గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

తెల్లవారు ఝామునే సీతమ్మ గారికి స్నానం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరుగు పొరుగు ముత్తయిదువులు అన్ని వర్ణాల వారు వేడి నీరు కాచి ఇత్తడి బిందెల్లో పోసుకొని , ఆ బిందెల మీద ఇంత పసుపు ముద్ద వుంచుకొని వీరిఇంటికి తేసాగారు. పురుడు చేసినది లేడీ డాక్టరే అయినా సీతమ్మ గారిని స్నానం చేయించడానికి ఎరుకల మంత్రసానిని పిలిచారు. సుబ్బమ్మగారు కూతురు తలపై చమురు వుంచి, దీవించి, స్నానం చేసి మడి పని చూసుకోసాగారు. చాకలి మనిషి, ఎరుకల మంత్రసాని కలిసి తలంటు స్నానం చేయించాక సీతమ్మ గారు ఓ పాత చీర ధరించి తనకు ప్రసవం జరిగి, ఇన్నాళ్ళూ తాను పసివాడుపరున్న నులక మంచం మీద ఓ చేత వేపమండా ఓ చేత కత్తి, ధరించి మంచంమధ్యలో కూర్చొన్నారు. పూర్వపు రోజుల్లో బిడ్డ బొడ్డు కోసినకత్తి ధరించే వారు. మిడ్వైఫ్ డాక్టర్లు పురుడు పోసినా ఆచారం కొరకు ఇంటిలోని కత్తిని ఓసారి బొడ్డుకు తాకించమనే వారు ఆడవారు. బొడ్డుకోసిన కత్తీ వేపమండా చేత ధరించి పాత చీర ధరించి తలంటు పోసుకొన్న పురిటాలు తాను ఆ పదిరోజులు శిశువుతో పరున్న నులక మంచం నడి మధ్య కూర్చొంటుంది. ఐదు, ఆరుగురు ముత్తయిదువులు చుట్టూ నిల్చి ఆమె చేతిలో తాము తెచ్చిన పసుపు ముద్ద వుంచి, బిందెలోని వేడి నీరు ఆమెపై పోస్తారు. ఈ దృశ్యం చూడటానికి వేడుకగా వుంటుంది. అందుకే స్త్రీ ప్రసవించడానికి నీళ్ళాడటం అంటారు.

ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆమె వంద బిందెల నీరు స్నానం చేస్తే కాని శుద్ది కాదట. తమ లెఖ్ఖ ఏమయినా పొరపాటు వస్తుందేమో అని బియ్యం జల్లించుకునే వెదురుపేళ్ళ జల్లెడ ఆమె శిరస్సుపై వుంచి ఓ బిందెడు నీళ్లు ఆమెపై గుమ్మరిస్తారు. ఈ స్నాన శ్రమను తట్టుకోవడానికిఅంతవరకూ రాత్రి పూట అన్నం పెట్టకుండా ఏమినపరోట్లో, కొయ్య రోట్లో పెడుతున్నా ఆమెకు పదవ రోజు రాత్రి అన్నం, పాలు పాత బెల్లం ఇచ్చి కాళ్లకు పసుపురాసుకొని గోడకు గుండ్రంగా పసుపు రాసి అడ్డంగా కుంకుమ పట్టీలు పెట్టి ఆ గ్రామ దేవత చిహ్నానికి అన్నం పాలు బెల్లం నైవేద్యంగా పెట్టుకొంటారు మంత్ర రహితంగా. అంతవరకూ ఆమె పాలు, మజ్జిగ తాకరాదు ఆ రోజుల్లో, స్నానం పూర్తయే ముందు ఎడపిల్లకు తలస్నానం చేయించి తెచ్చి తల్లి వద్ద కూర్చోబెట్టి నాలుగు బిందెల వేడి నీరు గ్రుమ్మరిస్తారు ఇద్దరి మీద. తల్లి యొక్క ఈ వేషం, హడావుడి చూచి భయపడి కాసులు ఒకటే ఏడుపు. స్నానం ముగిసాక చాకలి మనిషి తాను తెచ్చిన పాత చీరతో సీతమ్మ గారి తలా, వళ్ళు శుభ్రంగా తుడిచి, సాంబ్రాణీ పొగ వేసి తాను తెచ్చిన చీర రవికా కట్టుకోవడానికి ఇచ్చింది.

ఈ చీర చాకలి మనిషే తాను బట్టలు ఉతికే వారిలో కడుపు చలువ అయిన తెల్లని చీర రవిక తెస్తుంది. సామన్యంగా ఒకరు కట్టే చీర మరొకరు కట్టడానికి ఇష్టపడరు. ఈ సందర్భంలో మాత్రం చాకలి దాని బట్ట కట్టి సూర్యనారాయణ మూర్తికి మ్రొక్కాలి పురిటాలు, అది ఆచారం, సూర్యుని ఎదురుగా బాలెంతరాలికి కుర్చీవేసి కూర్చోబెట్టి ఓ పెద్ద ముత్తయిదువు ఆమె నుదుట కుంకుమ తిలకం దిద్ది, ఆవుపాలు పచ్చివి ఆమె చేతిలో పోస్తూ సూర్యనారాయణ మూర్తీ తండ్రీ ఏటా ఏటా బాలింత. బాలింత ఇచ్చి, కడుపు చలువ ఐదవతనం ఇచ్చి రక్షించు తండ్రీ! అని మ్రొక్కిస్తుంది. ఆ రోజుల్లో గంపెడు పిల్లల్ని కనడం గొప్ప ఆయె.
ఈ కార్యక్రమం ముగిసాక త్రాగడానికి కాఫీ ఇచ్చి, ఆమె చేతికి అంతక్రితం వున్న గాజులు పురిటిలో మైల పడతాయి కనుక అవి తీసివేసి బాలెంత పచ్చలు అనే ముదురు ఆకుపచ్చ రంగు గాజులు తొడిగారు. బొట్టు, కాటుక, పసుపు పారాణి పెట్టి, తల చిక్కుతీసి దువ్వి పూలు ముడిచారు. పుణ్యాజినాకిని ఆరేసిన పట్టు బట్ట కట్టించి సిద్ధం చేశారు. పుణ్యహవచనం జరుగుతుండగా శాస్త్రి గారి వైద్య సేవలు పొందే సంపన్నులు ఒకరు సీతమ్మ గారికి ఉదారంగు బనారస్ జరీ పట్టు చీర, శాస్త్రి గారికి రుద్రాక్ష జరీ అంచుల పంచల చాపూ పంపారు శాస్త్రిదంపతులు బారసాల పీటలమీద ఆ బట్టలే చదివించుకున్నారు.

కాసులుకు అప్పట్లో క్రొత్తగా వస్తున్న చెమ్కీ, ఎంబ్రాయిడరీ కుట్టిన ఆకుపచ్చ రంగు గౌను కుట్టించారు. ఆ గౌను తొడిగించి బారసాల పీటలపై తమ దంపతుల ప్రక్కన ఆ పిల్లను కూర్చో పెట్టుకున్నారు. ఆ పిల్లవున్నది వున్నట్టు వుండక వెళ్లి జిలేబి కొరకు పెట్టిన నూనెపళ్ళెంలో పడిరది. నూనె ఇంకా పొయ్యి మీద పెట్టలేదు కనుక ప్రమాదం తప్పింది. ఆ నూనెగుడ్డతో వుండరాదని పెద్దలు, తాను ముచ్చట పడి కుట్టించిన గౌనుతోనే తన బిడ్డ కనపడాలి శుభ్రంగా పిండి, బట్టతో తుడవండి చాలు అని శాస్త్రి గారు అదో గోల. శాంతి హోమాలు, దానాలు అన్ని యధావిధిగా జరిగాయి. శాస్త్రి గారు మొదటి కుమారునికి తమ తండ్రి గారి పేరు పెట్టుకున్నారు. భోజనాల వేళ పురిటి గదిలో తూర్పు వైపు గోడకు పసుపు పూసి బొట్లు పెట్టి రుబ్బురోలు పొత్రానికి పసుపుపూసి, కుంకుమ బొట్లు పెడతారు. నూనె దీపం వెలిగించి, బొడ్డు కోసిన కత్తి ఆ దీపంపై మసిపారేలా పెడతారు. 5 పోగుల నూలు దారానికి పసుపు పూసి ఆ పొత్రం మీద వుంచుతారు. బాల సారెకు వండిన షడ్రశోపేతమైన పిండివంటలతోడి భోజనంతో పాటు గ్రామ దేవతకు ప్రీతి అయిన తెలకపిండి కూర కూడా ఈనైవేద్యంలో పెడతారు. ఈ నైవేద్యం బాగా ఎక్కువగానే వుండాలి. ఇది ఎన్నెమ్మ కుమార్తెలైన కొత్తెమ్మ, కొర్రెమ్మలకు ఈ పదార్థాలు చాకలి మనిషి తీసుకొని వెడుతుంది.

ప్రొద్దు వాటారే వేళకు మంత్రసాని వచ్చి ఇంటి వారు ఇచ్చే విందు భోజనం ఓ పాత బట్టలో మూట కట్టుకొని తనకు ఈనాముగా వచ్చే పాత చీర, కట్నం(డబ్బు) తీసుకొని, తలంటుసామాను తవ్వెడు నువ్వులనూనె, సోలడు పసుపు, సోలడు సున్నిపిండి, శేరు కుంకుడు కాయలు తీసుకొని, కాయం నూరిన రుబ్బురోలు పొత్రం తీసుకొని పెరట్లో ఆరేసిన పురిటాలి నులకమంచంపై పడుకొని ‘‘అల్లంతే కోమటీ, బెల్లంతే కోమటీ’’, అని పాడుతూ ఆ మంచంపై దొర్లుతుంది. పిల్లలంతా చేరి అదో వేడుకగా చూస్తారు. ఈ ఆచారం మరి ఎందుకు పెట్టారో తెలియదు. దీపాల వేళకు ముందుగా కత్తికి పట్టిన కాటుక గోకి ఓ డబ్బాలో పోస్తుంది బాలెంతరాలు, ఆ కాటుక పొడి ఆముదంలో మెదిపి బాలెంతరాలు తన కళ్లకు పెట్టుకొని బిడ్డకు పెట్టాలి. ఈ విధంగా చేస్తే బాలింత పొరలు అనే కంటి దోషం తొలగిపోతుందని నమ్మేవారు. పొత్రంపై వుంచిన మొలత్రాడు తల్లి శిశువుకు కడుతుంది. ఇది రక్షా బంధం మనిషి జీవిత పర్వంతం మొలతాడు ధరించాలి. మొలత్రాడు కట్టిన మగాడు అంటారు. కాని స్త్రీ శిశువుకు కూడా ఏడాది నిండే వరకు ఈ మొలత్రాడు కడతారు. మొలత్రాడు కట్టి, కాటుక పెట్టగానే తల్లికి పిల్లకూ కూడా నెల పురుడు వస్తుంది. మరో పది రోజులు వారిని ఎవరూ తాకరాదు. పురిటాలు కాటుకా, బొట్టు, పసుపు ధరిస్తుంది. రోజు విడిచి రోజు ఒళ్ళు నలచి కంఠ స్నానం చేస్తుంది. చెవుల్లో దూది, నుదుట దిష్టి విభూది ధరిస్తుంది. మధ్యాహ్నం భోజనానంతరం ఆమె రోజూ తాంబూలం వేసుకొంటుంది.

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో