నా జీవనయానంలో (ఆత్మకథ ) -స్కూలు ఫైనల్లో – కె వరలక్ష్మి

అల్మరా మూడు అరల్లోనూ పై అరలో నేను సేకరించిన (మా అమ్మ కొన్న) జపాన్ పింగాణీ బొమ్మలు, మట్టితో నేను తయారు చేసినవీ, కొన్నవీ ఉండేవి. రెండో అరలో నా బట్టలు, మూడో అరలో నా పుస్తకాలు ఉండేవి. తాళంచెవి అల్మరా అంచుమీదే ఉండేది. అద్దెకున్నవాళ్ళు మా ఇంట్లో సొంతంలాగే తిరిగేసేవారు. కానీ పెళ్ళికోసమని ఖాళీ చేయించడం వల్ల ఎవరూ లేరు. ఇంట్లో అందరికీ ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టే అలవాటు. ఇల్లు చిందరవందరగా ఉంటే మా నాన్నకి నచ్చేది కాదు. నా అజమాయిషీలో మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఎంతో పద్ధతిగా నడుచుకునేవారు.

అలాంటి ఇంట్లో నెక్లెసు ఎలా మాయమైపోయిందో అర్థం కాలేదు. నేను అప్పుడు నెమ్మదిగా వెళ్ళి మా అమ్మకి చెప్పాను. అంతలో నా ఫ్రెండ్స్ వచ్చేశారు. ‘నేను వెళతానులే నువ్వెళ్ళు’ అంది మా అమ్మ. ‘ఆగు’ అని మా చెల్లిది సన్నజాజుల నెక్లెసు నా మెడలో వేసింది.

స్కూలుకెళ్తుండగా చర్చి దగ్గరలో ఖాన్ సాయెబు గారబ్బాయి జంతుచర్మాలు సైకిలు వెనుక పేర్చుకుంటూ కనిపించాడు. మోహన్ చెప్పింది గుర్తొచ్చి నవ్వొచ్చింది నాకు. రెండేళ్ళ క్రితం ఈ అబ్బాయి ఇలాగే వ్యాపారం కోసం రాజమండ్రి వెళ్తూ మురారి దగ్గర మోహన్ కి కనిపించాడట. ఆ రోజు మోహన్ ఏదో పని మీద మురారి వచ్చి సైకిలు మీద తిరిగివెళ్తున్నాడట. జగ్గం పేట అని తెలిసి మా నాన్నపేరు చెప్పి నా గురించి అడిగితే చాలా పాజిటివ్ గా చెప్పేడట ఈ అబ్బాయి. మా ఫ్రెండ్స్ కి చెప్తే ‘ సో, అలాగ నీ పెళ్ళి కుదిర్చాడన్నమాట’ అని నవ్వారు వాళ్ళు.

మధ్యాహ్నం ఇంటికొచ్చి అన్నంతిని మా ఫ్రెండ్స్ వచ్చే వరకూ చదువుదామని మా తెలుగు ఉపవాచకాల్లో ఒకటైన నోరి నరసింహశాస్త్రి గారి వాఘిరా తీశాను. మా అమ్మ వచ్చి నా ప్రక్కన కూర్చుని ‘ ఇప్పుడు చెప్పు ఎక్కడ పెట్టావు నెక్లెసు’ అంది మెల్లగా.

‘అదేంటి?’ దొరకలేదా? అన్నాను నేను ఆశ్చర్యపోతూ.
‘ఇల్లు మొత్తం తిరగేశాం నేను మీ నాన్నమ్మా.. మీ నాన్న కంసాలి దగ్గర కూర్చుని మంచి డిజైను అని ఎంచి చేయించారు. ఇంకా నెలరోజులన్నా అవ్వలేదు. ఇప్పుడు మీ నాన్నొత్తే ఏం జెప్పాలి?’ అంది మా అమ్మ కళ్లనీళ్ళు పెట్టుకుంటూ.
‘ మజ్జాన్నం బడికెళ్ళకు. మళ్లీ నెలుకుదాం. బాగా గ్నేపకం చేసుకో ఎక్కడ పెట్టేసేవో’ అంది.
నేను లేచి ఇంట్లోకి పరిగెత్తాను. మళ్లీ ఇల్లంతా వెతికేం, చివరికి అలిసిపోయి, ‘ మీ నాన్న రానీ, తీసి ఎక్కడైనా పెట్టారేమో అడుగుదాం’ అంది.

సాయంకాలం మా నాన్నొచ్చాక చెప్తే ‘సరిగా నెలుకమ్మా, ఏ పుస్తకాల్లోనో పెట్టేసుంటావు. అన్నారు.
మర్నాటినుంచి ఇంట్లో పెద్దవాళ్ళు మౌనంగా ఉంటున్నారు. అపరాధభావమేదో నన్నలుముకుని దిగులుగా ఉండేది. కాని లోపలెక్కడో ‘మోహన్ నన్నేడిపించడానికి తీసి ఎక్కడైనా దాచిపెట్టి ఉండచ్చేమో’ అన్పించసాగింది.
మరిసటివారం అతను రాగానే ఎదురు పరిగెత్తుకెళ్ళి ‘ఏవండీ నా నెక్లెసు కనిపించడం లేదు’ అన్నాను.

‘అలాగా’ అన్నాడతను. సరిగ్గా వెతకకపోయావా!’
మోహన్ కి కూడా తెలియదని రూఢీ అయిపోయింది.
అతని వేలికి పెళ్ళిఉంగరం లేదని అన్నం వడ్డిస్తూ మా అమ్మ గమనించింది.
‘ఉంగరం ఏది బాబూ!’ అని అడిగింది.
‘ఇంట్లో మర్చిపోయి వచ్చానండీ!’ అన్నాడు అతని జేబులో రెండు నిండు సిగరెట్ ప్యాకెట్లు, అగ్గిపెట్టె ఉన్నాయి.
సోమవారం ఉదయం అతనెళ్ళిపోతాడనగా మా అమ్మ నెక్లెసు గురించి మళ్లీ అడగమంది. నేను వెళ్ళి అడగగానే గొంతు పెంచి ‘ అవును నేనే తీసికెళ్ళాను. ఎందుకు అలా వస్తువుల కోసం చచ్చిపోతున్నారు’ అన్నాడు.
నేను ఆశ్చర్యపోయి ‘దొంగతనం చేశారా?’ అన్నాను.

అంతే నా చెంప ఛెళ్ళుమంది.
ఎముకలు తేలిన అతని అరచేయి ఎంత గట్టిగా తగిలిందంటే నాకు కళ్ళు చీకట్లు కమ్మేశాయి. రుసరుసలాడుతూ అతనెళ్ళిపోయాడు.

మా నాన్న నా తలని నిమురుతూ ‘ పువ్వులాగా అపురూపంగా పెంచుకున్న పిల్లని ఈ దుష్టుడి చేతిలో పెట్టి గొంతు కోసేశాను. అంటూ దుఃఖపడిపోయాడు. మా అమ్మ నాన్నమ్మ అయితే ఒకటే ఏడుపు. మా అమ్మే ముందుగా తేరుకుని ‘ ఈ మాట బయటెక్కడా అనకమ్మా పరువు పోద్ది’ అంది. తరువాతి వారం వచ్చినప్పుడు మా నాన్న మోహన్ ని అడిగారు. నెక్లెసు ఏమైందని? డబ్బులు అవసరమై తాకట్టు పెట్టాను అన్నాడు.

‘చదువుకుంటున్న కుర్రోడివి. నీకంత డబ్బు అవసరమేంటి?’
‘డబ్బుతో అవసరాలుండవా?’ అన్నాడు మోహన్. యారగెంట్ గా
‘డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడటానికి కాకపోతే బంగారం ఎందుకు?’
‘అందుకని పిల్ల వొంటిమీద వస్తువు పట్టుకుపోతావా?
‘ నా వైఫ్ వస్తువులు నా ఇష్టం. అయినా మీరేం కట్నం ఇచ్చేసేరాని?’

‘కట్నం గురించి నువ్విప్పుడు మాట్లాడకు. ఆడపిల్లకి కట్నం ఇచ్చి పెళ్ళిచెయ్యవలసినంత నీచస్థితిలో మేం లేం. ఆ మాట మీ పెద్దోళ్లకి నేను ముందే చెప్పాను. తాతగారి ఆస్తికి వారసుడివి నువ్వే అని మీ వోళ్ళు అబద్ధాలు ఆడి మా కొంప ముంచారు.
‘అయితే వెంటనే నా వైఫ్ ని పంపించెయ్యండి. లక్ష్మీ బట్టలు సర్దుకో’ అంటూ పెద్ద పెద్ద కేకలు మొదలుపెట్టాడు మోహన్.
మా అమ్మ వచ్చి మా నాన్నని చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయింది ‘పిల్ల చదువు చెడగొడతారా ఏంటి?’ అంటూ, వెంటనే నా దగ్గరున్న మా చెల్లి నెక్లెసు మా తమ్ముడి రిస్ట్ చెయిన్, వేలి అందె ఉంగరం తీసేసుకుని ఎప్పుడూ నగలు దాచే రంగం (రంగూన్) పెట్టెలో పెట్టేసి తాళం వేసేసింది. శ్రావణమాసానికి అల్లుడికి ఇవ్వాలనుకున్న ఉంగరం చేయించడం ఆపేసి, ఆ బంగారంలో పెళ్ళి సూత్రాలు కలిపి నాకు సూత్రాలు చేయించేశారు. మూడవనెల శ్రావణంలో మంచిరోజు చూసి పసుపు త్రాడు పేని సూత్రాలు గుచ్చి నా మెడలో వేసింది. అప్పటివరకూ నేను పెళ్ళిలో వేసిన పసుపుతాళ్ళ బొత్తితోనే స్కూలుకి వెళ్ళేదాన్ని. వారం వారం సూత్రాల బొందుకీ, కాళ్లకీ పసుపు రాసుకొని తలస్నానం చెయ్యడం వగైరాలతో అదో లోకమైపోయింది.

ఆ శ్రావణంలోనే గోవిందు వాళ్ళు రెండోసారి మా చిన్నింట్లోకి వచ్చారు. ఈ సారి నాగత్త బదులు గోవిందు వదిన సత్యవతి వచ్చింది. మా గేటుకి కుడిప్రక్కనున్న ఇంట్లోకి రిజిస్ట్రారు ఆఫీసు జవాను కుటుంబం వచ్చింది. ఆయన భార్య మోహిని, స్కూలు స్నేహితులు కాక ఇంటిదగ్గర వీళ్ళిద్దరూ నాతో స్నేహంగా ఉండేవారు.

మా చిన్నింటి వాకిట్లో గోవిందు కుటుంబం వాళ్లంతా వరసగా మంచాలు వేసుకొని పడుకునేవారు. మా వాకిట్లో మా ఇంట్లో వాళ్లందరం. మోహన్ ఒకోసారి ఏ అర్ధరాత్రో వచ్చి మెల్లగా నన్ను లేపడం, నేను అతని వెంట మంచాలమధ్యనుంచి నడచుకుంటూ గదిలోకెళ్ళడం నాకు చాలా ఎంబరేసింగ్ గా ఉండేది. మా అమ్మ లేచి అల్లుడికోసం భోజనం వడ్డించడం – ఇంటందరూ లేచి కూర్చునేవారు. ఒకోసారి స్కూలుటైంలో వచ్చి మా క్లాసులోకొచ్చేసి ‘ఇంటికెళ్దాం రా’ అని పిలవడం టీచర్సెవరైనా హెడ్మాస్టారి పర్మిషన్ కావాలంటే మా క్లాసుకెదురుగా ఉన్న హెడ్మాస్టారి పీకల మీద కూర్చుని పర్మిషన్ రాయించుకు రావడం , పాఠం పోతుంది తర్వాత వస్తానంటే గద్దించడం, కేక వెయ్యడం, అతని వెంట తలదించుకుని ఇంటికి వచ్చెయ్యడం – నా చదువే కాదు జీవితమే అస్తవ్యస్తమైపోయినట్టుండేది.

త్వరలోనే నాకు పొత్తికడుపులో నొప్పితో పాటు ఏదో ఇబ్బంది మొదలైంది. మా అమ్మతో చెప్తే మోహన్తో కలిసి డాక్టరు దగ్గరకి వెళ్ళమంది. డా. జయ గారు ‘మీవయసెంత?’ అని మోహన్ ని అడిగి కనుబొమ్మలు చిట్లించారు. ‘చంటిపిల్లగా ఉన్నప్పటినుంచీ ఈ అమ్మాయికి వైద్యం నేనే చేస్తున్నాను. వాళ్లెంతో అపురూపంగా పెంచారు. ఇప్పుడు మీరు…’ అని ఆపేశారు. ‘ఇద్దరూ కోర్స్ వాడాలి.’ అంటూ ట్యాబ్లెట్లు, ఇంజక్షన్స్ రాసి ఇచ్చారు. నాకసలే ఇంజక్షన్ అంటే భయం. అన్ని ఇంజక్షన్లు చేయించుకోవాలంటే ఏడుపొచ్చింది.

ఆ సంఘటనతో నాకతని మీద ఏమాత్రమైనా ప్రేమ అనేది ఉండి ఉంటే అది కాస్తా ఇగిరిపోయింది. ఎప్పుడు చూసినా నా ‘పుస్తకాల్లో బట్టల్లో వెతుకుతూ ఉండేవాడు. నా కవిత పుస్తకం తీసి ‘ ఇదెవరి గురించి రాశావ్? అదెవరి గురించి రాశావ్? అని అడుగుతూ ఉండేవాడు.

‘నీగురించి మాత్రం కాదు’ అని అరవాలనిపించేది. అతనెప్పుడొచ్చి చదువుకోవడానికి టైం లేకుండా చేస్తాడో తెలీదు కాబట్టి ఎప్పుడూ చదువుకుంటూనే ఉండేదాన్ని. సాధారణంగా మా మీనాక్షి వాళ్ల మేడ పైన దక్షిణం వైపు డాబామీద కూర్చుని చదువుకుంటూ ఉండేవాళ్లం ఇద్దరం. సాయంకాలాలు వాళ్లింట్లో ఉప్పుడుపిండో, పులుసు ఉప్పిండో అటుకుల పులిహారో పచ్చి బొప్పాయి ముక్కల్లో, మామిడికాయి ముక్కల్లో ఉప్పుకారం కలిపినదో టిఫిన్ పెద్దగిన్నెతో చేసేవారు. మా కిద్దరికీ బాదం ఆకుల విస్తర్లలో పైకి పంపించేవారు. లీలకూడా అప్పుడప్పుడు వచ్చేది కానీ ఇంట్లో పనివల్ల దానికి తీరేది కాదు. అంతవరకూ మేం ఫ్రెండ్స్ అయిదుగురమే వెళ్ళేవాళ్లం స్కూలుకి, ఆ సంవత్సరం పెద్దచెల్లి కృష్ణవేణి మీనాక్షి చెల్లెలు పాపాయి, లీల తమ్ముడు నరసింహం, రామలక్ష్మి తమ్ముడు సుందరం ఆదిలక్ష్మి చెల్లెలు ఆండాళ్ళు మా వెంట వచ్చేవాళ్ళు. అయ్యరుగారి హోటల్లో పావలాకి ఒక పాలకోవా లేదా పెసరట్టు ఉప్మా వచ్చేవి. ఈ పిల్లలే లీజర్ టైంలో తెచ్చి ఇచ్చేవారు. అర్ధణాకి పెద్ద కరకజ్జం కొనుక్కొచ్చి మా చెల్లెళ్ళకీ తమ్ముళ్ళకీ పంచేదాన్ని. రాత్రి భోజనాలు అయ్యాక అందరం ఒకే నవారు మంచం మీద పడుకునేవాళ్లం. కథలకోసం వాళ్ళు నన్నొదిలేవాళ్ళు కాదు. మాచిన్నచెల్లీ తమ్ముడూ నన్నంటుకుని చెరోపక్క నా వాళ్లకి అటూ ఇటూ పెద్ద చెల్లీ పెద్దతమ్ముడూ ‘ఎపుడూ వాళ్ళేనా నీదగ్గిరా’ అంటూ మా పెద్దతమ్ముడు గొడవ చేసేవాడు. ఒక్కొక్కసారి చీటీలు తీసేవాడు. ఒకటి చదువుతున్న చిన్నతమ్ముడు , రెండు చదువుతున్న చిన్నచెల్లి ఏడుపు లంకించుకునేవాళ్ళు. మా చిన్నచెల్లి బడినుంచి వచ్చేటప్పుడు దారిప్రక్కన ఏ గడ్డిపువ్వు అందమ్గా కన్పించినా తెచ్చి ‘పెద్దక్కా’ అంటూ నాజడలో పెట్టేది. అలా ఆడుతూ పాడుతూ సాగే జీవితంలోకి పెళ్ళి అనే విషాదాన్ని ఎందుకు ఆహ్వానించేనా అని ఒంటరిగా ఉన్నప్పుడు దిగులొచ్చేసేది. నేను గట్టిగా తల్చుకుంటే ఆపలేకపోయేదాన్నా అని అన్పించేది.

మా దసరా సెలవలకి ముందు అతని అకళెజ్ కి ఏవో సెలవులొచ్చాయట. హఠాత్తుగా వచ్చి ‘బట్టలు సర్దుకో మా ఇంటికెళ్దాం’ అన్నాడు.

‘పెద్దవాళ్ళొచ్చి తీసుకెళ్తే గాని నీవెంట అమ్మాయినెలా పంపిస్తాం మొదటిసారి? మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్లనొచ్చి తీసుకెళ్లమను’ అన్నారు మా నాన్న. నేను కూడా ‘చదువుకోవాలి రాను’ అన్నాను.

వెంటనే అతను పరిగెత్తుకుని పెరట్లోకెళ్లి నూతిగోడమీదికెక్కి కూర్చున్నాడు. మాది చిన్ననుయ్యి. ఎంత సిమెంటుతో కట్టినా జారిపడితే నూతిలో పడతారు కదా! పొడవైన మనిషి కాళ్లు పొడవు కావడం వలన ఈ పక్కనుంచి ఆ పక్కకి కాళ్లుచాపి కూర్చున్నాడు. వంటింట్లో ఉన్న మా అమ్మ గోల గోలపెట్టేసింది. అసలే మా వీథిలో చాలా మంది వాడుక నీటికోసం మా నూతికే వచ్చేవారు.

‘తనని నాతో పంపిస్తారా? నన్నీ నూతిలో దుమికెయ్యమంటారా నాకు ఈతకూడా రాదు. అంటున్నాడతను. మా అమ్మ దణ్ణం పెట్టేసింది. ‘తీసుకెళ్లు బాబూ’ అంటూ.
మా నాన్నకి అప్పుడు అనుమానమొచ్చింది అతని మైండ్ సెట్ లో ఏదైనా లోపముందేమోనని. లేదా పెద్దలంటే భయభక్తులు లేకుండా నైనా పెరిగి ఉండాలని. లేకపోతే అత్తవారింట్లో ఎవరైనా అలా ప్రవర్తిస్తారా అన్నారు. నేను హడలిపోయి గబగబా బట్టలు సర్దుకుని తయారయ్యాను. మా నాన్న మమ్మల్ని బస్సు ఎక్కించడానికి వచ్చి స్వీట్లు కొని ఇచ్చారు.

బస్సులో అతను విజయగర్వంతో నవ్వి ‘నేనంటే ఏవనుకున్నావ్. నా అరికాల్లో ఏకచక్రం ఉంది . ఏకచక్రే మహాభోగే అంటారు తెల్సా?’ అన్నాడు. ఎంత భార్యాభర్తలైనా ఆడవాళ్లూ మగవాళ్లూ పక్క పక్కన కూర్చుంటే చిత్రంగా చూసే రోజులవి. అతను నా భుజం చుట్టూ చేయి వేసి కూర్చున్నాడు. అందరూ మమ్మల్నే చూడడం. అంతటితో ఆగకుండా జాకెట్టులోపలికి వేళ్లు.నేను బలంగా ఆ చేతిని లాగి పడేశాను. నేను మాట్లాడలేకపోవడం అతనికి బాగా లోకువైందని అన్పించింది. ‘బుద్ధిలేదా?’ అన్నాను.
‘నువ్వు నా పెళ్లానివి’ అన్నాడతను.

‘అందుకే చెప్తున్నాను. పెళ్లాన్ని పబ్లిగ్గా ఇంత అసహ్యంగా అవమానపరచరెవరూ’ అన్నాను. అతను హర్టయ్యాడట.
లేచి వెనకసీట్లో కెళ్ళి పోయి సిగరెట్టు వెలిగించుకున్నాడు.
మేం పొద్దుపోయి వాళ్ల అమ్మమ్మగారింటికి వెళ్ళేసరికి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
‘ఇదేంటమ్మాయ్ ఇదేం పద్ధతి? మీ పెద్దోళ్లకి ఆమాత్రం తెలీదా? మేమెవరం రాకుండా ఆడి వెనకాల నిన్ను పంపించేత్తారా? మా అవసరమే లేదా? మాకు చెప్పవలసిన పని లేదా అంటూ దండకం మొదలుపెట్టారు.

– కె వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , , , , , Permalink

2 Responses to నా జీవనయానంలో (ఆత్మకథ ) -స్కూలు ఫైనల్లో – కె వరలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో