నా జీవనయానంలో …..స్కూల్ ఫైనల్ …3 – కె. వరలక్ష్మి

నా జీవనయానంలో …..స్కూల్ ఫైనల్ …3

నా స్కూల్ ఫైనల్ క్లాసులు మొదలైనప్పటి నుంచీ మా వీధి బడ్డీ మీద ఎవరో పువ్వులు పెట్టడం మొదలుపెట్టేరు . మొదట్లో అవి ఎవరో దిష్టి తీసిన పూలనుకుని మా నాన్నమ్మ తిట్టుకుంటూ ఉదయాన్నే తుడిచి పారేసేది . ఒక గులాబీనో , రెండు చేమంతులో , గుప్పెడు మల్లె పూలో ఉండేవి . చూస్తే అవి తెల్ల వారు ఝామునే రాజమండ్రి నుంచి బుట్టల్తో మా ఊరి సెంటర్ కి అమ్మడానికి వచ్చే తాజా పూలు . ఇప్పటికీ ఆ అజ్ఞాత ప్రేమికుడెవరో తెలీదు కాని , నేను మాత్రం ఆ పూలని జడలో తురుముకుని స్కూలు కెళ్లే దాన్ని . ఒకసారి మోహన్ తో అన్నాను “పెళ్లికి ముందు ఒక గులాబీ పట్టుకుని వచ్చేవారు . పెళ్లయ్యాక పూల మాటే మరిచిపోయేరు . ఇంకెవరో ఈ పూలని మా వీధరుగు మీద పెట్టి వెళ్తున్నారు “ అని , అంటే , అతను డిటెక్షన్ మొదలు పెట్టేడు . మా ఇంట్లో ఉన్న రోజు తెల్లవారు ఝామునే లేచి వీధి లోకెళ్లి చూడడం . ఒక రోజు ఆ విషయమై నా క్లాస్ మేట్స్ ఇద్దర్ని ప్రశ్నలు వేసి , వాళ్లకేం తెలీదంటే కలబడి కొట్టేసి వచ్చేడు . మా నాన్న ఈ విషయం తెలిసి తలపట్టుక్కూర్చున్నారు.
అట్ల తద్ది రోజు మా నాన్నమ్మ చీకట్నే లేచి రెండు పొయ్యిల మీద రెండు కుమ్మరి పెనాలు పెట్టి అట్లు పొయ్యడం మొదలు పెట్టింది . వాయనా లివ్వడానికి పదకొండు మంది ముత్తై దువులకి పదకొండేసి చొప్పున అట్లు కావాలి మరి . అవికాక రాత్రి పూజకి ఇరవై రెండు . ఇంట్లో అందరూ తినడానికి బోలెడన్ని అట్లు కావాలి . ముందు రోజు సాయంకాలం మా అమ్మ చెప్పిన పేర్ల ప్రకారం పదకొండు మంది ముత్తై దువులకి అభ్యంగ స్నానం కోసం కుంకుడు కాయలు , నూనె , సున్నిపిండి , పసుపు , కుంకుమ పంచి వచ్చేను . రాత్రి భోజనాల తర్వాత మా నాన్నమ్మ మెత్తగా రుబ్బిన గోరింటాకుని నా రెండు చేతులకీ పెట్టింది . అర చేతిలో రూపాయికాసంత చందమామ , పెద్ద పెద్ద చుక్కలు , వేళ్లకి సగం వరకూ మెత్తేసింది . తెల్లవారే సరికి ఎర్రగా పండిన చేతులకి కొబ్బరి నూనె పూసింది . “ ఇంత ఎర్రగా పండే చేతులకి ఎంచక్కా చూసుకునే మొగుడు రావాలి . నీకేంటే తల్లీ అలాంటి రాక్షసుడు దొరికేడు “ అని కళ్ల నీళ్లు పెట్టుకుంది .

పదకొండు దాటిపోయింది . మోహన్ కుటుంబ సభ్యులెవరూ రాలేదు .వాళ్లు తెచ్చే కొత్త చీర కట్టుకుని పూజ చేసుకోవాలట . మా నాన్న కొట్టుకి పరుగెత్తి ఒక చీర కొనుక్కొచ్చేరు . పసుపు పూసుకుని తల స్నానం చేసి , మా నాన్న తెచ్చిన పసుపు రంగు చీర కట్టుకుని పూజకు కూర్చున్నాను . పూజ ముగిసేక పంతులు గారు నా చేత ఉద్యాపన చెప్పించేరు –

“తల్లి దండనా తండ్రి దండనా కలిగి
అత్త దండనా మావా దండనా కలిగి
భర్త దండనా పుత్ర దండనా కలిగి నా జీవితం శుభో జయంగా గడవాలి “ అని , అన్ని దండనల తర్వాత శుభమేమితో , జయమేమితో అని ఆలోచించే వయసు కాదప్పుడు , ఒక కాలు వెనక్కి మడిచి ఒంటి కాలి మీద నిలబడి వెనక్కి చేతులు పెట్టి ఒక్కొ క్కళ్ళకీ పదకొండేసి అట్లు , పదకొండేసి అరటి పళ్ళు , పసుపు – కుంకుమ , జాకెట్టు ముక్క పంచె సరికి నీరసంతో సొమ్మ సిల్లిపోయేను . రాత్రి చుక్క పొడిచే వరకూ ఉపవాసంతోనే ఉండి , జాజాలు – పూలతో చెరువు ఒడ్డున ఇసుకతో పసుపుతో చేసిన నీటి గౌరమ్మను పూజించి , ఇంటి కొచ్చి దేవుడి గదిలో ఇంటి గౌరమ్మను పూజించి నెయ్యి , బెల్లం తో ఒక అట్టు తిని ఉపవాసం ముగించి అలసటతో పక్క మీద వాలిపోయేను . తర్వాతి రోజుల్లో ఈ సంఘటనలతోనే “ఇదా పెళ్లంటే ?” కథ రాసేను .

అలా మొదలు పెట్టిన అట్ల తద్ది నోముని భర్తగారి ఆయురారోగ్యాల కోసం పదకొండేళ్లు నోచి తీరాలి . నోచేను కూడా .
అంతలో మా పెద్ద నాన్నగారమ్మాయి నూక రాజుకి పెళ్లి కుదిరింది . వాళ్ల కుల సంప్రదాయం ప్రకారం అబ్బాయి ఇంట్లోనే పెళ్లి పెట్టుకున్నారు .

నూకరాజుకీ నాకూ బంధుత్వం కన్నా స్నేహం ఎక్కువ . అది నన్ను పెళ్లికి తప్పకుండా రావాలని పట్టు పట్టింది . పెళ్లి రోజు ఉదయాన్నే మా పక్కింటి శేషమ్మ నాదుబ్బు జుట్టుకి కొబ్బరి నూనె పట్టించి నెత్తి పైన నాగారం పెట్టి ఈత పాయల జడ వేసింది . జడ మధ్యలో బంగారు చేమంతి పువ్వు పెట్టి , జడలో కనకాంబరాల మాల తురిమింది . నా పెళ్లి చీర కట్టుకుని మా అమ్మ నాన్నల్తో నేనూ వెళ్లేను . ఉదయం పదకొండు గంటలకి ముహూర్తం . మధ్యాహ్నం భోజనాల తర్వాత మా అత్తవారింటి కెళ్లి కన్పించి సాయంకాలానికి ఇంటికి చేరుకోవాలని అనుకున్నాం . బైపాస్ రోడ్డు పక్కనే పెళ్లి కొడుకు ఇల్లు . ఇంటి వెనక వాకిట్లో పెళ్లి . మోహన్ కుటుంబం వాళ్లెవరూ రాలేదు . నేను పందిట్లో పెళ్లి కూతురు పక్కనే కూర్చుని ఉన్నాను .హఠాత్తుగా పందిట్లో మోహన్ ప్రత్యక్ష మయ్యేడు . నేను హుషారుగా లేచి తన దగ్గరకి పరుగెత్తేను . “ మన వాళ్లెవరూ రాలేదా ?” అన్నాను అతని వెనక చూస్తూ .” నిన్నెవడు రమ్మన్నాడు ? అన్నాడతను కోపంగా . నేనేం చెప్పినా అతను గొడవ పెట్టేస్తాడని భయం వేసి “ ఈత పాయల జడ వేసుకున్నాను , బావుందా ?” అన్నాను జడ గంటలు ముందుకు వేసుకుని .” కప్పుల బాడీ కూడా వేసుకోక పోయేవా , అచ్చంగా మీ పక్క ఊరు పెద్దాపురం భోగం దానిలా ఉందువు “ అన్నాడతను కసిగా . నేను దెబ్బ తిన్న పక్షిలా చూసేనతని వైపు . పొంగి వస్తున్న కన్నీళ్లని కళ్ళల్లోనే కుక్కుకున్నాను . నా చెయ్యి పట్టుకుని ఆ పక్కనే ఉన్న స్టోర్ రూం లాంటి చిన్న గదిలోకి లాక్కెళ్లేడు. దాంట్లో పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ పెట్టి ఉన్నాయి . ‘కామాతురాణాం ..’ అన్నట్టు అతనికి ఉచ్చం నీచం అనేవి తెలీకుండా పోయాయి . అంతలో ఎవరో వచ్చి తలుపు కొట్టి , మమ్మల్ని చిత్రంగా చూస్తూ కొబ్బరి బొండాల పళ్లెం పట్టుకెళ్లేరు. నాకు తల కొట్టేసినట్టయింది .బైటి కెళ్లి పోబోయేను . నా జడని చేతికి చుట్టుకుని , మరో చేత్తో పీక నులిమేస్తూ నన్ను ఆపేడు , అంతలో ఇంకెవరో వచ్చి తలంబ్రాలు ,సూత్రాలు పట్టుకెళ్లేరు .”పెళ్లికి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి . ఇలాగ తలూపేసుకుంటే ఎలాగ ?” అని విసుక్కుందావిడ . నేనావిడ కన్నా ముందే బైటికొచ్చేసి మా అమ్మ దగ్గర కెళ్లి కూర్చున్నాను . నా రేగిన జుట్టు , కళ్లల్లో నీళ్లు చూసి మా అమ్మ విషయం గ్రహించింది . అతను నా దగ్గరకొచ్చి “ బైటి కెళ్దాం పద “ అన్నాడు . “పెళ్లై పోనియ్ బాబూ , తీసుకెల్దువు గాని” అంటూ మా అమ్మ ఏదో చెప్పబోయింది . “కుదరదు , ఇప్పుడే రావాలి “ అని ఆడ వాళ్ల మధ్య నుంచి అవతలికెళ్లి నుంచున్నాడతను . “చిన్న కుర్రోడు , పోన్లే పాపం “ అంటూ ఎప్పుడూ అతన్ని వెనకేసుకొచ్చే మా అమ్మకి చిరాకొచ్చిందతని మీద . “ ఎళ్లు తల్లీ , ఈ పందిట్లో ఏం గొడవ చేసేత్తాడో అంటూ నావొంటి మీది నగలన్నీ తీసేసి పంపించింది . ఇంట్లో వాళ్లు అతన్ని అలా అనుకోవడం నాకు అదీ బాధగానే ఉంటోంది . బైపాస్ రోడ్డులో ఎడమ వైపుగా నడిచి మూడు సినిమా హాల్స్ వైపు దారి తీసాడు . స్వామీ లోనో , అశోకా లోనో ‘ దాగుడు మూతలు ‘ ఆడుతోంది . జేబులో డబ్బులు లేవనుకుంటాను , నేల టిక్కెట్లు కొన్నాడు . నేల టిక్కెట్టు అర్ధ రూపాయి ఉండేదని గుర్తు . స్కూలు పిల్లల బెంచీ ల్లాంటి పొట్టి బెంచీలు కొన్ని , మిగిలిందంతా నేల , మార్నింగ్ షో కావడం వల్ల శుభ్రంగానే ఉంది . ఒక బెంచీ మీద నేను చివరి కొచ్చేలా కూర్చున్నాం . పొద్దుట పెళ్లి వాళ్లు పెట్టిన ఉప్మా ఎప్పుడో అరిగిపోయింది . ఆకలేస్తోందని చెప్పేను . ఇంటర్వెల్లో జేబులోని చిల్లరంతా తీసి పల్చగా జామ్ రాసిన ఒక బ్రెడ్ శాండ్విచ్ కొన్నాడు . చెరిసగం తిని , వన్ బైటు టీ తాగేం . సినిమా ముగిసే ముందు వెనక బెంచీ వాడెవడో నా మీదికి కాళ్లు పెట్టడం మొదలుపెట్టేడు . అంతే , ఒక్క ఉదుటున లంఘించి వాడితో కలియబడ్డాడు . నేను భయంతో కారిడార్లోకి వచ్చేసేను . కాస్సేపటికి వగుర్చుకుంటూ బైటి కొచ్చి ‘పద ‘ అన్నాడు . నెత్తి మాడుస్తున్న ఎండలో జాంపేట చర్చి పక్క నుంచి గోదారి గట్టు వైపు దారి తీసేడు . అసలే మూడ్ బాగా లేదు , పెళ్ళింటి కెళ్దామా అంటే ఏం తంటానో అని మౌనంగా ఉండిపోయేను . మార్కండేయేశ్వరాలయం ముందున్న రావి చెట్టుకింది మెట్ల మీద చతికిల బడ్దాం . అప్పటికి పాత రైలు బ్రిడ్జి ఒకటే ఉండేది . ప్రవహిస్తున్న గోదావరినీ , వచ్చే పోయే రైలు బళ్లనీ చూస్తున్నానే కాని నాకు కడుపులో రైళ్లు పరుగెడుతున్నాయి . అతనో రెండు సిగరెట్లు తగలేసాక మళ్లీ నడక మొదలు , పుష్కరాల రేవు ముందు నుంచి దేవీ చౌక మీదుగా ఆర్ట్స్ కాలేజ్ చేరుకున్నాం . కాలేజ్ లో ఏదో ఫంక్షన్ జరుగుతోంది . అక్కడ బిస్కెట్స్ , మిక్స్చర్ తిని , టీ తాగేక కాలేజ్ అంతా తిప్పి చూపించేడు . తిరిగి ఫంక్షన్ హాల్లోకి వచ్చేక ఎవరో వెనక నుంచి ‘ కాకి ముక్కుకి దొండపండులా ఉందిరోయ్ జంట ‘ అన్నారు . మోహన్ కోపంగా వెనక్కి తిరిగే లోపలనే అతని చెయ్యి పట్టుకుని బైటికి తీసుకొచ్చేసేను .మా పెళ్లి జరిగిన మూడో రోజు రాజమండ్రిలో బస్సు దిగి రిక్షాల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కొందరు అటుగా వెళ్తూ ఇలాగే అన్నారట .” నువ్వేమైనా పెద్ద అందగత్తె ననుకుంటున్నావా , పట్కా మొహం నువ్వూను , ఎర్ర తోలు ఉండగానే సరా ?” అన్నాడు . వాళ్లెవరో అన్నదాంట్లో నా ప్రమేయం ఏం ఉందో నాకర్ధం కాలేదు , నాక్కూడా వాళ్లన్నది బాధగానే అన్పించింది ” లేదు లేదు , నేను అందగత్తెనని అనుకోవడం లేదు . నా కన్నా మా చెల్లి బావుంటుందని అందరూ అంటూంటారు . అయినా పాతికేళ్లు దాటితే మీరు నా కన్నా బాగుంటారట – మా అమ్మ అంటూంటుంది. రంగుదేం ఉంది “ అంటూ ఏమిటేమిటో వాగేసేను అతన్ని చల్లబరచాలని .

కాలేజ్ గ్రౌండ్ లో కాస్సేపు తిరిగి గాంధీపురం మీదుగా నడిచి వాళ్ల అమ్మమ్మ గారింటికి చేరుకునే సరికి చీకటి పడింది . కూతుళ్లందరూ ఎవరిళ్లకి వాళ్లు వెళ్ళిపోయేరట . పెద్దావిడ కూడా ఇంట్లో లేరు . పెద్ద గది తాళం వేసుంది . నడవాలో లైటు వేసే సరికి వాల్చి ఉన్న మురికి మడత మంచం మీదా , గోడల మీదా పాకుతూ వందల కొద్దీ నల్లులు కన్పించాయి . ఓ గంట ఆ నరకంలో గడిపి బైటి కొచ్చేసి స్టేడియంకి అవతలున్న ఓ కిళ్లీ బడ్డీ దగ్గరకెళ్ళేం . అతన్ని ఐదు రూపాయలు , ఓ సిగరెట్టు పేకెట్టు అడిగేడు మోహన్ . అతను సిగరెట్టు పేకెట్ ఇచ్చేడు కాని , ఒక్క రూపాయే ఉందని ఇచ్చేడు .అతనే మోహన్ అప్పు పెట్టే కిళ్ళీ కొట్టువాడు . అతని బాకీ తీర్చడానికే నా నెక్లెస్ తెచ్చేసాడు .
మళ్లీ నడిపించి కంభాల చెరువు దగ్గర బస్సెక్కిస్తే ఇంటి కొచ్చి పడ్డాను . మా అమ్మా వాళ్లూ సాయం కాలమే వచ్చేసేరట .

– కె. వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నా జీవన యానంలో..., , , , , , , , , , , , , , , , Permalink

One Response to నా జీవనయానంలో …..స్కూల్ ఫైనల్ …3 – కె. వరలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో