స్నేహితుల్తో ఫోటో – కె వరలక్ష్మి

పెద్దాపురాన్ని ఒకప్పుడు వత్సవాయి వంశజులైన రాజులు పరిపాలించేరట. బొబ్బిలియుద్ధం కథలో పెద్దాపురం ప్రసక్తి ఉంటుంది. ఆనాటి రాజమహలు, రాణీమహలు, వగైరాలు తర్వాతి కాలంలో డిగ్రీ కాలేజ్ కోసం వితరణగా ఇవ్వబడ్డాయి. మేం చదువుకునేసరికి ఆ ఊళ్ళో కాలేజీ లేదు. రాజులకాలంలో గొప్ప అందాలొలికిన పట్తునేతకూ, నాట్యశాస్త్రంలో నిష్ణాతులూ, సౌందర్యమూర్తులూ అయిన కళావంతుల కుటుంబాలకూ ప్రసిద్ధి చెందిందట పెద్దాపురం. అలాంటి ఊరు తర్వాతి కాలంలో ఎలాంటి వికృత నామాన్ని పొందిందో అందరికీ తెలుసు. ఈ సబ్జెక్టు మీద నేను ఊరు అనే కథ రాశాను.

మేం పరీక్షలు రాయడానికి వెళ్తుంటే మొదటిరోజు నుంచీ ఎవరో అయిదారుగురు అబ్బాయిలు సైకిళ్లమీద నెమ్మదిగా తొక్కుతూ మమ్మల్ని వెంబడించేవారు. తిరిగివచ్చేటప్పుడు కూడా అంతే. మేం వాళ్లను పట్టించుకోకుండా తలవంచుకుని నడిచేవాళ్ళం రేపటితో పరీక్షలు ముగుస్తాయనగా వాళ్ళ అల్లరి శృతి మించి, మా కాళ్ళకి అడ్డంగా సైకిలు చక్రాలు పెట్టడం మొదలుపెట్టారు. లీల కోపం పట్టలేక ‘ఇడియట్’ అంది గట్టిగా. అంతే, వాళ్ళు ఇంకో పదిమందిని వెంటేసుకొచ్చి వీధి అరుగులమీద బైఠాయించారు. వాళ్లల్లో ఇద్దరెళ్ళి బస్టాండులో ఉన్న మా స్కూలు అబ్బాయిలు నలుగుర్ని పిల్చుకొచ్చారు. వాళ్ళు పెద్ద హీరోలలాగా వీళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేసి పంపించేశారు. అదంతా ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ, అప్పటికది పెద్దవిషయం మాకు.
పరీక్షలు ముగిసిన మధ్యాహ్నం మీనాక్షి బావగారు మమ్మల్ని బజారులోకి తీసుకెళ్ళారు. రిబ్బన్లు గాజులు హెయిర్ పిన్స్ లాంటివి కొని పెట్టి దర్గా సెంటరు వైపు తీసుకెళ్లారు. రోడ్డు ప్రక్కనున్న మూడు పోర్షన్ల పెంకుటింట్లో ఒక పోర్షన్ లోకి దారితీశారు. లోపలివాళ్ళు బైటికి కన్పించకుండా ప్రహరీ గోడ ఉంది. పాతికేళ్ల వయసున్న ఒకావిడ ఎదురొచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళింది. చాపలు వేసి కూర్చోబెట్టింది. తినడానికి మిక్చరు, స్వీట్లు లాంటివి పెట్తింది. చక్కగా నవ్వుతూ మాట్లాడుతోంది. చెవులకి చిన్న దుద్దులు తప్ప నగలేం లేవు. ఇల్లు పరిశుభ్రంగా ఉంది. నేను పరిశీలిస్తూ కూర్చున్నాను. ఆవిడ మీనాక్షితో మాట్లాడుతోంది. వాళ్ల బావగారు తెలివి తక్కువతనంతో వ్యాపారాన్ని పట్టించుకోకుండా స్నేహితుల కోసం ఎలా ఖర్చు పెట్టేస్తున్నారో తన ఒంటిమీద నగల్ని కూడా ఎలా పట్టుకుపోయారో చెప్తోంది. బైటికొచ్చాక తెలిసింది అది ఆయనకు చిన్నిల్లు అని. ఆ రోజుల్లో చాలామంది మగవాళ్లు అలా చిన్నిల్లు పెట్టుకోవడం తమకొక గొప్పలా భావించేవారు.ఆనాటి ఆ సంఘటన నా మనసులో నాటుకుపోయింది. ఇరవై ఏళ్ల తర్వాత మరో కళావంతుల అమ్మాయిని చూశాక ‘పిండిబొమ్మలు’ కథ రాశాను. ఆ కథలో రమణి పాత్ర ఆరోజు పెద్దాపురంలో నేను చూసిన అమ్మాయి.

ఆ రోజు సాయంకాలం మా ఆదిలక్ష్మి నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. మా ఊరికెళ్తే ఇంక వీలుపడదని మేం ఫోటో తీయించుకోవాలనుకున్నాం. మా రామలక్ష్మి రాలేదు. మా నలుగుర్నీ బాబయ్య గారు (ఆదిలక్ష్మి నాన్నగారు) ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీయించారు. ఆదిలక్ష్మి రెండు జడలు బిగించి వేసుకుని రిబ్బన్లతో మడతపెట్టి కట్టుకునేది. అందుకని దాని జుట్టు చెక్కుచెదిరేది కాదు. నా జుట్టు కాస్త చెదిరిందని బాబాయిగారు సవరించారు. నా ఫ్రెండ్స్ పేరెంట్లందరూ నా పట్ల అంతటి ఆత్మీయత చూపించేవారు. మధ్యలో నేను, ఆదిలక్ష్మి, నా కుడివైపు లీల, ఆదిలక్ష్మికి ఎడమవైపు మీనాక్షి కూర్చున్నాం. ఆ ఫొటో ఇప్పటికీ నా దగ్గర పదిలంగా ఉంది. పరీక్షలముందు క్లాస్ గ్రూప్ ఫోటో కి వెళ్లాలని తయారై కూడా ‘అబ్బాయిల్తో ఫోటో ఏవిటే బాబూ’ అంటూ రామలక్ష్మి మానేసిందని మేమూ మానేసాం. దానికి తర్వాత చాలాసార్లు విచారించాను. ఆనాటి క్లాస్ మేట్లను ఫోటోలోనైనా చూసే అవకాశం లేదే అని. హేండ్ కేమేరాస్ కూడా లేని రోజులవి.

మా వీధిలో అడ్డాలమంగమ్మ అనే ఆవిడ అట్లు పోసి అమ్ముకుని జీవనం సాగిస్తుండేది. గానుగ పక్కన చిన్న పూరింట్లో నెలకి అర్ధరూపాయిచ్చి అద్దెకుండేది. నిరుపేదరాలు. కానీ, అందరికీ తనకొడుకు మెడ్రాస్ లో సినిమా యాక్టరని చెప్తుండేది. ఏం లాభంలే’ అని అందరూ ఆవిడమీద జాలిపడేవారు. ఆ కొడుకొకరోజు హఠాత్తుగా ఊడిపడ్డాడు. అతని పేరు అడ్డాల నాగేశ్వర్రావు. చాలా సినిమాల్లో డాక్టరు. పోలీసు లాంటి చిన్నచిన్న క్యారెక్టర్లు వేశాడు. అతను తిన్నగా మా నాన్న దగ్గరకి వచ్చి ‘ అన్నయ్యా నువ్వు సాయం చేస్తే నేను స్టేజి మీద హీరో నాగేశ్వర్రావు గారి పాటలకి స్టెప్పులు, సోలో డైలాగ్స్ లాంటివి చేసుకుని నాలుగుడబ్బులు సంపాదించుకుంటాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నువ్వు సరే అంటే బ్రతికిపోతాను’ అన్నాడు. మా నాన్న వెంటనే మా బంకు వెనక దొడ్లో స్టేజీ వేయించి, ఉచితంగా మైకు సెట్టు ఇచ్చి ఊరంతా ప్రచారం చేయించి కొందర్ని స్వయంగా కలిసి చెప్పి అన్ని వీధుల్లోనూ ప్రదర్శనలు ఇచ్చేటట్టు, వాళ్ళు అతనికి ఆర్ధికంగా సాయపడేటట్లు ఏర్పాట్లు చేశారు. ముందురోజే నా పరీక్షలు ముగిసి ఇంటికి వచ్చాను. బేనర్లు రాయడం, స్టాంపు వేసి టికెట్లు తయారుచేయడం లాంటివి నేను చేశాను. అతను అందగాడే కాదు. మంచి నటుడు కూడా. మొదటి రోజు మా దొడ్లో ఇచ్చిన ప్రదర్శన మంచి విజయవంతమైంది. బాగా డబ్బులొచ్చాయి. రెండవరోజు కాకినాడ రోడ్లో ఉన్న డా॥ జయగారి పాతఇంటికెదురుగా ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డా॥ జయ గారి తండ్రి డా॥ రామారావుగారు, మారిశెట్టి తాతయ్యగారు లాంటి పెద్దలంతా వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. అసలు వ్యక్తి స్టేజి వెనక ఫుల్లుగా తాగేసి పడిపోయి ఉన్నాడట. మా నాన్న వెళ్ళి మొహం కడిగించి, మజ్జిగ తాగించి ఎలాగో స్టేజి మీదకి పంపించారు. డైలాగ్స్ ఎలాగూ చెప్పలేడని మంచి పాటొకటి వేశారు. పల్లవి పూర్తి కాకుండానే అతను స్టేజి మీదనుమ్చి కర్టెన్ వెనుక నేలమీద పడిపోయాడు. పెద్దలంతా నిరసనగా చూసి లేచి వెళ్ళిపోయారు.

మొదటిరోజు నాగేశ్వర్రావు గారి విషాదపాత్రలతో పాటల్తో ఏడిపించిన అతను రెండోరోజు ఫెయిల్యూర్ తో ఏడిపించేడు. ఎందుకో తెలీదు కానీ, ఆ రాత్రి చాలా ఏడ్చాను. తాగుడు, తాగేవాళ్ళు అంటే చెప్పరాని అసహ్యం కలిగింది. మా నాన్నైతే తలపట్టుకూర్చుండిపోయారు. అలాంటివాడికి సాయపడాలన్నందుకు సిగ్గుపడిపోయారు. మర్నాడు తెల్లవారేసరికి అడ్డాల నాగేశ్వర్రావు అయిపు లేకుండా పోయాడు.

నా పరీక్షలు ముగిసేయి కాబట్టి నన్ను మా అత్తవారింటికి పంపించే ఏర్పాట్లలో పడింది మా అమ్మ. ముందుగా రంగురంగుల లతలు, పూలు ఉన్న పెద్ద ట్రంకుపెట్టె కొన్నది. ఆ రోజుల్లో చాలా మంది ఇనుపరేకుతో చేసిన అలాంటి పెట్టెల్నే వాడేవారు. ఈ పెట్టే ఇద్దరు మనుషులు కష్టపడి మోయాల్సినంత పెద్దది. దాంట్లో సగం మేరకి నా బట్టలు, మిగతా సగంలో సబ్బులు, కుంకుడుకాయల పొడి లాంటివి పెట్టుకోవాలట. ఈసారి అత్తారింటికి ప్రయాణం అంటే నాకేమీ ఇష్టంగా అనిపించలేదు. పైగా ఏడుపొస్తోంది.

మరి తర్వాత చదువు రాజమండ్రిలోనే చదువుకోవాలి కదా, అంటూ నాకు నచ్చజెప్తోంది మా అమ్మ. అలాంటి సమయంలో జి.వి.బి వచ్చాడు. మొన్నమొన్నటివరకూ నిక్కర్లేసుకుని తిరగడం వల్ల ఆ అబ్బాయి ఎంత పెద్దరికం ప్రదర్శించబోయినా ఎవరం లెక్కచేసేవాళ్ళం కాదు. పోనీ అమెరికా వెళ్ళిపోతావా? అన్నాడు. ఎందుకు అన్నాను నేను ఆశ్చర్యపోయి. ‘అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి’ అన్నాడు. ‘ఈ ట్రంకు పెట్టె వద్దులే, మా ఇంట్లో పెద్ద జిప్ బేగ్ ఉంది తెస్తాను. కాకినాడ వరకూ వచ్చి షిప్పు ఎక్కిస్తాను అన్నాడు అమెరికా వెళ్ళడానికి అదే పెద్ద ప్రాబ్లం అయినట్లు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అనే రెండు ఖండాలుంటాయి అని పాఠాల్లో చదువుకోవడం తప్ప అమెరికా గురించి మరో ముక్క తెలీదు. నీ మొహం లే. అని నవ్వేశాను నేను. అప్పటికే మా నాన్నమ్మ వాడివైపు కొరకొరా చూస్తోంది. ‘సరే, నీ ఇష్టం. ఆలోచించుకో.’ అని వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నాకు ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా పట్టరాని నవ్వొస్తూ ఉంటుంది. పిన్ని (వాళ్ళమ్మ) అయితే మాతో సమంగా వాడ్ని ఆటపట్టించేది ‘ఒరేయ్, పొట్లకాయ్’ అని పిలిచి.

ఆ రోజుల్లో ఆడపిల్లను పుట్టింటివాళ్ళే తీసుకెళ్ళి అత్తింట్లో దిగబెట్టడం గాని, మా పిల్లను తీసుకెళ్ళండి అని కబురుచెయ్యడం గానీ, అవమానంగా భావించేవారు. మా పిల్ల మాకు బరువుకాదు అనే ధోరణి ప్రదర్శించేవారు. ఇక, కాపు, కమ్మ కులాల్లో అయితే ఇద్దరు పిల్లలు పుట్టే వరకూ అమ్మాయిల్ని అత్తింటికి పంపేవారు కాదు.

మా అమ్మా అన్నీ ట్రంకు పెట్టెలో సర్దేసి వియ్యాల వారికోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టింది. ఈ సారి సెలవులకి వెళ్ళి రావడం కాకుండా నేను అక్కడ ఉండిపోవడానికి వెళ్ళడం కదా, ఇప్పుడైనా పెద్దవాళ్ళు వస్తారని ఆశపడింది.

పరీక్షలు రాసేసి ఎప్పట్లాగే తనొక్కడే వచ్చడు. మోహన్, మర్నాడే ప్రయాణం అన్నాడు. మా నాన్న కాలెండరు చూసి అష్టమి పూట పంపనన్నారు. ‘అష్టమి లేదు, గిష్టమి లేదు వెళ్ళి తీరాల్సిందే’ అన్నాడు మోహన్. గొడవంతా మామూలే. తనే గెలిచాడు.
అప్పుడప్పుడే ఊళ్ళోకి రిక్షాలొచ్చాయి. ఒక రిక్షా పిలిచి, మేం ఎక్కేక కష్టపడి ట్రంకు పెట్టెను ఎక్కించారు. పెట్టె పట్టక పెద్దాపురంలో ఇచ్చిన గాజులు, గిఫ్టులు, పసుపు కుంకుమలు, లాంటివి ఒక సజ్జలో సర్దింది మా అమ్మ. రిక్షా పుంతలోంచి రోడ్డు పైకి ఎక్కే పెద్ద వాలులో సజ్జ కిందకి జారిపోయి గాజులు పగిలిపోయి, పసుపు కుంకుమలు వొలికిపోయాయి. వెనుక వస్తున్న మా నాన్న భయపడిపోయారు ఇలా జరిగిందేంటని.

మా ఊరినుంచి రాజమండ్రికి బస్సుచార్జి అరవై పైసలు. గోకవరం బస్టాండు నుంచి మా అత్తవారింటికి రిక్షా కేవు రూపాయి. ట్రంకుపెట్టె చూసి ఇంకో అర్థరూపాయి ఎక్కువ అడిగాడు. మోహన్ జేబులో డబ్బులుంటే బేరాలవీ ఆడడు. దర్జా వొలకపోస్తాడు.
ఈ సారి అమ్మమ్మగారింటికి కాకుండా పక్కవీధిలోనే మా అత్తగారు అద్దెకు తీసుకున్న మరో ఇంటికి వెళ్లాం. వీధిలో నవారు మంచం పట్టేటంత అరుగు, ఒక గది, దాని వెనుక చిన్న వంటగది, దాని వెనుక అంట్లు తోముకునే చిన్న ప్లేస్. దాని వెనుక బాత్ రూమ్. టాయ్ లెట్ రెండు పోర్షన్ల ఇల్లు అది. సున్నం వేసి చాలా కాలం అయినట్టుంది మాసిన గోడలు. సెలవులు కావడం వల్ల ఉష తప్ప మిగతా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మోహన్ పెద్దచెల్లెలు రాణి నవ్వుతూ పలకరించింది. భయం భయంగా వెళ్ళిన నా మనసు తేలిక పడింది.

ఇక్ష్వాకుల కాలం నాటి డొక్కు సైకిలొకటేసుకుని మధ్యాహ్నం మామామగారొచ్చారు. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్లో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడట. మనిషి ఇన్ షర్ట్ చేసుకుని చూడ్డానికి బాగానే ఉన్నాడు కానీ, ఏదో తేడా అన్పించింది. ఆయనకి కన్పించకూడదనే ఆంక్ష ఉంది కాబట్టి నేను వంటింట్లో ఓ మూలకి తప్పుకొన్నాను. తర్వాత ఆయన మాట్లాడుతుంటే అర్థమైంది. తాగివచ్చాడని. నోట్లో జర్దా కిళ్లీ ఒకటి. దాని ఘాటు వంటింట్లోకి వస్తోంది. ఈ పెట్టెవరిది? అని మొదలుపెట్టి తిట్లని లంకించుకునాడు. అసలు ఆ సన్నాసికే తిండి దండగ అనుకుంటుంటే ఆడికొక పెళ్ళాం. ఇక్కడెవడూ డబ్బులు పోగేసుక్కూర్చోలేదు. అడ్డమైనోళ్ళనీ మేపడానికి’ అంటూ అన్నం తిని పడుకునే వరకూ తిడుతూనే ఉన్నాడు.

చుట్టుప్రక్కల వాళ్ళు కోడలొచ్చిందట అని పలకరిస్తే చాలు, ‘అవునమ్మా ఇదిగో ఈ అందాలసుందరిని కానీ కట్నం లేకుండా చేసుకొచ్చాడు మా ఎదవ. ఆడికి పదివేలు కట్నం వచ్చేది. ఈ మా తల్లి పుణ్యం కట్టుకుంది’ అంటూ మా అత్తగారు మొదలుపెట్టేవారు. మా మావగారు రాత్రి డ్యూటీ నుంచి వస్తూ తాగేసొచ్చి మళ్లీ తిట్లు మొదలు. కంపుకొట్టే బాత్రూంలోకి వెళ్ళి దుఃఖం అణిగే వరకూ ఏడ్చి, మొహం కడుక్కుని రావడం అలవాటు చేసుకున్నాను.

-కె .వరలక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , , , , , Permalink

One Response to స్నేహితుల్తో ఫోటో – కె వరలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో