మతం గడపకు మార్కెట్ ముగ్గులు !!

ఒకరు కాదు, పది మంది కాదు ఒకే సారి సుమారు 150 కి దగ్గరగా మనుష్యులు ఒకే క్షణాన శవాలుగా మారిన క్షణం , ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. గగుర్పాటు చెందింది. భీతావహం చెందింది. కన్నీరు కార్చింది. అందులో పసి కందులున్నారు, వయసుడిగిన వాళ్ళున్నారు, తమ యవ్వన ప్రాయంతో చిందులేసే చిచ్చుబుడ్ల నవ్వుల యువకులు, యువతులున్నారు. అందులో ముస్లిములున్నారు, క్రైస్తవులున్నారు, సిరియా దేశీయులున్నారు. ఫ్రెంచ్ దేశీయులున్నారు.

eeeఇక మరుక్షణం అందరి హృదయాలకు కంచె పడింది. ఆ కంచెలో ఇస్లాం మత ఛాందస వాదం మీద ఏహ్యం మరో సారి పెరిగింది. ప్రపంచం లో మనుష్యులు సృష్టించుకున్న మతాలు, పురోగతికి ఉపయోగపడకుండా తిరోగమనానికి ఉపయోగ పడ్డం ఏంటి ? మరి ఇంకా అందరూ మతాన్ని నెత్తి మీద పెట్టుకుని బతికేస్తున్నారెందుకు ? మతం లేకపోతే మనిషికి జీవితం పైన నిర్భయమైన భావన లేదు. తనకు దొరకని అంతు చిక్కని సమాధానాలకు మనస్సును నెమ్మదింప జేసే మతం, మనిషిని పురోగమనం వేపే నడిపింది. ఐతే, సమాజం అభివృద్ధి అయ్యే కొద్ది, ఇదే మతం తిరోగమన పాత్ర తీసుకోవడం – అయినా సరే ప్రజలింకా మతాన్ని గట్టిగా నమ్ముతూ రావడం, ఈ సమాజం లో పెద్ద పారడాక్స్ ఐఎస్ ఐఎస్ పై ఏహ్య పడే ముందు ఒక విషయం ఆలోచించాలి. బిలియన్ డాలర్లు విలువ చేసే ఆయుధ సంపత్తి, ఆస్తులు ఈ సంస్థలకు ఎక్కడి నుండి వస్తున్నాయి ?

ఈ మత ఛాందస సంస్థలు ప్రధానంగా సౌదీ దేశాలలో కేంద్రీకృతం అయి ఉన్నాయి. ఆయా దేశాలు నిజానికి, ప్రపంచం లోని మిగతా దేశాలు విధించిన వ్యాపార ఆంక్షలకు వ్యాపార నిర్బంధానికి గురౌతున్నాయి. ఈ సంస్థల అస్తిత్వానికి రెండు ప్రధాన వనరులు. ఒకటి – మూర్ఖ మానవ వనరులు, రెండు – ఎవరి బారిన పడకుండా ఆయా సంస్థల చేతిలో మాత్రమే చిక్కే ఆర్థిక వనరులు.

ఈ ఆర్థిక సామర్థ్యం ఈ సంస్థలకు ప్రధానంగా మూడు విధాలుగా వస్తుంది. మొదటగా ఆయిల్ స్మగ్లింగ్ .

ఐ ఎస్ ఐ ఎస్ ప్రధానంగా తూర్పు సిరియా ప్రాంతం నుండి , ప్రధాన చమురు ఉత్పత్తిని సరఫరా చేస్తుంది. ఫైనాన్షియల్ టైంస్ పత్రిక ప్రకారం, ఈ మత ఛాందస సంస్థ రోజుకు సుమారు 40,000 బేరళ్ళ దాక ఉత్పత్తిని చేస్తూ, సుమారు రోజుకు 2 – 3 మిలియన్ డాలర్ల ( సుమారు రోజుకు 15 – 20 కోట్లకు పైచిలుకు. నిజానికిది తక్కువ అమౌంటే. వేరే సోర్స్ కూడా చూద్దాం) లాభాన్ని పొందుతుంది. మరి ఇన్ని ఆంక్షలున్న ఈ దేశాల నుండి – ఆయిల్ ఎవరు కొంటున్నారు ?

ఒక పక్క ఐ ఎస్ ఐ ఎస్ ను మట్టుపెడతాం అని శపథం చేస్తున్న సంపన్న దేశాలు ఆయిల్ స్మగ్లింగ్ రూట్లను ఎందుకు దాడి చేయలేకపోతున్నాయి? ఈ ఆయిల్ వ్యాపారం పెద్ద ఎత్తులో, పబ్లిక్ గా, ఎంతో మంది ఉద్యోగస్తులతో, ఇంజినీర్ల సహకారం తో జరుగుతుంది. అయినా సరే, వాటి ఆక్సిజన్ ను కట్ చేయలేకపోతున్నాయా ?
(” నిజానికి , వీల్లందరు కలిసి సరి అయిన ఉద్దేశ్యం తో పని చేస్తే ఐ ఎస్ ఐ ఎస్ ను నెలల్లో కాదు..వారాల్లో అయినా మట్టు పెట్టవచ్చు ” అని కుర్దిష్ ఇంటెలిజెన్స్ ఛీఫ్ BBC కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రస్తావించాడు. )

రెండొ ప్రధాన మార్గం – మనీ లాండరింగ్. ఈ సంస్థలను సపోర్ట్ చేసే వాళ్ళెవరో , వాళ్ళు సంస్థలైనా, దేశాలైనా, వ్యక్తులైనా , బ్లేక్ మనీ ని , ఈ సంస్థకు అంద జేస్తున్నారు. పబ్లిక్ సీక్రెట్ ఏంటంటే – బార్క్ లేస్, స్టాంచార్ట్ , ఎచ్ ఎస్ బీసీ తదితర బేంకులు కూడా ఈ మనీ లాండరింగ్ లో తోడ్పడుతున్నాయి అని ( ఎలా , ఏంటి అన్నది పెద్ద సబ్జెక్ట్. ఈ బేంకుల మీద ఆయా దేశాల్లోని రెగ్యులేటర్స్ వార్నింగ్ కూడా ఇవ్వడం, చట్ట పరమైన జరిమానాలు వేయడం కూడా జరిగింది). ఇన్నేసి బిలియన్ డాలర్ల డబ్బు ఐ ఎస్ ఐ ఎస్ కు , ఎవరి ఆసరా లేకుండానే ఎలా చేరుతుంది ? ఇంతే కాకుండా ఇంత డబ్బును ఐ ఎస్ ఐ ఎస్ ఏ బేంకులో ఎలా దాచుకుని ఉపయోగించుకుంటుంది ?

ఇక మూడో మార్గం – ఆయుధ సరఫరా. ప్రముఖ ఆయుధ ఉత్పత్తి కర్మాగారాలన్నీ కేవలం అగ్ర దేశాల లోనే ఉన్నాయి. అందులో కూడా టాప్ 100 కంపనీలలో 47 కంపనీలు కేవలం అమెరికా లోనే ఉన్నాయి. ఆయుధ కర్మాగారాల మీద, ఎటువంటి కంట్రోల్ లేకుండా ఎలా అప్రూవల్స్ ఇస్తున్నారు ? సేల్స్ ఎవరికి జరుగుతున్నాయో కూడా గమనించకుండా ఉండడం ఎలా జరుగుతుంది ?

ఇక్కడ ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గురించి మనం తెలుసుకోవాలి. భెర్లిన్ గిల్డో అని ఒక స్వీడిష్ దేశస్తుడు బ్రిటన్ లో , సిరియా రాజ్య వ్యతిరేక మత ఛాందస సంస్థలకు సహాయం అందిస్తున్నాడని పోలీసులు కేసు పెట్టారు. ఐతే డిఫెన్స్ లాయర్ – గిల్డో ఏ సంస్థలకు సహకరిస్తున్నాడని అభియోగం మోపారో, అదే సంస్థలకు బ్రిటీష్ ఇంటలిజన్స్ సంస్థ సహాయ సహకారాలందిస్తుందని ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం తో , ఆ కేసు బ్రిటిష్ రక్షణ వ్యవస్థకు ఎంబారాసింగ్ గా పరిణమించి చివరికి కేసు కొట్టేయవలసి వచ్చింది.

ఇదిలా ఉంటే G – 20 సభల్లో , రష్యా అక్రమ ఆయిల్ వ్యాపారం జరుగుతున్నట్టు చూపుతున్న సాటిలైట్ ఫోటోలు చూపించి G 20 దేశాల ప్రభుత్వాల నుండి వ్యక్తుల నుండీ ఐఎస్ ఐఎస్ కు ధన సహాయం అందుతుందని చెప్పి అందరినీ నివ్వెర పరిచింది. కార్పెట్ కింద జరుగుతున్న వ్యవహారం కాస్తా అందరి ముందుకు రావడం తో అందరూ భుజాలు తడుముకోవాల్సి వచ్చింది. తమాషా వ్యవహారం ఏంటంటే ప్రముఖ ‘ది ఎకనమిస్ట్ ‘ మేగజైన్ ప్రకారం , రష్యా అస్సద్ వ్యతిరేక ఇతర తిరుగుబాటు గ్రూపులపై బాంబింగ్ జరిపింది కాని ఐ ఎస్ ఐ ఎస్ స్థావరాల మీద జరపలేదు అని. ఒక ప్రముఖ ఆస్ట్రేలియా పత్రిక కథనం ప్రకారం రష్యా ఆయుధ అమ్మకాల్లో 10 శాతం సిరియాకే జరగడం, సిరియా రష్యాకు మిడిల్ ఈస్టు లో ప్రముఖ నేవల్ బేస్ గా ఉపయోగించుకోవడం, సిరియా ఇంఫ్రాస్ట్రక్చర్, నేచురల్ గేస్ పరిశ్రమల్లో రష్య కు ప్రధాన పెట్టుబడులుండడం కారణాలుగా వివరించింది.

ఒక సారి ఐఎస్ ఐఎస్ పుట్టుక గురించి ఆలోచిస్తే – ఐఎస్ ఐఎస్ నిజానికి సున్ని ముస్లిం ఐన సద్దాం తో పాటు ఇరాక్ పై 2003 లో అమెరికా దాడి జరిపాక ఏర్పడ్డ సంస్థ. సున్ని ఇస్లాం తత్వాన్ని ప్రాతిపదికగా చెప్పుకుంటూ మనుగడ సాగిస్తున్న సంస్థ ఇది. ప్రధానంగా సిరియా, ఇరాక్ ను బేస్ చేసుకుని పని చేస్తున్న సంస్థ. సద్దాం పైన దాడి జరిగాక ఇరాక్ చిన్నాభినమైన ఆర్థిక వ్యవస్థ తో , రాజకీయ శూన్యతతొ మిగిలిపోవడం ఐఎస్ ఐఎస్ కు మంచి బీజం పడింది. సిరియా లో షియా వర్గానికి చెందిన అస్సద్ ఏక ఛత్రాధిపత్య పాలనను ధిక్కరిస్తూ ముందుకొచ్చిన తిరుగుబాటును కూడా ఆసరాగా తీసుకుని మరింత ఉధృతం చెందింది. సిరియా లో రక్కా అనే నగరాన్ని ఆక్రమించి ఇస్లామిక్ స్టేట్ ( రాజ్యం) కోసమై కార్యకలాపాలు ఉధృతం చేయడం మొదలు పెట్టింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే – అగ్ర రాజ్యాలు అఫీషియల్ గా , అస్సద్ కు వ్యతిరేకమైన తిరుగు బాటు దారులను సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫ్రాన్స్ తోపాటు, అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు ఎప్పుడో తమ విధానాన్ని ప్రజాముఖంగా ప్రకటించారు కూడా. అస్సద్ కు వ్యతిరేకత నిర్మించడం కోసం’ తిరుగుబాటు ఉద్యమ ‘ కారులకు మాత్రమే అగ్ర రాజ్యాలు సపోర్ట్ చేసాయా లేదా ఈ క్రమం లో అదే కారణం కోసం ఐఎస్ ఐఎస్ ను కూడా పోషించారా ? అన్నది ప్రశ్న. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్ ఖైదాను అప్పట్లో అమెరికానే పెంచి పోషించిందని అమెరికా ప్రభుత్వ వర్గాలే ఒప్పుకున్న దృష్ట్యా ఈ ప్రశ్న కీలకమైనది.

ఐతే ఇప్పటికి కూడా – ఐఎస్ ఐఎస్ పారిస్ ను మాత్రమే అటాక్ కోసం ఎందుకు ఎన్నుకోవడం అన్నదాని గురించి ఇంత వరకు నిర్దుష్ట సమాచారం ఏమీ లేదు. వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకటనలో ” పారిస్ వేశ్యా వృత్తికి, ఉంపుడు గత్తెలకు, అల్లా పై అపనమ్మకం ఉన్న వాళ్ళకు నెలవుగా ఉంది ” అని మాత్రమే చెప్పింది.

ఈ వ్యాసం రాసే సమయానికి , ఫ్రాన్స్ జయప్రదంగా రక్కా లో వందల మంది పౌరులను (పారిస్ దాడుల్లో 30 కి మించి ఐఎస్ ఐఎస్ మిలిటెంట్లు చనిపోయి ఉండరని వార్తా కథనం ) పైగా పొట్టన పెట్టుకుని ఐఎస్ ఐఎస్ పై కక్ష తీర్చుకుంది. హాస్పిటల్స్ ను కూడా ధ్వంసం చేసింది. ఐఎస్ ఐఎస్ ఫ్రాన్స్ రాజ్యానికి వ్యతిరేకంగా 130 మంది అమాయకులను చంపితే, ఫ్రాన్స్ ఐఎస్ ఐఎస్ కు వ్యతిరేకంగా ఐఎస్ ఐఎస్ పరిపాలిత ప్రాంతం లో నివసిస్తున్న వందల మంది పైగా అమాయకులను చంపేసింది. ఇక్కడ తేడా ఏముంది ? ఎవరు ఎవరిపై యుద్ధం చేస్తున్నారు ? సిరియా ప్రజలవీ ప్రాణాలే ! పారిస్ ప్రజలవీ ప్రాణాలే ! యుద్ధం మొదలైందని చెప్పుకుంటే – ఒకరి ప్రాణాలకు మాత్రమే సింపథీ ఎందుకు వస్తుంది ఇక ? ఇది యుద్ధం కదా ?!…ఎవరో ఒకరు… సంబంధం ఉన్నా లేకున్నా చావాల్సిందే ! సద్దాం లాంటి వాళ్లను యుద్ధ నేరస్తులుగా ప్రకటించారు గాని , బుష్ , ఒబామా, పుతిన్, హోలాండ్ లాంటి వాళ్ళను మాత్రం ఎందుకు స్పేర్ చేయాలి ?

ఐఎస్ ఐఎస్ అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు నుండి పుట్టుకొచ్చింది. అదే అమెరికా , అమెరికా వ్యతిరేక అస్సద్ ప్రభుత్వాన్ని సివిల్ వార్ లో కూల దోయడానికి ఐఎస్ ఐఎస్ ను పరోక్షంగా కొంత ప్రత్యక్షంగా కొంత operate చేసింది. అమెరికా తో పాటు, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా అస్సద్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు దారులను ప్రోత్సాహించే కారణం తో , ఐఎస్ ఐఎస్ ను బల పరుస్తున్నారనే వాదనలో నిజం ఉన్నట్టే తెలుస్తుంది. అంతర్జాతీయ ఇంటెలిజన్స్ వ్యవస్థ collude అవ్వడం వల్ల, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల ప్రతి ఒక్క ఆరోపణ విచారణకు నిలబడలేకపోతుంది.

మత ఛాందస వాదం ప్రపంచ మానవుల జీవితాలను దిన దిన గండంగా చేసే దిశ వైఫు అడుగులు వేస్తున్నాయి. ఐతే మరి మార్కెట్ ఛాందస వాదం చేస్తున్న దేమిటి ? ఈ వ్యాసం ఉద్దేశ్యం సరిగ్గా మత ఛందస వాదానికి, మార్కెట్ ఛాందస వాదానికి ఉన్న అనుబంధాన్ని గురించి ఆలోచింపజేయడమే. ఇప్పటి వరకు ఏ దేశానికి వ్యతిరేకంగా , కాంక్రీట్ గా విచారణకు నెలబడగలిగే ఆధారం లేకపోవడం వలన సోర్స్ ప్రస్తావించి నిరూపించలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఒకటి మాత్రం ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ద్వేషం, అత్యాశ కు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపారం !!

ఐతే ఖచ్చితంగా మత ఛాందస వాద సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు తట్టే ప్రశ్నలకు అటు తిరిగి , ఇటు తిరిగి మార్కెట్ ఛాందస వాదం గురించే ఆలోచించాల్సి వస్తుంది. మత ఛాందస వాదం కౄరమైనదే ! మార్కెట్ ఛాందస వాదం నీచమైనదే !!

మరి ఆ రెండు అమానవీయ దృక్పథాలు కలిసి పని చేయాలనుకుని నిర్ణయించుకుంటే ???

– పి. విక్టర్ విజయకుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

పురుషుల కోసం ప్రత్యేకం, వ్యాసాలుPermalink

14 Responses to మతం గడపకు మార్కెట్ ముగ్గులు !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో