పెద్ద పెద్ద బంగారు గొలుసులు దాదాపుపదిహేను అడుగులెత్తున్న ఆలయ పై కప్పుకున్న గుండ్రని కొక్కేలకు వేళ్లాడుతూ నేలకు అయిదడుగుల ఎత్తున్న ఊయల ఫలకం పై వేంచేసి యున్న స్వామి వారిని తామే భరిస్తున్నట్లు గర్వంగా సున్నితంగా ఊగుతున్నాయి . ఆలయ ఆగమ శాస్త్ర పద్ధతుల ప్రకారం కళ్యాణానంతరం కొలువు దీరియున్న సౌమ్య నాధుడు శ్రీదేవి – భూదేవి సమేతుడై వన్నె వన్నెల పూల హారాలు నవరత్న ఖచిత వజ్ర వైడూర్య ఆభరణాలు ధరించి చిరునవ్వు మోముతో నిజమైన వాడా అని భ్రమింప చేస్తున్నాడు .
దేవదాసి కుటుంబానికి చెందిన నెలద బాల్యం నుండి ఆలయ ఆగమ సాంప్రదాయాలు , సంస్కృతము , నృత్య సంగీతాలు నేర్చుకున్నది. యుక్త వయస్కురాలైన పిమ్మట పండితులు , ఆచార్యులు ఆమె తెలివి తేటలకు పెట్టిన అన్ని పరీక్షల్లోనూ సులువుగా నెగ్గినది . ఆపై సమాశ్రణ ములు జరిపించుకుని అనగా కుడి భుజముపై చక్ర ముద్ర ఎడమ భుజమున శంఖ ముద్ర వక్ష స్థల పై భాగమున తిరునామపు ముద్రలు వెండి అచ్చులను నిప్పుతో ఎర్రగా కాల్చి శరీరంపై ఏర్పడేలా ముద్రించుతారు . అలా “సమాశ్రణ ములు “ పొందిన నర్తకీ మణి ఏ ఆలయ ముందు నృత్య పూజకు అర్హత పొందుతుంది . ఆలయంలో స్వామికి కుంభ హారతి పట్టుట , చామరముతో విసరుటం స్వామి కొలువు దీరిన వేళ నృత్య సంగీతాలతో షోడశోప చారాలతో సేవించటం చేసే వారు .
అలా ముద్ర పొందని నర్తకీ మణులకు ఆలయ ప్రవేశం ఉన్నా నాట్యార్చన నిషిద్ధం . వారు కేవలం రాజాస్థానాలలో , సభలలో నాట్యమాడే వారు .
ఆలయానికి దైవానికి అంకితమైన దేవదాసీలు రాజుల ఆస్థానాల్లో నర్తించే వారు కారు . రాజులే దైవ దర్శనానికి వచ్చినపుడు వీరి నర్తన చూసే అవకాశం ఉండేది . వీరిని రాజుతో సహా ప్రజలంతా గౌరవ భావంతో చూసేవారు శివదాసి , విష్ణు దాసీలుగా పిలవబడుతుంటారు . శివ పూజా కెంకర్యాలతో శైవాలయాలలో నర్తించే వారు శివ దాసీలు . కళ్యాణ ఉత్సవమూ ఆలయంలో జరిగిన పిదప దేవుడు కొలువు దీరును . అట్టి సమయంలో స్వామి దర్బారులో అర్చనా నృత్య రీతిగా నృత్తము , నృత్యము అభినయములతో కూడిన కేళికలు ప్రదర్శిస్తారు . గుడికి ఆ సమయంలో విచ్చేసిన ప్రజానీకం కొరకు భాగవతాది పురాణ గాధలను నృత్య రీతిగా ప్రదర్శించటం దేవదాసీల కృత్యం . పూజా సమయంలో చేసే స్తోత్ర నృత్యములు పండుగ దినాలలో ప్రత్యేకంగా చేస్తారు . అలాగే రాత్రి సమయంలో స్వామి పవళింపు సేవ చేయు సమయంలో అష్టదిక్పాలకులను ప్రశంశిస్తూ ఆలయాన్ని కాపాదమనే అర్ధం వచ్చే నృత్యాలు చేస్తారు . ఇలాటి సంప్రదాయ రీతిని అవపోసన పట్టిన నెలద అలవోకగా తన తనువు మనసు లగ్నం చేసి స్వామి కైంకర్యముగా నాట్యమాడుతోంది .
కూడా వచ్చిన ఆడవాళ్లు స్వామికి మొక్కుతూ భక్తిగా కళ్ళు మూసుకోగా …. ఇదే అవకాశంగా భావించిన శౌర్య చిన్నగా మరో వేపుగా క్రిక్కిరిసి నించుని ఉన్న పౌరుల మధ్యలో దూరాడు . బాగా పొడగరి కావటంతో తమకు నాట్యం కనబడటం లేదని పక్కకి వెళ్ళమంటూ వెనక ఉన్న వాళ్లు అతన్ని అడుగుతున్నారు . అలా జరిగి జరిగి ఓ స్థంభం వద్దకు వచ్చి చేరాడు . ఆ స్థంభానికి ఆనుకుని తనూ నాట్యం చూస్తున్నాడు నిజానికి ఆ నాట్యం చూసి తన్మయత్వంలో వచ్చిన పని మరిచాడతను .
ఈ జనంలో ఎవరినో ఒకరిని పరిచయం చేసుకొని తద్వారా తను వెదకుతున్న కుటుంబం ఆచూకీ కోసం ప్రయత్నించటం లేదా ….. తనకు సమ ఉజ్జీ అయిన వ్యక్తి దుస్తులు దొంగిలించి ఈ ఊరి నుంచి బైట పదే ప్రయత్నం చేయటం ఉద్దేశ్యాలుగా అక్కడికి వచ్చాడు . ఎంత సౌందర్యం , ఎంత పవిత్రత ఆ నాట్యంలో నిష్ణాతురాలుగా నర్తిస్తున్న నెలదను చూసి అనుకున్నాడు శౌర్య . అల ఓ మారు పరిసరాలు పరికించాడు . ఊరి జనమే కాక పొరుగు పరగణాల నుంచీ కూడా వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం నిండిపోయింది . రాజావారు బాలీసు పై పద్మాసనంలో కూచుని తిలకిస్తున్నారు . ఆ తరువాత స్థాయిల వారిగ అధికార గణాలు ఆశీనులై ఉన్నారు . చిన్ని నులక మంచంపై పరగణా పాలెగాడు కూచుని ఉన్నాడు .
(ఇంకా వుంది )
– సుమన కోడూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to నెలద -13(ధారావాహిక) – సుమన కోడూరి