నా కళ్ళతో అమెరికా-48 – కె .గీత

సియాటిల్- భాగం-3(తులిప్ ఫెస్టివల్)

ఏప్రిల్ నెలలో కనువిందు చేసే తులిప్ ఫెస్టివల్ సియాటిల్ కు దగ్గరలో స్కాజిట్ వాలీ జరుగుతుందని తెలిసే ఈ ప్రయాణానికి సిద్ధమయ్యేము కనక ఆ రోజు ఉదయం నా ఉత్సాహం అంతా ఇంతా కాదు.
అసలే ప్రకృతి ఆరాధకురాలిని, పూల ఉత్సవం అంటే ఆనందం పొంగి రాదూ!

సియాటిల్ నగరానికి 20 మైళ్లు దక్షిణంగా ఉన్న ఎయిర్పోర్టుకి దగ్గర్లో మా బస కావడంతో మళ్లీ నగరం మీంచి ముందు రోజు చూసిన సాగరపు కొసని రాసుకుంటూ ఉదయం మా ప్రయాణం మొదలుపెట్టేం. మధ్యాహ్నం పన్నెండు గంటల వేళకి స్కాజిట్ వేలీకి చేరుకున్నాం. మేం వెళ్లింది ఏప్రిల్ మూడో వారం కావడం వల్ల ఇక దాదాపు తులిప్ పూల సీజన్ అయిపోవస్తున్నట్టే. ఈ పూలు కేవలం ఏప్రిల్ నెలలో ఆ నాలుగు వారాలే కనువిందుచేయడం విశేషం.

తులిప్ ఫెస్టివల్ – రూజెన్ గార్డెన్:– స్కాజిట్ వేలీ లో ప్రధానంగా చూడవలసిన తులిప్ పూల గార్డెన్లు రెండు ఉన్నాయని విజిటింగ్ సెంటర్లో ఆగి తెలుసుకున్నాం. ముందుగా ప్రఖ్యాతి చెందిన రూజెన్ గార్డెన్ కి వెళ్లాం. మనిషికి $5 డాలర్లు టిక్కెట్టు. పార్కింగు ఫ్రీ.
గార్డెన్ ని ఆనుకుని రోడ్దుకు మరో వైపు ఉన్న పార్కింగులో కారు పెట్టి రోడ్డు దాటి గేటు దగ్గిరికి వచ్చేసరికే అందమైన రంగు రంగుల బల్బుల్లాంటి పూలు సంతోషంగా తలలూపుతూ కనిపించాయి.

దాదాపు అయిదు వందల మంది వరకూ ఉండి ఉంటారక్కడ. కనుచూపుమేర ఎక్కడ చూసినా రంగు రంగుల తులిప్ పూల వరుసల్తో అదేదో దేవలోకమన్న అనుభూతి కలిగింది.
ఎకరాల మేర అద్భుతమైన పూల పంట. మొదటి సారిగా అమెరికాలో వ్యవసాయ క్షేత్రాలలోకి నడిచి వెళ్ళిన అనుభవం ఇక్కడే కలిగింది.

ఎంట్రన్స్ లో ఉన్న చిన్నగార్డెన్ ని దాటి, పెద్ద పొలాల మధ్య ఉన్న పెద్ద నడిచే బాట గుండా ఒకటే నడక. పూల మధ్య నుంచి మనిషి నడవగలిగిన దారులుండి నడిస్తే కాళ్లని తాకే తడిదేరిన మట్టి పరిమళమొకటి.
మా అమ్మ నాతో ఉండడం నాకు బాగా సంతోషాన్ని కలిగించింది. ఇంతటి సౌందర్యాన్ని తనకీ చూపించగలిగాననే సంతృప్తి ఆ ఆనందానికి కారణం అనుకుంటా. సిరి ని వదలగానే పూల మధ్య గట్ల మీంచి పరుగులు తీసి చటుక్కున ఒక పువ్వు తెంపేసింది. ఇక పిల్లని తో పుడు బండీలో కూచో బెట్టుకుని ముందుకు నడిచాం.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి .

ఆ పూట నేనక్కడ పూల గట్ల వెంబడి సౌందర్యారాధకురాలినై తిరుగాడాను.

సత్య వేగంగా ఆ కొస నుంచి ఈ కొస వరకూ వాక్ కి వెళ్ళొస్తానని వరుని తీసుకుని ముందు వెళ్ళిపోయేడు. మా అమ్మ, నేను స్థిమితంగా ఫోటోలు తీసుకుంటూ అబ్బురంగా ప్రతీ పువ్వునీ చూసుకుంటూ మెలగ్గా నడవడం మొదలు పెట్టేం.
అన్నిటికన్నా విశేషం చక్కగా ఎండ కాయడమని అంతా చెప్పుకోగా విన్నాం. సియాటిల్ చుట్టుపక్కల ఎప్పుడూ వర్షాలు పడతాయట. కానీ మా అదృష్టం కొద్దీ మంచి ఎండ కాస్తూంది ఆ రోజు. పొరబాటున అక్కడ వర్షం లో చిక్కుకుంటే చిన్నపిల్లతో బాగా ఇబ్బంది పడే వాళ్లం. అమెరికాలోవానంటే ఆహ్లాదంగా ఉండదు. ఎముకలు కొరికే వాన చల్లదనానికి ఏవీ ఆస్వాదించలేం.
తులిప్ టౌన్ :- రెండు గంటల ప్రాంతంలో అక్కణ్ణించి తులిప్ టౌన్ అనే తులిప్ గార్డెని చూడడానికి వెళ్లాం. ఇక్కడ కూడా అక్కడి లాగానే టిక్కెట్టు తీసుకున్నాం. అయితే ఇక్కడి గార్డెన్లు అక్కడంత పెద్దవి కావు. కానీ చాలా రకాల రంగులు ఉన్నాయిక్కడ. అదీగాక అప్పటికే ఏప్రిల్ మూడవ వారం కావడంతో చాలా పూల వరుసలు మొదలు కూడా లేకుండా కత్తిరించేసారు.

అప్పటికే అందరికీ ఆకలి వేస్తూంది. అయినా ఒక గంట పాటు ఓపికగా తోట చుట్టూ తిరిగేం. మట్టిలో తిరుగుతూ పూలని కళ్ల నింపుకూంటూ అలా మైమరిచి అందరం తిరుగుతూనే ఉన్నాం. సిరి కార్టులో బాగా పేచీ పెడ్తూండడం తో కాస్సేపు వదిలాం. ఇలా వదలడం పాపం మొక్కల మధ్యకు పరుగెత్తేసింది. పెద్ద వాళ్లు వెళ్లలేని దారిలో మొక్కల మధ్యకు పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ పిల్లని అక్కణ్ణించి బయటకు లాగేసరికి తల ప్రాణం తోకకొచ్చింది మాకు. ఒల్లంతా మట్టికొట్టుకుపోయి వచ్చిన పిల్లని చూస్తే మాకు నవ్వాగలేదు. చెప్పక పోవ డమేం, నాకు కూడా అలా మొక్కల మధ్యకి వెళ్ళిపోయి, పూలని ఒళ్ళంతా కప్పుకుని, పూలని ఆకాశమంతా నింపి, నేలంతా పరిచి మైమరిచి పోవాలనిపించింది. ఇంతవరకూ నేను ఎన్నో పూల మొక్కలని చూసేను. కానీ తులిప్ పూల అందమే వేరు.

విచ్చుకోని పెద్ద మొగ్గల్లా రంగుల హరివిల్లు విరిసినట్లు గొప్ప సౌందర్యంతో వికసించిన పుష్పాల్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఎంత సమయమైనా సరిపోదు.

ఇక భోజనానికి అక్కడే ఉన్న చిన్న రెస్టారెంటులో పీజాలతో భోజనం కానిచ్చాం. తాత్కాలికంగా నిలబెట్టిన గోడలకి ఉన్న యూరోపియన్ పద్ధతిలోని పెయింటింగులని చూస్తూ కాస్సేపు, గిఫ్ట్ షాపులో అటూ ఇటూ తిరిగి చూస్తూ కాస్సేపు గడిపేం. గాజుతో తయారు చేసిన తులిప్ పూల సెట్టుని గుర్తుగా కొన్నాను నేను. చిన్నవేజ్, అందులో మూడు తులిప్ పూలతో ఉన్న బుల్లి గాజు బొమ్మలవి. భలే ముద్దుగా అందం గా ఉన్నాయి.

అక్కణ్ణించి కదిలి వెళ్ళాలనిపించకపోయినా తప్పని సరి కాబట్టి కదలాల్సి వచ్చింది.
కెనడా బోర్డరు:- అక్కణ్ణించి ఇంకా మరో అరవై మైళ్ళు ప్రయాణిస్తే కెనడా బోర్డరు వస్తుంది. అయితే సమయం సరిపోతుందో, లేదో అని ఆలోచనలో పడ్డాం. అప్పటికి నాలుగు కావస్తూంది. పొద్దు పోవడానికి ఇంకా చాలా సమయం ఉండడం తో కనీసం కారులో నించైనా బోర్డరు చూసి వచ్చేద్డామని నేను అటు వైపు కారు పోనిచ్చాను. అదెంత మంచి పనో అక్కడికి వెళ్తే గానీ మాకు అర్థంకాలేదు.

నాకు తెలిసిన ఒక యువ జంట అక్కడ మాకు తారస పడ్డారు. మేం ఇలా బోర్డరు వైపు వెళ్తున్నామని తెల్సి వాళ్ళు మాకంటే మరో గంట తర్వాత మా వెనకే బయలుదేరారు.

ఇక మేం ఎక్కడా ఆగకుండా తిన్నగా కెనడా బోర్డరన్న ఊరికి చేరుకున్నాం. ఆ ఊరి పేరు బ్లెయిన్. సరిగ్గా ఆ ఊరు దాటి ఫ్రీవే ఎక్కేమంటే కెనడా వైపు వెళ్లిపోతాం. పొరబాటున అటు వెళ్ళేమంటే ఇక మా పని అంతే సంగతులన్న మాట. తిరిగి రావాలంటే వీసా కావాలి. అయితే డ్రైవ్ చేస్తున్న నేను చప్పున ముందు జంక్షను లోనే మెలుకువతో పక్కకి మలుపు తీసుకున్నాను.
పీస్ ఆర్క్ స్టేట్ పార్కు:- మేం వెళ్లాల్సిన కెనడా బోర్డరు లో ఉన్న “పీస్ ఆర్క్ స్టేట్ పార్కు” (Peace Arch State Park) కు ఆ ఫ్రీవే ఎక్కేందుకు వెళ్లే బ్రిడ్జి మీదుగానే వెళ్లి, ఇమ్మిగ్రేషన్ బోర్డు వైపు కాకుండా మళ్లీ ఊరిలోకి వెళ్ళే మలుపు తీసుకోవాలి. అది దిగేక వచ్చే నాలుగైదు మలుపులు చిన్న రోడ్ల లోంచి వెళ్తే కనిపించే ఇమ్మిగ్రేషన్ ఆఫీసులున్న సందు దాటుకుని లోపలికి వెళ్తే కనిపించే మామూలు రెసిడెన్షియల్ పార్కు లో కారు పార్కు చేసి కిందికి కాళీ నడకన దిగితే పెద్ద ఆర్క్ కనిపిస్తుంది. ఇదంతా కనుక్కోవడానికి చాలా కష్ట పడాలి.

మొత్తానికి మేం ఎవరో ఆన్లైనులో రాసిన కొండ గుర్తులని చదివి చివరికి పార్కుకి చేరుకున్నాం. అక్కడొక పోలీసు కారులో కాపలా కనిపించేడు. నేను కారు దిగి వెళ్లి ఇలా బోర్డరు చూడడానికి వచ్చామని చెప్పాను. పార్కుకి అటు వైపు ఎదురుగా ఉన్న అవతలి రోడ్డు వైపు చూపించి సింపుల్ గా “అదే కెనడా” అన్నాడు. పిల్ల్లల్ని పరుగెత్తుతూ అటు వైపు పొరబాటున కూడా వెళ్లనివ్వొద్దనీ, అలా కనిపిస్తే ఫైను వేస్తాననీ చెప్పాడు. మేం ఎంత వరకూ వెళ్ళొచ్చో, ఏం చూడొచ్చో వివరంగా చెప్పాడు.
దేశాల సరిహద్దంటే పెద్ద సీను ఊహించుకున్న మాకు అతి మామూలుగా కంచె గట్ర లేకుండా, ఇలా పార్కులాగా ఉండడం చాలా ఆశ్చర్యం వేసింది.

సిరిని అతి గట్టి గా పట్టుకుని కింది వైపు నడక మొదలెట్టాం. వదిలేస్తే ఖచ్చితంగా బాణంలాగా దూసుకుపోతుందా పిల్ల. పార్కుని ఆనుకుని ఉన్న రోడ్డుని దాటి బోర్డరు కనిపించే చోట పెద్ద ఆర్చ్ ఎదురుగా ప్రత్యక్షమైంది. అక్కడ ఇరు వైపులా యూ. ఎస్. ఏ , కెనడా అని ఉన్న రాళ్ల దగ్గర ఫోటోలు తీసుకున్నాం. కాలు అటు పెట్టొద్దని మమ్మల్ని సత్య హెచ్చరించినా నేను వినిపించుకోకుండా కెనడా వైపు ఒకడుగు వేసొచ్చాను. పోలీసు చూసి ఉంటాడేమోనని సత్య ఒకటే భయపడ్డాడు. అక్కడ ఆర్క్ లో తెరిచి ఉన్న గేటు కి ఉన్న గోడల పై ఒకవైపు ” Children of a Common Mother”, మరోవైపు “May these gates Never be Closed” అని రాసి ఉంది.

ఆ రోజు చూసిన తులిప్ పూల వనాలు ఒక ఎత్తైతే, ఈ సరిహద్దు మరొక ఎత్తు. ఎందుకో అంతటి ఆనందమూ, ఉత్సాహమూ కలిగాయిక్కడ. ఎంత సేపు గడిపినా తనివితీరని తనం వెంటాడింది.

ఇక మేమే ఇంత కష్టాలు పడి దారి కనుక్కున్నామేమో, మా వెనకే వచ్చిన జంట పాపం ఊర్లో చక్కర్లు కొడ్తూ, పది సార్లు ఎలా రావాలని ఫోన్లు చేసేరు. వాళ్ళు పొరబాటున కెనడా వైపు వెళ్లిపోకుండా సాధ్యమైనంత వరకూ దారి వివరంగా చెప్తూనే ఉన్నాను. తీరా వాళ్లొచ్చే వరకూ మేం అక్కడ ఉండడం కుదరలేదు. ముందు ప్రదేశాలు మనం చూడకుండా ఎవరికీ ఇలా సలహాలు ఇవ్వకూడదని అర్థమైంది.

సూర్యాస్తమయం తో బాటూ కొద్దిగా చలి కూడా మొదలయ్యింది. పైగా మాకు కారు పార్కింగు మరో ప్రాబ్లం కావడంతో అక్కణ్ణించి త్వరితంగా బయలుదేరి కనుచూపుమేరలో ఊరిని ఆనుకుని ఉన్న సముద్రతీరానికి వెళ్ళాం. అది అలలతో ఎగిసిపడే సముద్ర తీరం కాదు. వెనక్కు భూమార్గం లోకి చొచ్చుకు వచ్చి బురద తెట్టు పట్టిన చెరువు లాంటి సముద్ర తీరం. ఉత్తర అమెరికా ఖండంలో రెండు అతి పెద్ద దేశాల జల సరిహద్దు అది.

నిజానికి కారు బయటకు దిగి అక్కడి సూర్యాస్తమయంలో ప్రశాంతంగా తీరంలో కాలిబాట మీద అలా నడిచి రావాలన్న తాపత్రయం కలిగింది. కానీ ఉదయం నించీ తిప్పటతో అలిసి పోయిన పిల్లలల్ని కనీసం భోజనం సమయానికి సియాటిల్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉండడం వల్ల పదినిమిషాల్లో బయలుదేరాం.

మా అమ్మకు, నేను తీరంలో అందంగా రంగులద్దుతున్న సూర్యాస్తమయాన్ని, సంధ్య వెలుగులో మెరిస్తూన్న పీస్ ఆర్క్ అందమైన దృశ్యాన్ని అలా తన్మయంగా చూస్తూ ఉండిపోయాం ఆ కాస్సేపూ. ఇంతలో కెనడా నించి ఆర్క్ మీదు గా అమెరికా వస్తున్న రైలు కనిపించింది. బోర్డరు చెకింగు, దాటి అది ఊర్లోకి వచ్చేంత వరకూ అబ్బురంగా చూసి బయలుదేరేం.

రాత్రి ఎనిమిది గంటల వేళ హోటలుకి చేరి భోజనాలకి బయటకు వెళ్ళొచ్చి పది గంటల వేళ నిద్రకుపక్రమించిన మరుక్షణం నా మనసు తులిప్ పూల తోటల మీంచి ఎగురుతూ సరిహద్దువైపు సాగి సుందర దృశ్యాన్ని కల లారా చూస్తూ పరవశించిందని మళ్లీ చెప్పాలా!!

 

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, యాత్రా సాహిత్యం, , , , , , , , Permalink

One Response to నా కళ్ళతో అమెరికా-48 – కె .గీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో