అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి
మగవారికాలేజిలో చేరిన మొదటి అమ్మాయి ,మొదటి మహిళా హౌస్ సర్జన్ ,బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి మహిళా లేజిస్లేట,ర్ ,రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డ్ కు మొదటి చైర్ పర్సన్ ,శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్, మద్రాస్ కార్పోరేషన్ మొదటి ‘’ఆల్డర్ వుమన్ ‘’ఇలా అన్నిటా ప్రధమంగా నిలిచిన డాక్టర్ ముత్తు లక్ష్మి రెడ్డి ని గురించి తెలుసుకొందాం .
బాల్యం –విద్య:
మద్రాస్ రాష్ట్రం లోని పుదుక్కోట సంస్థానం లో 30-6-1886లో ముత్తులక్ష్మి జన్మించింది. తండ్రి నారాయణ సామి .తల్లి చంద్రమ్మాళ్ .ఆ కాలం లో మహిళలపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి . . తండ్రి నారాయణ సామి మహారాజా కాలేజి ప్రిన్సిపాల్ .చాందస భావాలకు వ్యతిరేకి .అందుకే కూతురు చదువుకు ప్రోత్సహించాడు .యవ్వన దశలో స్కూల్ మాన్పించినా ఇంటి దగ్గర ట్యూటర్ లనుపెట్టి విద్య నేర్పించాడు .కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేస్స్తోంది తల్లి .తాను అందరిలాగా ఉండదలచుకోలేదని తన ప్రత్యేకతను చాటుకోవాలను కొంటున్నానని తల్లికి నిర్మోహ మాటం గా చెప్పింది .మగవాళ్ళ చెప్పు కింద తేలు ల్లాగా పడి ఉంటున్న స్త్రీ జనాన్ని చూసి సానుభూతి ప్రకటించేది .వారికి విముక్తి కలగాలని కోరుకొనేది .మగ పిల్లలకే చదువు ఆడవారు చదువుకోకూడదు అనే దాన్ని బాహాటంగా వ్యతిరేకించింది .మెట్రిక్ పాసై మహారాజా కాలేజిలో చేరటానికి దరఖాస్తు చేస్తే కాలేజిప్రిన్సిపాల్, మగ విద్యార్ధుల తలిదండ్రులు తిరస్కరించారు . .మగ పిల్లల కాలేజిలో ఆడపిల్ల చేరితే వారినిఅనైతికంగా ప్రలోభ పెట్టి విద్యా వ్యవస్థను కలుషితం చేస్తుందని వాళ్ళ భయం .ఆమె స్త్రీకావటం ఒకటి ఆమె తండ్రి ఆధునిక భావాలు కలవాడుకావటం మరోటీ కారణాలుగా వారికి కనిపించాయి .కాని ఇలాంటి సంకుచితభావాలకు అతీతుడైన పుదుక్కొట మహారాజు ప్రిన్సిపాల్ అభ్యంతరాన్ని తోసిరాజని ముత్తులక్ష్మి ని కాలేజిలో చేర్చుకోవటమే కాకుండా ఆమెకు స్కాలర్షిప్ మంజూరు చేశాడు ..తండ్రికి ఆమె స్కూల్ టీచర్ కావాలని ఉండేది. కాని ఆమె కు ఇంకా ఉన్నత ఆశయాలు౦డేవి .
డాక్టర్ ముత్తు లక్ష్మి
ఉన్నత విద్య పూర్తీ చేసి 1907లో మద్రాస్ మెడికల్ కాలేజి లో చేరింది .అక్కడ అన్నిటా ప్రధమంగా నిలిచి తన ప్రతిభను ప్రదర్శించింది .ఎన్నో బంగారు పతకాలను ,ప్రైజ్ లను సాధించింది .1912లో మెడిసిన్ పాసై భారత దేశం లో మొదటి మహిళా వైద్యులలో ఒకరుగా నిలిచింది . మద్రాస్ లోని ప్రభుత్వ మహిళా శిశు వైద్య శాలలో హౌస్ సర్జన్ అయింది .డాక్టర్ సుందర రెడ్డి ని తనకు సమాన గౌరవం కలిగిస్తానని ,తన మనోభీస్తానికి ఎన్నడూ వ్యతిరేకంగా నడుచుకోనని ఆయన నుండి హామీ పొంది ,తన వ్యక్తిత్వాన్ని చాటుకొని1914లో 28 వ ఏట వివాహం చేసుకొన్నది .ప్రసిద్ధ తమిళ హీరో శివాజీ గణేశన్ కు మేనత్త ముత్తులక్ష్మి .అతనికి ఆదర్శ౦ ఆమె అని ఆతను చెప్పుకొన్నాడు .
రాజకీయ అరంగేట్రం:
కాలేజీలో చదివే రోజుల్లో సరోజినీ నాయుడు ఏర్పాటు చేసిన మహిళా సభలకు హాజరై ఉత్త్తేజితురాలైంది ముత్ట్టు లక్ష్మి ..స్త్రీ హక్కులకోసం సరోజినీ చేస్తున్న ఉద్యమాలకు సహకరించింది .తరువాత .అనిబి సెంట్ ,మహాత్మా గాంధీల ప్రభావానికి లోనైంది .ముత్తులక్ష్మిని స్త్రీ శిశు సంక్షేమం కోసం కృషి చేయమని వారు ఆదేశించారు .మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కా కూడదని ఆమె విస్తృతంగా ప్రచారం చేసి వారిలో మార్పు తెచ్చింది .
ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత విద్యనేర్చింది . డాక్టర్ ప్రాక్టీస్ వదిలి ‘’వుమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ‘’ వారి అభ్యర్ధన మేరకు మద్రాస్ రాష్ట్ర శాసనమండలి కి శక్తి హరిహరన్ చేత 1926లో నామినేట్ చేయబడింది . ఇండియా మొత్తం మీద శాసన సభలో ప్రవేశించిన మొట్టమొదటి మహిళగా రికార్డ్ కెక్కింది .తర్వాత డిప్యూటీ చైర్ పర్సన్ గా .ఏకగ్రీవంగా ఎన్నుకో బడింది .ప్రపంచలో నే మొట్ట మొదటి లెజిస్లేచర్ మహిళా డిప్యూటీ చైర్మన్ గా గుర్తింపు పొందింది .’’.మహిళలకు మునిసిపాలిటీ శాసన సభలలో ఓటు హక్కు ఇవ్వాలని గొప్ప ఉద్యమం చేసింది ..’’దేవ దాసి’’వ్యవస్థను నిర్మూలించటానికి .కనీస వివాహ వయస్సును పెంచటానికి ఆమె కృషి అనితర సాధ్యం .మహాత్మా గాంధిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసింది .
సంఘ సంస్కర్త:
.అనాధలు అంటే ఆమె హృదయం ద్రవించేది .మరీ బాలికా అనాధలంటే విపరీతమైన ఆదరణ చూపించింది .అనాధలకు ఉచిత వసతి భోజనాలకోసం ‘’అవ్వై హోమ్’’ను మొట్టమొదటిసారిగా మద్రాస్ లో స్థాపించిన వితరణ శీలి ముత్తులక్ష్మి .ఎన్నో సాంఘిక సమస్యలపై,సంస్కరణ లపై గ్రంధాలు రాసింది .’’శాసనమండలిలో నా అనుభవాలు ‘’అనే పుస్తకం లో తన సేవాకార్యక్రమాలను వివరించింది .స్త్రీ శిశు హాస్పిటల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే తీర్మానం తెచ్చి పాస్ చేయించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రసూతి ఆస్పత్రిలో ప్రత్యేక హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది .స్థానిక సంస్థలు ,మునిసిపాలిటీల చేత నడుపబడే విద్యాలయాలలోని విద్యార్ధులకు తరచుగా క్రమపద్ధతిలో వైద్య పరీక్షలు నిర్వహించేట్లు చేసింది .ట్రిప్లికేన్ లోని ‘’కస్తూరిబాయి హాస్పిటల్ ‘’ముత్తు లక్ష్మి అకుంఠిత దీక్షా ఫలితమే .
అఖిల భారత మహిళా సభకు ముత్తు లక్ష్మి అధ్యక్షురాలిగా ఎన్నుకో బడింది .వేశ్యా వ్రుత్తి నిర్మూలనకు ,అనైతికంగా స్త్రీ బాలికలను అవమాన పరచటానికి బిల్లు పాస్ చేయించింది .వేశ్యాగృహాల చెర నుండి విముక్తులైన స్త్రీల కోసం ఒక బోర్డింగ్ హోం ను ఏర్పాటు చేసిన దయామయి .ముస్లిం బాలికలకోసం ఒక ప్రత్యేక హాస్పిటల్ ను స్థాపింప జేసింది .హరిజన విద్యార్ధినులకు స్కాలర్ షిప్ లు మంజూరు చేయించిన ఘనత ముత్తు లక్ష్మిది .మగవారికి 21 ఏడాది వరకు ఆడపిల్లలకు 16వ ఏడాది వరకు వివాహం చేయరాదని శాసనం చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది .
ఇవికాక ఆమె ఎన్నో విధాలుగా ప్రజా సేవ చేసి ధన్యురాలైంది .’’కేన్సర్ రిలీఫ్ ఫండ్ ‘’ను ప్రారంభించింది . 1935 లో ‘’కేన్సర్ రోగులకు హాస్పిటల్ ‘’కట్టాలని ఉంది అని ప్రకటించింది .ఎందరో దాతలు వదాన్యులు విరాళాలలతో ముందుకు వచ్చారు .1952లో ‘’అడయార్ కేన్సర్ ఇన్ ష్టి ట్యూట్’’ కు ‘’శక్తి హరిహరన్ ‘’శంకు స్థాపన చేశాడు .18-6-1954నుండి అది పని చేయటం ప్రారంభించింది .ఇండియాలో రెండవ పెద్ద కేంద్రంగా దీనికి గుర్తింపు వచ్చింది .ఈ నాడు ప్రపంచ ప్రసిద్ధమై ఏటా 80,000 మంది కేన్సర్ వ్యాధి గ్రస్తులకు ఆశా దీపంగా భాసిస్తోంది . అడయార్ లోని వట వృక్షంగా ఈ సంస్థ అభివృద్ధి చెంది కేన్సర్ రోగులపాలిటి సంజీవని అయింది ధన్య చరిత్ర ఆమెది .
సాంఘిక సంక్షేమ శాఖ కు మొదటి చైర్ పర్సన్ అయింది ముత్తులక్ష్మి .భారత దేశం లో విద్యాభి వృద్ధిని అధ్యయనం చేసి సలహాలిచ్చే ‘’హార్టాగ్ ఎడ్యుకేషన్ కమిటీ ‘’లో సభ్యురాలై విలువైన సూచనలు అందజేసింది .ఈ కమిటీ తరఫున భారత దేశం అంతా పర్య టించి స్త్రీ విద్యా వ్యాప్తి అభి వృద్ధిని గమనించింది ..ఈ కమిటీలో ముత్తులక్ష్మి ఒక్కరే మహిళా సభ్యురాలు .అలాంటి అరుదైన గౌరవం ఆమెకు దక్కింది .ఈ కమిటీ సలహాలు పాటించి ప్రభుత్వం ఎన్నో అభి వృద్ధి పధకాలను ప్రవేశ పెట్టి మహిళా విద్యకు దోహదం చేసింది .అఖిలభారత మహిళా సమాఖ్య తరఫున ప్రచురించే ‘’రోషిణి’’పత్రికకు సంపాదకురాలుగా సమర్ధంగా పని చేసింది .మహిళాభి వృద్ధికోసం జీవితాంతం పోరాడిన దీరోచిత మహిళా మాణిక్యం ముత్తు లక్ష్మీ రెడ్డి .ఎన్నో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిన ఆమె వ్యక్తిత్వం అమోఘం .80ఏళ్ళ వయసులో కూడా ఆమెలో చైతన్యం పొంగి పోర్లేది .రాజకీయాలలో ఉన్నా స్త్రీ జాతి సేవను మరచిపోలేదు. ఆమెది మహాత్ముని శాంతి అహింసా మార్గం . పారిశుధ్యం తో కూడిన మరుగు దొడ్లను ,అందులో ప్రత్యేకం గా స్త్రీలకూ వేరుగా ఏర్పాటు చేయటానికి తీవ్ర కృషి చేసి సాధించింది .మురికి వాడలలో నివసించే పేదప్రజలకు వైద్య సదుపాయాలను కలిగించిన మహోదయురాలు.
ముత్తు లక్ష్మి చేసిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం1956లో ‘’పద్మ భూషణ్ ‘’గౌరవాన్నిచ్చి సత్కరించింది .ముత్తు లక్ష్మిని చిరస్మరణీయం చేసిన జీవన సాఫల్యాలు ‘’అవ్వై హోం’’ మరియు ‘’కేన్సర్ ఇన్ ష్టిట్యూట్’’లు అనే రెండు గొప్ప సంస్థలు .82 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి ,ప్రజా సేవలో పునీతురైన డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి 22-7-1968 న స్వర్గస్తురాలైంది .
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~