రచయత;మల్లాదివెంకటకృష్ణమూర్తి
సమపర్తి కిరాయి హంతకుడు, ఆయన అసలు పేరు దివ్యకాంత్. కాని అవసరాన్ని బట్టి చాలా మారు పేర్లు ఉపయోగిస్తాడు.1.0.6 క్లబ్లో ఆక్టివ్మెంబర్. సమపర్తికి చంపే పని అప్పగించే సంస్థ పేరది. ఆయనలో హాస్య చతురత ఉంది,. సంస్కారం ఉంది. మనుషుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోగలడు. డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలో, ఎలా ఖర్చు చేయాలో తెలుసు. బాగా మేధావి. కూతురు నీతికను ప్రాణంగా చూసుకుంటాడు. ఆయన చదరంగం నేర్పే స్కూల్ని నడుపుతున్నాడు. అది ఆదాయం కోసం కాదు అభిరుచిమేరకి. ఇంకా కిరాయి హంతకుడిగా తను సంపాదించే డబ్బును వైట్చేయటానికి. చదరంగంలో చాలా నేర్పరి .స్కూల్ నడపటమే కాదు సమ ఉజ్జీలతో ఆడుతుంటాడు కూడా. తనకు తెలిసిన ఏ భాషలో మాట్లాడినా మాతృభాష అనుకునేలా మాట్లాడగలడు. చాలా మేధావి.
నీతిక సమపర్తి ఏకైక కుమార్తె.తండ్రీ కూతుర్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం.తల్లి నీతిక చిన్నప్పుడే చనిపోతుంది.తండ్రి అనేక సార్లు ఊళ్ళకు వెళ్ళటము, ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళే పెట్టెలల్లో కత్తులను చూడటము, మధ్యన ముడివేసిన స్కార్ఫ్లను చూడటము నీతికకు అనుమానం కలిగి సమపర్తిని అడుగుతే తను కిరాయి హంతకుడు అని ఒప్పుకుంటాడు. అప్పటి వరకూ చాలా హత్యలు ఎక్కడా పట్టుబడకుండా నేర్పుగా చేసిన వాటి గురించి చెబుతాడు. నీతికకు బాధ కలుగుతుంది. ఆయన మూలంగా ఇంకా కొందరు హత్య చేయబడకూడదు అని నిర్ణయించుకొని , కొద్ది వారాలుగా ఆలోచించి, కష్టము, బాధాకరమే ఐనా తండ్రి మీద పోలీసులకు పిర్యాదు చేయాలని కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. తండ్రి మీద ఎంత ప్రేమ ఉన్నా ఇంకా కొన్ని ప్రాణాలు పోకూండా కాపాడాలని అనుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తండ్రి హంతకుడు అని చెబితే వాళ్ళు పట్టించుకోలేదు. చివరకి సి.ఐ.డి ఏ.సి. ఇంద్రజిత్ ఆమె మాటలని నమ్మాడు.
ఈ తండ్రీ కూతుళ్ళిద్దరూ మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన నవల “యమదూత” లోని పాత్రలు. వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా అద్భుతంగా వ్రాశారు మల్లాది. అంతటి అభిమానం ఉన్న తండ్రి మీద కూతురు ఎందుకు పిర్యాదు చేసింది?
అసలు 1.0.6 క్లబ్ అంటే ఏమిటి ?
ఆమె తండ్రి నిజంగా హంతకుడా?
చదరంగం పిల్లలు ఎందుకు ఆడాలి?
సమపర్తిని పట్టుకుంటార ? ఇవన్నీ తెలవాలంటే “యమదూత ” చదవాలి.
మిస్టర్వి, శనివారం నాది ,విలన్లాంటి ఎన్నో క్రైం నవలలు వ్రాసిన మల్లాది నుంచి వెలువడిన మరో క్రైం నవల “యమదూత.” ఇందులో సమపర్తి కిరాయి హంతకుడిగా ఎందుకు మారాడో , ఎలా హత్యలు చేస్తాడో, హత్యానంతరం పోలీసులకు దొరకకుండా ఎలా తప్పుడు ఋజువులు పెట్టి తప్పించుకుంటాడో ఆసక్తిగా చెబుతారు మల్లాది. చదరంగం మీద విపులంగా రాసిన నవల నేను చదివినది ఇదొక్కటే! శ్రీపాద వారి వడ్లగింజలు నవలలో , యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల నవలలో కూడా చదరంగం గురించి వ్రాసారు కాని ఇంత విపులంగా లేదు. చదరంగం మీద ఇంకేవైనా నవలలు వచ్చాయేమో నాకు తెలీదు. క్రైం, సస్పెన్స్ , ప్రేమ ప్రధాన అంశాలుగా గల మంచి ఎంటర్టేన్మెంట్ నవల యమదూత.
మల్లాది గురించి కాని, ఆయన రచనా శైలిని గురించి కాని కొత్తగా చెప్పేందుకు ఏముంటుంది?
తెలుగు నవలా పాఠకులకు అభిమాన రచయిత.
-మాలా కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~