పింది.

ఇల్లంతా కప్పేసినాక ఇంట్లోకి వచ్చి చూస్తే, మళ్లా మబ్బుగా కనపడిరది. అవ్వ పెట్టిన సద్ది సంగటి తిని, తిరిగి అరుగుమింద పడి నిదరపోతా ఉండాడు తాత.

‘‘పాపా, రెండు కుండు నీళ్లు తేపో నాయినా. బిరిన్న సంగటీ శారూ చేసిపెట్టేసి, రాగవరెడ్డోళ్ల మడిలోకి పొయ్యి ఓదులు తిరగెయ్యా’’ అంటా పొయ్యిగడ్డకాడకి పొయ్యిందవ్వ.

– ఎండపల్లి భారతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , Permalink

One Response to వాసాలమింద కప్పడం (కథ)- ఎండపల్లి భారతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో