నా జీవనయానంలో (ఆత్మ కథ ) – కె . వరలక్ష్మి

స్కూలు ఫైనల్లో.. 2 

ఆ మాటల్ని భరించలేక అమ్మమ్మగారికి ఉదయం నుంచి మా ఇంట్లో జరిగిందంతా చెప్పాను. ‘ఆరి పనికిమాలినోడా, నువ్వక్కడ కూడా ఇలాటి ఏసాలే ఏస్తన్నావా?’ అంటూ అప్పటికప్పుడు అరడజను నిమ్మకాయలు తెప్పించి ఆ రసం అతని తలకి పట్టించారు. కాస్సేపాగి నాలుగైదు బకెట్ల చన్నీళ్ళు తలమీద పోసారు. ఎందుకలా చేస్తున్నారని అడిగితే ‘ఆడికి కొంత తిక్కుందిలే. ఆ తిక్క ముదిరినప్పుడల్లా మా అమ్మ అలాగే చేస్తాది’ అంది బేబీ అక్కయ్య. మోహన్ పిన్నులు ముగ్గురికీ రోజుల తేడాతో మగపిల్లలు పుట్టారు. పక్కగదిని కూడా ఖాళీ చేయించి వీళ్ళే వాడుకుంటున్నారు.

పక్కవీథిలో బేబక్కయ్య వాళ్ళ అద్దె ఇంట్లో నన్ను పడుకోమని పిల్లల్ని తోడిచ్చి పంపించారు. ఇంటినిండా, మంచం నిండా విప్పిన బట్టలు. పిల్లల పాస్ కంపులు. ఉదయం నుంచి పడిన ఆందోళన దాని తాలూకు అలసట. అలాగే పడి నిద్రపోయాను. ఒక రాత్రివేళ కాలిమీద భగ్గుమన్నట్టై కెవ్వుమని అరిచి లేచి కూర్చున్నాను. సన్నని బెడ్ లేంప్ వెలుతుర్లో చేతిలో వెలుగుతున్న సిగరెట్టుతో మోహన్ నవ్వుతూ నిల్చుని ఉన్నాడు. నా కుడిపాదానికి బెత్తెడు పైన సిగరెట్టుతో అంటించాడు.
‘బస్సులో ఏమన్నావ్, బుద్ధిలేదా అనా? దానికి తోడు మా అమ్మ(అమ్మమ్మ)కి అంతా చెప్పేస్తావా?’ అంటున్నాడు.
భయంతో బాధతో ఆ రాత్రంతా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉన్నాను. నేను అప్పటికే కథా రచన గురించిన ఏదో వ్యాసంలో ‘ఎవరు ఎవర్నైనా బాధించడానికి ఒక కారణమంటూ ఉండాలి’ అని చదువుకున్నాను. నన్ను ప్రేమించానని పెళ్లాడిన వ్యక్తిలో ఆ అకారణద్వేషానికి కారణం ఏమిటి? మర్నాడు ఉదయం అమ్మమ్మగారింటికెళ్ళగానే మా అత్తగారు, ఆవిడ పెద్ద చెల్లెలు (ఆంటీ) మరోసారి దండకం విప్పారు. పెద్దవాళ్ళకి ఎదురుచెప్పే అలవాటు ఎలాగూ లేదు నాకు. ‘మానేన కలహం నాస్తి’ అని నేను చదువుకున్నది ఆ ఇంట్లో ఆచరణలో పెట్టడం మంచిదన్పించింది.

రాత్రి భోజనం చెయ్యక ఆకలితో డొక్కల్లో నొప్పి వచ్చేస్తోంది. ఉదయం తొమ్మిది దాటిపోతున్నా ఎక్కడా పొయ్యి అంటించిన దాఖలాలేవీ కన్పించలేదు. లోపలికెళ్ళి వెతుక్కుంటే గిన్నెలన్నీ అంట్లలోనే ఉన్నాయి. అందరూ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు. మధ్యలో ఎవరిపిల్లలు ఆకలని వస్తే వాళ్ళ చేతిలో పది పైసలు పెడుతున్నారు వాళ్ళ అమ్మలు. ఆపిల్లలేమో వీళ్ళ గేటుకెదురుగా స్టేడియం రేకులగోడ కానించి తడకల్తో కట్టిన కాకా హోటల్ కి పరుగెత్తి ఇడ్లీయో, బజ్జీనో కొని తెచ్చుకుని తింటున్నారు.

తెల్లవారిందగ్గర్నుంచీ పిల్లల తిండికోసం ఆరాటపడుతూ మజ్జిగ చిలికే మా నాన్నమ్మ, చద్దన్నాలు లేకపోతే వేడిఅన్నం సిద్ధం చేసే మా అమ్మ గుర్తుకొచ్చేరు. ఇన్నాళ్ళూ నేను నిరసనగా చూసి బ్రతిమాలించుకుని తినే చద్దన్నం అన్నం మునిగేలా వేసిన మజ్జిగ, గిన్నె అంచుకు అంటించుకుని నంజుకునే మాగాయముద్ద గుర్తుకొచ్చి ఆకలి మరింత పెరిగింది. నేనొస్తున్నప్పుడు మా అమ్మ ఇచ్చిన ఐదురూపాయలు, నాన్న ఇచ్చిన పదిరూపాయలు బట్టల అడుగున సంచిలో ఉన్నాయి. అవి తీసి కొనుక్కోవచ్చా, వీళ్ళేమైనా అంటారా? ఆలోచిస్తుండగానే రామయ్యమ్మొచ్చి పొయ్యంటించి ఓ పెద్ద గిన్నెతో నీళ్ళు పెట్టింది. దాంట్లో చారెడు పంచదార, దోసెడు నల్లని కాఫీ పొడివేసి మరిగించింది. దించేముందు చిట్టిగ్లాసుడు పాలు పోసింది. దాన్ని వడగట్టి అందరికీ పెద్దగ్లాసుల్తో ఇవ్వడం మొదలుపెట్టింది. నాకూ ఓ గ్లాసిచ్చింది. అప్పటివరకూ నాకు కాఫీ వాసన తెలీదు. అది మరుగుతున్నప్పుడే నాకు కడుపులో తిప్పడం మొదలైంది. నడవాకెళ్ళి ఆ నల్లని చేదు కాఫీని తాగడానికి ప్రయత్నించగానే ఓక్ మని బైటికొచ్చేసింది.

మా అత్తమామల్ని తప్ప మిగతా అందర్నీ మోహన్ ఎలా పిలుస్తాడో నేనూ అలాగే అనడం మొదలుపెట్టాను. అమ్మమ్మను ‘అమ్మ’అని, పిన్నుల్ని’అక్కయ్య’ అని, బాబాయిల్ని ‘చిన్నాన్న’లని మోహన్ అయిదుగురు చెల్లెళ్ళు, పెద్ద చెల్లెలు రాణి నాకన్నా ఏడాది చిన్నదట. మినర్వాటాకీస్ పక్కనున్న సిటీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. రెండో చెల్లెలు ఉష కొంత డౌన్ సిండ్రోమ్ అమ్మాయిలాగా ఉంది. పార్వతి, శాంత, ఆఖరుది రుక్మిణి. పూర్తిగా అమాయకప్పిల్ల. అయిదారేళ్ళది. ఏది పడితే అది మాట్లాడుతుండేది. ఈ పిల్లలు, ముఖ్యంగా ఉష అమ్మమ్మగారింట్లో ఏపని చెప్తే ఆ పని చేస్తుండేది. ఒక్కళ్లకీ శుభ్రమైన బట్టలు లేవు, నియమంగా బడికి పంపించే వాళ్ళు లేరు. ఆ ఇంట్లోవాళ్ళు అన్నంలో చారు కలుపుకొంటూ అయిదుపైసలిచ్చి పంపిస్తే తెలకపిండి వడియాలు. పది పైసలిస్తే నీళ్ళపెరుగు తేవడానికి మండుటెండలో పరుగెత్తేవాళ్ళు. ఆ తెలకపిండి వడియాల్ని కూడా నేను అక్కడే చూసాను. నోట్లో పెట్టుకోలేనంత ఘోరమైన రుచి. గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం అన్నీ మోహన్ చెల్లెళ్ళే. చిన్నపిల్లలు కావడం వల్ల ఒకోసారి మాటవినకుండా పారిపోయేవాళ్ళు. ఇక ఆ పనులన్నీ నాకప్పగించారు. పూటపూటకీ బండెండు అంట్లు. అప్పటికి మా ఇంట్లో నేనెప్పుడూ అంట్లు తోమలేదు. ఇల్లు తుడవలేదు. బట్టలు ఉతకలేదు. చాకలికి వేసే అలవాటు. గిన్నెలు తోమాలని కూర్చుంటే అంతంత ఎంగిళ్లతో ఆ గిన్నెల్ని ముట్టుకోడానికి అసహ్యం వేసేసేది. బట్టలుతకడానికి నా ఒంట్లో ఓపిక చాలేది కాదు. అలా చేసావేంటీ, ఇలా చేసావేంటీ అన్పించుకుంటూనే పనులు నేర్చుకున్నాను. స్కూలు పుస్తకాలు తెచ్చుకున్నాను. కాని, వాటిని తియ్యడానికే సమయం దొరికేది కాదు. అన్నిటికీ తోడు పసిపిల్లల్ని ఎత్తుకునే పని ఒకటి. ఈ పని మాత్రం నాకు ఇష్టంగా ఉండేది. సరస్వతక్కయ్య కొడుకు డౌన్ సిండ్రోమ్ బోయ్. ఎక్కువగా వాణ్ణెత్తుకుని ఆడించేదాన్ని.

ఒకరోజు రామయ్యమ్మ రాలేదని పిల్లలకి స్నానం నన్ను చేయించమన్నారు. నాకేమో భయం, వాళ్ల ముక్కుల్లోకి నీళ్ళెళ్ళిపోతాయేమోనని. సరే, వాళ్లకెదురు చెప్పలేక కాళ్ళు చాపుకొని కూర్చున్నాను. మా స్కూల్లో తరచుగా పరుగుపందాల్లో పాల్గొనడం వల్లనో, మా స్కూల్ గ్రౌండులో చేసే మార్చ్ ఫాస్ట్ వల్లనో, రింగ్ టెన్నిస్ ఆడుతుండటం వల్లనో నా కాళ్ళు ధృఢంగా ఉండేవి. నీళ్ళు పడగానే సిగరెట్టు గాయం చురుక్కుమంది. ఒంటిమీద గాయం మానిపోవచ్చు గాని, మనసులోని గాయం అంత త్వరగా మానదు కదా! నా మోకాళ్లమీద మూడేసి తెల్లని చారలున్నాయి. అవి బిడ్డ పుట్టినప్పుడు తల్లిగర్భం మీద వచ్చే చారల్లాంటివట. అవి ఎందుకొచ్చాయో నాకు తెలీదు. నేను ఎదిగే క్రమంలో అవి ఏర్పడ్డాయి. అప్పటికప్పుడు నన్ను నుంచోబెట్టి పరికిణీ ముడి విప్పించి నా పొత్తికడుపును తనిఖీ చేశారు. ఈ లోపల ఒకటే ఎగతాళి నవ్వులు. పెల్లుబికి వస్తున్న ఏడుపుని కష్టం మీద దిగమింగాను. అవమానం పొందడమొకటే కాదు, ఇదీ అని చెప్పలేని ఊహకందని కలవరమేదో నన్నావరించుకుంది.
ఒకరోజు ఆకలికి ఆగలేక టిఫిన్ తెప్పించుకుందామని సంచిలో డబ్బుల కోసం వెతికాను. ఎక్కడున్నై? మోహన్ ఎప్పుడో తీసేసుకున్నాడట. ఒకరోజు ఊరు చూపిస్తానని శ్యామలా జంక్షన్ లో తిప్పి దగ్గర్లో ఉన్న వరదరావు హోటలుకి తీసికెళ్ళాడు. దోసె, ఇడ్లీ, పెరుగుబూందీ తెప్పించాడు. ‘తింటావా’ అని అడిగాడు. నేను మొహమాటంగా ‘ఉహు’ అన్నాను. అంతే. మొత్తం తినేసాడు. మరోరోజు కుమార్ టాకీస్ పక్కనుంచి గోదారి గట్టున నడిపించి కొత్తగా కట్టిన అప్సరా హోటలుకి తీసుకెళ్లాడు. ఇడ్లీ, గులాబ్ జామూన్ తెప్పించి తినేశాడు. నాకు గులాబ్ జామ్ అంటే ఇష్టం. నాకొకటి కావాలన్నాను. ఒకటీ పావలా, డబ్బుల్లేవు పదమని బైటికి తీసుకొచ్చేసి తనొక కిళ్ళీ, సిగరెట్టు కొనుక్కున్నాడు.

ఒకరోజు మధ్యాహ్నం వేళ ఇప్పుడు రావులపాలెం బస్టాండు ఉన్న చోటున వాళ్ళ ఫ్రెండు ఆచారి ఇంటికి తీసుకెళ్ళాడు. ఒకటే గది అతి శుభ్రంగా. ఆచారి తల్లిగారు నన్ను చూస్తూనే నా చెంపలు నిమిరి మెటికలు విరిచి అవతలిగోడకున్న రెండుజడల బి.సరోజాదేవి కేలెండరు చూపించి ‘ఒరే రామ్మోహన్రావ్, నీ పెళ్ళాం అచ్చంగా ఈ పిల్లలాగుందిరా’ అన్నారు. వేడి అన్నం, పప్పుపులుసు, కరకరలాడుతున్న బెండకాయ వేపుడు ముక్కల్తో కొసరి కొసరి కడుపునిండా భోజనం పెట్టారు. ఆచారి కూడా ‘చెల్లెమ్మా’ అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఆ తర్వాత త్వరలోనే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారట. నేను వాళ్ళని మళ్లీ చూడలేదు. ఒకరోజు మోహన్ బైట నిలబడి సిగరెట్ కాలుస్తుంటే మా అత్తగారు లోపలికొచ్చి ‘ఏవమ్మాయ్, పెళ్ళి చేసుకోగానే సరా, ఆడిచేత సిగరెట్టు మాన్పించలేవా’ అని కేకలేసారు. ‘తల్లీ, ఇరవైఏళ్ళు పైగా పెంచిన మీరు చెప్పలేనిది మూడునెలల్లో నేనెలా చెప్పగలను, అందునా నీ కొడుక్కి!’ అనాలని నోటి చివరివరకూ వచ్చినమాటల్ని లోపలికి దిగమింగుకున్నాను.

వాళ్ళింటికి జుబేదా అని చక్కని ముస్లిమ్ అమ్మాయి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వస్తూ ఉండేది. ఆ అమ్మాయి మోహనంటే పడి చచ్చిపోతుందని ఇంట్లోవాళ్ళూ, మోహన్ కూడా అంటుండేవాళ్ళు. ఆ అమ్మాయి తన పనేమో తానేమో అన్నట్టు కళ్ళు దించుకుని ట్యూషన్ ముగించుకుని వెళ్ళిపోయేది. మోహన్ కి పెళ్ళైపోయిందని బాధపడుతోందని ఒకళ్ళు. మోహన్తో సహా ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఎదుటివాళ్ళకి అక్రమసంబంధాలంటగట్టే జబ్బొకటుందని నాకర్థమైంది.

మోహన్ ఉత్తరాల్లో శుక్రవారాలు మసీదుకి, శనివారాలు గుడికీ, ఆదివారాలు చర్చికీ క్రమం తప్పకుండా వెళ్తానని రాసేవాడు. అ మాట అడిగితే ‘నువ్వేదో కథలూ గట్రా గిలుకుతావని తెలిసిందిలే. ఆ మాత్రం స్టిల్ కొడితే బావుంటుందని’ అన్నాడు వెకిలిగా నవ్వుతూ. పెళ్లైపోగానే అంతా అయిపోయిందని అతని ఉద్దేశం. నేనొక ఫూల్ నని నాకర్థమైందప్పుడే.

మా అత్తగారికి ఆవిడ చెల్లెళ్ళలాగా నుదుటబొట్టుకానీ, చెవులకు దుద్దులుగానీ, మెళ్ళో సూత్రాలు గానీ ఉండేవి కావు. అప్పటికి నాకుగానీ, మా ఇంట్లోవాళ్లకి గానీ ఆవిడ క్రిస్టియానిటీ తీసుకున్నారని తెలీదు. తెలిసినా అదేమంత పెద్దవిషయం కాదు మా దృష్టిలో. ఎవరి ఇష్టం వారిది అనే ధోరణి మాది. ఆవిడ రోజంతా రోడ్డువైపున్న వీళ్ళకొట్టుగదుల్లో ఒకదాంట్లో ఉన్న గ్రాఫైటు మిల్లులో ఉండేవారు. అది వీళ్ళసొంతమో, వేరెవరి దాంట్లోనైనా ఆవిడ పని చేస్తున్నారో నాకు తెలిసేది కాదు, తలకు గుడ్డకట్టుకుని, కనురెప్పల్తో సహా ఒళ్లంతా గ్రాఫైటు పౌడరు నిండిపోయి కన్పించేవారు. ఆచుట్టూ మూసలకంపెనీలు చాలా ఉండడం వల్ల ఈ మిల్లుకి నిరంతరం పని ఉండేదట. మా గ్రాఫైటు మిల్లుల వలన కొత్తపేట మొత్తం నల్లని బూడిద ఆవరించి ఉండేది. పాదాలకు నల్లని పౌడరు అంటుకుపోయేది. దగ్గుకుంటూ, తుమ్ముకుంటూ ఆవిడ ఆ పని ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. చాలా జాలిగా అన్పించేది.

నేనొచ్చిన మర్నాడే మా అత్తగారు నా చెవిరింగులిమ్మని తీసుకున్నారు. కరెంటుబిల్లు కట్టాలట. రెండురోజులాగి ఇత్తడి రింగులు తెచ్చిపెట్టారు. నాకు అవి పడక చెవి రంధ్రాలు పుళ్ళు పడ్డాయి. ఏం జరిగిందో చూసి కూడా సరస్వతిగారు గంటకోసారి ‘మేం రోల్డ్ గోల్డ్ పెట్టుకోం, మా నాన్న ఒప్పుకొనేవారు కాదు, మేం అచ్చమైన బంగారమే పెట్టుకుంటాం’ అంటూ నా బుర్ర తినేసేది, ఇంచుమించు ఇరవై రోజులు ఉండిపోయానక్కడే. ఎట్టకేలకు మా అత్తగారు నా చెవిరింగులు విడిపించి ఇచ్చారు.

మోహన్ నన్ను కిక్కిరిసి ఉన్న బస్సెక్కించి తను వచ్చేవారం వస్తానన్నాడు. నాకలా ఒంటరిగా ప్రయాణించడం మొదటిసారి. ఆ గంటసేపూ బస్సులోనూ, బస్సుదిగి ఇంటికొస్తూనే ఏడుస్తూనే ఉన్నాను. ఇంట్లో మా నాన్నను చూస్తూనే ‘నాన్నా’ అంటూ భోరుమన్నాను. మా నాన్న హడిలిపోయారు ఏం జరిగిందోనని. అప్పటికప్పుడు అన్నంకలిపి తినిపిస్తూ. పెరుగన్నం కలుపుతూ దుఃఖపడిపోయారు. ‘పిల్లకక్కడ సరైన తిండికూడా పెట్టలేదు. ఎలాగైపోయిందో’ అంటూ. రోజూ అన్నం కలుపుతూ అదే పనట మా నాన్నకి. ఇక మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ‘పెద్దక్కొచ్చిందోయ్’ అని ఒకటే గెంతులు. యథాతథంగా మోహన్ అర్ధరాత్రి దిగాడు.

మర్నాడు స్కూల్లో మా సైన్స్ మాస్టారు జగన్నాధశర్మగారు ‘స్కూలు ఫస్ట్ వస్తావనుకున్న పిల్లవి సెలవుల్లో స్పెషల్ క్లాసులకి హాజరు కాలేదు. ఇక స్కూలురోజుల్లో మీ ఆయనొచ్చి ఎప్పుడు పిల్చుకెళ్ళిపోతాడో తెలీదు. ఎందుకమ్మాయ్ ఈ చదువు, శుభ్రంగా అత్తారింటికెళ్ళి కాపరం చేసుకోక?’ అంటూ తలమొయ్యా చివాట్లేసారు. ఆ రోజుల్లో అన్నిక్లాసులకీ అంతే విలువున్నా స్కూలుఫైనలంటే పబ్లిక్ పరీక్షలు కాబట్టి మరీ భయపడి చచ్చేవాళ్లం.

నన్ను నేను ఇంకా బిజీగా ఉంచుకోవడానికి హిందీ అక్కయ్యగార్ని అడిగాను. నేను కూడా ట్యూషనుకి వస్తానని. ఆవిడప్పుడు దక్షిణ్ భారత్ హిందీ ప్రచారసభ పరీక్షలు కట్టించేవారు. ‘స్కూలుఫైనల్లో అరవై మార్కులు దాటి వచ్చిన వాళ్ళు ప్రాధమిక, మధ్యమిక రాయనక్కరలేదు. డైరెక్టుగా రాష్ట్ర పరీక్షకు వెళ్ళొచ్చు. నీకు తప్పకుండా వస్తాయి. ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలకు బాగా చదువుకో’ అన్నారు.

ఇంతలో అట్లతద్దికి గౌరీనోము వాయనాలు తీర్చాలని, అందర్నీ రమ్మని మా అత్తవారింటికి ఉత్తరం రాసారు మా నాన్న. ఒక వారం ఆగి స్వయంగా వెళ్ళి చెప్పి వచ్చారు. తప్పకుండా వస్తామన్నారట.

– కె . వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , Permalink

3 Responses to నా జీవనయానంలో (ఆత్మ కథ ) – కె . వరలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో